Skip to main content

సినిమాటో గ్రఫీ విభాగంలో...ఉపాధి మార్గాలు...

సినిమా అనేది ఒక దృశ్యమాలిక. దాన్ని తెరపై అందంగా, హృద్యంగా చిత్రీకరించేవాడే సినిమాటోగ్రాఫర్. తన సృజనాత్మక శక్తితో దర్శకుడి ఆలోచనలకు, కథకు దృశ్య రూపాన్నిస్తూ.. మాటలకందని భావాలను కెమెరాతో కళ్లకు కడతాడు.
దర్శకుని ఉహా శక్తికి ప్రాణం పోస్తాడు. అందుకే ఈ వృత్తి యువతను బాగా ఆకర్షిస్తోంది. సినిమా నిర్మాణాలు, సీరియల్స్, షార్ట్‌ఫిల్మ్స్, యాడ్స్, వెడ్డింగ్ షూట్స్.. ఇలా సరికొత్త వేదికలు పుట్టుకొస్తుండటంతో సినిమాటోగ్రఫీ విభాగంలో డిమాండ్ నెలకొంది. ఉపాధి అవకాశాలు అంతే స్థాయిలో విస్తృతమవుతున్నాయి.ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ కెరీర్.. అందుబాటులో ఉన్న కోర్సులు.. అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు..

ఉపాధి మార్గాల గురించి తెలుసుకుందాం...
ఆనంద్.. అకడమిక్ చదువులంటే పెద్దగా ఆసక్తిలేని ఓ సాదాసీదా కుర్రాడు. కానీ అతనికి సినిమాలంటే భలే పిచ్చి. అందులోనూ ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. సినిమాటోగ్రాఫరై.. కె.కె సెంథిల్‌లా మగధీర లాంటి దృశ్యకావ్యాన్ని తెరకెక్కించాలని, రత్నవేలులా రోబో లాంటి టెక్నికల్ మూవీని సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించాలని, పీసీ శ్రీరామ్‌లా గీతాంజలి వంటి అందమైన ప్రేమకథని విజువలైజ్ చేయాలని కోరిక. కానీ అతనికి సినిమాటోగ్రాఫర్ కావాలంటే ఏం చదవాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అవకాశాలు ఎలా వస్తాయి, అకడమిక్ కోర్సులేమైనా ఉన్నాయా.. ఇలా ఏమీ తెలియదు. కానీ సినిమాటోగ్రాఫర్ కావాలనే బలమైన కోరిక, అభిరుచి మాత్రం ఉన్నాయి. అతనిలో అన్వేషణ మొదలైంది. చాలా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే క్రమంలో ిసినిమాల గురించి, సినిమాటోగ్రఫీ గురించి తెలిసిన వాళ్లని అడిగి తెలుసుకోవడం, రకరకాల ఇన్‌స్టిట్యూట్‌ల వాళ్లని కలవడం, ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించాడు. ఇలా చేస్తున్న సందర్భంలో అతను తెలుసుకున్న అంశాలేమిటంటే..

విధులు :
సినిమా తెరకెక్కే క్రమంలో డెరైక్టర్, ఆర్ట్ డెరైక్టర్, మ్యూజిక్ డెరైక్టర్, యాక్టర్లుంటారు. కానీ సినిమాటోగ్రాఫర్ ఏం పనిచేస్తాడు. సినిమాటోగ్రాఫర్ అనే వ్యక్తి డెరైక్టర్, ఆర్టిస్టులు, లైటింగ్ డిపార్ట్‌మెంట్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్.. ఇలా అన్నీ విభాగాల వారికి సన్నిహితంగా ఉంటూ.. సీన్ మూడ్‌కి తగిన విధంగా లైటింగ్, ఫ్రేమ్, యాంగిల్స్, సెట్టింగ్, బ్యాక్‌గ్రౌండ్, షాట్ సైజ్ సెట్ చేస్తూ సంబంధిత సీన్ తెరపై అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా కృషి చేస్తాడు. సినిమా పట్టాలెక్కడానికి ముందు కథకి తగిన లొకేషన్లు సెలెక్ట్ చేసుకొని.. నేరుగా అక్కడికి వెళ్లి.. అక్కడ షూటింగ్‌కు అనుకూల పరిస్థితులున్నాయా, లైటింగ్ ఎలా ఉంటుంది, సౌండ్ పొటెన్షియల్ ఏంటి అనే విషయాల్ని పరిశీలిస్తాడు. లొకేషన్ ఫైనలైజ్ అయ్యాక సంబంధిత లొకేషన్‌కు ఫిల్మ్ అండ్ లైటింగ్‌కు సంబంధించిన పరికరాలను, కెమెరాలను తరలిస్తాడు. షూటింగ్ మొదలైన తర్వాత అన్నీ విభాగాలను సమన్వయ పరుచుకుంటూ.. డెరైక్టర్‌తో కలిసి ఫిల్మ్ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తాడు.

