Skip to main content

న్యూఇయర్‌లో మీ కెరీర్‌ను హ్యాపీగా మలుచుకోండిలా..

చూస్తుండగానే కొత్త సంవత్సరం వచ్చేసింది. ఎన్నో ఆశల ఊసులు మోసుకుంటూ.. 2019 నుంచి 2020లోకి అడుగుపెట్టేశాం.

 వాస్తవానికి జనవరి ఫస్ట్‌ వస్తుందనగానే కొత్త నిర్ణయాలు తీసుకోవడం మనకందరికీ అలవాటు. మంచి అలవాట్లు.. చదువు, కెరీర్‌కు పనికొచ్చే తీర్మానాలు.. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకోవడానికి, భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకోవడానికి.. నూతన సంవత్సరాన్ని ఓ చక్కటి సందర్భంగా భావిస్తాం. గతించిన సంవత్సరంలో ఎదురైన అనుభవాలు..
వాటి నుంచి నేర్చుకున్న పాఠాలను, జ్ఞాపకాలను వెంట తెచ్చుకొని.. కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. అసలు న్యూఇయర్‌ అంటేనే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు వారధి. అలాంటి నూతన సంవత్సరాన్ని సంతోషంగా స్వాగతిస్తూ.. విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ చదువును, కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం...

ప్రణాళిక తప్పనిసరి :
కొత్త ఏడాది చదువులో, కెరీర్‌లో మరింత ముందుకు దూసుకుపోవడానికి ప్రణాళికలు వేసుకుంటాం. ఆ ప్రణాళికలో మన లక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. లక్ష్య సాధన సులభంగా ఉండాలంటే.. ప్రణాళిక సూటిగ, స్పష్టంగా ఉండాలి. కొత్త లక్ష్యాలతో కొత్త మజిలీకి తొలి అడుగు వేసేముందు గతం తాలూకు అనుభవాలను ఒకసారి అవలోకనం చేసుకోవాలి. గడిచిన కాలంలో సాధించిన విజయాలు, ఎదురైన వైఫల్యాలను ఓసారి పునఃపరిశీలన చేసుకోవాలి. గతం తాలుకూ చేదు అనుభవాలను, ఓటములను.. భవిష్యత్‌ విజయాలకు నిచ్చెన మెట్లుగా భావించాలి. లక్ష్య సాధన కోసం ప్రాక్టికల్‌ ప్రణాళిక రూపొందించుకొని.. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని తీర్మానించుకోవాలి.
 
 
మార్పులను స్వాగతించాలి..
మార్పు ఒక్కటే శాశ్వతం అంటారు. కాబట్టి జీవిత గమనంలో మార్పును స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితులు వాటంతటవే సానుకూలమవుతాయనే భావన నుంచి భయటపడాలి. ఎంచుకున్న రంగంలో రాణించడానికి మనవంతు మానవ ప్రయత్నం నిరంతరం కొనసాగించాలి. ఆ క్రమంలో మన ఆలోచనలకూ సానబెట్టాలి. కొత్త సంవత్సరంలో కంఫర్ట్‌ జోన్‌లోనుంచి బయటపడాలని నిర్ణయించుకోవాలి. సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. కొత్త కోర్సు, కొత్త కాలేజీ, కొత్త కొలువు, కొత్త కంపెనీ.. ఇలా ఎలాంటి మార్పునైనా స్వాగతించాలి. అలాగే వాయిదా పద్ధతిని వదిలించుకోవాలని కొత్త సంవత్సరంలో గట్టిగా తీర్మానించుకోవాలి. ఈ రోజు చేయాల్సి పని ఇప్పుడే పూర్తి చేయాలి. రేపటి పనిని ఈ రోజే ముగించేలా పట్టుదలతో పనిచేయాలి. వాయిదా మనస్తత్వం వదిలి ఆత్మవిశ్వాసంతో ప్రణాళికా బద్ధంగా కృషి చేయాలి.
 
