ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే సైకాలజీ.. కెరీర్ అవకాశాలు ఇవే..
ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు సైకాలజిస్ట్‌లను (మానసిక వైద్యులను) ప్రదిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది! దీంతో.. ఇటీవల కాలంలో సైకాలజిస్ట్‌లకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. సైకాలజీని కెరీర్‌గా ఎంచుకునేందుకు మార్గాలు, అందుబాటులో ఉన్న అవకాశాలపై ప్రత్యేక కథనం..
నేటి ఉరుకులు, పరుగుల జీవితం.. నిద్ర లేచింది మొదలు.. పడుకునే వరకూ..ఎంతో ఒత్తిడి. మరోవైపు గత ఏడాది కాలంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న భయాందోళనలు. దాంతో ఒత్తిళ్లు, మా నసిక సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి వారందరికీ ఉపశమనం కల్పించే దిశగా సైకాలజిస్ట్‌లు సేవలందిస్తున్నారు. సైకాలజీని కెరీర్‌గా ఎంచుకుంటే.. భవిష్యత్‌లో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నిర్వచనం ప్రకారం–మనిషి మనసును, ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే.. సైకాలజీ..
70 శాతం మంది..
ప్రస్తుత పోటీ ప్రపంచం, కరోనా అనిశ్చిత పరిస్థితులు,ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, సామాజిక ఒడిదుడుకుల కారణంగా.. నూటికి 70 శాతం మంది మానసిక సమస్యలు లేదా మానసిక సంఘర్షణకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) జర్నల్ పేర్కొంది. ఈ సమస్యలు చికిత్సతోనే నివారించగలిగేవిగా ఉంటున్నాయని స్పష్టం చేసింది. ఇలాంటి మానసిక సమస్యలను పరిష్కరించే నిపుణులే సైకాలజిస్ట్‌లు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. దేశంలో 2023 చివరి నాటికి దాదాపు అరవై వేల మందికిపైగా సైకాలజిస్ట్‌ల అవసరం ఉంటుందని అంచనా. దీంతో సైకాలజీ కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు చక్కటి కెరీర్ అవకాశాలు అందుకునే వీలుంది.
ప్రధానంగా మూడు రకాల సైకాలజిస్ట్‌లకు ప్రాధాన్యం పెరుగుతోంది.
క్లినికల్ అండ్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్: వీరు పూర్తిగా మానసిక రుగ్మతలతో బాధపడే రోగులకు అన్ని రకాలుగా చికిత్స అందించి.. ఉపశమనం కల్పించే ప్రయత్నం చేస్తారు.
అకడమిక్ సైకాలజిస్ట్‌లు: కళాశాలల్లో విద్యార్థుల మానసిక దృక్పథంలో మార్పు వచ్చేలా చేసి.. వారు కెరీర్ పరంగా ముందుకు సాగేలా కౌన్సెలింగ్ ఇచ్చేవారే అకడమిక్ సైకాలజిస్ట్‌లు.
ఆర్గనైజేషనల్ అండ్ కమ్యూనిటీ సైకాలజిస్ట్: ఇది ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ నెలకొంటున్న మరో సైకాలజీ విభాగం. సంస్థల్లో విధి నిర్వహణ పరంగా ఎదురయ్యే ఒత్తిళ్ల వల్ల కూడా మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపేది.. ఆర్గనైజేషనల్ అండ్ కమ్యూనిటీ సైకాలజిస్ట్‌లే!
ఇంకా చదవండి : part 2 : సైకాలజీ అందించే ఇన్‌స్టిట్యూట్స్ గురించి తెలుసుకోండిలా..