Skip to main content

మాంద్యంలోనూ కొలువుల జాత‌ర‌లో ముందుంటున్న రంగాలు ఇవిగో..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం ప్రైవేట్‌ రంగంలో కొలువులపై తీవ్రంగానే పడింది. లాక్‌డౌన్‌తో మొదలైన కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. నేటికీ అనేక రంగాల్లో నియామకాల జాడ లేదు. ఉన్న ఉపాధి కోల్పోయి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు ఆశించిన ప్రాజెక్టులు రాకపోవడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు కొలువుల్లో కోత వేసే పరిస్థితి. ఇలాంటి మాంద్యం పరిస్థితుల్లోనూ కొన్ని విభాగాల్లో కొలువులు మెరుస్తున్నాయి.. అవేంటో తెలుసుకుందామా..!!

సైబర్‌ సెక్యూరిటీ:
ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్నాయి. వ్యక్తుల నుంచి మొదలు పెద్దపెద్ద సంస్థల వరకూ.. ఎంతో విలువైన సమాచారం తస్కరణకు గురవుతోంది. ఇలాంటి సైబర్‌ మోసాలు మరింతగా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో సంస్థలు ప్రత్యేకంగా సైబర్‌ సెక్యూరిటీ టీమ్స్‌ను నియమించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దాంతో ఇప్పుడు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్‌ నెలకొంది. ఇప్పటికే ఇంజనీరింగ్‌ పూర్తి చేసినవారు ‘సైబర్‌ సెక్యూరిటీ’ కోర్సులు నేర్చుకుంటే.. ఉద్యోగ అవకాశాలు దక్కించుకునే అవకాశం ఉంటుంది. సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు నెట్‌వర్క్, కంప్యూటర్ల డేటా తస్కరణకు గురికాకుండా కాపాడుతుంటారు. సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో రాబోయే సైబర్‌ ప్రమాదాలను గుర్తించడం, దాడులను నివారించడం, అత్యవసర పరిస్థితులకు వెంటనే స్పందించడం, లోపాలను సవరించడం వంటివి నేర్పుతాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సైతం చాలా రకాల సైబర్‌ సెక్యూరిటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా కోర్సులు ఉచితంగానూ, స్వల్ప మొత్తం చెల్లించి నేర్చుకోవచ్చు. ఎథికల్‌ హ్యాకింగ్‌, నెట్‌వర్క్‌ అండ్‌ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ ఫోరెన్సిక్‌, ఐటీ సర్టిఫికేషన్, బిజినెస్‌ సెక్యూరిటీ తదితర కోర్సులను కోర్సెరా, ఉడెమీ వంటి వాటి ద్వారానూ మూక్స్‌ విధానంలో నేర్చుకోవచ్చు. డిగ్రీ, బీఎస్సీ/బీటెక్‌/బీఈ వంటి అర్హతలతో సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో చేరొచ్చు.

రిస్క్‌ అనాలసిస్‌..
ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా.. ఏ స్థాయిలో ప్రారంభించినా.. ప్రతి ఒక్కరూ మొదట ఆలోచించేది ‘రిస్క్‌’ గురించే! ఎవరైనా సరే నష్ట భయం లేకుండా సంస్థను నడపాలనుకుంటారు. అందుకు రిస్క్‌ అనలిస్ట్‌ల సేవలు అవసరం. రిస్క్‌ అనాలిసిస్‌ నిపుణులు కీలకమైన వ్యాపార కార్యకలాపాలు లేదా ప్రాజెక్టుల్లో ఉన్న సమస్యలను గుర్తించడంతోపాటు వాటిని ఎలా అధిగమించాలో విశ్లేషిస్తారు. ఒకవేళ అప్పటికే వ్యాపారంలో ఏదైనా రిస్క్‌ ఉన్నట్టయితే.. దానిని తక్కువ నష్టంతో ఎలా అధిగమించాలో సూచిస్తారు. ముఖ్యంగా రిస్క్‌ అనాలిసిస్‌ అనేది బిజినెస్‌లో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి సహాయపడుతుంది.