గాలివాటం... ఆచరణ:
గాలివాటంగా రోజులు గడిపేయడం చాలా తేలికైన పని. ఎందుకంటే.. గాలివాటు గమనంలో మనం ఎటుపోతున్నామో మనకే తెలియని పరిస్థితి. మనకు తెలియకుండానే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి. మనం కోరుకున్న విధంగా మనం జీవితం సాగాలంటే.. సమయపాలనతోపాటు ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకోవాలి. లక్ష్యం లేకుండా జీవితాన్ని గడిపేయకుండా.. కలల సాకారానికి శ్రీకారం చుట్టాలి. లక్ష్య సాధనలో ఎక్కడున్నామో తెలుసుకోవాలి. ఉన్నచోటే ఉండకుండా... ఒక్క అడుగైనా ముందుకు వేయాలి. ఊహలు, ఆలోచనలకంటే– ఆచరణ ముఖ్యం. మానవ జీవితంలో మహాద్భుతాలు ఆచరణతోనే సాధ్యం. ఇంజనీర్‌ అవుతా, డాక్టర్‌ను అవుతా.. సివిల్స్‌ రాస్తా.. అంటూ కలలు కంటూ కూర్చుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆశయసాధనకు ఆచరణ ముఖ్యమని గుర్తించాలి.
 
నైపుణ్యాలే ప్రధానం :
నేటి పోటీ ప్రపంచంలో కార్పొరేట్‌ సంస్థలు ఎంతటి ఉన్నత చదువులున్నా... నైపుణ్యాలుంటేనే ఆఫర్‌ ఇస్తున్నాయి, విద్యార్హతల్లో మెరుగ్గా ఉన్నప్పటికీ.. స్కిల్స్‌ లేకుంటే అవకాశం ఇవ్వడంలేదు. మార్కులు బాగా వచ్చిన ప్రతీ ఒక్కరిలో నైపుణ్యాలు ఉంటాయని గ్యారెంటీ లేదు. సంస్థలకు కావాల్సింది నైపుణ్యం. కాబట్టి విద్యార్థులు ఎప్పటికప్పుడు సాంకేతిక ప్రపంచంలో వస్తున్న నూతన టెక్నాలజీలను గ్రహించాలి, వాటిని నేర్చుకోవాలి. ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో వెనుకబడి పోకుండా ఉండాలంటే.. నైపుణ్యాలను ఆధునీకరించుకుంటూ ఉండాలి. తాజా టెక్నాలజీ, కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలపై దృష్టిసారించి.. వాటిని అందిపుచ్చుకునేలా కొత్త సంవత్సరంలో కృషిచేయాలి. దీనివల్ల ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నా.. ఉద్యోగ భద్రత ఉంటుంది.
 
నెట్‌వర్క్‌ పెంచుకోవాలి..
కెరీర్‌లో పైకి రావాలనుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన నైపుణ్యం.. నెట్‌వర్క్‌. వృత్తి జీవితం సుస్థిరంగా సాగాలంటే..పనిచేస్తున్న సంస్థలో నెట్‌వర్క్‌ పెంచుకుంటూ ఉండాలి. కేవలం సంస్థలోనే కాకుండా.. బయట కూడా వీలైనంత వరకు నెట్‌వర్కింగ్‌ పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కొత్త నైపుణ్యాలున్న వారిని, కొత్త భాషలు వచ్చినవారిని, కొత్త నేపథ్యాలున్న వారిని మన స్నేహితుల జాబితాలో చేర్చుకోవాలి. అలాగే సెమినార్స్, వర్క్‌షాపులు, వెబ్‌నార్లు వంటి వాటిల్లో పాలుపంచుకుంటూ ఉండాలి. దీనిద్వారా ఆయా రంగాల్లో ఉన్న ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
కొత్త విషయాలు నేర్చుకోండి...
ఎప్పటికప్పడు కొత్త విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం వల్ల మనల్ని మనం ఉత్తేజపరుచుకోవచ్చు. ఉదాహరణకు మనం డేటాసైన్స్‌ విభాగంలో ఉద్యోగం చేస్తుంటే.. బిగ్‌డేటా అనలిటిక్స్‌ కోర్సు నేర్చుకునేలా ప్రయత్నించాలి. మీడియాలో ఉద్యోగం చేస్తున్న వారైతే... డిజిటల్‌ మీడియా ట్రెండ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రతి రోజూ నేర్చుకుంటూ ఉండేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలి. మన రంగంతోపాటు అనుబంధ రంగాల్లో సంభవిస్తున్న మార్పులను గమనిస్తుండాలి.
 

