Skip to main content

స్టార్టప్ ఆఫర్స్..ఆచితూచి అడుగేయండి..!

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో స్టార్టప్స్ కంపెనీలు రెట్టింపు సంఖ్యలో నియామకాలు జరుపుతున్నాయి. భారీ పే ప్యాకేజీలు అందిస్తున్నాయి. విద్యార్థులు కూడా స్టార్టప్‌ల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే! మరోవైపు స్టార్టప్ కంపెనీలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలోని విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్స్‌ను సైతం వెనక్కు తీసుకుంటున్నాయి. నియామకాలను వాయిదా వేస్తున్నాయి. ఇది విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. త్వరలో ఈ విద్యా సంవత్సరానికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో..స్టార్టప్ కంపెనీల ఆఫర్స్ విషయంలో నిపుణులు అందిస్తున్న సూచనలు, సలహాలు!!
పేరున్న స్టార్టప్ కంపెనీలు సైతం ఇటీవల కాలంలో విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్స్‌ను వెనక్కు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విద్యా సంవత్సరం చివర్లో ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదివిన ప్రతిభావంతులు ఏదో ఒక జాబ్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కాబట్టి స్టార్టప్ కంపెనీల ఆఫర్స్‌ను ఆమోదించే ముందు అభ్యర్థులు ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రమోటర్స్ నుంచి కంపెనీ ప్రొఫైల్ వరకు
స్టార్టప్ కంపెనీ ఆఫర్‌ను ఆమోదించే ముందు అభ్యర్థులు స్టార్టప్ సంస్థ ప్రమోటర్స్ వివరాలు, వారి విజన్, సంస్థ ప్రొఫైల్, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? అనే అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. సదరు సంస్థ ప్రొడక్ట్/సర్వీస్ వివరాలు.. టార్గెట్ కస్టమర్స్, సర్వీస్/ప్రొడక్ట్‌కు సంబంధించి మార్కెట్ పరిస్థితుల గురించి అవగాహన పెంచుకోవాలి. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్, ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్స్, కంపెనీల వెబ్‌సైట్స్ ద్వారా ఈ సమాచారం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా స్టార్టప్ కంపెనీ ఆర్థిక సామర్థ్యం గురించి తెలుసుకోవాలి. కార్యకలాపాల నిర్వహణ, భవిష్యత్తు మనుగడ పరంగా సంస్థకున్న ఆర్థిక వనరుల లభ్యత చాలా కీలకం. ఎందుకంటే భారీ లాభాలు ఆశించి పెట్టుబడులు పెట్టే సీడ్ ఫండింగ్ సంస్థలు, వెంచర్ క్యాపిటలిస్టులు.. స్టార్టప్ కంపెనీ నుంచి ఆశించిన లాభాలపై నమ్మకం సడలితే నిధులు ఉపసంహరించుకుంటారు. దాంతో ఒత్తిడికి లోనైన కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ముందు మానవ వనరులపై వేటు వేస్తాయి. కాబట్టి రూ.లక్షల ప్యాకేజ్‌తో ఆఫర్ ఇచ్చినా.. సంస్థ ఆర్థిక సామర్థ్యం సరిగా లేకుంటే అభ్యర్థులు సమీప భవిష్యత్తులోనే ఒడిదుడుకులకు లోనవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

పని వాతావరణం
ఇప్పటికే సదరు స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య గురించి తెలుసుకోవడం కూడా తాజా అభ్యర్థులకు మేలు చేస్తుంది. సాధారణంగా స్టార్టప్ సంస్థల్లో మానవ వనరుల సంఖ్య 20 నుంచి 50 మధ్యలోనే ఉంటోంది. ఫండింగ్ సంస్థల ప్రోత్సాహం ఉంటే ఈ సంఖ్య 100 నుంచి 150 వరకు ఉంటుంది. తద్వారా స్టార్టప్ సంస్థ మనుగడపై ఒక అంచనాకు రావచ్చు. వీలైతే అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని సంప్రదించి వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా స్టార్టప్ కంపెనీలో పని సంస్కృతి, పని వాతావరణం గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. స్టార్టప్ సంస్థల్లో చేరాలనుకునే అభ్యర్థులు తమలోని సృజనాత్మకతను, నైపుణ్యాలను, తమ ఆలోచనలను అమలు చేసేందుకు వీలుంటుందని, ఆ మేరకు కంపెనీలు సైతం తమను ప్రోత్సహిస్తాయనే అభిప్రాయంతో ఉంటారు. తాము చేరాలనుకుంటున్న కంపెనీలో ఇలాంటి పరిస్థితి ఉందో? లేదో? తెలుసుకోవడం మంచిది.

ప్యాకేజ్, ఇతర బెనిఫిట్స్
స్టార్టప్ ఆఫర్‌ను ఆమోదించే క్రమంలో తమకు అందించే ప్యాకేజ్‌ను ఏ రూపంలో ఇస్తాయో అభ్యర్థులు ముందుగానే తెలుసుకోవాలి. కొన్ని స్టార్టప్ సంస్థలు భారీ స్థాయిలో పే ప్యాకేజీ ప్రకటించినా.. అందులో 40 నుంచి 50 శాతం మాత్రమే నగదు రూపంలో ఇస్తున్నాయి. మిగతా మొత్తాన్ని ఈక్విటీలు, స్టాక్ ఆప్షన్స్ కేటాయింపు రూపంలో అందిస్తున్నాయి. కాబట్టి ఔత్సాహిక అభ్యర్థులు.. తమ వాస్తవ అవసరాలు, కంపెనీలు అందించే ప్యాకేజీ తీరుతెన్నుల గురించి తెలుసుకోవాలి. నగదు రూపంలో అందించే మొత్తం తమ అవసరాల మేరకు ఉందని భావిస్తేనే ఆఫర్‌ను అంగీకరించడం మేలు.

