Skip to main content

రోబోల రాజ్యంలో...రాణించేదెలా?

ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్ గురించే చర్చ జరుగుతోంది. నేడు ఏ రంగంలో చూసినా.. ఈ లేటెస్ట్ టెక్నాలజీ వినియోగం, విస్తరణ శరవేగంగా సాగుతోంది. ఈ టెక్నాలజీపై దృష్టిపెట్టని దేశాలు గానీ.. పరిశోధనలు చేయని ల్యాబ్‌లు గానీ లేవంటే అతిశయోక్తికాదు!! నేడు ఎక్కడ ముఖ్య సదస్సు జరిగినా.. రోబోల స్వాగతం కనిపిస్తోంది.
మరోవైపు స్మార్ట్‌ఫోన్ల నుంచి చాట్‌బోట్‌ల వరకూ... మనకు తెలియకుండా ఎన్నో పనులు ఏఐ చక్కబెట్టేస్తోంది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఉద్యోగాల తీరును సైతం సమూలంగా మార్చివేస్తోంది. మరి ఈ ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల ద్వారా ఉద్యోగాలుసొంతం చేసుకోవాలంటే... ఏ కోర్సులు చదవాలి... ఎలాంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలో తెలుసుకుందాం..
  • 2020 నాటికి ఏఐ, రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాలు లక్షల్లోనే
  • అన్ని రంగాలు, విభాగాలకు శరవేగంగా విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీ కార్యకలాపాలు
  • నైపుణ్యాలుంటేనే రాణించే అవకాశం అంటున్న నిపుణులు
  • ఇప్పటికే సంబంధిత కోర్సులు, సర్టిఫికేషన్‌లపై దృష్టిసారిస్తున్న విద్యార్థులు
  • టీమ్‌లీజ్ సంస్థ అంచనాల ప్రకారం 2018లో ప్రతి అయిదు సంస్థల్లో ఒక సంస్థ ఏఐ, మెషీన్ లెర్నింగ్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించనుంది.
  • కెల్లీ సర్వీసెస్ అంచనా ప్రకారం 2018లోనే 60 శాతం పెరగనున్న మెషీన్ లెర్నింగ్, ఏఐ నిపుణుల అవసరం.
1. కృత్రిమ మేధ.. కెరీర్ తార
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధస్సు).. ఆధునిక యుగంలో మరో సాంకేతిక విప్లవం! సాఫ్ట్‌వేర్ రంగం నుంచి సర్వీస్ సెక్టార్ వరకు.. మాన్యుఫ్యాక్చరింగ్ నుంచి మేనేజ్‌మెంట్ వరకు.. రానున్న కాలంలో అధిక శాతం
కార్యకలాపాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనే! ఇప్పటికే ఈ కోవలో నడుస్తున్న పలు సంస్థలు! దాంతో యువత భవిష్యత్తు కెరీర్ కోణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ నైపుణ్యాలు పొందాల్సిన ఆవశ్యకత! ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్‌ కెరీర్ అవకాశాలపై విశ్లేషణ..
  • నాలుగైదేళ్ల క్రితం.. బ్యాంకు అకౌంట్‌లో నగదు డిపాజిట్ చేయాలంటే.. బ్యాంకుకు వెళ్లి, వోచర్ నింపి.. గంటల కొద్దీ 'క్యూ'లో వేచి ఉండాల్సిన పరిస్థితి. కానీ, ఇప్పుడు క్యాష్ డిపాజిట్ మెషీన్ ద్వారా రెండు నిమిషాల్లో అకౌంట్‌లో నగదు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు.
  • గూగుల్ మ్యాప్స్..ఒక ప్రదేశం పేరు ఎంటర్ చేయగానే ఎలా వెళ్లాలి? నిర్దేశిత ప్రాంతం నుంచి గమ్య స్థానానికి చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఏఏ మార్గాల్లో వెళ్లొచ్చు? ఇలా.. అన్నీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్న పరిస్థితి.
వీటన్నిటికీ మూలం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధస్సు). దీనిద్వారా అప్పటికే రూపొందించిన నిర్దిష్ట ప్రోగ్రామింగ్ ద్వారా ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా కార్యకలాపాలను సులువుగా పూర్తిచేసుకునే అవకాశం లభిస్తోంది. ఇది.. ఓవైపు వినియోగదారులకు, మరోవైపు సంస్థలకు కూడా ఉపయుక్తం. దాంతో అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కార్యకలాపాల వేగం, విస్తృతి పెరుగుతోంది. ఫలితంగా రానున్న కాలంలో ఇది యువతకు ఉత్తమ కెరీర్ ఆప్షన్‌గా నిలవనుంది. భవిష్యత్‌లో సంప్రదాయ కొలువుల సంఖ్య తగ్గి.. ఐఓటీ, ఏఐ విభాగాల్లోనే ఉద్యోగాలు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఏఐలో విస్తృత అవకాశాలు లభించనున్నాయని అంచనా. కారణం.. కృత్రిమ మేధస్సుతో కార్యకలాపాలు సజావుగా సాగాలంటే.. సంబంధిత ప్రోగ్రామ్‌ల రూపకల్పనకు మానవ మేధస్సు తప్పనిసరి.