ఉద్యోగాన్వేషణ ఇలా..!
కంపెనీల నియామకాల తీరు మారుతోంది. ఉద్యోగాల స్వభావం సైతం మారిపోతోంది. కంపెనీలు టెక్నాలజీకి పెద్ద పీట వేస్తున్నాయి. స్కిల్‌ ఉంటేనే ఆఫర్‌ అంటున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో గతంలోలా కాకుండా.. ఇప్పుడు ఆన్‌లైన్‌ పరీక్షల ట్రెండ్‌ ప్రారంభమైంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్‌ వంటి సంస్థలు.. ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ టెస్టులు నిర్వహించి.. ప్రతిభ చూపితే ఆఫర్స్‌ ఇస్తున్నాయి. ముఖ్యంగా కోడింగ్‌ స్కిల్‌ ఉంటే సాఫ్ట్‌వేర్‌ కొలువు ఖాయం అవుతోంది. కోడింగ్‌ హాకథాన్‌లు జరుగుతున్నాయి. ఎథికల్‌ హ్యాకింగ్‌ పోటీల ద్వారా బగ్‌ను గుర్తించి లక్షలు సంపాదిస్తున్నారు. ఈకామర్స్, డెలివరీ రంగాల్లో ఎక్కువ సంఖ్యలో కొలువులు లభిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగాన్వేషణలో ఉన్న అభ్యర్థులు జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్స్‌కు అనుగుణంగా తమను తాము మలచుకోవాలి. కొత్త సంవత్సరంలో టెక్నాలజీ, స్కిల్స్‌ నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి. అదేవిధంగా తమ అర్హతలు, నైపుణ్యాలు నలుగురికి తెలిసేలా సోషల్‌ మీడియాను ఉపయోగిం చుకోవచ్చు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సైతం ఆన్‌లైన్‌ మార్గాల్లో సబ్జెక్టు నైపుణ్యాలు పెంచుకోవచ్చు!!


అన్నింటికీ పునాది... పదో తరగతి
పదో తరగతి.. ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా పునాది వంటిది. తెలుగు రాష్ట్రాల్లో మార్చి చివరి వారంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. భవిష్యతలో ఏ కోర్సులో చేరాలన్నా.. ఎలాంటి ఉద్యోగం కోసం ప్రయత్నించాలన్నా.. పదో తరగతిలో సాధించిన మార్కులు కీలకం. అందుకే కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న విద్యార్థులు మార్చిలో జరగబోయే పబ్లిక్‌ పరీక్షల్లో గరిష్ట స్కోర్‌ చేయడంపై దృష్టిపెట్టాలి. అందుకోసం ప్రతి సబ్జెక్టుకు సంబంధించి సిలబస్‌ను, పరీక్ష విధానాన్ని అవగాహన చేసుకొని.. పటిష్ట ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకోవాలి. పరీక్షల ముందు ప్రతి క్షణం ఎంతో విలువైనదిగా భావించి... ప్రిపరేషన్‌ సాగించాలి. ఎక్కువమంది విద్యార్థులు కష్టంగా భావించే మ్యాథమెటిక్స్, జనరల్‌ సైన్స్, ఇంగ్లిష్‌కు కాస్త ఎక్కువ సమయం కేటాయించి.. ఎక్కువ ఏకాగ్రతతో చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే పాఠశాలలో ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలను అవగాహన చేసుకుంటూ.. సందేహాలుంటే అప్పటికప్పుడే నివృత్తి చేసుకోవాలి. చదవడం, రాయడం, రివిజన్‌.. ఇలా నిరంతరం కొనసాగించాలి. అప్పుడే ఎక్కువ మార్కుల సాధనకు అవకాశం ఉంటుంది. అలాగే కొత్త సంవత్సరంలో పదోతరగతి పూర్తిచేసుకోబోయే విద్యార్థులకు ఇంటర్మీడి యెట్‌తోపాటు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. తక్షణ∙ఉపాధికి మార్గం వేసే ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరేవీలుంది. అవకాశం ఉన్న విద్యార్థులు ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ వంటి కోర్సుల్లో చేరి ఉన్నత విద్యవైపు దృష్టిసారించొచ్చు. భవిష్యత్తులో టెక్నికల్‌ ఫీల్డ్‌లో స్థిరపడాలనుకునే విద్యార్థులు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరడం సముచితం. అదే విధంగా ఇంటర్మీడియెట్‌లో ఒకేషనల్‌ కోర్సులు సైతం అందుబాటులోకి వచ్చాయి.
 
