Skip to main content

సుస్థిర కెరీర్‌కు దారిచూపే..ఇంటర్న్‌షిప్స్‌

చేతిలో డిగ్రీ పట్టా.. కళ్లు చెదిరే జీపీఏ.. అద్భుతమైన సాఫ్ట్‌స్కిల్స్‌.. ఇవి ఉంటే చాలు.. ఉద్యోగం గ్యారెంటీ అన్నది నిన్నటి మాట! నేడు ‘జీపీఏ సరే.. ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌ మాటేమిటి?’ అంటూ.. కంపెనీలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రధానంగా బీటెక్, ఎంబీఏ కోర్సులకు సంబంధించి ఇలాంటి ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో విద్యార్థులకు అకడమిక్‌ దశలోనే ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌ అందిస్తున్నాయి ఇంటర్న్‌షిప్స్‌. వీటిపై స్పెషల్‌ ఫోకస్‌..

6 నుంచి 8 వారాలు...
ఇంటర్న్‌షిప్‌ అంటే.. విద్యార్థులు తాము కోర్సును చదువుతున్నప్పుడే కొద్దికాలం పాటు తమ అకడమిక్స్‌కు సంబంధించిన రంగాల్లోని సంస్థల్లో విధులు నిర్వర్తించడం. వీటి వ్యవధి ఆరు నుంచి ఎనిమిది వారాలు. ఇంటర్న్‌షిప్‌ వల్ల విద్యార్థులకు వాస్తవ పరిస్థితులు, ఇండస్ట్రీలోని ఆధునిక ధోరణులపై అవగాహన ఏర్పడుతుంది. భవిష్యత్‌లో చేయబోయే జాబ్‌కు సంబంధించిన నైపుణ్యాలు అలవడతాయి. అంటే.. కోర్సు పూర్తయ్యే నాటికి ఇండస్ట్రీ రెడీగా తీర్చిదిద్దుకునేందుకు ఇంటర్న్‌షిప్‌ మంచి వేదిక.

వేసవి సెలవుల్లో..
ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం తదితర ప్రముఖ విద్యాసంస్థల్లో... కంపెనీలే సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ పేరుతో విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక చేస్తున్నాయి. బీటెక్‌ విద్యార్థులకు ద్వితీయ, తృతీయ సంవత్సరం ముగిసిన తర్వాత వేసవి సెలవుల్లో తమ సంస్థల్లో ఇంటర్న్‌ట్రైనీగా పనిచేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌ విద్యార్థుల విషయంలో రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్‌లో.. మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత వచ్చే వేసవి సెలవుల్లో ఇంటర్న్‌ట్రైనీగా చేరే విధానం అమలవుతోంది.

కొలువుకు తొలి మెట్టు...
ఇంటర్న్‌షిప్‌ను కొలువుకు తొలిమెట్టుగా భావించొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఇంటర్న్‌ ట్రైనీగా చురుగ్గా వ్యవహరిస్తే.. కోర్సు పూర్తయ్యాక అదే సంస్థలో పూర్తిస్థాయి కొలువు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఐఐటీలు, ఐఐఎంల ఫైనల్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్లను పరిశీలిస్తే.. ఒక సంస్థ అందించే మొత్తం ఆఫర్లలో 60 శాతం మేర అభ్యర్థులు అప్పటికే సదరు సంస్థలో ఇంటర్న్‌ ట్రైనీగా పనిచేసిన వారే ఉండటం విశేషం.

ఆర్థిక ప్రోత్సాహం :
ఇంటర్న్‌గా పనిచేసే అభ్యర్థులకు సంస్థలు స్టైపెండ్‌ రూపంలో ఆర్థిక ప్రోత్సాహకాలు సైతం అందిస్తున్నాయి. అత్యున్నత విద్యాసంస్థల నుంచి ఎంపిక చేసిన అభ్యర్థులకు కంపెనీలు రెండు నెలల వ్యవధికి రూ.లక్ష వరకు స్టైపెండ్‌ అందిస్తున్నాయి. అయితే కంపెనీలు అనుసరిస్తున్న ఎంపిక విధానం కూడా క్లిష్టంగా ఉంటుంది. రియల్‌ జాబ్‌ ఇంటర్వ్యూను తలపించేలా ఆప్టిట్యూడ్‌ టెస్ట్, హెచ్‌ఆర్‌ రౌండ్, టెక్నికల్‌ రౌండ్‌ నిర్వహించి.. ఇంటర్న్‌ ట్రైనీగా అవకాశాలు ఇస్తున్నాయి.