అన్ని రంగాల్లోనూ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అన్ని రంగాల కార్యకలాపాల్లో, వ్యాపారాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. కస్టమర్ డేటా అనాలిసిస్ నుంచి కోర్ మాన్యుఫ్యాక్చరింగ్ వరకు.. ప్రతి రంగంలోనూ ఏఐ అధారిత కార్యకలాపాలు ఎన్నో! ఉదాహరణకు ఈ-కామర్స్ లేదా ఆన్‌లైన్ షాపింగ్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. పలు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అప్పటికే తమ పోర్టల్ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువుల వివరాలను సేకరించి.. వాటికి సంబంధించి కొత్త వస్తువులు అందుబాటులోకి వస్తే సంబంధిత వివరాలను వినియోగదారుల ఈ-మెయిల్స్ లేదా మొబైల్ ఫోన్స్‌కు పంపుతున్నాయి. అదే విధంగా యాపిల్ ఐ-ఫోన్స్‌లో స్పీచ్ టు టెక్స్ట్, గూగుల్ ట్రాన్స్‌లేట్ వంటివెన్నో ఏఐకి ఉదాహరణగా పేర్కొనొచ్చు.

కోర్ సెక్టార్స్‌లో ఇలా..
కోర్ మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్స్‌లో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది? అనే సందేహం తలెత్తడం సహజం. ఈ రంగంలో ఏఐ వినియోగం కోణంలో రోబోటిక్స్, 3-డి డిజైన్ ప్రింటింగ్ వంటి వాటిని నిదర్శనంగా చూపొచ్చు. ఉదాహరణకు ఇటీవల కాలంలో స్మార్ట్ కార్లు లేదా డ్రైవర్ లెస్ కార్ల గురించి తరచూ వింటున్నాం. అంటే.. అప్పటికే రూపొందించిన నిర్దేశిత ప్రోగ్రామింగ్ ద్వారా ప్రయాణికులు తమ గమ్యస్థానం వివరాలను పేర్కొంటే.. స్మార్ట్ కార్లు సదరు గమ్యానికి చేర్చుతున్నాయి. అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రాధాన్యం పెరుగుతున్నప్పటికీ... ఈ జాబితాలో ముందంజలో నిలుస్తున్నది సాఫ్ట్‌వేర్ రంగమే. సాఫ్ట్‌వేర్ కంపెనీలు.. తమ క్లయింట్ సంస్థలకు వేగంగా సేవలు, ప్రొడక్ట్‌లు అందించే క్రమంలో ఏఐ ఆధారిత కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. పలు సంస్థల్లో ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఐవీఆర్‌ఎస్, ఆన్‌లైన్ చాట్ వంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సేవలే.

