లాజిస్టిక్స్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ రంగాల్లో కొలువుల జాతర...
Sakshi Education
- షావోమీ సంస్థ గత నెలలోమన దేశంలో ఒకే రోజు రికార్డు స్థాయిలో 500 రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించింది..
- స్విగ్గీ, జొమోటోల్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే నిమిషాల్లో వేడివేడి మీల్స్ మన ముంగిటకే వచ్చేస్తోంది..
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ప్రొడక్ట్‌ను ఆన్‌లైన్‌లో కొంటే.. మీ చేతికందే సమయాన్ని సైతం ముందే చెబుతుండటం విశేషం..
ఈ-కామర్స్, రిటైల్ రంగమే కారణమా?
- లాజిస్టిక్స్, సప్లయ్‌చైన్ మేనేజ్‌మెంట్ విభాగం భారీ సంఖ్యలో కొలువులకు మార్గం వేస్తోంది.ఇటీవల కాలంలో లాజిస్టిక్స్, సప్లయ్‌చైన్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఉద్యోగాలకు ఈ-కామర్స్, రిటైల్ రంగాల విస్తరణే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కామర్స్, రిటైల్.. రంగం రోజురోజుకూ విస్తరిస్తోంది. అమెజాన్ వంటి పెద్ద పెద్ద బహుళజాతి సంస్థల నుంచి టెక్నాలజీ ఆధారిత ఫుడ్ డెలివరీ స్టార్ట్‌అప్స్ వరకూ... ఐకియా వంటి భారీ కంపెనీల నుంచి స్థానిక సూపర్ మార్కెట్‌ల దాకా... ఈ కామర్స్, రిటైల్ రంగాలు దూసుకుపోతున్నాయి.
- మరోవైపు వినియోగదారుల కొనుగోలు దృక్పథంలోనూ మార్పులు వస్తున్నాయి. నేటి బిజీ బిజీ జీవితంలో సమయాభావం, నేరుగా షాప్‌లకు వెళ్లే తీరిక లేని వాళ్లు.. ఆన్‌లైన్ పోర్టల్స్‌లోనే తమకు కావల్సినవన్నీ ఆర్డర్ చేస్తున్నారు. ఈ కామర్స్ కంపెనీల పుణ్యామాని అవి క్షణాల్లో నేరుగా గుమ్మం ముందుకే వస్తున్నాయి. అందుకే గత రెండేళ్లుగా ఆన్‌లైన్ కొనుగోళ్ల ధోరణి వేగంగా పెరుగుతోంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం-ఆయా వస్తువుల కొనుగోలు పరంగా ఈ-కామర్స్ సంస్థల వాటా దాదాపు 40 శాతం మేరకు ఉండటమే ఇందుకు నిదర్శనం. మరోవైపు ఆఫ్‌లైన్ విధానంలో రిటైల్ ఔట్‌లెట్స్ సైతం నిర్ణీత మొత్తంలో కొనుగోలు చేస్తే హోమ్ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. లాజిస్టిక్స్, సప్లయ్‌చైన్ మేనేజ్‌మెంట్ ద్వారా ఈ-కామర్స్, రిటైల్ రంగ కంపెనీలు వినియోగదారులకు చేరువవుతున్నాయి.
డ్రైవర్, డెలివరీ బాయ్ నుంచి...
- ఈ-కామర్స్, రిటైల్ సంస్థలు వినియోగదారులకు మరింత వేగంగా ‘చేరువ’ కావాలని ప్రణాళికలు రచిస్తుండటంతో లాజిస్టిక్స్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పుట్టుకొచ్చేందుకు వీలుకలుగుతోంది. దిగువ స్థాయిలో ప్రొడక్ట్ ప్యాకింగ్, డ్రైవర్, డెలివరీ బాయ్ మొదలు.. అత్యున్నత స్థాయిలో ప్రొక్యూర్‌మెంట్ ఆఫీసర్స్, సప్లయ్ చైన్ అనలిస్ట్స్, ఆపరేషన్స్ మేనేజర్, అనలిస్ట్ వరకు పలు రకాల ఉద్యోగాలు లభిస్తున్నాయి. అర్హతలు, జాబ్ ప్రొఫైల్ ఆధారంగా నెలకు రూ. 8వేల నుంచి రూ.లక్ష వరకు కూడా వేతనం లభిస్తోంది.
