Skip to main content

సీడీఎస్‌ఈ... సాయుధ దళాల్లో కొలువుకు మార్గం

త్రివిధ దళాలు అనగానే దేశభక్తి ఉప్పొంగుతుంది. దేశ రక్షణలో పాల్పంచుకునే అరుదైన అవకాశం చాలా తక్కువమందికే లభిస్తుంది. మాతృభూమి సేవలో తరించే ఉద్యోగమే సాయుధ దళాల్లో కొలువు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఆరంభంలోనే ఆఫీసర్ ఉద్యోగమైతే.. సవాళ్లకు కొదవుండదు. త్రివిధ దళాల్లో చాలెంజింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి యువత నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో చేరేందుకు వీలుకల్పించే కంబైన్‌‌డ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ ఈ)(1)-2019 నోటిఫికేషన్ సమాచారం, సన్నద్ధత వివరాలు..

మొత్తం ఖాళీలు: 417
విభాగం ఖాళీలు
ఇండియన్ మిలటరీ అకాడమీ (డెహ్రాడూన్) 100
ఇండియన్ నావల్ అకాడమీ (ఎజిమల) 45
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్) 32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై) (పురుషులు) 225
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై) (మహిళలు) 15

విద్యార్హతలు :
  • ఇండియన్ మిలటరీ అకాడమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
  • ఇండియన్ నావల్ అకాడమీకి బీటెక్/బీఈ.
  • ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
  • నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • అకడమిక్ అర్హత పరీక్ష చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. మహిళా అభ్యర్థులు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే అర్హులు.
వయోపరిమితి :
  • ఇండియన్ మిలటరీ అకాడమీ, నావల్ అకాడమీలకు 1996, జనవరి 2-2001, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
  • ఎయిర్‌ఫోర్స్ అకాడమీ పోస్టులకు 1996, జనవరి 2-2000, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
  • ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (పురుషులు, మహి ళలు) పోస్టులకు 1995, జనవరి 2-2001, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
  • అన్ని విభాగాలకు అవివాహితులైనవారు మాత్రమే అర్హులు. ఎంపికైన అభ్యర్థులు శిక్షణ సమయంలోనూ వివాహం చేసుకోకూడదనే నిబంధన ఉంది.
ఎంపిక ప్రక్రియ :
ఎంపిక ప్రక్రియలో మొదట రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్ బీ) నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరవ్వాలి. ఇది అన్ని కోర్సుల విద్యార్థులకు కామన్‌గా ఐదు రోజుల పాటు ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ఔత్సాహికులకు ఆరు రోజులపాటు నిర్వహిస్తారు.

రాత పరీక్ష :
రాత పరీక్షను ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న విభాగాన్ని బట్టి పరీక్ష వేర్వేరుగా ఉంటుంది.

ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ టెస్టులు...
ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ టెస్టులు రెండు దశల్లో ఉంటాయి. ఈ టెస్టులో మొదటి రోజు స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తారు. ఇది స్టేజ్-1 టెస్ట్. ఈ దశలో అర్హత సాధిస్తే స్టేజ్-2కు అనుమతిస్తారు.
స్టేజ్-1: ఈ దశలో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ (ఓఐఆర్) టెస్ట్‌లు ఉంటాయి. విద్యార్థులను ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేస్తారు. వీరికి పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్‌లు(పీపీ అండ్ డీటీ) నిర్వహిస్తారు. ఇక్కడ బ్లర్ అయిన ఫోటో ఒకటి కనిపిస్తుంది. దాన్ని చూసి అర్థం చేసుకున్న విషయాన్ని కథలా రాయాల్సి ఉంటుంది. దాన్నే బోర్డు సభ్యుల ముందు వివరించాలి. ఆ తర్వాత గ్రూపు సభ్యులంతా కలిసి ఫోటో మీద రాసిన కథనాన్ని చర్చించి.. దానికో ముగింపు ఇవ్వాల్సి ఉంటుంది.
స్టేజ్-2: ఇందులో సైకాలజీ టెస్ట్‌లు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్కులు, ఇంటర్వ్యూ, కాన్ఫరెన్సులు ఉంటాయి. వీటిని నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు. సైకాలజీ టెస్టుల్లో థీమాటిక్ అప్పెర్‌సెప్షన్ టెస్ట్ (టీఏటీ) ఉంటుంది. ఇక్కడ 11 ఫోటోల స్లైడ్ షో ఉంటుంది. ప్రతి ఫోటో 30 సెకన్ల పాటు వచ్చిపోతుంది. దానిపై 4 నిమిషాల వ్యవధిలో స్టోరీ రాయలి. ఆ తర్వాత వర్డ్ అసోసియేషన్ టెస్ట్(డబ్ల్యూఏటీ), సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ (ఎస్‌ఆర్‌టీ)ల ద్వారా అభ్యర్థుల సమయస్ఫూర్తిని పరీక్షిస్తారు. డబ్ల్యూఏటీలో ఒక్కో పదాన్ని 15 సెకన్ల పాటు చూపించి.. దానిపై స్పందన రాయమంటారు. ఇక చివరగా సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్(ఎస్‌డీ)లో... అభ్యర్థి తన కుటుంబం, స్నేహితులు, కాలేజీ, ఉపాధ్యాయులతోపాటు తన గురించి కూడా రాయాల్సి ఉంటుంది.