ఆ అయిదు రంగాల్లో అత్యధికం:
ఇటీవల ఫిక్కీ, నాస్‌కామ్ చేపట్టిన సర్వే ప్రకారం వచ్చే మూడేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అయిదు రంగాల్లో అత్యంత కీలకంగా మారనుంది. అవి.. ఐటీ/ఐటీఈఎస్, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్స్‌టైల్స్ అండ్ అపరెల్స్, ఆటోమోటివ్‌‌స. ఫలితంగా ఈ రంగాలు భారీ స్థాయిలో ఏఐ సంబంధిత ఉద్యోగాలకు కేరాఫ్‌గా నిలిచే అవకాశముంది. సర్వే నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం 600 మిలియన్ల వర్క్‌ఫోర్స్‌లో దాదాపు తొమ్మిది శాతం మందికి ఏఐ విభాగాల్లో కొలువులు లభించనున్నాయి. ప్రముఖ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ గార్ట్‌నెర్ నివేదిక ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 2.3 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ విభాగంలో లభించనున్నాయి.

లభించే ఉద్యోగాలివే..
ఏఐ విభాగంలో లభించే ఉద్యోగాలను పరిగణనలోకి తీసుకుంటే.. వచ్చే మూడేళ్లలో ప్రధానంగా అయిదు రకాల ఉద్యోగాలు లభించనున్నాయి. అవి.. ఏఐ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్; మ్యాన్-మెషీన్ టీమింగ్ మేనేజర్; డేటా డిటెక్టివ్; ఏఐ టెక్నీషియన్; ఏఐ అనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్‌‌స.

నైపుణ్యాలు పెంచుకోవడమెలా ?
అన్ని రంగాల్లో ఏఐ విస్తరణ దృష్ట్యా సంబంధిత నైపుణ్యాలు పెంచుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అకడమిక్ స్థాయిలోనే వీటిని పెంచుకుంటే మరింత ఫలితం ఉంటుంది. ప్రస్తుతం పలు ఇన్‌స్టిట్యూట్‌లు అకడమిక్ స్థాయిలో బీటెక్‌లో ఒక కోర్సుగా, అదే విధంగా ఎంటెక్ స్థాయిలో ఏఐ స్పెషలైజేషన్‌ను అందిస్తున్నాయి.

కోర్సుల వివరాలు..
  • పీజీ డిప్లొమా ఇన్ మెషీన్ లెర్నింగ్ అండ్ ఏఐ: ఐఐటీ-ముంబై.
  • ఫౌండేషన్స్‌ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అండ్ మెషీన్ లెర్నింగ్: ఐఐఐటీ-హైదరాబాద్.
  • ఎంటెక్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.
  • ఎంటెక్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌): యూపీఈఎస్.
ఇవే కాకుండా మరెన్నో ఇన్‌స్టిట్యూట్‌లలో ఏఐ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి.

షార్ట్‌టర్మ్ సర్టిఫికేషన్స్‌ :
ఏఐ నైపుణ్యాలు అందించే పలు షార్ట్‌టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఐబీఎం, ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఏఐలో ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్నాయి. వీటి కాల వ్యవధి నెల రోజుల నుంచి నాలుగు నెలల వరకు ఉంటోంది. వీటిని పూర్తిచేసుకుని సంబంధిత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే.. ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి గుర్తింపు లభిస్తోంది. మన దేశంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనూ స్వల్పకాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

వేతనాలు ఆకర్షణీయం :
ఏఐ నైపుణ్యాలతో ఉద్యోగాలు సొంతంచేసుకున్న వారికి వేతనాలు ఆకర్షణీయంగానే ఉంటున్నాయి. బీటెక్ పూర్తిచేసుకొని ఎంట్రీ లెవల్‌లో చేరిన వారికి వార్షిక వేతనం రూ.5 లక్షల వరకు లభిస్తోంది. ఎంటెక్ స్థాయిలో ఏఐ స్పెషలైజేషన్ పూర్తిచేసుకున్న వారికి వార్షిక వేతనం రూ.10 లక్షల వరకు అందుతుంది. ఇటీవల రాండ్‌స్టాడ్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నిష్ణాతులకు సగటు వార్షిక వేతనం రూ.13.7 లక్షలుగా కనిపించింది.