- వాస్తవానికి ఒక ఉత్పత్తిని తయారు చేయడం ఎంత ముఖ్యమో.. దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తికి సరైన సమయంలో చేర్చడం అంతకంటే ప్రధానం. అప్పుడే సంస్థపై నమ్మకం, భవిష్యత్తులో సదరు వినియోగదారుడు ఏదైనా వస్తువు కొనాలంటే.. తమ సంస్థవైపే మొగ్గు చూపుతాడు. అందుకే లాజిస్టిక్స్, సప్లయ్ చైన్ విభాగాలను ఆయా సంస్థలు అత్యంత పటిష్టంగా రూపొందిస్తున్నాయి. ఎక్కడా తేడా రాకుండా.. అనుకున్న సమయానికే ఆర్డర్ చేసిన వినియోగదారుడికి వస్తువు చేరేలా వ్యవస్థను సిద్ధం చేస్తున్నాయి. ఫలితంగా ఈ విభాగాల్లోలక్షల సంఖ్యలో కొలువులు పలకరిస్తున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్, సంప్రదాయ డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు, ప్రత్యేక కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు.. ఇలా ఆయా అర్హతలకు తగినట్లు ఉద్యోగాలు సొంతం చేసుకునే అవకాశం లాజిస్టిక్స్, సప్లయ్‌చైన్ మేనేజ్‌మెంట్ రంగంలో ఉంది.
లాజిస్టిక్స్ :
- వనరులు, వస్తువులు, సమాచారం, సేవలను... వాటి ఉత్పత్తి స్థానం నుంచి అవసరమైన వినియోగదారుడికి అందించే ప్రక్రియ నిర్వహణనే లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వస్తువులు తయారైన చోటు నుంచి అంతిమంగా కస్టమర్స్‌కు చేరవేయడమే లాజిస్టిక్స్. ఇందులో వస్తువులను నిల్వచేయడం (వేర్‌హౌసింగ్), రవాణా (ట్రాన్స్‌పోర్టేషన్), అందజేయడం(డెలివరీ) వంటి ప్రక్రియలు ఎంతో కీలకమైనవి.
- లాజిస్టిక్స్‌లో ఇన్‌బౌండ్ లాజిస్టిక్స్, అవుట్‌బౌండ్ లాజిస్టిక్స్ అని రెండు రకాలు. ఉదాహరణకు ఒక కారు తయారీ కంపెనీ... కొత్త కారును తయారుచేయడం కోసం ఇంజన్, టైర్లు, గేర్ సిస్టమ్, బాడీ పార్ట్స్ వంటి విడి భాగాలను ఆయా పరికరాల తయారీదారుల నుంచి కొనుగోలు చేస్తుంది. వీటిని కారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్లాంట్‌కు రవాణా(ట్రాన్స్‌పోర్టేషన్) చేసి.. అక్కడ నిల్వ(వేర్‌హౌసింగ్) ఉంచి.. విడిభాగాలన్నింటిని అమర్చి(అసెంబ్లింగ్) కారు తయారు చేసే ప్రక్రియనే ఇన్‌బౌండ్ లాజిస్టిక్స్ అంటారు. ఇలాతయారైన కారును కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్‌కు తరలించడం.. అక్కడి నుంచి అమ్మకాలు జరిపే డీలర్ షాప్‌కు రవాణ చేయడం.. అక్కడి నుంచి కారు కొన్న అంతిమ వినియోగదారునికి చేరవేయడాన్ని.. అవుట్‌బౌండ్ లాజిస్టిక్స్ అని పేర్కొంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియ జరగాలంటే... వివిధ స్థాయిలో ప్యాకింగ్ సిబ్బంది నుంచి డైవర్స్, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, వేర్‌హౌస్ మేనేజర్, ఇన్వెంటరీ మేనేజర్ వరకూ.. సంబంధిత నైపుణ్యాలున్న మానవ వనరుల సేవలు తప్పనిసరి.
