Skip to main content

నా కెరీర్.. నా నెట్‌వర్కింగ్..!

‘శ్రీను, సాయి ఇంజనీరింగ్ నుంచి స్నేహితులు. సాయి మెరిట్ విద్యార్థి. మంచి పర్సంటేజ్ ఉంది. కానీ ఇతరులతో త్వరగా కలవలేడు.
కొత్తవాళ్లను పరిచయం చేసుకునే చొరవ లేదు. శ్రీను సగటు విద్యార్థి. ఇతరులతో ఇట్టే కలిసిపోయేతత్వం ఇతని సొంతం. కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటూ వాళ్లతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడంలో దిట్ట శ్రీను. ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగ వేటలో పడ్డారు. శ్రీనుకి తన నెట్‌వర్క్‌లో తెలిసిన వారి నుంచి ఉద్యోగ అవకాశాల గురించి ఎప్పటికప్పుడూ సమాచారం అందుతుంది. ఫలితంగా తన పరిచయస్తుల్లో ఓ ఉద్యోగి రిఫరెన్స్‌తో సగటు విద్యార్థి అయిన శ్రీను ప్రముఖ ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం సొంతం చేసుకున్నాడు. మరోవైపు మెరిట్ స్టూడెంట్ అయిన సాయి మాత్రం ఇంకా ఉద్యోగాన్వేషణలోనే ఉన్నాడు’. నేటి డిజిటల్ యుగంలో నైపుణ్యాలకు తోడు ‘నెట్‌వర్కింగ్’ ఎంత ముఖ్యమో తెలిపే ఉదంతం ఇది. ఉద్యోగావకాశాలతోపాటు ఉజ్వల కెరీర్‌కు కీలకంగా మారుతున్న నెట్‌వర్కింగ్ నైపుణ్యాలు పెంచుకోవడం ఎలాగో తెలుసుకుందామా...!

66 శాతం రిఫరల్ ద్వారానే..

నేటి జాబ్ మార్కెట్‌లో.. ‘మీకు ఏం తెలుసనేది ముఖ్యం కాదు, మీరు ఎవరికి తెలుసనేదే ప్రధానం’ అంటున్నారు నిపుణులు. సుమారు 66 శాతం ఉద్యోగ అవకాశాల గురించి.. ఔత్సాహికులకు తెలియడం లేదని ఇటీవల ఓ సర్వే తేల్చింది. ఇవన్నీ వ్యక్తిగత పరిచయాల ద్వారా, ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల రిఫరెన్స్ ద్వారా భర్తీ అయిపోతున్నాయి. సంస్థలు కూడా కొత్త వారి ఎంపిక కోసం భారీ కసరత్తు చేసే బదులు.. తమ కంపెనీలోనే పనిచేసే నమ్మదగ్గ ఉద్యోగుల రిఫరెన్స్ ద్వారా నియామకాలు జరపడం మేలని భావిస్తున్నాయి.

నెట్‌వర్కింగ్ అంటే ?
నెట్‌వర్కింగ్ అంటే.. తమ రంగంలోని వారితో పరిచయాలు పెంచుకోవడం.. వ్యక్తిగతంగా సంబంధాలు కొనసాగించడం. ఈ పరిచయాలు ప్రొఫెషనల్‌గా ఎదగడానికి దోహదపడతాయి. ఈ పరిచయస్తులు ఎవరైనా కావచ్చు.. కాలేజీలో సీనియర్‌లు, స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు, గతంలో కలిసి పనిచేసిన సహోద్యోగులు, కాలేజీ పూర్వవిద్యార్థులు, ఇరుగుపొరుగు వారు.. ఇలా నెట్‌వర్క్‌లో అందరూ భాగస్వాములే! నెట్‌వర్క్ పరస్పర ప్రయోజనకారని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగ ఖాళీలు, నియామక సమాచారం మాత్రమే కాకుండా... ఓ కంపెనీలో ఉద్యోగావకాశం లభించినప్పుడు అక్కడి పని వాతావరణం, విధానాలు తెలుసుకునేందుకు కూడా సదరు సంస్థలోని వారితో సంభాషించాల్సి ఉంటుంది. అంటే.. కెరీర్‌కు సంబంధించిన ప్రతి అడుగులోనూ నెట్‌వర్క్ ఉపయోగపడుతుంది.