బీటెక్ స్థాయి నుంచే..
ఏఐలో ఉద్యోగాలు కోరుకునే విద్యార్థులు బీటెక్ స్థాయి నుంచే ఈ దిశగా అడుగులు వేయాలి. ఇప్పటికే దేశంలో పలు సంస్థల కార్యకలాపాల్లో ఏఐ ఆధారిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే రెండు, మూడేళ్లలో మరింతగా పెరిగే అవకాశముంది. కాబట్టి బీటెక్‌లో చేరే విద్యార్థులు, బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులు ఏఐ నైపుణ్యాల శిక్షణ దిశగా ప్రయత్నించాలి. మా క్యాంపస్‌లో ఇప్పటికే సాఫ్ట్‌వేర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఏఐ, మెషీన్ లెర్నింగ్‌లో శిక్షణనిస్తున్నాం. వీటిని విద్యార్థులకు సైతం అందించే ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
- ప్రొఫెసర్ సి.ఎస్.జవహర్, సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్, ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్.

2. రోబోల రాజ్యం..రాణించండిలా !
రోబోటిక్ టెక్నాలజీ.. గత కొంతకాలంగా సాంకేతిక రంగంలో వినిపిస్తున్న మాట.. మెరుగ్గా పనిచేస్తూ.. మానవ వనరులకు సవాలు విసురుతున్నాయ్ రోబోలు.. మనుషుల ఉద్యోగాలు రోబోలు ఎగరేసుకుపోతాయేమో నన్న ఆందోళన ఓ వైపు... మరోవైపు రాబోయే రోజుల్లో మనుషులు, రోబోలతో కలిసి
పనిచేయకతప్పదంటున్న నిపుణులు. ఇలాంటి పరిస్థితిలో విద్యార్థులు రోబోటిక్ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రోబోల రాజ్యంలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు,చదవాల్సిన కోర్సులు, అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల గురించి తెలుసుకుందాం..
  • 'మిత్ర' రోబో.. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సదస్సులో పాల్గొన్న దేశ విదేశాలకు చెందిన వందల మందిని ఆకట్టుకున్న మర మనిషి. సదస్సులో పాల్గొన్న అతిథులకు, నిపుణులకు స్వాగతం పలకడంమే కాకుండా.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సైతం చెప్పి అబ్బురపరిచింది.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ముంబైలోని కమలా హిల్స్ బ్రాంచ్. ఈ బ్రాంచ్‌లోకి అడుగుపెట్టగానే.. ఇంటెలిజెంట్ రోబోటిక్ అసిస్టెంట్ (ఐఆర్‌ఏ) పేరుతో రూపొందించిన రోబో.. వెల్ కం టు అవర్ కస్టమర్ అంటూ.. మీకు స్వాగతం పలుకుతుంది. మీరు బ్యాంకుకు ఎందుకు వచ్చారో కనుక్కుని.. దానికి సంబంధించి ఏ విభాగంలో సంప్రదించాలో తెలియజేస్తుంది.
  • బ్రాబో రోబోట్స్... టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టీఏఎల్ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్‌ లిమిటెడ్ రూపొందించిన ఇండస్టియ్రల్ రోబో. ఇది మెటీరియల్ హ్యాండ్లింగ్, ఉత్పత్తి ప్రక్రియలో పలు విడి భాగాలను అసెంబుల్ చేయడం వంటి పనులన్నీ చేస్తుంది. రెండు మూడేళ్ల క్రితం వరకు బ్యాంక్ ఎండ్ విభాగాల్లోనే పరిమితమైన రోబో సేవలు.. ప్రస్తుతం అన్ని రంగాలకు విస్తరిస్తున్నాయని చెప్పడానికి ఈ మూడు ఉదాహరణలు చాలు.
రోబోటిక్స్ అంటే ?
రోబోటిక్స్, రోబోలు అంటే మనుషుల్లాగా పనిచేసే యంత్రాలు. ముందస్తు ప్రోగ్రామింగ్‌ను ఆధారంగా రోబోలు సంబంధిత కార్యకలాపాలు నిర్వర్తిస్తాయి. రోబోలను తమకు అవసరమైన రీతిలో పనిచేసేలా సాఫ్ట్‌వేర్ ఆధారంగా ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత.. దానికి అందిన ఆదేశాల ప్రకారం నిర్దిష్టంగా ఒక పనిని నిమిషాల్లో పూర్తిచేస్తుంది. సాంకేతిక నైపుణ్యాల పరంగా మనుషులతో పోల్చితే రోబోలు నాలుగో వంతు సమయంలోపే ఓ పని పూర్తి చేయగలుగుతున్నాయి. అందుకే సంస్థలు, రోబో ఆధారిత సేవలకు మొగ్గు చూపుతున్నాయి. అన్ని రంగాల్లో, కార్యకలాపాల్లో రోబోల విస్తరణకు కారణమేంటి..! రోబోలు ఇంత విస్తృత స్థాయిలో, ఎవరూ ఊహించని విధంగా అంతటా ఎందుకు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం.. టెక్నాలజీ! పరిశోధనలు ఫలితంగా రోజుకో కొత్త టెక్నాలజీ మెరుగైన రీతిలో ముందుకు వస్తోంది. దాంతో రోబోల పనితీరును మెరుగుపరచి.. అవి అత్యంత సమర్థంగా పని చేయడానికి అవసరమైన ప్రోగ్రామ్‌లను రూపొందించడం పెరుగుతోంది.

