Skip to main content

మ్యాథ్స్‌తో కెరీర్...

ప్రపంచానికి లెక్కలు నేర్పిన ఘనత మనది. ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, శ్రీనివాస రామానుజన్, ఇలా మహా మేధావులెందరో గణితశాస్త్ర అభివృద్ధికి కృషి చేశారు. గణితం అంటే కేవలం ఒక సబ్జెక్టే కాదు,ఇతర విభాగాల్లోనూ దీన్ని పాత్ర కీలకం. నిర్మాణ రంగంలో ఇంజనీర్లకు, ఐటీ రంగంలో కంప్యూటర్ ప్రోగ్రామర్లకు, ఫైనాన్షియల్ రంగంలో, అకౌంట్స్, ఖగోళ శాస్త్ర వేత్తలకు... ఇలా అన్ని విభాగాల్లో మ్యాథ్స్ మిళితమై ఉంటుంది. మ్యాథ్స్‌తో కెరీర్ స్కోప్, కోర్సులు, ఉండాల్సిన స్కిల్స్ గురించి వివరాలు తెలుసుకుందాం...
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మ్యాథ్స్‌పై పట్టు సాధించడం ద్వారా జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్,ఎంసెట్, క్యాట్ తదితర ప్రవేశ పరీక్షల్లో రాణిస్తున్నారు. తెలుగు విద్యార్థులేకాకుండా దేశంలోని చాలామంది విద్యార్థులు ఇంటర్, డిగ్రీ స్థారుులో మ్యాథ్స్ ఒక సబ్జెక్టు ఉండేలా చూసుకుంటారు. చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్(సీఎంఐ),ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, ఐఐఎస్సీ వంటి ప్రముఖ విద్యా సంస్థలు మ్యాథమెటిక్స్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిల్లో డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

బోధన వృత్తి :
మ్యాథ్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన వారు సబ్జెక్టుపై పట్టు ద్వారా.. బోధన, పరిశోధన, సాఫ్ట్‌వేర్, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు.. ఇలా వివిధ మార్గాలో ఉపాధి అవకాశాలు పొందొచ్చు. దేశంలో ఐఐటీ జేఈఈ మెయిన్, అడ్వాన్‌‌సడ్ లాంటి ప్రవేశ పరీక్షలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ పరీక్షలో మ్యాథ్స్‌దే అగ్రభాగం. ఇందులో సాధించే మార్కులే ర్యాంకు సాధించడంలో కీలకం. ఈ పరీక్షకు బోధించాలంటే మ్యాథ్స్‌పై గట్టిపట్టు ఉండాలి. గణిత సమస్యలకు వేగంగా సమాధానాలు గుర్తించడం, విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేగలిగితే జేఈఈ, ఎంసెట్ కోచింగ్ సంస్థల్లో అవకాశాలు పొందొచ్చు. ఐఐటీ ఎంట్రెన్స్ ప్రవేశ పరీక్షకు కోచింగ్ హడావుడి అంతాఇంతా కాదు. ఇంటర్‌లో రూ.లక్షలు చెల్లించి కార్పొరేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. అక్కడ మ్యాథ్స్ టీచర్లే ప్రధానం కాబట్టి వీరికి మంచి డిమాండ్ ఉంది. ఇంజనీరింగ్‌లోనూ మ్యాథ్స్ సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుంది. పీజీ, పీహెచ్‌డీ చేసిన వారికి ఇంజనీరింగ్ కళాశాలలు అవకాశాలు కల్పిస్తున్నాయి.

ఇతర ప్రవేశ పరీక్షలకూ...
ఐఐటీ, ఎంసెట్, ఇంజనీరింగ్ విభాగాల్లోనే కాదు.. జీఆర్‌ఈ, శాట్, క్యాట్, జీమ్యాట్, ఇతర పీజీ ప్రవేశ పరీక్షలు; ఐసెట్, ఎస్‌ఎస్‌సీ వంటి పోటీ పరీక్షలకు మ్యాథ్స్ నిపుణుల అవసరం ఉంటుంది. ఆయా కోర్సులు ఆఫర్ చేసే ఇన్‌స్టిట్యూట్లల్లో బోధించడం, సొంతంగా కోచింగ్ సెంటర్ ప్రారంభించడం లేదా ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పడం వంటి ఉపాధి వేదికలకు కొదవలేదు. ముఖ్యంగా ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకు పీవో, క్లర్క్, స్పెషలిస్టు ఆఫీసర్, రైల్వే ఉద్యోగాలు మొదలైన వాటికి మ్యాథ్స్ సంబంధిత క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ తప్పనిసరిగా ఉంటుంది. చక్కటి కమ్యూ నికేషన్ స్కిల్స్, సబ్జెక్టుపై పట్టుంటే.. ఈ రంగంలో పేరు సంపాదించుకోవడంతోపాటు మంచి వేతనాలు లభిస్తాయి.

