Skip to main content

స్పేస్ కెరీర్ వైపు యువత చూపు...

చంద్రయాన్ 2 ప్రయోగం తర్వాత అంతరిక్ష రంగంపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. అంతరిక్ష ప్రయోగాలను యావత్ దేశం గమనిస్తుండటం.. స్వయంగా ప్రధానమంత్రి సహా ప్రముఖులంతా శాస్త్రవేత్తలను అభినందిస్తుండటంతో స్పేస్ కెరీర్ వైపు యువత మొగ్గుచూపుతోంది. అంతరిక్ష సంస్థల్లో పనిచేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో.. అంతరిక్ష పరిశోధన రంగం (స్పేస్ రీసెర్చ్)లో లభించే పలు ఉద్యోగాల గురించి ఓ తాజా సర్వే వెల్లడించింది. ఆ వివరాలు...
సివిల్ ఇంజనీర్ :
అంతరిక్ష కార్యక్రమానికి అవసరమైన మౌలికవసతుల డిజైన్, భవనాల నిర్మాణంపై సివిల్ ఇంజనీర్లు పనిచేస్తుంటారు. దాంతోపాటు రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ మ్యాపింగ్, మెటీరియల్స్ డిజైన్ చేయడం.. వాటి వాస్తవిక పనితీరు గురించి డ్రాయింగులు, మ్యాప్‌లను విశ్లేషించే సామర్థ్యం ఉంటే.. అంతరిక్ష పరిశోధన సంస్థల్లో సివిల్ ఇంజనీర్ ఉద్యోగానికి సరిపోతారని చెప్పొచ్చు. సివిల్ డిప్లొమా/ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. సివిల్ ఇంజనీర్ సగటు వార్షిక వేతనం రూ.2,20,260 నుంచి రూ.6,12,000 వరకు ఉంటుంది.

టెక్నికల్ అసిస్టెంట్ :
అంతరిక్ష పరికరాల తయారీలో నైపుణ్యం పదర్శించడం.. ఆయా పరికరాల రూపకల్పనలో ఆసక్తి చూపడం.. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ట్రబుల్‌షూటర్‌గా పనిచేయడం టెక్నికల్ అసిస్టెంట్ ప్రధాన బాధ్యతలు. ముఖ్యంగా ఇమేజింగ్ అప్లికేషన్స్‌కు సంబంధించిన అనుభవం సంపాదిస్తే... టెక్నికల్ అసిస్టెంట్‌గా కెరీర్‌లో దూసుకుపోవచ్చు. డిప్లొమా/బీఈ/బీటెక్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి వార్షిక సగటు వేతనం రూ. 2,36,832 నుంచి రూ.6,00,000వరకు ఉంటుంది.

టెక్నీషియన్ :
అంతరిక్ష పరిశోధనల్లో అంతర్గత,క్లౌడ్ ఆధారిత మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. సరికొత్త టెక్నాలజీపై సంపూర్ణ అవగాహన.. ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను వినూత్న విధానాల్లో పరిష్కరించగలిగే స్కిల్ ఉంటే చాలు స్పేస్ రీసెర్చ్‌లో కుదురుకోవచ్చు. సంబంధిత విభాగంలో ఐటీఐ/డిప్లొమా ఉండాలి. టెక్నీషియన్ సగటు వార్షిక వేతనం రూ. 2,00,078 నుంచి రూ.5,88,000వరకు ఉంటుంది.

డ్రాఫ్ట్స్‌మన్/డ్రాఫ్టర్ :
ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ బృందంతో అనుసంధానం అవుతూ.. కాన్సెప్ట్ సపోర్ట్ నుంచి ఫైనల్ డిజైన్ వరకు సమన్వయంతో డిజైన్ డెవలప్‌మెంట్ పూర్తిచేయడం డ్రాఫ్టర్ ముఖ్యమైన పని. టెన్‌‌త, ఇంటర్‌తోపాటు ఐటీఐ ఉండాలి. డ్రాఫ్టర్ వార్షిక సగటు వేతనం రూ.1,99,752 నుంచి రూ.5,52,000 వరకు ఉంటుంది.

మెకానికల్ ఇంజనీర్ :
డ్రాయింగ్స్‌ను విశ్లేషించే మేధస్సు కలిగి ఉండటం, బెసిక్ మెకానికల్ కాన్సెప్ట్‌పైన అవగాహన, విశ్లేషణ జ్ఞానం కలిగి ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా/బీఈ/బీటెక్ పూర్తిచేసి ఉండాలి. మెకానికల్ ఇంజనీర్ వార్షిక సగటు వేతనం రూ.1,91,184 నుంచి రూ.5,04,000 వరకు ఉంటుంది.

ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ :
ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల నిర్వహణలో, సమస్యలు తలెత్తినప్పుడు వాటి పరిష్కారంలో ట్రబుల్‌షూటర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా/ బీఈ/బీటెక్ ఉండాలి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ వార్షిక సగటు వేతనం రూ. 1,95,264 నుంచి రూ.5,16,00 వరకు ఉంటుంది.

మెషినిస్ట్ :
అంతరిక్ష పరికరం తయారీ ప్రక్రియకు సంబంధించిన ప్రింటింగ్ ప్రాసెస్‌ను అమలు చేయడం.. గ్లయిడింగ్ మెషీన్ల ఆపరేషన్‌లో నైపుణ్యం కలిగివుండాలి. టెన్‌‌త, ఇంటర్‌తోపాటు ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు. మెషినిస్ట్ సగటు వార్షిక వేతనం రూ. 1,72,596 నుంచి రూ.4,44,000వరకు ఉంటుంది.

ఫిట్టర్ :
బ్లూప్రింట్ల అధ్యయనం, యంత్రాల భాగాలను వేరుచేయడం, అసెంబ్లింగ్ చేయడం వంటి సామర్థ్యం ఉండాలి. ఐటీఐ సంబంధిత విభాగంలో పూర్తిచేసి ఉండాలి. ఫిట్టర్ సగటు వార్షిక వేతనం రూ. 1,53,348 నుంచి రూ.4,08,000వరకు ఉంటుంది.

పైన తెలిపిన ఉద్యోగాలకు సంబంధించిన సగటు వార్షిక వేతనం గత మూడేళ్లు, ప్రస్తుత వేతనాల వివరాలు సేకరించి.. అంచనావేసినట్లు ఇండీడ్ సర్వే పేర్కొంది.
Published date : 17 Sep 2019 05:07PM

Photo Stories