Skip to main content

రెండు ఉద్యోగాలు.. ఒకటే సన్నద్ధత!

ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మొత్తం 2,045 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 1,536 క్లాస్ 3 అసిస్టెంట్ కేడర్ పోస్టులు, 509 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1) ఉద్యోగాలు. ఈ రెండూ వేర్వేరు రకాల ఉద్యోగాలైనప్పటికీ నియామకాలకు సంబంధించి నిర్వహించే రాత పరీక్షలోని అంశాలు దాదాపుగా ఒకటే (స్పెషలిస్ట్ స్ట్రీమ్ మినహా). ప్రశ్నల క్లిష్టతలో కొద్దిపాటి తేడా ఉంటుంది. కాబట్టి ఈ రెండు పోస్టులకు ఏక కాలంలో సన్నద్ధం కావచ్చు. ఇందుకు ఉపకరించే మార్గాలు..

ఈ రెండు ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలో రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/ న్యూమరికల్ ఎబిలిటీ అంశాలు ఉమ్మడిగా ఉంటాయి. వీటికి సంబంధించిన అంశాల సమస్యల ను ప్రాక్టీస్ చేయడం అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరీక్షలకు ఉపయోగపడుతుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు మాత్రం సంబంధిత స్పెషలైజేషన్, అసిస్టెంట్ పోస్టులకు కంప్యూటర్ నాలెడ్జ్ విభాగం అదనంగా ఉంటుంది.
  • అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా ఇంటర్/తత్సమాన పరీక్షలో 60 శాతం (ఎక్స్ సర్వీస్‌మెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. ఎస్‌ఎస్‌సీ/హెచ్‌ఎస్‌ఎస్సీ/ఇంటర్మీడియెట్/గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ప్రాంతీయ భాష తెలిసుండాలి.
    వయసు: 2014, జూన్ 30 నాటికి 18-30 ఏళ్లు.
  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్‌కు అర్హత: స్పెషలిస్టు ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. జనరలిస్ట్ ఉద్యోగాలకు డిగ్రీ లేదా తత్సమాన అర్హత. వయసు: 2014, అక్టోబర్ 1 నాటికి 21-30 ఏళ్లు.
రీజనింగ్:
రీజనింగ్‌లో కోడింగ్-డీకోడింగ్, సీటింగ్ ఆరేంజ్‌మెంట్, పజిల్స్, బ్లడ్ రిలేషన్స్, డెరైక్షన్స్ తదితర అంశాలుంటాయి. ఇందులోని ప్రశ్నలను సెట్ల రూపంలో (ఇందులో 3 లేదా 5 స్టేట్‌మెంట్లు ఉంటాయి) అడుగుతారు. ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సమాధానాలు సరైనవి అయితే పూర్తి మార్కులు పొందడం అనుకూలత. బ్లడ్‌రిలేషన్స్, డెరైక్షన్స్, ఏజ్ వంటి అంశాల నుంచి కూడా ప్రశ్నలు ఇస్తారు. ఆఫీసర్ పరీక్షలో వచ్చే సీటింగ్ అరేంజ్‌మెంట్, పజిల్స్ ప్రశ్నల క్లిష్టత అధికంగా ఉంటుంది.

ఇంగ్లిష్:
ఇందులో రీడింగ్ కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీ, గ్రామర్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్ సంబంధిత అంశాలు ఉంటాయి. రీడింగ్ కాంప్రెహెన్షన్‌కు సంబంధించి ఇచ్చిన ప్యాసేజ్‌ను సరిగా చదివి అవగాహన చేసుకోవడమే కీలకం. ప్రశ్నకు సమాధానం ఇచ్చేటప్పుడు రచయిత (ప్యాసేజ్) దృష్టి కోణంలో ఆలోచించడం ప్రయోజనకరం. ఈ విభాగానికి 12-15 మార్కులు ఉండొచ్చు. అసిస్టెంట్ పేపర్‌లో ఈ విభాగం సులువుగానే ఉంటుంది.

జనరల్ అవేర్‌నెస్:
సమకాలీన అంశాలపై అవగాహనను పరీక్షించే విధం గా ఇందులో ప్రశ్నలు ఉంటాయి. నోబెల్ పురస్కార గ్రహీతలు, క్రీడలు-విజేతలు, వార్తల్లో వ్యక్తులు, సదస్సులు-సమావేశాలు వంటి వాటిపై దృష్టి సారించాలి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల (ప్రధానమంత్రి జనధన్ యోజన వంటివి) గురించి అవగాహన పెంచుకోవడం కీలకం.

న్యూమరికల్ ఎబిలిటీ/క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:
అసిస్టెంట్ పరీక్షలో ఈ విభాగాన్ని న్యూమరికల్ ఎబిలిటీగా, ఆఫీసర్స్ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌గా వ్యవహరిస్తారు. ఈ విభాగంలో సింప్లిఫికేషన్‌కు ప్రాధాన్యమిస్తారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మ్యాథమెటికల్ సిరీస్, యావరేజెస్, రేషియో అండ్ ప్రొపోర్షన్, ప్రాఫిట్-లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పెర్ముటేషన్స్- కాంబినేషన్స్, ప్రాబబిలిటీ నుంచి కూడా ప్రశ్నలు ఇస్తారు. ఆఫీసర్ పరీక్షలో డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 10-15 ప్రశ్నలు, డేటా సఫిషియన్సీ నుంచి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

కంప్యూటర్ నాలెడ్జ్:
ఈ విభాగాన్ని ఇంటర్నెట్, నాన్ ఇంటర్నెట్ అనే రెండు భాగాలుగా విభజించవచ్చు. ఇంటర్నెట్ భాగంలో నెట్‌వర్క్స్, నూతన సాంకేతిక అంశాలు, వైరస్, యాంటీ వైరస్, ఫైర్‌వాల్స్, వైరస్‌ల బారినుంచి కంప్యూటర్ వ్యవస్థను కాపాడటం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. నాన్ ఇంటర్నెట్ భాగానికి సంబంధించి హార్డ్‌వేర్, ర్యామ్, ఆపరేటింగ్ సిస్టమ్, రిజిస్టర్స్ వంటి అంశాలను చదవాలి. ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు సంబంధించి ఆధిక శాతం ప్రశ్నలు విండోస్ నుంచి ఉంటాయి. గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ కంపెనీల నూతన ఉత్పత్తులు, చైర్మన్లు, సీఈఓల వివరాలపై కూడా అవగాహన పెంచుకోవడం ప్రయోజనకరం. ఎంఎస్ ఆఫీస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి కీ బోర్డ్ షార్ట్‌కట్స్ తెలిసుండాలి.
గమనిక: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పరీక్షకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు గడువు ముగిసింది. అసిస్టెంట్ పోస్టులకు చివరి తేదీ నవంబర్ 10, 2014.

వెబ్‌సైట్:  www.newindia.co.in
Published date : 08 Nov 2014 11:44AM

Photo Stories