మనుషులూ ఉండాల్సిందే..
రోబోటిక్స్ నైపుణ్యాలతో సంస్థలు కార్యకలాపాలు నిర్వహించాలంటే.. దానికి అనుగుణంగా సదరు రోబోటిక్స్‌కు సంబంధించి బ్యాక్‌ఎండ్‌లో మానవ ప్రమేయం కూడా ఉంటేనే సాధ్యం. నిర్దిష్టంగా రోబో సేవలను అందుబాటులోకి తెచ్చే క్రమంలో.. సదరు సంస్థ తమ వినియోగదారులు, కార్యకలాపాలకు అనుగుణంగా స్పందించే రీతిలో రోబోలు పని చేసేలా ముందుగానే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ రూపొందించాలి. కాబట్టి రోబోలు పనిచేయడానికి అవసరమైన ప్రోగ్రామింగ్ చేసేందుకు మానవ ప్రమేయం తప్పనిసరి.

ఈ విభాగాల్లో ప్రాధాన్యం :
అన్ని రంగాల్లోనూ రోబో ఆధారిత సేవలు పెరుగుతున్నప్పటికీ.. ఉత్పత్తులు, సర్వీసుల డిజైన్, డెవలప్‌మెంట్, డెలివరీకి సంబంధించిన విభాగాల్లో రోబోలకు అధిక ప్రాధాన్యం కనిపిస్తోంది. ఫలితం.. వచ్చే అయిదారేళ్లలో అన్ని రంగాల్లోనూ రోబోల ప్రమేయం 20 నుంచి 30 శాతం మేరకు నమోదవనుంది. ముఖ్యంగా మెకానికల్, ప్రొడక్షన్, లాజిస్టిక్స్ విభాగాల్లో రోబోల ప్రమేయం పెరుగుతోంది. ఇటీవల కాలంలో సేవల రంగంలోనూ రోబోల అవసరం అధికమవుతోంది. ఇందుకు ఉదాహరణగా బ్యాంకింగ్ రంగాన్ని పేర్కొనొచ్చు.

నైపుణ్యాలు..
రోబోటిక్స్‌లో కొలువులు కోరుకునే యువత నిర్దిష్టంగా ప్రత్యేక నైపుణ్యాలు సొంతం చేసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, కోడింగ్ స్కిల్స్; నానో టెక్నాలజీ; డిజైన్ అండ్ టెక్నాలజీ; సంబంధిత రంగాల్లో కోర్ నైపుణ్యాలు ఉండాలి. ఉదాహరణకు సాఫ్ట్‌వేర్ రంగంలో రోబోటిక్స్ విభాగంలో రాణించాలంటే.. రోబోల రూపకల్పనకు అవసరమైన స్పీచ్ రికగ్నిషన్,వాయిస్ రికగ్నిషన్ వంటి అంశాల కోణంలో కోడింగ్ స్కిల్స్ అవసరమవుతాయి.