ప్రపంచం మెచ్చిన లింక్డ్‌ఇన్ :
నేటి డిజిటల్ యుగంలో కెరీర్ అవకాశాల పరంగా నెట్‌వర్కింగ్ అత్యంత ప్రభావశీల ఆయుధంగా మారింది. నెట్‌వర్క్ పరిధిని విస్తరించుకోవడానికి మార్గం.. సోషల్ మీడియా. టెక్నాలజీ దిగ్గజ సంస్థల బాస్‌లు మొదలు.. కంపెనీలో కొత్తగా చేరిన ఉద్యోగులు, ఉద్యోగ వేటలో ఉన్న వారందరూ ‘లింక్డ్‌ఇన్’ అనే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో అందుబాటులో ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50కోట్ల మంది ప్రొఫెషనల్స్ లింక్డ్‌ఇన్‌లో నమోదు చేసుకున్నట్లు అంచనా. అంతేకాకుండా టాప్ సంస్థలు మొదలు స్టార్టప్‌ల వరకూ.. మానవ వనరుల అన్వేషణ కోసం లింక్డ్‌ఇన్‌ను విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ సోషల్‌సైట్‌కు భారీగా చెల్లింపులు జరిపి.. దానిద్వారానే నియామకాలు చేపడుతున్నాయి. కాబట్టి కెరీర్ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి లింక్డ్‌ఇన్ ఎంతో ఉపయోగప డుతుంది. దేశ, విదేశాల్లో కొలువులు తెచ్చిపెట్టే సోషల్ సైట్‌గా లింక్డ్‌ఇన్‌ను పేర్కొంటారు. మీకున్న నైపుణ్యాలు, పని అనుభవం, అకడమిక్ నేపథ్యం, ఇప్పటివరకు పొందిన అవార్డులు.. ఇలా పూర్తి వివరాలతో కూడిన ప్రొఫైల్ అప్‌డేట్ చేస్తే చాలు ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇక్కడ జాబ్ ప్రొఫైల్‌కు అనుగుణంగా ‘సజేషన్స్’ రూపంలో ప్రొఫైల్‌కు సరిపోయే ఉద్యోగాలు నిత్యం కనిపిస్తాయి. అంతేకాకుండా మీ ప్రొఫైల్‌ను... సహోద్యోగులు, మీతో కలిసి గతంలో పనిచేసిన వారు ఎండార్స్ చేస్తే ప్రొఫైల్‌కు విశ్వసనీయత మరింత పెరుగుతుంది. కెరీర్‌పరంగా నెట్‌వర్క్ విస్తరణకు లింక్డ్‌ఇన్ ప్రముఖ వేదికగా చెప్పవచ్చు.

సోషల్ మీడియా సక్రమంగా..
నియామకాల పరంగా కంపెనీలు లింక్డ్‌ఇన్‌తోపాటు ఇతర సోషల్ మీడియాను క్రియాశీలకంగా ఉపయోగిస్తున్నాయి. ట్వీటర్, ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ ఆధారంగా కంటెంట్, తాజాగా జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ అనగానే స్నేహితులతో చాటింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. ఇందులో ఉండే ఉపయోగకరమైన గ్రూప్స్‌లో చేరొచ్చు. తద్వారా ఉద్యోగావకాశాల సమాచారం తెలుసుకోవచ్చు. తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఆయా గ్రూపుల్లో చేర్చమని కోరవచ్చు. ప్రత్యేక చొరవతో మీ గురించి పరిచయం చేసుకుంటూ.. నెట్‌వర్క్‌ను విస్తరించుకోవచ్చు. అలానే కొన్నిసంస్థలు అధికారిక పేజీలు నిర్వహించి.. జాబ్ ఓపెనింగ్స్ వివరాలను పోస్ట్ చేస్తున్నాయి.

ఈవెంట్స్, వర్క్‌షాప్స్‌కు హాజరైతే...
నెట్‌వర్క్‌ను పెంచుకునేందుకు ప్రొఫెషనల్స్ నిర్వహించే సదస్సులకు హాజరవడం కూడా ఉపయోగపడుతుంది. ఆయా రంగాల్లో నిపుణులుగా పేరొందిన వారు నిర్వహించే సదస్సులకు హాజరవడం ద్వారా.. సదరు రంగంలోని ప్రముఖులతో పరిచయాలతోపాటు వారి ఉపనాస్యాలు వినే అవకాశం లభిస్తుంది. ఇది కెరీర్‌లో ఎదగడానికి ఎంతో దోహదం చేస్తుంది. కొన్ని సంస్థలు సైతం ప్రొఫెషనల్ వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటాయి. వీటిల్లో పాల్గొనడం వల్ల సబ్జెక్టు నైపుణ్యాలతోపాటు సదరు రంగంలోని వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఫలితంగా ఉద్యోగ అవకాశాల వివరాలు తెలుసుకోవడం తేలికవుతుంది. అలాగే ప్రొఫెషనల్ క్లబ్స్ కూడా నెట్‌వర్కింగ్‌కు దోహదపడతాయి. ప్రయోజనకరమైన పరిచయాలకు కొన్ని క్లబ్స్, సొసైటీలు మార్గం వేస్తున్నాయి.

‘టచ్’లో ఉండండి..
కొత్తగా పరిచయమైన వారితో టచ్‌లో ఉండటం ముఖ్యం. దాంతోపాటు సోషల్ మీడియా ద్వారా స్నేహితులు, సీనియర్లు, తమ రంగంలోని వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. వారిని సోషల్ మీడియా ద్వారా తరుచూ పలకరించడం, ఏవైనా సందేహాలుంటే.. సలహాలు అడగటం వంటివి చేయాలి. తద్వారా మీ మీద సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. ఏమైనా అవకాశాలు వచ్చినప్పుడు వారికి ఠక్కున మీరే గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. ఇలా తమ రంగంలోని వారితో నెట్‌వర్కింగ్ కొనసాగించడం కెరీర్ పరంగా ఉపయోగపడుతుంది !!
Published date : 20 Oct 2018 04:51PM

Photo Stories