Skip to main content

ప్రభుత్వ ఉద్యోగాల్లో విజేతగా నిలవాలంటే..!

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా నోటిఫికేషన్లు, కొలువుల భర్తీపై మళ్లీ చర్చమొదలైంది.
దాంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఉద్యోగ పోటీ పరీక్షల నోటిఫికేషన్లు 2021లో స్వాగతం పలికే అవకాశముంది. ఇప్పటికే విద్యార్థులు ఉద్యోగాల ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు. సరైన ప్రణాళిక, పుస్తకాల ఎంపికలో జాగ్రత్త, కష్టపడేతత్వంతో పోటీ పరీక్షల్లో విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు.. ప్రణాళికతో చదవడం ద్వారా పోటీలో విజేతలుగా నిలవొచ్చు.

సహనానికి పరీక్ష !
పోటీ పరీక్షలు.. గెలిస్తే విజేత. ఓడితే పాఠం. గెలిచి నిలిస్తే ఉద్యోగం, పోరాడి ఓడితే మరోసారి రాసేందుకు అనుభవం. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే.. తెలివి తేటలు, ప్రణాళిక, కష్టపడేతత్వం, కొంతమేర అదృష్టం ఉండాలి. వీటితోపాటు విజయతీరానికి చేరుకోలేకపోతే కెరీర్‌లో ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటో చూసుకొని పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపాలి. గ్రూప్స్, ఎస్‌ఎస్‌సీ పరీక్షలు, పోలీసు నోటిఫికేషన్లలో సక్సెస్ పొందాలంటే.. కనీసం ఏడాది పాటు చదవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నియామక ప్రక్రియలో జాప్యం జరగొచ్చు. గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కుటుంబం, సమాజం, సహచరుల నుంచి రకరకాల ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. వీటన్నింటితోపాటు ఆర్థిక సమస్యలు ఉండనే ఉంటాయి. కాబట్టి అన్నింటిని తట్టుకునే సహనం, మానసిక సంసిద్ధతతోపాటు అవసరమైన ఆర్థిక వనరులు ముందే ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా సానుకూల ఆలోచనలతో ముందడుగు వేయాలి. ఒకరకంగా చెప్పాలంటే.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవడం అనేది అభ్యర్థిలోని సహనానికి పరీక్ష !

ప్రత్యేక వ్యూహం..
ఆయా పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ విషయంలోనూ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలి. ఏ పరీక్షలకు సన్నద్ధమవ్వాలి.. అందుకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన.. సదరు పరీక్ష సిలబస్.. గత విజేతల ప్రిపరేషన్ తీరు వంటి వాటిని ముందుగా అధ్యయనం చేయడం లాభిస్తుంది. ఇటీవల గ్రూప్స్, సివిల్స్ పరీక్షలకు ఇంజనీరింగ్ పట్టభద్రులు, ఇతర వృత్తి విద్య కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు సన్నద్ధమవ్వడం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు జనరల్ స్టడీస్‌పై పట్టును ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి. ప్రిపరేషన్ కోసం ప్రత్యేక వ్యూహాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.

పరీక్షలెన్నో.. సిలబస్ ఒకటే.. !
ఐబీపీఎస్, స్టేట్ బ్యాంకు నుంచి పీవో, క్లర్క్ నోటిఫికేషన్స్‌.. జాతీయ బ్యాంకుల సొంత ఉద్యోగ ప్రకటనలు.. రైల్వే నియామక బోర్డు నుంచి గ్రూప్-డి, లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టులు.. రైల్వే రక్షణ దళంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. వీఆర్‌వో, గ్రూప్ 4, బిల్ కలెక్టర్, పంచాయతీ సెక్రటరీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఎస్‌ఐ, కానిస్టేబుల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నుంచి వచ్చే కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) ఎగ్జామినేషన్, కానిస్టేబుల్ (జీడీ)... మొదలైన ఉద్యోగ పరీక్షలకు అభ్యర్థులు ఏకకాలంలో సన్నద్ధమయ్యే అవకాశముంది. కారణం.. ఈ పరీక్షల్లో పాఠ్యాంశాలు కామన్‌గా ఉండటమే! సుమారు 60-70 శాతం వరకు సిలబస్ ఉమ్మడిగా ఉన్నందున్న సరైన ప్రణాళికతో ప్రిపేరైతే అభ్యర్థులు.. ఏకకాలంలోఅనేక రకాల పోటీ పరీక్షలు రాయొచ్చు. ఆయా పరీక్షల సిలబస్‌లో సాధారణంగా కనిపించే అంశాలు.. జనరల్ స్టడీస్, అర్థమెటిక్ (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్), మెంటల్ ఎబిలిటీ(రీజనింగ్), ఇంగ్లిష్. వీటిపై పట్టుసాధిస్తే.. ఏ పరీక్షలో అయినా విజయం సొంతం చేసుకోవచ్చు.