డిమాండింగ్ విభాగాలు..
రోబోటిక్స్ అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రోబోటిక్స్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి లేదా రోబోటిక్ స్పెషలైజేషన్ కోర్సులు చేసిన వారికి సాఫ్ట్‌వేర్, ప్రొడక్షన్, మెకానికల్, హెల్త్‌కేర్, ఎలక్టాన్రిక్స్, ఎలక్ట్రికల్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం జాబ్ మార్కెట్ డిమాండ్ కోణంలో విశ్లేషిస్తే.. ప్రధానంగా నిలుస్తున్న విభాగాలు.. మెడికల్ రోబోటిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, రోబోట్ మోషన్ ప్లానింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అండ్ రోబోటిక్స్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్

కొలువులివే..
1. రోబోటిక్స్ టెక్నీషియన్స్‌
2. రోబోట్ డిజైన్ ఇంజనీర్
3. రోబోటిక్స్ టెస్ట్ ఇంజనీర్స్
4. ఆటోమేటెడ్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్
5. రోబోటిక్ సిస్టమ్ ఇంజనీర్.

వేతనాలు..
రోబోలను రూపొందించే సంస్థల్లో కనిష్టంగా మూడు లక్షల నుంచి పది లక్షల వరకు వేతనం లభిస్తోంది. ఆయా సంస్థల్లో రోబోటిక్స్ విభాగంలో ఇంజనీర్లు, డెవలపర్స్‌గా చేరిన వారికి సగటున నెలకు రూ.50 వేల నుంచి రూ.80 వేల వేతనం లభిస్తోంది. బ్యాక్‌ఎండ్‌లో రోబోటిక్ ఆధారిత సేవలను అందిస్తున్న బ్యాంకింగ్, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో నెలకు రూ.60 వేల వరకు వేతనం ఖాయం.

అందుబాటులోకి వస్తున్న కోర్సులు..
రోబోటిక్స్ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ విభాగంలో అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు పలు కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. పలు ఇన్‌స్టిట్యూట్‌లు బీటెక్ స్థాయిలో రోబోటిక్స్‌ను ఒక కోర్సుగా అందిస్తున్నాయి. ఎంటెక్ స్థాయిలో రోబోటిక్స్‌లో ఆయా స్పెషలైజేషన్ కోర్సులను పలు ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి. రోబోటిక్స్‌లో పూర్తిస్థాయి కోర్సులు అభ్యసించలేని వారికి.. అదే విధంగా రోబోటిక్స్‌లో పరిపూర్ణ నైపుణ్యాలు అందించడానికి పలు సర్టిఫికేషన్ కోర్సులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

ఎంటెక్ స్థాయిలో రోబోటిక్స్ సంబంధిత కోర్సులు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు :
  1. ఐఐటీ - ముంబై, చెన్నై, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కీ, గువహటి
  2. ఐఐఎస్‌సీ- బెంగళూరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
  3. బిట్స్ - పిలానీ, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ - హైదరాబాద్
  4. వీటితోపాలు పలు ఎన్‌ఐటీ క్యాంపస్‌లలోనూ రోబోటిక్స్ ఎలక్టివ్‌గా ఎంటెక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
రోబోటిక్స్... ఫ్యాక్ట్స్
  • అంతర్జాతీయ స్థాయిలో 2022 నాటికి రోబోటిక్ ఇంజనీరింగ్ విభాగంలో పది శాతం మేర పెరగనున్న నియామకాలు.
  • గార్ట్‌నర్ నివేదిక ప్రకారం అన్ని రంగాల్లోని సంస్థల్లోనూ 13 శాతానికి చేరుకోనున్న రోబోల వినియోగం.
  • ప్రస్తుతం దేశంలో రోబోలను రూపొందిస్తున్న సంస్థల సంఖ్య దాదాపు 50.
కెరీర్ అవకాశాలకు వేదిక :
ఇప్పుడు రోబోటిక్స్ కెరీర్ అవకాశాలకు ప్రధాన వేదికగా మారుతోంది. ఒకప్పుడు కోర్ మాన్యుఫ్యాక్చరింగ్ విభాగాలకే పరిమితమైన రోబో సేవలు.. అన్ని విభాగాలకూ విస్తరిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు రోబోటిక్ నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషిచేయాలి. అల్గారిథమ్స్, మ్యాథమెటిక్స్, కంప్యుటేషన్, కోడింగ్ విభాగాల్లో బేసిక్స్‌పై పట్టున్న అభ్యర్థులు రోబోటిక్స్ నైపుణ్యాలు సొంతం చేసుకోవడంలో ముందంజలో నిలుస్తారు.
- జి.సనత్ కుమార్, డిప్యూటీ డెరైక్టర్, సీఐటీడీ, హైదరాబాద్.