స్వీయ అన్వేషణ...
ప్రముఖ విద్యా సంస్థలు తమ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్‌ అవకాశాలు కల్పిస్తుంటాయి. కానీ, టైర్‌–2, 3 ఇన్‌స్టిట్యూట్‌ల్లో చదివే విద్యార్థులకు ఇంటర్న్‌ అవకాశాలు లభించడం తేలిక కాదు. ఈ కళాశాలల విద్యార్థులు స్వీయ అన్వేషణతో ఇంటర్న్‌షిప్స్‌ కోసం ప్రయత్నించాలి. ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్స్‌ను ఉపయోగించుకోవాలి. ఈ పోర్టల్స్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం, రెజ్యూమెను అప్‌లోడ్‌ చేయడం ద్వారా ఎప్పటì కప్పుడు ఇంటర్న్‌షిప్‌ అవకాశాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని సంస్థలు.. తాము అందిస్తున్న ఇంటర్న్‌షిప్స్‌కు సంబంధించి తమ వెబ్‌సైట్‌లోని కెరీర్స్‌ కాలమ్‌లో వివరాలు పొందుపరుస్తున్నాయి. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి.

ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి!
బీటెక్‌ విద్యార్థులకు ఇకపై ఇంటర్న్‌షిప్‌ పూర్తిచే యడం తప్పనిసరికానుంది. ఈ మేరకు ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) మార్గదర్శకాలు రూపొందించింది. బీటెక్‌ విద్యార్థులు నాలుగేళ్ల కోర్సు వ్యవధిలో తప్పని సరిగా రెండు ఇంటర్న్‌షిప్స్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఇంటర్న్‌షిప్స్‌ అవకాశాలు అందుకునేలా ఇన్‌స్టిట్యూట్‌లు తప్పనిసరిగా సహక రించాలి. ఇన్‌స్టిట్యూట్‌–ఇండస్ట్రీ ఇంటరాక్షన్‌ విభాగా లను ఏర్పాటు చేయాలని ఏఐసీటీఈ సూచించింది. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది.

ఇంటర్న్‌షిప్‌ ప్రయోజనాలు...
  • సంబంధిత విభాగంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది.
  • తరగతిగదిలో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించే అవకాశం.
  • Strengths, Weaknesses, Threats, Opportunities (SWOT) విశ్లేషణకు వీలు. దీనివల్ల మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై స్పష్టత ఏర్పడుతుంది.
  • జాబ్‌ కల్చర్, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ పెంచుకునే అవకాశం.
  • ముఖ్యంగా సీనియర్లతో కలసి పనిచేసే అవకాశం రావడం వల్ల ప్రాక్టికల్‌ నైపుణ్యాలను పెంచుకునేందుకు వీలుంటుంది.

ఇంటర్న్‌ అన్వేషణకు మార్గాలు..
1. సంస్థల వెబ్‌సైట్లలోని కెరీర్‌ కాలమ్స్‌.
2. ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్స్‌లో రిజిస్ట్రేషన్‌.
3. సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్స్‌ ద్వారా ఆయా రంగాల నిపుణులను సంప్రదించడం.
4. అకడమిక్‌గా సీనియర్లు, ప్రొఫెసర్లను సంప్రదించడం.
5. సమీపంలోని పరిశ్రమల హెచ్‌ఆర్‌ వర్గాలను స్వయంగా సంప్రదించడం.

ఇంటర్న్‌గా ఇలా..
1. ఇంటర్న్‌గా చేరిన ఒకట్రెండు రోజుల్లోనే తమకు అప్పగించబోయే టాస్క్‌ గురించి తెలుసుకోవాలి.
2. అప్పగించిన పనిని పూర్తిచేసేందుకు కొత్తగా ఆలోచించాలి.
3. సమస్యను పరిష్కరించే క్రమంలో ఏవైనా సందేహాలు వస్తే బిడియం లేకుండా సీనియర్ల సలహాలు తీసుకోవాలి.
4. ఇంటర్‌ పర్సనల్‌ బిహేవియర్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంటర్న్‌షిప్‌ చేయడం ద్వారా విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సీనియర్లు, ప్రొఫెసర్లు, ఇండస్ట్రీ నిపుణుల సహకారం తీసుకోవాలి. స్టైపెండ్‌ గురించి ఆలోచించకుండా.. మంచి ఇంటర్న్‌ అవకాశం వస్తే చేసేందుకు సిద్ధంగా ఉండాలి.
ప్రొఫెసర్‌ ఎం.చంద్రశేఖర్, నిట్‌– వరంగల్‌.

Published date : 06 Dec 2017 03:48PM

Photo Stories