జనరల్ స్టడీస్.. చాలా విస్తృతం
చాలా విస్తృతమైన విభాగం.. జనరల్ స్టడీస్. ఇది వివిధ సబ్జెక్టుల సమ్మిళితంగా ఉంటుంది. రాష్ట్ర స్థాయి పరీక్షల్లో సింహభాగం జనరల్ స్టడీస్‌దే. కరెంట్ అఫైర్స్.. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న సమకాలీన అంశాలు.. నిత్యజీవితంలో సైన్స్‌ ప్రాముఖ్యత.. పర్యావరణ శాస్త్రం, విపత్తు నిర్వహణ.. జాగ్రఫీ, ఎకానమీ.. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ.. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర.. తెలంగాణ/ఏపీ చరిత్ర, సంస్కృతి, వారసత్వం, సాహిత్యం.. తెలంగాణలో ఉద్యమ చరిత్ర.. సంబంధిత రాష్ట్రం అవలంబిస్తున్న విధానాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ మొదలైన ఎన్నో అంశాల్లో అభ్యర్థులకున్న పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.

అర్థమెటిక్ :
సివిల్స్ సీ-శాట్ నుంచి వీఆర్‌వో పరీక్ష వరకు.. అన్నింటిలో అర్థమెటిక్ ఉంటుంది. కొన్ని పరీక్షల్లో సుమారు 40 శాతం వరకూ ప్రశ్నలు ఈ అంశం నుంచే వస్తుంటాయి. ఉద్యోగం సొంతమవ్వాలంటే.. ఈ విభాగంలో మంచి స్కోరు చేయడం తప్పనిసరి. ఇందులో పర్సంటేజ్, యావరేజెస్, రేషియో-ప్రపోర్షన్, ప్రాఫిట్-లాస్, సింపుల్- కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్-వర్క్, టైమ్-డిస్టెన్స్, పెర్ముటేషన్స్-కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, పార్టనర్‌షిప్‌పై దృష్టిసారించాలి.
  • భాగహారాలు, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక అంశాలను నోటితో గణించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సింప్లిఫికేషన్స్‌కు బోడ్‌మస్ రూల్స్‌కు సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలు గుర్తించుకోవాలి. వీటివల్ల సింప్లిఫికేషన్స్‌, నంబర్ సిరీస్ ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించొచ్చు. సమయం ఆదా అవుతుంది. కొన్ని అంశాలను ప్రత్యేకంగా బ్యాంకింగ్ పరీక్షల్లోనే అడుగుతారు. అవి.. డేటా సఫిషియన్సీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌.
  • ఎస్‌ఎస్‌సీ, రైల్వే, పోలీస్ రిక్రూట్‌మెంట్ మొదలైన వాటిల్లో జామెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, మెన్సురేషన్ టాపిక్స్‌పై ఎక్కువగా ప్రశ్నలు ఉంటాయి.
  • డేటా ఇంటర్‌ప్రెటేషన్: పట్టికలు, గ్రాఫ్‌ల ద్వారా సమాచారమిస్తూ ప్రశ్నలు అడిగే విభాగం.. డేటా ఇంటర్‌ప్రెటేషన్. ఇందులో ప్రశ్నలకు వేగంగా సమాధానాలు గుర్తించేందుకు పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోలపై అవగాహన వుండాలి. వివిధ రకాల గ్రాఫ్‌లను సాధన చేయాలి.

