Skip to main content

ముందస్తు అవగాహనతో సాగితే.. అక‌డ‌మిక్ మంచి ఫ‌లితాలు సాధించొచ్చు..

ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ విషయంలో విద్యార్థులు ఏదైనా ఒక సెషన్‌కు సన్నద్ధమయ్యే ముందు.. లెర్నింగ్‌ పరంగా నిర్దిష్ట అవగాహనతో ముందుకెళ్లాలి.
అంటే.. ఏ సెషన్‌కు హాజరవుతున్నాం..ఆ సెషన్‌లో చెప్పే పాఠం ఏమిటి.. ఏ టాపిక్‌ నేర్చుకోనున్నాం?! వంటి అంశాలపై ముందస్తు అవగాహన ఉండాలి. దీనివల్ల ముఖ్యమైన అంశాలు, అకడమిక్‌గా ప్రయోజనాలపై స్పష్టత లభిస్తుంది. అదేవిధంగా సదరు టాపిక్‌ లేదా సెషన్‌ పూర్తయ్యాక.. నేర్చుకున్న అంశాలను మరోసారి అవలోకనం చేసుకోవాలి.

నోట్స్‌తో మేలు..
ఆన్‌లైన్‌ బోధన ఫలవంతమవ్వాలంటే.. పాఠం వింటున్నప్పుడే నోట్స్‌ రాసుకోవడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు. లెక్చరర్‌ సదరు క్లాస్‌లోని విద్యార్థులందరికీ కలిపి ఒక ఉమ్మడి వేదిక ద్వారా అందుబాటులోకి వచ్చి పాఠాలు చెబుతుంటారు. ఆ సమయంలో ముఖ్యమైన అంశాలను వివరిస్తారు. వాటిని విద్యార్థులు అప్పటికప్పుడు నోట్స్‌లో రాసుకోవాలి. ఫలితంగా ఆన్‌లైన్‌ బోధన ముగిశాక.. సదరు సెషన్‌లో చెప్పిన పాఠాన్ని నోట్స్‌ ద్వారా స్వీయ అభ్యసనం చేసేందుకు వీలవుతుంది.

ప్రాక్టికల్‌ వీడియోలు..
ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ను సమర్థంగా ఉపయోగించుకునేందుకు మరోమార్గం.. ప్రాక్టికల్‌ వీడియోలను వీక్షించడం. టాపిక్‌లో ఉండే అంశానికి సంబంధించి దాన్ని వాస్తవ పరిస్థితుల్లో విశ్లేషించే వీడియోలను చూడాలి. దీనివల్ల ఆ టాపిక్‌కు సంబంధించి మరింత అవగాహన ఏర్పడుతుంది. ఉదాహరణకు.. ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌ను తీసుకుంటే.. అందులో కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్‌ వంటి అంశాలకు సంబంధించి ప్రాక్టికల్‌గా అన్వయించే వీడియోలను చూడాలి. ఈ ప్రాక్టికల్‌ వీడియోల ద్వారా సదరు అంశాన్ని అవగాహన చేసుకోవడం ప్రధానంగా సైన్స్‌ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులు తాము క్లిష్టంగా భావించే అంశాలను కూడా ఈ ప్రాక్టికల్‌ వీడియోల వీక్షణ ద్వారా సులువుగా అవగాహన చేసుకోవచ్చు.

ఇంకా చ‌ద‌వండి: part 3: స్వీయ మూల్యాంకనం చేసుకుంటేనే.. స‌మ‌ర్థ‌వంతంగా నేర్చుకోవ‌చ్చు..
Published date : 24 May 2021 07:43PM

Photo Stories