Skip to main content

సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్..

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. స్వయం ఉపాధికి ఆధునిక పేరు! ఇటీవల కాలంలో అత్యంత ప్రాధాన్యం ఉంటున్న విభాగమిది! ఇందులో ప్రస్తుతం మరో కొత్త విభాగం కీలకంగా మారుతోంది. అదే.. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సామాజిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడే సంస్థలను స్థాపించడమే సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇందులోని అవకాశాలపై విశ్లేషణ..
ఒకవైపు కెరీర్ పరంగా స్వయం ఉపాధి లక్ష్యాన్ని, మరోవైపు సామాజిక అవసరాలను తీర్చాలనే ఆకాంక్షను నెరవేరేలా చేస్తోంది సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇది సామాజికంగా నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలు మొదలు అభివృద్ధి సమస్యల వరకు పరిష్కారాలను చూపుతోంది. సామాజిక అభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి బాటలు వేస్తోంది.

ఎన్నో రంగాలు
  • సాధారణ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో పోల్చితే సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఆదాయం కొంత తక్కువ ఉంటుంది. కానీ, సమాజాభివృద్ధికి తోడ్పడ్డామన్న సంతృప్తికి కొదవ ఉండదు.
  • ప్రస్తుతం దేశంలో ఐఐటీల నుంచి సాధారణ కళాశాలల విద్యార్థుల వరకు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై మొగ్గుచూపుతున్నారు. ఔత్సాహికులు స్టార్టప్ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఐఐటీ చెన్నైకు చెందిన కృష్ణన్ అనే విద్యార్థి రైల్వేస్టేషన్‌లలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, రూ.2కు లీటర్ నీటిని అందిస్తున్నారు. అమృత ధార పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు ఆలోచన.. ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్‌మెంట్స్’ సంస్థ నిర్వహించిన పోటీలో విజయం సాధించింది. దీంతో ఆ విద్యార్థి ఆర్థిక సహకారం పొందాడు. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ సంస్థలకు వివిధ సంస్థల నుంచి మద్దతు లభిస్తోంది.
విద్యలో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విద్యా రంగానికి కూడా విస్తరిస్తోంది. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ సంస్థలు, ఈ-లెర్నింగ్ సంస్థలు, వెబ్‌సైట్లు వంటివన్నీ ఎడ్యుకేషన్ రంగంలో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా పరిగణించవచ్చు. వీటికి కూడా సీడ్ ఫండింగ్ ఏజెన్సీల నుంచి మద్దతు లభిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన Edutor ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ సంస్థకు దాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే హైదరాబాద్ ఏంజెల్స్ సంస్థ రూ.2 కోట్లు సీడ్ క్యాపిటల్ అందించింది.

ఉద్యోగావకాశాలు
సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగంలో సంస్థల కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో ఇందులో ఉద్యోగ అవకాశాలు అధికమవుతున్నాయి. ఈ విభాగంలో వచ్చే రెండేళ్లలో 70 వేల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశమున్నట్లు అంచనా. కానీ ఇతర ఎంటర్‌ప్రెన్యూర్ సంస్థలతో పోల్చితే వీటిలో వేతనాలు కొంత తక్కువగా ఉంటాయి.

కార్పొరేట్ సంస్థలు సైతం
కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీం ప్రకారం సంస్థలు తమ నికర లాభంలో రెండు శాతం సామాజిక అభివృద్ధికి కేటాయించాలి. ఈ క్రమంలో పలు కార్పొరేట్ సంస్థలు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా కొత్త వెంచర్లు ప్రారంభిస్తున్నాయి. లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్నాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్య రంగాల్లో స్టార్టప్ ఔత్సాహికులకు నిధులను కూడా సమకూరుస్తున్నాయి. కేవలం స్వచ్ఛంద సంస్థలు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి అడుగుపెడతాయనుకుంటే పొరపాటు. పూర్తిస్థాయిలో కమర్షియల్‌గా మారిన రంగాల్లోనూ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్థల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన IMPRINT పథకంలో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు పెద్దపీట వేశారు.

ఫండింగ్ ఏజెన్సీలు
  • ACUMEN ఫండ్
  • SONG: ఈ సంస్థ చిన్న, మధ్య తరహా సోషల్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఆర్థిక సహకారం అందిస్తోంది.
  • ఆవిష్కార్ ఇండియా మైక్రో వెంచర్ క్యాపిటల్: ముంబైకు చెందిన ఈ సంస్థ చెత్త నిర్వహణ, ఇంధనం, హస్తకళలు తదితరాలకు ఆర్థిక సహకారం అందిస్తోంది.
  • గ్రే మేటర్స్ క్యాపిటల్ ఫౌండేషన్: హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ మైక్రో ఫైనాన్స్, ఎడ్యుకేషన్ రంగంలో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఫండింగ్ సదుపాయం కల్పిస్తోంది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు ఇండియా ఇన్‌క్లూజివ్ ఇన్నోవేషన్ ఫండ్ పేరుతో ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఓర్పు అవసరం. ప్రారంభంలో లక్షిత క్లయింట్లను చేరుకోవడం కొంత కష్టంగా ఉంటుంది. నిధుల కోసం సీడ్ ఏజెన్సీలను మెప్పించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఇటీవల కాలంలో స్టార్టప్ కాంపిటీషన్లలో సోషల్ స్టార్టప్ ఔత్సాహికుల సంఖ్య పెరగడంతో ఫండింగ్ ఏజెన్సీల ఆలోచన దృక్పథంలోనూ మార్పు వస్తోంది.
- రామ్ గొల్లమూడి, ఫౌండర్, ఎడ్యూటర్.
Published date : 16 May 2016 03:22PM

Photo Stories