మెంటల్ ఎబిలిటీ/రీజనింగ్ :
  • అభ్యర్థుల అనలిటికల్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం.. రీజనింగ్. దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో ఉంటుంది. బ్యాంకింగ్ పరీక్షల్లో ఫలితాన్ని నిర్దేశించే విభాగమిది. ఇది వివిధ సందర్భాలలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సంక్లిష్ట పరిస్థితుల్లో సమస్యలను తెలివిగా పరిష్కరించే నేర్పును పరీక్షిస్తుంది.
  • బ్యాంకింగ్ పరీక్షల్లో హై లెవల్ రీజనింగ్ మీద ప్రశ్నలు ఉంటాయి. అసంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టాపిక్స్ ముఖ్యమైనవి. ఈ విభాగానికి సంబంధించి వెర్బల్ రీజనింగ్‌పై దృష్టి పెట్టాలి. కోడింగ్, డీ-కోడింగ్, అనలిటికల్ ఫజిల్స్, క్రిటికల్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి.
  • కోడింగ్-డీకోడింగ్ కోసం.. ఇంగ్లిష్ అక్షర క్రమాన్ని ముందు నుంచి వెనుకకు, వెనుక నుంచి ముందుకు ప్రాక్టీస్ చేయాలి. దీంతోపాటు ఏ అక్షరం ఎన్నో స్థానంలో ఉందో సులువుగా గుర్తించాలి.
  • రాష్ట్రస్థాయి పరీక్షలకు కోడింగ్-డీకోడింగ్, క్యాలెండర్స్, డెరైక్షన్స్‌, డైస్, నాన్ వెర్బల్(చిత్రంలో దాగి ఉన్న మొత్తం పటాల సంఖ్య), అనాలజీ మొదలైనవి ముఖ్యం. బ్యాంకింగ్‌లో మాత్రం హైలెవల్ ప్రశ్నలు అడుగుతారు. అనలిటికల్ రీజనింగ్, సిలాయిజమ్స్, ఇన్ ఈక్వాలిటీస్, ఇన్‌పుట్ అవుట్‌పుట్, డేటా సఫిషియెన్సీ విభాగాల్లో నుంచే బ్యాంకింగ్ పరీక్షల్లో ఎక్కువగా ప్రశ్నలు ఉంటాయి. కాఠిన్యత స్థాయి ఎక్కువగా ఉంటుంది.

ఇంగ్లిష్ :
  • ప్రతి పోటీ పరీక్షలోనూ కచ్చితంగా ఉండే సబ్జెక్ట్.. ఇంగ్లిష్. బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ, రైల్వే పరీక్షల్లో దీనికి వెయిటేజీ ఎక్కువ. టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలో ప్రాథమిక స్థాయి ప్రశ్నలు ఎదురవుతాయి.
  • ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, రీడింగ్ కాంప్రెహెన్షన్, యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తుంటాయి. వీటితోపాటు స్పెల్లింగ్‌‌స, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్సెస్, ప్రిపోజిషన్స్‌, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, వొకాబ్యులరీ, రీ రైటింగ్ ద సెంటెన్స్‌, రీ అరెంజ్ ది సెంటెన్స్‌, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ప్రెసిస్ రైటింగ్, బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు సాధించాలి.
  • ఇంగ్లిష్‌లో పట్టు కోసం మొదట బేసిక్ గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. టెన్సెస్, సెంటెన్స్‌ ఫార్మేషన్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ వంటి ముఖ్యాంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి.

మెటీరియల్ సేకరణ... పెద్ద సవాలు
పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో మెటీరియల్ సేకరణ సవాలుగా మారింది. విద్యార్థులు మార్కెట్లో లభించే అకాడమీ పుస్తకాలు, ప్రముఖ టీచర్ల పుస్తకాలు చదవడం మేలు. పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ కోసం ప్రతిరోజు క్షుణ్నంగా ఏదైనా ప్రామాణిక దినపత్రిక చదివితే సరిపోతుంది.

కరెంట్ అఫైర్స్: రోజూ పేపర్ చదువుతూ సొంత నోట్స్ సిద్ధం చేసుకోవాలి. మార్కెట్‌లో దొరికే ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని చదివితే సరిపోతుంది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మ్యాగజైన్లు, యోజన వంటివి ఉపయుక్తం.
  • జనరల్ సైన్స్‌కు అకాడమీ పుస్తకాలు చదవడం మేలు. పర్యావరణం, విపత్తు నిర్వహణకు ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు దోహదం చేస్తాయి.