అర్హతలేంటి..?
సినిమాటోగ్రాఫర్‌గా రాణించాలంటే.. ఫిల్మ్ అండ్ ఫొటోగ్రఫీపై మంచి ప్యాషన్ ఉండాలి. అలాగే మంచి భాషా నైపుణ్యం, భావ వ్యక్తీకరణ అవసరం. కెమెరాల పనితీరు, రకాలు, కెమెరా పరికరాలేమిటి, ఫిల్టర్స్, ఫిల్మ్ స్టాక్ గురించి తెలుసుకోవాలి. ఇంకా ఎక్స్‌పోజర్, కంపోజిషన్, లైటింగ్, లైటింగ్ సోర్సెస్, కలర్ టెంపరేచర్, ఫిల్మ్ స్టాక్, డెవలప్‌మెంట్, స్పెషల్ ఎఫెక్ట్స్, కలర్ కంపోజిషన్, సీన్ బ్లాకింగ్, సౌండ్, లెన్స్ వంటి అంశాలపై అవగాహన ఉండాలి. కెమెరా ఆపరేటింగ్, లైట్ సెట్టింగ్ వచ్చి ఉండి.. కెమెరా క్రూతో పనిచేయించుకోవడం తెలుసుండాలి. ప్రస్తుతం పేరున్న సినిమాటోగ్రాఫర్‌లంతా గతంలో అప్పటికే అనుభవజ్ఞులైన కెమెరామెన్ల దగ్గర కెమెరా ట్రైనీగా, సెకండ్ కెమెరా అసిస్టెంట్(ఏసీ)గా, తర్వాత ప్రథమ కెమెరా అసిస్టెంట్‌గా అప్రెంటీస్‌షిప్ చేసి అనుభవం గడించిన వారే.

ఎలాంటి నైపుణ్యాలుండాలి..?
  • ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించే లక్షణం ఉండాలి.
  • ఇతరులతో మంచిగా సంభాషించుటకై కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • క్రియేటివిటీ, ఐటీ స్కిల్స్‌తో పాటు నాయకత్వ లక్షణాలుండాలి.
  • పీపుల్స్ మేనేజ్‌మెంట్, టీమ్ వర్క్ స్కిల్స్ తప్పనిసరి.

ఉపాధి వేదికలు :
సినిమాటోగ్రఫీ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు..
  • దూరదర్శన్
  • ఏబీసీఎల్
  • ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌లు
  • టీవీ ఛానళ్లు
  • వీడియో ఇండస్ట్రీస్
  • డాక్యుమెంటరీ కంపెనీలు
  • అడ్వర్టయిజింగ్ కంపెనీలు
  • యానిమేటెడ్, మల్టీమీడియా కంపెనీలు
  • మీడియా హౌస్‌లుల్లో ఉపాధి పొందొచ్చు.

వేతనాలు :
సినిమాటోగ్రాఫర్‌ల వేతనాలు పరిశ్రమ, అనుభవం, పనిచేసే ప్రదేశాలు, ప్రాజెక్ట్ స్థాయిని బట్టి ఉంటాయి. ప్రారంభంలో రూ.30 వేల వరకు ఉంటుంది. అనుభవం, నైపుణ్యం పెరిగే కొద్ది రూ. 6 లక్షల నుంచి పది లక్షల వార్షిక వేతనం అందుకునే అవకాశముంది.

కెరీర్ ఎలా ఉంటుంది?
  • ఇతర వృత్తుల మాదిరిగానే ఇందులోనూ ఒడిదుడుకులు ఉంటాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుంటూ.. వినూత్న ఆలోచనలతో, దూరదృష్టితో ముందుకు పోతూ ఉంటే కెరీర్ పరంగా సినిమాటోగ్రఫీ చక్కటి మార్గం.
  • ఇందులో నిర్దిష్ట పనిగంటలు ఉండవు.. ఒక ప్రాజెక్టు ఒప్పుకున్న తర్వాత మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరణ అన్నా రెడీగా ఉండాలి. చేసే పని కూడా ఒక చోట ఉండదు. షూట్ చేసే లోకేషన్‌ను బట్టి ఆ ప్రాంతానికి ప్రయాణం చేయాలి. నిత్యం శారీరకరంగా కష్టపడాల్సి ఉంటుంది. వీటన్నింటికీ సిద్ధపడితే సినిమాటోగ్రఫీ కెరీర్‌లో ముందుకు సాగొచ్చు.

భవిష్యత్ గమనం :
భారత సినిమా రంగం ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు నిర్మించే చిత్ర పరిశ్రమ. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ సహా ప్రధాన భారతీయ భాషల్లో సినిమాల నిర్మాణం నిత్యం జరుగుతూనే ఉంటుంది. దేశంలో ఏడాదికి వెయ్యికి పైగా సినిమాలు విడుదలవుతున్నాయని ఓ అంచనా. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ.. సినీ పరిశ్రమపై దీని ప్రభావం తక్కువనే చెప్పాలి. కాబట్టి అర్హతలు, నైపుణ్యాలు, సృజనాత్మకత ఉంటే... భవిష్యత్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

ఇన్‌స్టిట్యూట్‌లు :
  • ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ)-పుణే
  • సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్- కోల్‌కతా
  • సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆర్ట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్-న్యూఢిల్లీ
  • గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్-బెంగళూరు
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-న్యూఢిల్లీ
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూ మీడియా డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్-పుణే
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్-న్యూఢిల్లీ
  • ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్-నోయిడా
  • ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ-చెన్నై

కోర్సులు
సినిమాటోగ్రఫీకి సంబంధించి చాలా ఇన్‌స్టిట్యూట్‌లు 10+2 లేదా ఇంటర్మీడియట్ అర్హతతో పలు రకాల కోర్సులు అందిస్తున్నాయి.

అవి...
యూజీ కోర్సులు:
  • అడ్వాన్డ్స్ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ
  • బీఏ (సినిమాటోగ్రఫీ) ఆర్ట్స్
  • బీఎస్సీ (ఫొటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ)
  • బీ.వొకేషనల్ (సినిమాటోగ్రఫీ).
పీజీ కోర్సులు:
  • ఎంఏ (సినిమాటోగ్రఫీ) యాక్టింగ్
  • ఎంఎఫ్‌టెక్ (సినిమాటోగ్రఫీ)
  • ఎమ్మెస్సీ (ఫొటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ) మల్టీమీడియా, యానిమేషన్ అండ్ గేమింగ్
  • పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ వీటితోపాటు డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
Published date : 17 Jan 2020 03:57PM

Photo Stories