3. మెషీన్ లెర్నింగ్...కెరీర్ షైనింగ్! Career guidance
మెషీన్ లెర్నింగ్.. నేడు టెక్నాలజీ నిపుణులు తరచూ వాడుతున్న కొత్త పదం! టెక్నికల్ విద్యార్థులకు సరికొత్త ఉపాధి వేదికగా ఆవిర్భవిస్తోంది! ఇందుకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరం ఎంతో ఉంది ! ఈ నైపుణ్యాలు సాధించడం ఎలా? మెిషీన్ లెర్నింగ్ అంటే ఏంటి? భవిష్యత్తులో ఉపాధి పరంగా అవకాశాలు ఏ స్థాయిలో ఉంటాయి?ఎలాంటి విద్యార్థులకు ఇది అనుకూలం? తదితర అంశాలపై విశ్లేషణ..
వాస్తవానికి మెషీన్ లెర్నింగ్ అనేది ఏఐలో ఒక భాగం. ప్రతిదానికీ ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరంలేకుండా.. కంప్యూటర్లు అంతకుముందు నిక్షిప్తమైన డేటా ఆధారంగా వాటంతటవే నిర్ణయాలు తీసుకునేలా చేయడమే మెషీన్ లెర్నింగ్. ఏఐలో ఏ విధంగానైతే.. మానవ ప్రమేయం లేకుండా కార్యకలాపాలు జరుగుతున్నాయో.. అదే తరహాలో మెషీన్ లెర్నింగ్ కూడా కంప్యూటర్లు ఆటోమేటిక్‌గా పనిచేసేలా చూస్తుంది. డేటాసైన్స్‌, డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్ సమ్మిళితంగా మెిషీన్ లెర్నింగ్ కార్యకలాపాలు ఉంటాయి.

స్వీయ సామర్థ్యం :
మెిషీన్ లెర్నింగ్‌కు అవసరమైన ప్రత్యేక అల్గారిథమ్స్‌ను రూపొందించి కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తారు. వీటి ఆధారంగా భవిష్యత్తులో సదరు సిస్టమ్స్, సంబంధిత అంశాలను స్వయంగా విశ్లేషించడం, ప్రోగ్రామింగ్, నిర్ణయాలు తీసుకోవడంలో స్వీయ పద్ధతిలో వ్యవహరిస్తాయి. అప్పటికే ఓ సిస్టమ్‌ను ఒక వ్యక్తి వినియోగించిన సమయంలో.. ఏఏ విషయాలను శోధించారు? అనే అంశాన్ని నిక్షిప్తం చేసుకుని.. ఆ తర్వాత పూర్వపు శోధనల ఆధారంగా అతనికి అవసరమైన సమాచారం కోణంలో పలు మార్గాలను చూపించడం మెషీన్ లెర్నింగ్ ప్రత్యేకత.
  • సోషల్ నెట్‌వర్కింగ్, జాబ్ సెర్చ్ పోర్టల్స్.. ఇలా దాదాపు పబ్లిక్ ఇంటర్‌ఫేస్ ఉండే అన్ని విభాగాల్లోనూ మెిషీన్ లెర్నింగ్‌తో యూజర్లకు అవసరమైన సమాచారం క్షణాల్లో కళ్లముందు ప్రత్యక్షమవుతోంది.
  • అదే విధంగా యూజర్ల ప్రొఫైల్స్ ఆధారంగా మెయిల్స్, మెసేజ్‌ల రూపంలో సమాచారం అందుతోంది. ఉదాహరణకు జాబ్‌సెర్చ్ పోర్టల్స్‌లో ఒకసారి మీ ప్రొఫైల్‌ను, స్కిల్స్‌ను క్రియేట్ చేసుకుంటే.. వాటికి సరితూగేలా సదరు పోర్టల్‌లో కొత్త జాబ్స్ అప్‌లోడైతే.. ఆ సమాచారం వెంటనే మీ మెయిల్‌కు వస్తుంది. వీటన్నిటికీ మెషీన్ లెర్నింగే కారణం.
ప్రత్యేక అల్గారిథమ్స్:
మెషీన్ లెర్నింగ్.. స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ.. వీటికి సంబంధించి ప్రత్యేకంగా మూడు రకాల అల్గారిథమ్స్ అవసరమవుతున్నాయి. అవి.. సూపర్‌వైజ్డ్ లెర్నింగ్, అన్ సూపర్‌వైజ్డ్ లెర్నింగ్, రీయిన్ ఫోర్స్‌మెంట్ లెర్నింగ్.

