Skip to main content

నచ్చిన కోర్సులు.. తక్కువ ఫీజులోనే

ప్రవేశం, కోర్సుల ఎంపిక, వ్యవధి, బోధనా పద్ధతులు, మూల్యాంకనం.. ఇలా ఏ అంశం తీసుకున్నా.. ఉద్యోగం చేస్తూనే చదువు కొనసాగించాలనుకునే వారికి దూరవిద్యా విధానం అనుకూలంగా మారుతోంది.
ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), డా.బి.ఆర్. అంబేద్కర్‌ఓపెన్‌యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) తదితర వర్సిటీలు దూరవిద్య కోర్సుల్లో ప్రతి ఏటా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. దూరవిద్య ప్రాధాన్యం, అందిస్తున్న కోర్సులు, ప్రవేశ విధానాలపై ప్రత్యేక కథనం...

ఆధునిక మార్గం :
దూర విద్యను ఆధునిక అభ్యసనా మార్గంగా పరిగణిస్తున్నారు. రెగ్యులర్ కోర్సుల్లో ఎక్కువగా ఫీజులు కట్టలేని విద్యార్థులకు.. ఉద్యోగం చేస్తున్న కారణంగా రోజూ తరగతులకు హాజరుకాలేని వారికి దూరవిద్యా విధానం మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. విద్యార్థులు దూరవిద్య సహాయంతో నచ్చిన కోర్సుల్లో చేరొచ్చు. దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు దూర విద్యా విధానంలో కోర్సులను అందిస్తున్నాయి.

ప్రయోజనాలు:
  • సౌకర్యవంతమైన విద్యా విధానం
  • సులభమైన పాఠ్యాంశాలు
  • రెగ్యులర్‌గా క్లాసులు ఉండకపోవడం
  • ఒకవైపు చదువు కొనసాగిస్తూనే సంపాదించే అవకాశం
  • తక్కువ కోర్సు ఫీజు.
ప్రతికూలతలు:
  • తరగతి గది విద్య లేకపోవడం
  • సహచరులతో పరస్పర పరిచయం లేకపోవడం.

పేరున్న యూనివర్సిటీలు..

దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు దూరవిద్యా విధానంలో కోర్సులను అందిస్తున్నాయి. వాటిలో ఇగ్నో, అంబేద్కర్ యూనివర్సిటీ, ఉస్మానియా విశ్వ విద్యాలయం, ఆంధ్రా విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం వంటివి కొన్ని ప్రముఖంగా నిలుస్తాయి.

ఇగ్నో :
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) దేశంలో దూర విద్యకు చిరునామాగా నిలుస్తోంది. దీనికి దేశవ్యాప్తంగా రీజనల్, సబ్ రీజనల్ స్టడీ సెంటర్లు ఉన్నాయి. వాటి ద్వారా అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను అందిస్తోంది. ప్రస్తుతం జనవరి-2020 ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోంది.

ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఇగ్నో సొంతం. వీరంతా విద్యార్థులను నాలెడ్జ్, స్కిల్స్, వాల్యూస్ పరంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు టెలీ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇగ్నో అందించే మెటీరియల్ సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది.
వెబ్‌సైట్: http://www.ignou.ac.in

నాగార్జున విశ్వవిద్యాలయం:
నాగార్జున విశ్వవిద్యాలయంలో 1976లో సెంటర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(సీడిఈ)ను స్థాపించారు. దీనిద్వారా ఏటా రెండుసార్లు ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఒక అకడెమిక్ సంవత్సరం జూలై నుండి జూన్ వరకు.. మరొక అకడెమిక్ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఉంటుంది. స్టడీ సెంటర్ల ద్వారా వీకెండ్ క్లాసులు/ ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు.
అందిస్తున్న కోర్సులు:
  • బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్‌ఐఎస్‌సీ
  • ఎంఎస్సీ, ఎంఏ, ఎంకాం
  • ఎంబీఏ, ఎంసీఏ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎల్‌ఎల్‌ఐఎస్‌సీ
  • పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు.
వెబ్‌సైట్: http://www.anucde.info
 
ఉస్మానియా యూనివర్సిటీ:
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూర విద్యా విధానంలో పలు యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. ముఖ్యంగా మూడేళ్ల బీఏ, బీకామ్, బీబీఏ; అలాగే వివిధ సబ్జెక్టుల్లో ఎంఏ; ఎంకామ్, ఎంబీఏ, ఎంఎస్సీలతోపాటు పీజీ డిప్లొమా ఇన్ మ్యాథమెటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర కోర్సులను దూర విద్యావిధానంలో అందిస్తోంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.oucde.net
 
ఆంధ్రా యూనివర్సిటీ :
ఆంధ్రా యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూజీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులతోపాటు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ వంటి ప్రొఫెషనల్ కోర్సులను సైతం దూర విద్యా విధానంలో అందిస్తోంది. బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, బీఈడీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, ఎంసీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎంహెచ్‌ఆర్‌ఎం తదితర కోర్సులను వివిధ సబ్జెక్టుల్లో, వివిధ స్పెషలైజేషన్లల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. అంతేకాకుండా సర్టిఫికెట్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ అకౌంటింగ్,సర్టిఫికెట్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ మల్టీ మీడియా టెక్నాలజీస్, సర్టిఫికెట్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ ఇంటర్నెట్ టెక్నాలజీలను అందిస్తోంది.
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ:
తెలుగు రాష్ట్రాల్లో దూర విద్యకు పెద్ద దిక్కుగా ఉంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. దీనికి రెండు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్టడీ సెంటర్లు ఉన్నాయి. ‘ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్స్’ అనే నినాదంతో విద్యార్హతలు, వృత్తి నైపుణ్యాలు అందించేందుకు కృషిచేస్తోంది. అలాగే సామాజికంగా వెనుకబడి ఉన్నత విద్యను పొందలేని వారిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తోంది.
 అందిస్తున్న కోర్సులు:  బీఏ, బీకాం, బీఎస్సీ, బీఈడీతోపాటు దాదాపు అన్ని స్పెషలైజేషన్స్‌తో ఎంబీఏ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం కోర్సులను ఆఫర్‌చేస్తోంది.
 వెబ్‌సైట్: braou.ac.in
 
పేద విద్యార్థుల కోసం:
సామాజిక, ఆర్థిక కారణాల వల్ల రెగ్యులర్ విద్యకు దూరమైన వారికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించేందుకు ఓపెన్ యూనివర్సిటీ వ్యవస్థ ఉపయోగపడుతోంది. అవసరాల రీత్యా సరళతను జోడించి నేటి తరానికి అవసరమయ్యే రీతిలో విద్యను అందించే స్థాయికి ప్రస్తుతం ఓపెన్ యూనివర్సిటీ వ్యవస్థ చేరుకుంది. రానున్న కాలంలో వనరుల లేమితో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వాలు సంక్లిష్టతతో కూడిన విద్యా సంబంధిత అవసరాలను తీర్చలేకపోవచ్చు. అదే సమయంలో ఓపెన్ యూనివర్సిటీ ఉన్నత విద్యలో ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచుతూ యువత కలల సాకారానికి ఆలంబనగా నిలుస్తోంది.
  - సి.పార్థసారథి, ఐఏఎస్, ఇంచార్జ్ వైస్ చాన్సలర్, బీఆర్‌ఏఓయూ
Published date : 14 Jan 2020 11:46AM

Photo Stories