Skip to main content

సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్తో ప్రయోజనాలు ఇవీ..

దేశ శాస్త్ర, సాంకేతిక రంగాలకు అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దే దిశగా ‘కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. అందుకోసం సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్’ ద్వారా అవకాశం కల్పిస్తోంది. ఏటా రెండు సార్లు నిర్వహించే ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ చూపిన అభ్యర్థులు జేఆర్‌ఎఫ్‌తో పాటు లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసేందుకు కూడా అర్హత లభిస్తుంది. 2020 జూన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇటీవల విడుదల చేసింది. ఈ నేపథ్యంలో... సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్‌తో ప్రయోజనాలు, అర్హతలు, పరీక్ష విధానంపై ప్రత్యేక కథనం...
సబ్జెక్టులు
  • కెమికల్ సెన్సైస్
  • ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానెటరీ సెన్సైస్
  • లైఫ్ సెన్సైస్
  • మ్యాథమెటికల్ సెన్సైస్
  • ఫిజికల్ సెన్సైస్

సీఎస్‌ఐఆర్ నెట్‌తో ప్రయోజనాలు
ఫెలోషిప్:
సీఎస్‌ఐఆర్ ఏటా పెద్ద సంఖ్యలో జేఆర్‌ఎఫ్‌లు అందిస్తోంది. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపి ఎంపికైన అభ్యర్థులు దేశంలోని ప్రముఖ లేబొరేటరీలు, ఇన్‌స్టిట్యూట్స్‌లో పరిశోధనలకు ఫెలోషిప్‌లను అందుకోవచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్)కు ఎంపికైన వారికి నెలకు రూ.31,000 చొప్పున రెండేళ్లపాటు ఫెలోషిప్ లభిస్తుంది. దీంతో పాటు మరో రూ.20,000 వార్షిక కంటింజెంట్ గ్రాంట్‌గా అందిస్తారు. జేఆర్‌ఎఫ్‌గా రెండేళ్లు పూర్తయ్యాక.. పీహెచ్‌డీ కోసం రిజిస్టర్ చేసుకుంటే.. మూడో ఏడాది నుంచి ‘సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్‌ఆర్‌ఎఫ్)’ అందుతుంది. ఎస్‌ఆర్‌ఎఫ్‌లకు ప్రతినెలా రూ.35,000 ఫెలోషిప్ లభించడంతో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి.

అసిస్టెంట్ ప్రొఫెసర్: జాతీయ స్థాయిలో జరిగే జాయింట్ సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ ద్వారా దేశంలోని యూనివర్సిటీలు, కళాశాలల్లో లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అర్హత సాధించవచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్)కు ఎంపికైన అభ్యర్థులు దేశంలోని యూనివర్సిటీల్లో, కాలేజీల్లో లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసేందుకు కూడా అర్హులే.

అర్హతలు
  • సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినవారితో పాటు బీటెక్/బీఈ/ బీఫార్మసీ/ఎంబీబీఎస్/ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్/ఎమ్మెస్సీ/బీఎస్సీ హానర్స్ తత్సమాన అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత సబ్జెక్టుల్లో జనరల్ అభ్యర్థులకు 55 శాతం, ఇతరులకు 50 మార్కులు తప్పనిసరి.
  • జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకునేవారు 01 జనవరి 2020 నాటికి జనరల్ అభ్యర్థుల వయసు 28 ఏళ్లు దాటరాదు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ మహిళలకు ఐదేళ్లు, ఓబీసీ-నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు మూడేళ్ల వయో సడలింపు ఉంది.
  • లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం
  • సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు.
  • సీఎస్‌ఐఆర్-నెట్ పరీక్ష కెమికల్ సెన్సైస్, ఎర్త్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్ విభాగాలలో ఎంచుకున్న సబ్జెక్టుపైనే సింగిల్ పేపర్‌గా ఉంటుంది. పరీక్ష సమయం 3గంటలు. మొత్తం మూడు విభాగాల్లో (పార్ట్-ఎ, బి, సి) 200 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఇస్తారు.
  • పార్ట్-ఎ(30 మార్కులు): ఇది అన్ని సబ్జెక్టులకు ఒకే విధంగా ఉంటుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్ (లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్) నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థి 15 ప్రశ్నలకు సమాధానం గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు.
  • పార్ట్-బి(70 మార్కులు): ఇందులో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించి 25 నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. వీటిల్లో నుంచి ఆయా సబ్జెక్టును బట్టి 20 నుంచి 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
  • పార్ట్-సి(100 మార్కులు): ఈ విభాగంలో ఇచ్చిన ప్రశ్నలకు విశ్లేషణాత్మకంగా జవాబులు రాయాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్థి సైంటిఫిక్ పరిజ్ఞానాన్ని, సైన్స్ అప్లికేషన్స్ ను పరీక్షిస్తారు. ఈ విభాగంలో మార్కులకు అధిక వెయిటేజీ ఉంటుంది.
  • అన్ని విభాగాలలోను తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది.

దరఖాస్తు చేయడం ఎలా
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ జూన్-2020 కోసం ఒక అభ్యర్థి ఒక సబ్జెక్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ‘ఆన్‌లైన్’లో ఎన్‌టీఏ వెబ్‌సైట్ csirnet.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి ఫోన్ నంబర్, ఈ మెయిల్‌తో సహా అన్ని వివరాలు నమోదు చేయాలి.

దరఖాస్తు ఫీజు
  • జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు: రూ.1000
  • ఓబీసీ-నాన్ క్రిమిలేయర్: రూ.500
  • ఎస్సీ/ఎస్టీ: రూ.250
  • దివ్యాంగులకు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
  • దరఖాస్తుకు చివరి తేది: 15 ఏప్రిల్ 2020
  • హాల్‌టికెట్ల జారీ: మే 15 నుంచి
  • పరీక్ష తేది: జూన్ 21
  • పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.nta.ac.in, csirnet.nta.nic.in
Published date : 23 Mar 2020 03:45PM

Photo Stories