స్టార్టప్ జాబ్.. సవాలే!
స్టార్టప్ సంస్థలంటే అప్పుడే మొగ్గ తొడిగిన కంపెనీలు. ఉత్పత్తులు, సేవల గురించి లక్ష్యాలు నిర్దిష్టంగా ఉన్నప్పటికీ.. వాటి అమలు, కార్యాచరణ అంతా ప్రాథమిక దశలోనే ఉంటుంది. జీరో నుంచి పని మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి స్టార్టప్ కంపెనీలో పనిచేయడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారం. కంపెనీలు సైతం తాము ఆఫర్ ఇచ్చిన అభ్యర్థుల నుంచి ఎంతో ఎక్కువగా ఆశిస్తాయి. నిజమైన ఆసక్తి ఉంటేనే, పని ఒత్తిడిని తట్టుకోగలమనుకుంటేనే స్టార్టప్ సంస్థల ఆఫర్‌ను ఆమోదించాలి. అంతేకాకుండా తమకున్న సబ్జెక్ట్ స్కిల్స్ సంస్థ జాబ్ ప్రొఫైల్‌కు సరితూగుతాయో లేదో ముందుగానే అంచనా వేసుకొని అడుగేయాలి.

నిత్యనూతనంగా ఉండాలి
కొత్తగా ప్రారంభమైన కంపెనీలో సీఈఓ నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ వరకూ.. అందరూ కలివిడిగా పని చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన జాబ్ ప్రొఫైల్‌ను మాత్రమే కాకుండా అందరూ అన్ని రకాల పనులు చేయాల్సి ఉంటుంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులను నిరంతరం అంచనా వేయడం.. పోటీదారుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను గుర్తించడం.. వ్యూహ, ప్రతివ్యూహాలు రూపొందించడం వంటి విధులు నిర్వర్తించాలి. సంస్థ కార్యకలాపాలను నిర్వహించడంలో సృజనాత్మకతను వెలికి తీసే నైపుణ్యం అవసరం. ఇతరుల కంటే తమ సంస్థ ప్రొడక్ట్స్ బెస్ట్ అని వినియోగదారుల్లో అభిప్రాయం ఏర్పడేలా వ్యూహాలు, పథకాలు రచించాలి. ముఖ్యంగా మార్కెటింగ్ ప్రొఫైల్ ఆఫర్స్ అందుకున్న అభ్యర్థులకు ఇది ఎంతో అవసరం. కాబట్టి స్టార్టప్ కంపెనీలో చేరేటప్పుడు అన్ని ప్రతికూలతలు, సానుకూలతలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలన్నది నిపుణుల సలహా!!

స్టార్టప్ జాబ్స్.. కీ డొమైన్స్
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్,డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఎస్‌ఈఓస్, కోడింగ్ ఎక్స్‌పర్ట్స్, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, డేటా సైంటిస్ట్స్, ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్ మేనేజర్స్ వెబ్ డిజైనర్స్, యాప్ డెవలపర్స్, బిజినెస్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్స్, సోషల్ నెట్‌వర్క్ స్పెషలిస్ట్స్

స్టార్టప్ జాబ్స్ సానుకూలతలు
అభ్యర్థుల నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలుగులోకి తెచ్చేందుకు ఎంతో అవకాశం.
తాము చేసిన పనికి వెనువెంటనే ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది.
ఆసక్తికి అనుగుణంగా పని చేసే అవకాశం (ఫ్లెక్సిబుల్ వర్క్ ఎన్విరాన్‌మెంట్) ఉంటుంది.
స్వీయ సామర్థ్యాలను పెంపొందించుకునే అవకాశం.
వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసే అవకాశం. ఇది ఎంఎన్‌సీ జాబ్స్‌లో లభించడం కొంత కష్టమే.

స్టార్టప్ జాబ్స్ ప్రతికూలతలు
సంస్థ ప్రమోటర్స్‌కు నిర్దిష్ట వ్యూహం లేకపోతే ఉద్యోగుల భవితవ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ప్రారంభంలో నిర్దిష్ట పని వేళలని లేకుండా.. 24x7 విధానంలో పనిచేయాల్సిన పరిస్థితి.
ఎంఎన్‌సీల మాదిరిగా కొత్త టెక్నాలజీలపై వ్యవస్థాగతంగా శిక్షణ ఉండదు. అభ్యర్థులే స్వీయ శిక్షణ ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి.
వేతనాల పరంగా ఎంఎన్‌సీలతో పోల్చితే తక్కువ ప్యాకేజ్‌లు.
వినియోగదారులను ఆకట్టుకోవడంలో కొంత ఇబ్బంది.
తమ సంస్థను మెప్పించడంలో ప్రారంభంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు సైతం ఎదురవుతాయి.

రెండు కోణాల్లో ఆలోచించాలి
స్టార్టప్ ఆఫర్స్‌ను అంగీకరించే అభ్యర్థులు సంస్థ, వ్యక్తిగతం అనే రెండు కోణాల్లో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే కెరీర్ ఉన్నతంగా ఉంటుంది. ముఖ్యంగా సంస్థల ప్రొఫైల్ గురించి తెలుసుకోవడంలో ఏ మాత్రం వెనుకంజ వేయకూడదు. సంస్థ నేపథ్యం, కార్యకలాపాలు, టార్గెట్ సెగ్మెంట్‌లు నిర్దిష్టంగా లేకపోతే అభ్యర్థుల కెరీర్ గ్రోత్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ప్రొఫెసర్ బి.వెంకటేశం, ఐఐటీ-హెచ్, ప్లేస్‌మెంట్ హెడ్
Published date : 03 Aug 2016 03:23PM

Photo Stories