Skip to main content

సైన్స్‌ కెరీర్‌కు ఉజ్వల మార్గాలు...

10+2/ఇంటర్మీడియెట్‌ విద్యార్థులను.. భవిష్యత్‌ లక్ష్యంఏంటని అడిగితే! ఎక్కువ మంది టక్కున చెప్పే సమాధానం.. ఇంజనీరింగ్‌ లేదా మెడిసిన్‌.
అయితే, ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు విస్తృతమవుతున్న నేపథ్యంలో సైన్స్‌ ఉజ్వల కెరీర్‌కు కేరాఫ్‌గా నిలవడం ఖాయమంటున్నారు నిపుణులు. ప్రస్తుతం భారత్‌లోనూ పరిశోధన, అభివృద్ధి (R&D), నవకల్పనలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ క్రమంలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులతో పాటు సైన్స్‌ ఔత్సాహికులకు ఇంజనీరింగ్, మెడిసిన్‌ కాకుండా.. సైన్స్‌లో ఉన్న ఇతరఅవకాశాలపై ఫోకస్‌..

కెరీర్‌ అంటే కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్‌ మాత్రమే కాదు. విస్తృత దృష్టితో ఆలోచిస్తే.. ప్రత్యామ్నాయాలు అనేకం. వాటిలో ప్రధానమైనది ప్యూర్‌సైన్సెస్‌. ఇందులో ముందడుగేసి, అద్భుత కెరీర్‌ను అందుకోవచ్చంటున్నారు నిపుణులు. సైన్స్‌ రంగంలో అవకాశాలపై ప్రస్తుతం విస్తృత చర్చ జరుగుతోంది. దేశంలో సైన్స్‌ కోర్సుల వైపు విద్యార్థులను ఆకర్షించేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌) వంటి ప్రత్యేక సంస్థలను నెలకొల్పారు. అంతేకాకుండా ప్రభుత్వం సైన్స్‌ రంగంలో ఔత్సాహికులకు వివిధ రకాల ప్రోత్సాహకాలు (కెవీపీవై, ఇన్‌స్పైర్‌ తదితర) అందిస్తోంది.

అవకాశాలు అపారం...

  • ఇంటర్‌ బైపీసీ విద్యార్థుల్లో అధికశాతం మందికి ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ లక్ష్యంగా ఉంటుంది. కానీ, సీట్లు తక్కువగా ఉండటం వల్ల చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశం లభిస్తుంది. కాబట్టి మిగతా విద్యార్థులు నిరాశ చెందకుండా ప్యూర్‌ సైన్సెస్‌లో కెరీర్‌పై దృష్టిసారించొచ్చు.
  • బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులకు అగ్రికల్చర్‌ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, న్యూట్రిషన్‌ అండ్‌ డైటీటిక్స్, హార్టికల్చర్‌ సైన్స్, వెటర్నరీ సైన్స్‌ తదితర ఉన్నత విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్‌ తర్వాత సంబంధిత సబ్జెక్టుల్లో ప్యూర్‌ సైన్సెస్‌లో పీజీ చేసి ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
  • ఇంటర్‌ ఎంపీసీ తర్వాత విద్యార్థులకు సైన్స్‌ విభాగంలో అవకాశాలు విస్తృతం. నచ్చిన గ్రూప్‌లో బీఎస్సీలో చేరి, ఆపై భవిష్యత్‌ కెరీర్‌ దృష్ట్యా పీజీ చేయొచ్చు. ఉదాహరణకు ఎర్త్‌ సైన్సెస్, జియో ఫిజిక్స్, మెటలర్జీ, స్పేస్‌ సైన్స్‌ వంటి విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ దిశగా అడుగులు వేయొచ్చు.
  • ప్యూర్‌ సైన్సెస్‌పై ఆసక్తి, ఆవిష్కరణలపై ఉత్సాహం ఉన్న విద్యార్థులు బీఎస్సీ తర్వాత నేరుగా పీహెచ్‌డీ (ఇంటెగ్రేటెడ్‌) ప్రోగ్రామ్‌లో చేరొచ్చు. ఐఐఎస్సీ, ఐఐఎస్‌ఈఆర్‌ తదితర సంస్థల్లో ఇంటెగ్రేటెడ్‌ పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌ అభ్యర్థులకు సరికొత్త వేదిక ఫోరెన్సిక్‌ సైన్స్‌. ఇందులో పీజీ డిప్లొమా, పీజీ కోర్సులు పూర్తిచేస్తే ఫోరెన్సిక్‌ లేబొరేటరీల్లో టెక్నీషియన్, అనలిస్ట్‌గా కెరీర్‌ను సుస్థిరం చేసుకోవచ్చు.
ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్‌లు :
సైన్స్‌లో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు, ఉన్నతవిద్య అవకాశాలు కల్పించేందుకు వివిధ ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైంది.. ఐఐఎస్‌ఈఆర్‌. ఇంజనీరింగ్‌కు ఐఐటీల తరహాలో సైన్స్‌ రంగం లో ఉన్నత విద్య అవకాశాలను అందించేందుకు ఐఐఎస్‌ఈఆర్‌లను నెలకొల్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడు ఐఐఎస్‌ఈఆర్‌ క్యాంపస్‌ లున్నాయి. కేవీపీవై/జేఈఈ అడ్వాన్స్‌డ్‌/స్టేట్‌ అండ్‌ సెంట్రల్‌ బోర్డ్స్‌ ఛానెల్‌ (ఎస్‌సీబీ) ఆధారంగా ఐఐఎస్‌ఈఆర్‌లో ప్రవేశించొచ్చు.

