Skip to main content

మధురమైన కెరీర్కు.. వైన్ ఎక్స్పర్ట్!

సురాపానం.. మనదేశంలో దీని ప్రసక్తి పురాణాల కాలం నుంచే ఉంది. ఆధునిక కాలంలో లిక్కర్ ప్రాముఖ్యత ఎనలేనిది. ఇది ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులనే ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది. పరిశ్రమలో మద్యం తయారీ నుంచి అది వినియోగదారుడికి చేరేవరకు వివిధ దశల్లో సేవలందించేవారే.. వైన్ ఎక్స్పర్ట్స్. ప్రపంచవ్యాప్తంగా రూ.లక్షల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలతో లిక్కర్ రంగం వేగంగా విస్తరిస్తోంది. దీంతో వైన్ నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. మిగిలిన రంగాలతో పోలిస్తే ఇందులో భారీ వేతనాలు అందుతుండడం విశేషం. యువత దీన్ని కెరీర్గా ఎంచుకుంటే భవిష్యత్తు బంగారుమయమవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

దేశంలో నిపుణుల కొరత
వైన్ ఎక్స్పర్ట్స్కు మద్యం తయారీ కంపెనీలతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ అండ్ బేవరేజ్ సంస్థలు, మద్యం ఎగుమతి దిగుమతి సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. తగిన అసక్తి, వనరులు ఉంటే సొంతంగా వైన్ కన్సల్టెంట్గా కెరీర్ను ప్రారంభించొచ్చు. వైనరీలు, బార్లు, రెస్టారెంట్లకు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. మద్యం వ్యాపారంలోకి కూడా ప్రవేశించొచ్చు. ప్రస్తుతం భారత్లో వైన్ నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. డిమాండ్కు సరిపడా నిపుణులు లేరని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రముఖ హోటళ్లలో అతిథుల అభిరుచికి, సందర్భానికి, వడ్డిస్తున్న ఆహారానికి తగిన మధువును అందించడం వైన్ నిపుణుల విధి. వైన్ జాబితాను రూపొందించాలి. మద్యం కంపెనీల్లో ముడి సరకు నాణ్యతను పరిశీలించి, లిక్కర్ తయారీని పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తయారైన మద్యాన్ని రుచి చూసి, సంతృప్తి చెందిన తర్వాతే విపణిలోకి విడుదల చేయాలి.

కావాల్సిన నైపుణ్యాలు
మద్యం నిపుణులు తరచుగా వైన్యార్డ్ యజమానాలు, చెఫ్లు, డిస్ట్రిబ్యూటర్లు, కస్టమర్లతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. కాబట్టి మెరుగైన ఇంటర్పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. వివిధ రకాల మద్యంపై పరిజ్ఞానం పెంచు కోవాలి. ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. కనీసం ఒక విదేశీ భాషపై అవగాహన ఉండడం మంచిది. ఫ్రాన్స్, ఇటలీలో వైన్ ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. ఫ్రెంచీ లేదా ఇటాలియన్లో పట్టు సాధిస్తే కెరీర్ పరంగా త్వరగా ఎదగడానికి వీలుంటుంది. వైన్ కన్సల్టెంట్గా పనిచేసేవారికి నాయకత్వ లక్షణాలు ఉండాలి.

అర్హతలు
మనదేశంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో భాగంగా వైన్ సర్వీస్, వైన్ టేస్టింగ్పై శిక్షణ ఇస్తున్నారు. కొన్ని లిక్కర్ సంస్థలు కూడా దీనిపై ట్రైనింగ్ను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరొచ్చు. విదేశాల్లో అయితే ఈ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా సర్టిఫికేషన్ కోర్సులు ఉన్నాయి.

వేతనాలు
వైన్ నిపుణులకు అధిక వేతనాలుంటాయి. జూనియర్ వైన్ ఎక్స్పర్ట్ కెరీర్ ప్రారంభంలోనే నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు అందుకోవచ్చు. సీనియర్కు నెలకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వేతనం లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనం ఇంకా పెరుగుతుంది. వైన్ కన్సల్టెంట్గా సొంతంగా పనిచేసుకుంటే డిమాండ్ను బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. లక్షలాది రూపాయలు ఆర్జించే కన్సల్టెంట్లు ఎందరో ఉన్నారు.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
ఇండియన్ వైన్ అకాడమీ
వెబ్సైట్: www.indianwineacademy.com

వైన్ అకాడమీ ఆఫ్ ఇండియా
వెబ్సైట్: www.wineacademyofindia.com

ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైన్ అండ్ బేవరేజ్ స్టడీస్
వెబ్సైట్: https://iwbs.in/

వైన్ అండ్ స్పిరిట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్

వెబ్సైట్: www.wsetglobal.com/

వైన్ స్పెక్టేటర్ స్కూల్
వెబ్సైట్: www.winespectator.com

ఇంటర్నేషనల్ వైన్ గిల్డ్-యూఎస్ఏ
వెబ్సైట్: www.internationalwineguild.com

ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ వైన్
వెబ్సైట్: www.mastersofwine.org
Published date : 07 Sep 2014 04:36PM

Photo Stories