లాజిస్టిక్స్‌లో కొలువలు..!
ప్యాకింగ్ పర్సన్స్:
ఒక ప్రొడక్ట్‌ను ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేసేసమయంలో ఎలాంటి డ్యామేజ్ జరగకుండాచూడాలి. దాంతోపాటు వినియోగదారులను ఆకట్టుకునేలా అందంగా, ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేయడం ప్యాకింగ్ పర్సన్స్ విధి. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి అర్హతతోనే ఈ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. సగటు నెల వేతనం రూ.8వేలు నుంచి రూ.పది వేలుగా ఉంటోంది.
ట్రక్/వెహికిల్ డ్రైవర్స్:
ఆయా ప్రొడక్ట్‌లను కస్టమర్స్‌కు చేరవేసేందుకు అవసరమైన వాహనాలకు డ్రైవర్స్ అవసరం ఉంటుంది. పదో తరగతి అర్హతతోపాటు హెవీ మోటార్ డ్రైవింగ్ లెసైన్స్ చేతిలో ఉంటే చాలు.. ఈ డ్రైవర్ ఉద్యోగం ఖాయం. వీరికి కూడా సగటున రూ. పది వేల వేతనం లభిస్తోంది.
డెలివరీ ఎగ్జిక్యూటివ్స్:
ఒకప్పుడు డెలివరీ బాయ్స్‌గా పిలిచే సిబ్బందినే సంస్థలు ఇప్పుడు డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌గా పేర్కొంటున్నాయి. సదరు ప్రొడక్ట్‌ను నిర్దిష్ట సమయంలోగా వినియోగదారుడి ‘చేతికి’ అందించి.. ఆ సంగతిని తక్షణమే సంస్థకు తెలియజేయడం డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ప్రధాన బాధ్యత. ఇటీవల కాలంలో సంస్థలు వీరికి బ్లూటూత్ డివైజ్‌లను కూడా అందిస్తున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ అర్హత ఉండి.. కాసింత సాంకేతిక పరిజ్ఞానం.. అంటే మొబైల్ ఆపరేషన్స్‌లో నైపుణ్యం ఉంటే చాలు ఈ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. వీరికి కనీసం రూ.15వేల నుంచి రూ.20వేల వరకూ అందుతోంది.
వేర్‌హౌస్ మేనేజర్:
ఈ-కామర్స్, రిటైల్ సంస్థలు భారీఎత్తున వేర్‌హౌస్(గోడౌన్స్)ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అన్ని రకాల వస్తువులు ఈ వేర్‌హౌస్‌లలోనే భద్రపరుస్తున్నారు. సదరు వేర్‌హౌస్‌లో ఏ సెగ్మెంట్‌లో ఏ వస్తువులు ఎక్కడ భద్రపరచాలి? ప్రొడక్ట్‌లను బయటికి పంపే విషయంలో ముందుగా వేటిని పంపాలో ప్రణాళిక రూపొందించుకోవడం వంటి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అదే విధంగా వేర్‌హౌస్‌లో పని చేసే సిబ్బందిని పర్యవేక్షించడం కూడా వేర్‌హౌస్ మేనేజర్ల బాధ్యతే! ఈ ఉద్యోగాలను బ్యాచిలర్ డిగ్రీతో అందుకోవచ్చు. వీరు ప్రారంభంలో రూ.20వేలకు పైగా వేతనం పొందే వీలుంది. అనుభవం, నైపుణ్యం, అంకితభావంతో మరింత ఎక్కువగానే సంపాదించే వీలుంది.