అవసరమైన నైపుణ్యాలు..
మెషీన్ లెర్నింగ్‌లో కెరీర్ కోరుకునే అభ్యర్థులు కంప్యూటర్ బేసిక్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ నైపుణ్యాలు పెంచుకోవాలి. వీటికి అవసరమైన విధంగా మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యుటేషనల్ స్కిల్స్, డేటా మోడలింగ్, సాఫ్ట్‌వేర్ డిజైన్, డెవలప్‌మెంట్ తదితర అంశాల్లో బేసిక్స్‌పై పట్టు సాధిస్తే.. మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్ పరంగా మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుంది. అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డేటా మేనేజ్‌మెంట్, స్టాటిస్టికల్ స్కిల్స్, మ్యాథమెటికల్, కంప్యుటేషనల్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్ ఉండాలి.

కోర్సులు..
ఐబీఎం, సిస్కో, అమెజాన్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు మెిషీన్ లెర్నింగ్‌లో సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి. మెషీన్ లెర్నింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఇప్పుడు పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంటెక్ స్థాయిలో ఏఐ/ఎంఎల్ స్పెషలైజేషన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. బీటెక్ సీఎస్‌ఈ/ఐటీ ఉత్తీర్ణులు ఈ కోర్సులకు అర్హులు.

అవకాశాలు :
మెషీన్ లెర్నింగ్‌లో పూర్తి నైపుణ్యం సాధించిన వారికి మంచి అవకాశాలు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి సంబంధించి ఆయా సంస్థల సర్వేలు, వాటి గణాంకాలే నిదర్శనం.

వేతనాలు..
ఎంట్రీ లెవల్‌లో రూ.రెండు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. ఆ తర్వాత డేటా అనలిటిక్ స్పెషలిస్ట్, మోడలింగ్ అనలిస్ట్ వంటి హోదాల్లో సగటున రూ.ఆరు లక్షల నుంచి రూ.ఏడు లక్షల వార్షిక వేతనం లభిస్తుంది.

మెషీన్ లెర్నింగ్, ఏఐ శిక్షణ కోర్సుల ముఖ్య వెబ్‌సైట్లు :
1. https://in.udacity.com/course
2. www.udemy.com
3. https://edureka.co
4. https://coursera.org
5. www.ibm.com/training
6. https://academy.microsoft.com
7. Microsoft Professional Program
8. https://ai.google/education

కోడింగ్ ప్రధానం:
మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ విభాగాల్లో మానవ వనరుల అవసరం పెరుగుతున్న మాట వాస్తవం. విద్యార్థులు మెషీన్ లెర్నింగ్‌లో రాణించాలంటే.. కోడింగ్ స్కిల్స్, అల్గారిథమ్స్‌పై పరిపూర్ణ అవగాహనతో అడుగు పెట్టడం మేలు చేస్తుంది. ఉద్యోగాల కోణంలో ఐటీ సంస్థలతోపాటు, ఈ-కామర్స్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్ విభాగాల్లో సైతం ఏఐ/ఎంఎల్ నిపుణులకు అవకాశాలు లభిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదే. రానున్న కాలంలో ఏఐ/ఎంఎల్‌లే ఆయా సంస్థల కార్యకలాపాల్లో అధిక శాతం ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి.
- ఆర్.జయంత్, ఐఎన్‌ఎస్‌ఓఎఫ్‌ఈ, హైదరాబాద్.
Published date : 22 May 2018 06:10PM

Photo Stories