ఇండియన్ మిలటరీ, నావల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ..
సబ్జెక్ట్ వ్యవధి మార్కులు
ఇంగ్లిష్ 2 గం॥ 100
జనరల్ నాలెడ్జ్ 2 గం॥ 100
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 2 గం॥ 100

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ :
సబ్జెక్ట్ వ్యవధి మార్కులు
ఇంగ్లిష్ 2 గం॥ 100
జనరల్ నాలెడ్జ్ 2 గం॥ 100
ఈ పరీక్షల్లో ప్రశ్నల క్లిష్టత ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టులకు గ్రాడ్యుయేషన్ స్థాయిలో, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌కు పదో తరగతి స్థాయిలో ఉంటుంది.

గ్రూప్ టాస్క్‌లు: రెండు రోజులపాటు 9 రకాల గ్రూప్ టాస్కులు నిర్వహిస్తారు. వీటి తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. బోర్డ్ ప్రెసిడెంట్ లేదా సీనియర్ సభ్యుడు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది 35 నుంచి 40 నిమిషాలపాటు జరుగుతుంది. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలకు వెళ్లగానే అభ్యర్థి పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్వశ్చనరీ (పీఐక్యూ) ఫాం నింపుతారు. దాని ఆధారంగా ఇంటర్వ్యూ సాగుతుంది. తుదిగా కాన్ఫరెన్స్ ఉంటుంది. ప్యానెల్‌లో ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్స్, సైకాలజి స్టులు ఉంటారు. వీరి ముందు అభ్యర్థులు వేర్వేరుగా హాజరవ్వాలి. ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు పీఏబీటీ ఉంటుంది. ఎంపికైన వారికి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్టు విడుదల చేస్తారు.

సన్నద్ధమవ్వండిలా...
ఇంగ్లిష్ :
అభ్యర్థుల ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం ఇది. ఇందులో ముఖ్యంగా వొకాబ్యులరీ, ఇంగ్లిష్‌ను అర్థం చేసుకునే నైపుణ్యాలు పరీక్షిస్తారు. ఈ పేపర్‌లో 120 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. సెంటెన్స్ జంబ్లింగ్, స్పాటింగ్ ఎర్రర్స్; సెంటెన్స్ ఆర్డరింగ్; సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్; రీడింగ్ కాంప్రెహెన్షన్; ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
జనరల్ నాలెడ్జ్ :
ఇందులోనూ 120 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. ఇందులో కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. రక్షణ రంగానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు, ప్రాముఖ్యం ఉన్న అంశాలు, అవార్డులు, సంయుక్త సైనిక విన్యాసాలు- ఆయా దేశాలు, సదరు విన్యాసాలకు పెట్టిన పేర్ల గురించి తెలుసుకోవడం మేలు. ప్రశ్నలు ఎక్కువగా కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయయి. కాబట్టి గత ఆర్నెల్ల నుంచి అంతర్జాతీయంగా, జాతీయంగా చోటుచేసుకున్న ముఖ్యమైన పరిణామాలపై పట్టుసాధించాలి.
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ :
ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి మినహా మిగతా పోస్టులకు సంబంధించిన పరీక్షల్లో మ్యాథమెటిక్స్ విభాగం ఉంటుంది. 100 ప్రశ్నలు-100 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున కేటాయించారు. పదోతరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. నంబర్ సిస్టమ్, ఎలిమెంటరీ నంబర్ థియరీ, అర్థమెటిక్, జామెట్రీ, మెన్సురేషన్, ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, స్టాటిస్టిక్స్ అధ్యాయాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అభ్యర్థులు పదో తరగతి స్థాయి పుస్తకాలు చదివితే ఈ విభాగానికి పూర్తిస్థాయి సన్నద్ధత లభిస్తుంది.
గమనిక: ఆబ్జెక్టివ్ తరహాలోని రాత పరీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు కోత విధిస్తారు.

ముఖ్య సమాచారం :
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుం: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2018, నవంబర్ 26.
పరీక్ష తేదీ: 2019, ఫిబ్రవరి 3.
తెలంగాణ, ఏపీల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.upsc.gov.in
Published date : 09 Nov 2018 06:22PM

Photo Stories