ఇంటర్మీడియెట్‌.. ఓ మైలురాయి
ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, అగ్రికల్చర్, లా, కామర్స్‌.. ఇలా ఏ కోర్సులో చేరాలన్నా... ఇంటర్మీడియెట్‌ మార్కులు, సంబంధిత గ్రూప్‌ సబ్జెక్టులపై పట్టు తప్పనిసరి. అందుకే కెరీర్‌కు మైలురాయి ఇంటర్మీడియెట్‌ అంటారు. తెలుగు రాష్ట్రాల్లో మార్చి మొదటి వారంలోనే ఇంటర్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. కాబట్టి విద్యార్థులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూనే.. ఇంటర్‌లో మంచి మార్కుల సాధనకు కృషి చేయాలి. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఓవైపు జేఈఈ, నీట్, ఎంసెట్‌ వంటి పరీక్షలకు ప్రిపేర్‌ అవుతూనే... ఇంటర్‌లోనూ సాధ్యమైనంత ఎక్కువ స్కోర్‌ చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ(జువాలజీ, బోటనీ)... ఆయా గ్రూప్‌లకు సంబంధించి చాలా కీలకమైన సబ్జెక్టులు. కాబట్టి ఆ సబ్జెక్టులపై ఇష్టం పెంచుకుంటూ.. ప్రిపరేషన్‌ సాగించాలి. చదవడంతోపాటు ప్రశ్నలకు సమాధానాలు రాయడం, ప్రాక్టీస్‌ చేయడం లాభిస్తుంది. ప్రతి సబ్జెక్టులో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి.. ఏ అధ్యాయానికి ఎంత సమయం కేటాయించాలి.. పరీక్షల కోణం ఏది ముఖ్యమో పరిశీలిస్తూ చదవాలి. గత ప్రశ్న పత్రాలు, మోడల్‌ పేపర్స్‌ నిత్యం సాధిస్తుండాలి.
          అలాగే ఇంటర్‌ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్‌తో పాటు అనేక అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. ఉపాధ్యాయులు, సీనియర్లను అడిగి ఇంటర్‌ తర్వాత అందుబాటులో ఉన్న ఉన్నత విద్య, ఉపాధి మార్గాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లా, ఫార్మసీ, అగ్రికల్చర్, వెటర్నరీ, సీఏ/సీఎస్‌/సీఎంఏ, హోటల్‌ మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్, ఫ్యాషన్, హార్టికల్చర్, యానిమేషన్, బయోటెక్నాలజీ, ఆర్కిటెక్చర్, పెట్రోలియం ఇంజనీరింగ్, డిజైన్‌ కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, త్రివిధ దళాల్లో ఉద్యోగాలు, రైల్వే, పోలీస్‌ కొలువులు తదితరాల గురించి అవగాహన పెంచుకొని.. భవిష్యత్‌లో మనకు ఏ మార్గం సరిపోతుందో ఆ దిశగా మన ఆలోచనలు సాగాలి.
 
