సైకాలజీతో అందే ఉపాధి అవకాశాలు.. వేతన వివరాలు ఇలా..
కెరీర్ అవకాశాలు..
సైకాలజీలో ఏ స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సులు పూర్తి చేసినా.. ఉజ్వల అవకాశాలు అందుకోవచ్చు. సైకాలజిస్ట్‌గా రాణించొచ్చు. కెరీర్ కౌన్సెలర్స్/అకడమిక్ కౌన్సెలర్స్, కార్పొరేట్ కౌన్సెలర్స్, ఫ్యామిలీ కౌన్సెలర్స్, సైకాలజీ ప్రొఫెసర్, కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. ముఖ్యంగా కౌన్సెలింగ్ నిపుణుడిగా సేవలందించొచ్చు. సోషల్ సైకాలజిస్ట్, రిహాబిలిటేషన్ ఎక్స్‌పర్ట్, మోటివేషనల్ స్పీకర్‌గా అవకాశాలు పొందొచ్చు.
సైకాలజిస్ట్.. సైకియాట్రిస్ట్ తేడా
కెరీర్ పరంగా సైకాలజీ, సైకియాట్రిస్ట్ రెండూ పూర్తిగా భిన్నమైనవి. సైకాలజీ కోర్సులను అకడమిక్‌గా ఎలాంటి నేపథ్యం ఉన్న అభ్యర్థులైనా అభ్యసించొచ్చు. కానీ సైకియాట్రిస్ట్ కోర్సు పూర్తిగా వైద్య సంబంధమైన కోర్సు. వీరు ముఖ్యంగా రోగులు వాడాల్సిన మందులను సూచిస్తారు.
వేతనాలు..
- అభ్యర్థులు పూర్తిచేసిన కోర్సు, ఉద్యోగంలో చేరిన సంస్థపై వేతనం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో పీజీ స్థాయిలో సైకాలజీ కోర్సు పూర్తి చేసుకున్న వారికి నైపుణ్యాలుంటే రూ.5 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తోంది.
- సైకాలజిస్ట్‌లు.. కౌన్సెలర్స్, సైకోథెరపిస్ట్‌లుగా సొంత ప్రాక్టీస్ ద్వారా మరింత ఆదాయం పొందొచ్చు. ఊ కార్పొరేట్ సంస్థలకు కౌన్సెలర్లుగా, కన్సల్టింగ్‌గా సేవలందించే వారికి కూడా చక్కటి ఆదాయం లభిస్తోంది.
- వ్యక్తిగత స్థాయిలో ఒక పేషెంట్‌కు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు రూ.500 నుంచి రూ.1000వరకు కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది.
ఓర్పు, నేర్పు ఉంటేనే..
సైకాలజీ రంగంలో అడుగు పెట్టాలనుకునే యువతకు ఎంతో ఓర్పు నేర్పు అవసరం. ఇతర కోర్సులతో పోల్చితే ఇది భిన్నమైనది. రకరకాల మానసిక సమస్యలతో వచ్చే వ్యక్తుల సమస్యలను ఓర్పుగా వినడం, సమస్యను విశ్లేషించడం, తగిన సలహా ఇవ్వడం చేయాల్సి ఉంటుంది.
ఉపాధి ఖాయం..
సైకాలజీ కోర్సులను పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాల పరంగా ఎలాంటి ఢోకా లేదని చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళనకు గురవుతున్న వారు తమ సమస్యల పరిష్కారం కోసం సైకాలజిస్ట్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ కెరీర్‌లో రాణించాలంటే..సహజ సిద్ధంగా ఓర్పు, సహనం, ఎదుటి వారి సమస్యలను అర్థం చేసుకునే దృక్పథం అవసరం.
– డా‘‘ సి.వీరేందర్, ప్రముఖ సైకాలజిస్ట్
సైకాలజీ కెరీర్.. ముఖ్యాంశాలు
- పోటీ పరిస్థితులు, ప్రస్తుతం కరోనా కారణంగా.. మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నవారి సంఖ్య లక్షల్లోనే.
- నూటికి డెబ్భై శాతం మందిలో మానసిక ఆందోళన వంటి సమస్యలు ఉన్నాయంటున్న డబ్ల్యూహెచ్‌వో.
- ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం సైకాలజిస్ట్‌లు, సైకియాట్రిస్ట్‌లను ఆశ్రయిస్తున్న వైనం.
- 2023 చివరి నాటికి దాదాపు అరవై వేల మందికి పైగా సర్టిఫైడ్ సైకాలజిస్ట్‌ల అవసరం ఉంటుందని అంచనా.
- సిబ్బందిలో ఒత్తిడిని తగ్గించడానికి సైకాలజిస్ట్‌లను నియమించుకుంటున్న కార్పొరేట్ సంస్థలు.
- ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో విద్యార్థుల కోసం కెరీర్ కౌన్సెలర్స్/సైకాలజిస్ట్‌ల నియామకాలు.
- పీజీ స్థాయి అర్హతతో మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ సెంటర్స్, ఎన్‌జీఓలు, కౌన్సెలింగ్ సెంటర్లలో ఉద్యోగావకాశాలు.
- ప్రారంభంలోనే గరిష్టంగా సగటు రూ.50 వేల వరకు వేతనం పొందే అవకాశం.
ఇంకా చదవండి : part 1 : ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే సైకాలజీ.. కెరీర్ అవకాశాలు ఇవే..