Skip to main content

ప్రిపరేషన్‌ ఇలా చేస్తే.. కొలువు ఖాయం

ఏ ఉద్యోగ పరీక్ష అయినా.. జనరల్‌ స్టడీస్‌ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జనరల్‌ స్టడీస్‌ అంశాలుగా పేర్కొనే ఏపీ, ఇండియన్‌ హిస్టరీ; జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి కోర్‌ అంశాలతోపాటు..సమకాలీన పరిణామాలపైనా అవగాహన పెంచుకునేలా ప్రిపరేషన్‌ సాగించాలి.

ముఖ్యంగా సమకాలీన అంశాలను.. జనరల్‌ స్టడీస్‌లోని కోర్‌ టాపిక్స్‌తో అనుసంధానిస్తూ చదవాలి. అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.

రాష్ట్ర స్థాయి అంశాలు..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు.. రాష్ట్ర స్థాయి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ చదవాలి. ప్రధానంగా రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, సహజ వనరులు, కళలు–సంస్కృతి, రాష్ట్ర చరిత్రకు సంబంధించిన ప్రధాన ఘట్టాలను అవపోసన పట్టాలి. సహజ వనరులు ఎక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలు, సదరు సహజ వనరులు అభివృద్ధికి దోహదపడుతున్న తీరును తెలుసుకోవాలి.

ప్రభుత్వ పథకాలు..
జనరల్‌ స్టడీస్‌తోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా అభ్యర్థులు దృష్టిపెట్టాలి. ముఖ్యంగా నవ రత్నాలు.. ఉద్దేశాలు, లక్షిత వర్గాలు, వాటికి బడ్జెట్‌ కేటాయింపులు, ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారి సంఖ్య వంటి అంశాలపై గణాంక సహిత వివరాలతో సంసిద్ధంగా ఉండాలి. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల(ఉదా: ఐటీ పాలసీ, పారిశ్రామిక ప్రణాళిక, ఉపాధి కల్పనకు తీసుకుంటున్న చర్యలు) గురించి తెలుసుకోవాలి.

అకడమిక్స్‌ + సమకాలీన..
జాబ్‌ క్యాలెండర్‌లో పలు స్పెషలైజ్డ్‌ పోస్ట్‌లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు: వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, లెక్చరర్లు వంటివి. వీటి నియామక ప్రక్రియలో జనరల్‌ స్టడీస్‌తోపాటు ఆయా సబ్జెక్ట్‌ నైపుణ్యాలను పరిశీలించే సబ్జెక్ట్‌ పేపర్లు కూడా ఉంటాయి. ఈ సబ్జెక్ట్‌ పేపర్లలో రాణించాలంటే.. అభ్యర్థులు అకడమిక్‌గా ఆయా సబ్జెక్ట్‌ నైపుణ్యాలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా వాటికి సంబంధించి తాజాగా పరిణామాల గురించి కూడా తెలుసుకోవాలి.

డిస్క్రిప్టివ్‌ ప్రిపరేషన్‌..
ఉద్యోగ నియామక పరీక్షలు ఆబ్జెక్టివ్‌ విధానంలోనే జరిగినా.. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మాత్రం డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో చదవడం ద్వారా విభిన్న కోణాల్లో నైపుణ్యం లభిస్తుంది. ఫలితంగా ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇవ్వగలిగే సంసిద్ధత లభిస్తుంది. చదివేటప్పుడే ముఖ్యమైన అంశాలతో సొంత నోట్స్‌ రూపొందించుకోవాలి. ఇది పరీక్షకు ముందు వేగంగా పునశ్చరణకు ఉపయోగపడుతుంది.

స్వీయ విశ్లేషణ..
అభ్యర్థులు.. ఎప్పటికప్పుడు తమ స్వీయ సామర్థ్యాలను విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు రాయడం ద్వారా తమ ప్రిపరేషన్‌ స్థాయిపై ఒక అంచనాకు రావాలి. దీనివల్ల ఇంకా సామర్థ్యం పెంచుకోవాల్సిన అంశాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. పరీక్ష సిలబస్, టాపిక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటూ.. ప్రతి రోజు ఆయా అంశాలకు కేటాయించాల్సిన సమయాన్ని నిర్దేశించుకోవాలి. టైమ్‌ టేబుల్‌ ప్రకారం చదవడం పూర్తి చేయాలి.

ఇంకా చదవండి: part 4: ఒకే అర్హతతో పలు పరీక్షలు.. ముందస్తు ప్రణాళిక ఉంటేనే..

Published date : 02 Aug 2021 04:20PM

Photo Stories