పరిశోధన సంస్థలు :
బీఎస్సీ పూర్తిచేసిన విద్యార్థులు పీహెచ్‌డీ దిశగా అడుగులు వేసేందుకు అందుబాటులో ఉన్న కొన్ని రీసెర్చ్‌ సెంటర్లు..
1. హోమీబాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (హెచ్‌బీఎన్‌ఐ).
2. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌).
3. ఆర్యభట్ట రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అబ్జర్వేషనల్‌ సైన్స్‌ (ఏఆర్‌ఐఈఎస్‌).
4. హరీశ్‌–చంద్ర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (హెచ్‌ఆర్‌ఐ).
5. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌–బెంగళూరు (ఐఐఎస్సీ).
6. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌).
7. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (నైపర్‌–ఫార్మసీ రీసెర్చ్‌ కోసం).
8. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐఎస్‌ఈఆర్‌).
9. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌.
10. సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ).

ప్రవేశాలకు మార్గాలు..
  • ఫిజిక్స్‌/థియరిటికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌/న్యూరో సైన్స్‌/కంప్యుటేషనల్‌ బయాలజీలో పీహెచ్‌డీ/ఇంటెగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (జెస్ట్‌) రాయాల్సి ఉంటుంది. ఇందులో స్కోర్‌ ఆధారంగా ఆర్యభట్ట రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అబ్జర్వేషనల్‌ సైన్సెస్, బోస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కోల్‌కతా), హోమీ బాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ముంబై) తదితర 31 రీసెర్చ్‌ కేంద్రాల్లో ప్రవేశించొచ్చు.
  • గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌) ఆధారంగా ప్రముఖ సంస్థల్లో డాక్టోరల్‌ ప్రోగ్రామ్స్‌లో చేరొచ్చు.
ఆర్థికప్రోత్సాహకాలు...
సైన్స్‌ రంగంలో పరిశోధన ఔత్సాహికులకు ఇప్పుడు ఆర్థికంగా ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌లో ప్రతిభ ఆధారంగా తొలుత జేఆర్‌ఎఫ్‌ హోదాలో నెలకు రూ.25,000 అందుకోవచ్చు. ఆ తర్వాత అర్హతలను బట్టి ఎస్‌ఆర్‌ఎఫ్‌ హోదాలో నెలకు రూ.28,000 అందుతుంది. అదనంగా కాంటింజెన్సీ గ్రాంట్, రీసెర్చ్‌ పూర్తిచేసేందుకుS ఉపయోగపడే సెమినార్లు, ఇతర సదస్సులకు హాజరయ్యేందుకు ట్రావెల్‌ గ్రాంట్‌ తదితరాలను కూడా అందుకోవచ్చు.

సహనంతోనే సక్సెస్‌...
సైన్స్‌ రంగంలో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవాలంటే ఎక్కువ సమయం అవసరమనే అభిప్రాయంలో కొంత వాస్తవముంది. మెడికల్‌ రంగంలో ఉన్నతంగా స్థిరపడాలంటే ఇంటర్మీడియెట్‌ తర్వాత దాదాపు పదేళ్ల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. సైన్స్‌ విషయానికొస్తే.. అకడమిక్‌గా ఎలాంటి బ్యాక్‌లాగ్స్‌ లేకుండా చదువుతూ ముందుకుసాగితే 30 ఏళ్లు వచ్చేసరికి పీహెచ్‌డీ పూర్తిచేసుకునే వీలుంది. – డాక్టర్‌ వి.ఎస్‌.రావు, కోఆర్డినేటర్, ఐఐఎస్‌ఈఆర్‌–తిరుపతి.
Published date : 27 Nov 2017 06:01PM

Photo Stories