డిగ్రీ.. అదనపు కోర్సులే.. :
బీఏ/బీఎస్సీ/బీకామ్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు.. కొత్త సంవత్సరం సందర్భంగా భవిష్యత్‌ లక్ష్యాలపై స్పష్టత తెచ్చుకోవాలి. అందుకనుగుణంగా కెరీర్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలి. కేవలం డిగ్రీ పట్టాతో జాబ్‌ మార్కెట్‌లో నెగ్గుకొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తమ డిగ్రీ కోర్సుకు తగ్గ జాబ్‌ సర్టిఫికేషన్స్‌ పూర్తిచేసుకునే ప్రయత్నంచేయాలి. బీఎస్సీ(బైపీసీ) అర్హతతో ఫార్మా తదితర రంగాల్లో ఉపాధి పొందొచ్చు. కాకపోతే అందుకుతగ్గ అదనపు కోర్సులు పూర్తిచేసుకోవాలి. అలాగే బీఎస్సీ(ఎంపీసీ) విద్యార్థులు కంప్యూటర్‌ సంబంధిత కోర్సులు నేర్చుకోవడం లాభిస్తుంది. అదేవిధంగా బీకామ్, బీఏ విద్యార్థులు సైతం కంప్యూటర్‌ కోర్సులతోపాటు డిజిటల్‌ మార్కెటింగ్, వెబ్‌డిజైనింగ్, యానిమేషన్‌ వంటి డిప్లొమా కోర్సుల ద్వారా నైపుణ్యాలు పెంచుకోవాలి. డిగ్రీ అర్హతతో ఉన్నత విద్యావకాశాలు అనేకం. సివిల్స్‌ నుంచి గ్రూప్స్, బ్యాంక్స్‌ వరకూ.. వివిధ పోటీ పరీక్షలకు అర్హత డిగ్రీ. కాబట్టి డిగ్రీ కోర్సుల విద్యార్థులు తమ భవిష్యత్‌ లక్ష్యం ఏదో నిర్ణయించుకొని... కొత్త సంవత్సరంలో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించొచ్చు.
 
ఇంజనీరింగ్‌.. ఎవర్‌ గ్రీన్‌
ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకుంటే... ఏదో ఒక అవకాశం లభిస్తుందనే అభిప్రాయం ఉంది. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ఐఐటీలు వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు తప్ప మిగతా చోట్ల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్, ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలు ఆశించిన స్థాయిలో లేవనే వార్తలొస్తున్నాయి. అదే సమయంలో లేటెస్ట్‌ టెక్నాలజీపై పట్టుంటే.. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగం ఖాయమని నిపుణులు నమ్మకంగా చెబుతున్నారు. కాబట్టి కొత్త సంవత్సరంలో.. ఇంజనీరింగ్‌ కోర్సులో మంచి మార్కులు సాధించడంతోపాటు నేడు హాట్‌ టాపిక్‌గా మారిన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్, డేటా అనలిటిక్స్, బిగ్‌డేటా, ఐవోటీ వంటి టెక్నాలజీపై పట్టు సాధించేలా ప్రయత్నించాలి. అందుకోసం ఒకవైపు ఇంజనీరింగ్‌ కోర్‌ సబ్జెక్టులు చదువుతూనే.. కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలి. ఎక్కువ సమయం సోషల్‌ మీడియాలో వెచ్చించకుండా.. లేటెస్ట్‌ టెక్నాలజీని నేర్చుకోవడంపై దృష్టిసారించడం ద్వారా ఇంజనీరింగ్‌ విద్యార్థులు భవిష్యత్‌ అవకాశాలను ఒడిసి పట్టుకోవచ్చు.
 

ఓటమి తాత్కాలికం :
ఓటమి శాశ్వతం కాదు. గెలుపు అంతిమం కాదని గుర్తించాలి. గతేడాది ఎదురైన జయాపజయాల నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలి. కొత్త సంవత్సరంలో విజయం వరించేదాక పదే పదే కృషి చేసేందుకు సిద్ధపడాలి. సమయపాలన పాటించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారే అంతిమంగా విజేతలుగా నిలుస్తారు. చరిత్ర,వర్తమానంలోనూ పేరు ప్రఖ్యాతులు గడించినవాళ్లు ఉపయోగించుకున్నది మనకున్న 24 గంటలే. మనం కూడా ఈ నూతన సంవత్సరంలో.. సరికొత్త నిర్ణయాలతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ చరిత్రలో మనకంటూ ఓ పేజీ కోసం కృషి చేద్దాం.. అలాగే ఎన్నో విజయాలు మనకందించడానికి ముందుకొస్తున్న నూతన సంవత్సరాన్ని మనసారా స్వాగతిద్దాం.. హ్యాపీ న్యూ ఇయర్‌.. ఆల్‌ ద బెస్ట్‌!!

Published date : 01 Jan 2020 06:21PM

Photo Stories