జాగ్రఫీ: అకాడమీ పుస్తకాలు, ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్; పాలిటీకి లక్ష్మీకాంత్ పుస్తకాలు అనుకూలంగా ఉంటాయి. పాలిటీకి సంబంధించి సమకాలీన రాజకీయ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా పేపర్ చదువుతూ.. సమకాలీన అంశాలకు సొంతంగా నోట్స్ సిద్ధం చేసుకోవాలి.

భారతదేశ చరిత్ర: చరిత్రకు సంబంధించి అకాడమీ, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవొచ్చు. ఆధునిక భారతదేశ చరిత్రకు బిపిన్ చంద్ర, ప్రాచీన చరిత్రకు సతీష్ చంద్ర, మధ్యయుగ చరిత్రకు ఆర్‌ఎస్ శర్మ పుస్తకాలు మేలనేదని నిపుణుల అభిప్రాయం. ఆయా పుస్తకాల్లో సమగ్ర సమాచారం లభిస్తుంది. అలానే తెలుగు రాష్ట్రాల్లో పేరున్న గ్రూప్స్ ఫ్యాకల్టీ నోట్స్‌ను సేకరించుకొని చదివితే సరిపోతుంది. అభ్యర్థి రాస్తున్న పరీక్షని బట్టి పుస్తకాన్ని ఎంచుకోవాలి.
  • తెలంగాణ ప్రాచీన చరిత్రకు తెలుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఉద్యమ చర్రితకు తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయోగపడుతున్నాయి. ఏపీ చరిత్రకు బీఎస్ హన్మంతరావు, రఘునాథరావు పుస్తకాలు ఉపయుక్తం.
  • ఎకానమీకి సంబంధించి ప్రభుత్వాలు విడుదల చేసే ఆర్థిక సర్వేలు చాలా కీలకం. వీటి నుంచే ఎక్కువగా ప్రశ్నలు కనిపిస్తుంటాయి. దాంతోపాటు అకాడమీ బుక్స్ చదవొచ్చు.
  • మెంటల్ ఎబిలిటీకి ఆర్.ఎస్.అగర్వాల్ పుస్తకం రిఫర్ చేయొచ్చు. వీటితో పాటు ఏదైనా ప్రామాణిక మెటీరియల్ సేకరించుకొని చదవాలి.
  • ప్రభుత్వ పథకాల కోసం వెబ్‌సైట్లు చూస్తే సరిపోతుంది.
  • జనరల్ ఇంగ్లిష్‌కు లెనిన్-మార్టిన్ పుస్తకం ఉపయోగపడుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునే విధంగా జయాకర్‌రావు పుస్తకం ఉపయోగపడుతుంది.
  • ఎథిక్స్‌కు తెలుగు అకాడమీ పుస్తకం, సోషియాలజీకి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయుక్తం

ప్రశ్నల సరళి క్లిష్టం..
పోటీ పరీక్షల్లో ప్రశ్నల సరళి కఠినంగా మారుతోంది. ముఖ్యంగా జనరల్ స్టడీస్‌లో ప్రశ్నలు క్లిష్టంగా ఉంటున్నాయి. ఇటీవల తెలంగాణ, ఏపీల్లో నిర్వహించిన వీఆర్‌వో, కానిస్టేబుల్, ఎస్‌ఐ, పంచాయతీ సెక్రటరీ పరీక్షల్లో ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. అభ్యర్థులకు సబ్జెక్టుపై సమగ్ర పరిజ్ఞానం ఉంటేనే సమాధానాలు గుర్తించే పరిస్థితి ఉంది. గతంలో ఆబ్జెక్టివ్ ఓరియెంటేషన్‌లో బిట్లు ప్రాక్టీస్ చేసి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే వీలుండేది, పోటీ విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా సబ్జెక్ట్‌ను లోతుగా పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతున్నారు. జనరల్ స్టడీస్‌కు సంబంధించి సమకాలీన అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటోంది.
Published date : 11 Jan 2019 06:01PM

Photo Stories