రిస్క్‌ అనాలసిస్‌– ముఖ్య ఉపయోగాలు:

  • ఏదైనా బిజినెస్‌ ప్రాజెక్టుకు ప్లాన్‌ చేస్తున్న క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఊహించి, వాటిని ప్రారంభంలోనే నిరోధించేందుకు ఉపయోగపడుతుంది.
  • కొత్త ప్రాజెక్ట్‌తో ముందుకు వెళ్లాలా వద్దా అని నిర్ణయించాలనుకున్నప్పుడు రిస్క్‌ అనాలసిస్‌ అవసరం ఉంటుంది.
  • మార్కెట్‌లోకి వచ్చే కొత్త పోటీదారులు లేదా ప్రభుత్వ విధానాల్లో మార్పులతో సంస్థపై వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది, రాబోయో విపత్తులను ఎలా అధిగమించాలో రిస్క్‌ అనాలసిస్‌ చెబుతుంది.
  • కంపెనీలో మార్పులు, చేర్పులు చేసేముందు, సాంకేతిక వైఫల్యం, సిబ్బందిని తగ్గించాల్సి వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది.

అర్హతలు..
వాస్తవానికి రిస్క్‌ అనాలసిస్‌ నిపుణులుగా రాణించాలంటే.. కనీసం డిగ్రీ అవసరం. అందులోనూ కామర్స్, ఫైనాన్స్‌, మ్యాథమెటిక్స్‌ లేదా ఎకనామిక్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ వంటివి పూర్తి చేసినవారు ఎంట్రీ లెవల్‌ రిస్క్‌ అనలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించవచ్చు. ఈ రంగంలో నిపుణులకు డిమాండ్‌ పెరుగుతున్న దృష్ట్యా కొత్త కోర్సులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. బీబీఏ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి డిగ్రీ స్థాయి కోర్సులతోపాటు స్వల్ప కాలిక సర్టిఫికెట్‌ కోర్సులు, డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఎడెక్స్, ఉడెమీ, కోర్సెరా వంటి ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ ద్వారా ఆయా స్వల్పకాలిక కోర్సుల్లో చేరి రిస్క్‌ అనాలసిస్‌పై అవగాహన పెంచుకోవచ్చు.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌..
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) కార్యకలాపాల్లో నేడు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కీలకంగా మారింది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంటే.. ఇంటర్నెట్‌ లేదా ఇతర రిమోట్‌ సర్వర్ల ద్వారా సాఫ్ట్‌వేర్‌ లేదా హార్డ్‌వేర్‌ సేవలు పొందడం. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా ఐటీ సేవలను సులభతరం చేయవచ్చు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా ప్రపంచంలోని ఏమూలన ఉన్న డేటానైనా, సమాచారాన్నైనా, అప్లికేషన్‌ అయినా పొందొచ్చు. ఈ విధానంలో ఆయా సాఫ్ట్‌వేర్‌/హార్డ్‌వేర్‌ సేవలు పొందేందుకు అవసరమైన వ్యయం గణనీయంగా తగ్గుతుంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో ప్రపంచంలో ఇండియా వాటా ప్రస్తుతం 22 శాతంగా ఉంది. సమీప భవిష్యత్తులో ఇది రెండింతలు అయ్యే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విభాగంలో అవకాశాలు దక్కించుకోవాలనుకుంటే.. ఇందులో ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. అందుకోసం ప్రత్యేక కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరాలకు అనుగుణంగా చాలామంది డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులతో కెరీర్‌ ప్రారంభిస్తున్నారు. అర్హతలను బట్టి ఈ రంగంలో క్లౌడ్‌ ఆర్కిటెక్ట్, క్లౌడ్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్, క్లౌడ్‌ డెవలపర్‌ లేదా క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజర్‌గా కెరీర్‌ ప్రారంభించవచ్చు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ నైపుణ్యాలు నేర్చుకోవాలంటే.. అభ్యర్థులకు ప్రా«థమికంగా ప్రోగ్రామింగ్‌ గురించి తెలియాలి. బీటెక్‌/బీఈ(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌), బీసీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు పూర్తి చేసినవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.

Published date : 01 Sep 2020 02:43PM

Photo Stories