ప్రభుత్వ ఉద్యోగాలు :
ప్రభుత్వ విద్యాసంస్థల్లో జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి పోస్టుల భర్తీకి పీజీ/ పీహెచ్‌డీ అర్హతగా నిర్ణయిస్తారు. యూజీసీ నెట్ పరీక్షల్లో అర్హత సాధిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగా లకు పోటీ పడవచ్చు. ఒకవేళ ఇందులో టాప్‌లో నిలిస్తే జేఆర్‌ఎఫ్ కూడా లభిస్తుంది. దీంతో నెలకు దాదాపు రూ.34వేలు అందుకోవచ్చు. దీంతోపాటు పీహెచ్‌డీ పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. మ్యాథ్స్‌లో డిగ్రీ పూర్తి చేసి బీఈడీ చేసిన వారు ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్టులకు పోటీపడవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైతే మంచి వేతనాలతో పాటు సుస్థిరమైన కెరీర్ ఏర్పరచుకోవచ్చు. మ్యాథ్స్ అభ్యర్థులు ఈవిధంగా బోధనరంగంలో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

డేటా సైన్స్ :
సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవం డేటాసైన్స్. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలదే అనే అంచనా. వీటన్నింటికి గణితం నిపుణుల అవసరం ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్, సంబంధించిన సబ్జెక్టులో పీజీ చేస్తే డేటా సైంటిస్టులుగా రాణించవచ్చు. డేటా సైంటిస్టులకు మంచి వేతనాలు, ఉన్నతమైన కెరీర్ లభిస్తుంది. ప్రోగ్రామ్‌కు లాజిక్ రాయాలంటే మ్యాథ్స్‌పై అవగాహన ఉంటేనే సులువవుతుంది. మ్యాథ్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ చదివిన వారిని సాఫ్ట్‌వేర్ సంస్థలు నియమించుకుంటున్నాయి. వీరు సాఫ్ట్‌వేర్ రంగంలో బిజినెస్ అనలిస్టుగా, ఆపరేషన్‌‌స రీసెర్చ్ ఎనలిస్ట్, కంప్యూటర్ సిస్టం ఎనలిస్ట్ తదితర హోదాలతో రాణించవచ్చు.

పీజీలో స్పెషలైజేషన్లు :
కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఐటీ వంటి డిమాండ్ ఉన్న కోర్సుల్లో చేరడానికి మ్యాథ్స్ నేపథ్యం తప్పనిసరి. అంటే.. మ్యాథ్స్‌ను కేవలం ఒక సబ్జెక్టులా కాకుండా.. దాన్ని ఆధారంగా కెరీర్‌ను తీర్చిదిద్దుకోవడానికి ఉన్న అవకాశాలను వెతుక్కోవాలి. మ్యాథ్స్‌ను డిగ్రీలో ఒక సబ్జెక్టుగా చదివినా, లేక ఆనర్స్‌గా కోర్సు పూర్తి చేసినా చాలా అవకాశాలు లభిస్తాయి. పీజీ స్థారుులో కొన్ని సంస్థల్లో గణితంలోనూ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నారుు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని యూనివర్సిటీల క్యాంపస్ కళాశాలల్లో మ్యాథ్స్ యూజీ, పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆయా యూనివర్సిటీల అనుబంధ కళాశాలల్లోనూ మ్యాథ్స్ కోర్సు నిర్వహిస్తున్నారు.

కొన్ని ముఖ్యమైన ఇన్‌స్టిట్యూట్స్ :
  1. చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్, చెన్నై
    వెబ్‌సైట్:
    https://www.cmi.ac.in/admissions
  2. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్, చెన్నై
    వెబ్‌సైట్:
    https://www.imsc.res.in
  3. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
    వెబ్‌సైట్:
    https://www.math.iisc.ac.in
  4. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
    వెబ్‌సైట్:
    https://www.uohyd.ac.in
  5. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
    వెబ్‌సైట్:
    https://www.tifr.res.in
  6. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (కలకత్తా,చెన్నై, న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూర్, తేజ్‌పూర్, గిరిధ్)
    వెబ్‌సైట్:
    https://www.isical.ac.in
  7. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్), భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణే, తిరువనంతపురం
    వెబ్‌సైట్:
    www.iiserb.ac.in
  8. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, భువనేశ్వర్‌ఠి
    వెబ్‌సైట్:https://sms.niser.ac.in
  9. హరీశ్ - చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, అలహాబాద్,
    వెబ్‌సైట్:
    https://www.hri.res.in
  10. ఐఐటీ ఢిల్లీ, గాంధీనగర్, హైదరాబాద్, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ, రోపార్.
గమనిక: వీటిల్లో ప్రవేశాలు జామ్ ద్వారా జరుగుతాయి.
Published date : 30 Jan 2018 11:53AM

Photo Stories