ఇన్వెంటరీ మేనేజర్/ఎగ్జిక్యూటివ్:
వేర్‌హౌస్‌కు వస్తున్న వస్తువులు, డెలివరీకి వెళ్తున్న వస్తువులకు సంబంధించిన వివరాలను నమోదు చేసే ఉద్యోగులే.. ఇన్వెంటరీ మేనేజర్‌లు/ఎగ్జిక్యూటివ్స్. ఏదైనా డిగ్రీ అర్హతతో ఇన్వెంటరీ మేనేజర్ కొలువు సొంతం చేసుకోవచ్చు. వీరు ప్రారంభ ంలో రూ.20వేల వరకూ అందుకునే వీలుంది.
- లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ విభాగంలో పైన పేర్కొన్న పలు రకాల కొలువులతోపాటు ఆయా సంస్థలు అవసరాన్ని బట్టి లాజిస్టిక్స్ కోఆర్డినేటర్, వేర్‌హౌస్ సూపర్‌వైజర్, బుక్ కీపింగ్ అసిస్టెంట్స్, స్టోర్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి.
సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ :
ఒక ప్రొడక్ట్ తయారీకి అవసరమైన ముడిసరుకును సేకరించడం... వస్తువును తయారు చేయడం.. తయారైన ప్రొడక్ట్‌ను అంతిమ వినియోగదారుకు చేరవేయడం వరకూ.. జరిగే వివిధ ప్రక్రియల నిర్వహణే సప్లయ్‌చైన్ మేనేజ్‌మెంట్. సరైన వస్తువును సరైన సమయంలో సరైన ప్రదేశంలో సరైన ధరకు వినియోగదారుడికి అందించే నిర్వహణ విభాగాన్నే సప్లయ్‌చైన్ మేనేజ్‌మెంట్ అంటున్నారు. సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ విభాగంలోని నిపుణులు.. సప్లయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రిటైలర్స్, లాజిస్టిక్స్, కన్స్యూమర్స్... ఇలా విభిన్న విభాగాల మధ్య సమన్వయం సాధించే కీలకమైన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఓ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ... ఒక స్మార్ట్‌ఫోన్‌ను ఫలాన తేదీన మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చిందంటే... కచ్చితంగా ఆ రోజున సదరు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో, సేల్స్ కౌంటర్‌ల వద్ద వినియోగదారుడికి అందుబాటులో ఉంచేలా తెరవెనుక అన్ని ప్రక్రియలను నిర్వహించే విభాగమే సప్లయ్‌చైన్ మేనేజ్‌మెంట్. ఒకవేళ ముందే ప్రకటించినట్లు నిర్దేశిత రోజున సదరు స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తేలేకపోతే ఏమవుతుంది?! ఆ ప్రొడక్ట్‌పై వినియోగదారుడికి ఆసక్తి తగ్గిపోయి.. డిమాండ్ పడిపోయి.. పెద్ద ఫెయిల్యూర్‌లా మిగిలిపోయి కంపెనీకి భారీ నష్టాలు మూటకట్టే ఆస్కారముంటుంది!! కాబట్టి ఏ వ్యాపార సంస్థకైనా సప్లయ్‌చైన్ మేనేజ్‌మెంట్ అనేది వెన్నుముక వంటిదని చెప్పొచ్చు. ఎంతో కీలకమైన ఈ విభాగంలో సంబంధిత నైపుణ్యాలుంటేనే రాణించే వీలుంటుంది. అందుకే అకడమిక్‌గా ప్రత్యేకంగా ప్రొఫెషనల్ అర్హతలున్న అభ్యర్థులకు ఆయా సంస్థల్లో ప్రాధాన్యం లభిస్తోంది. విధులకు తగ్గట్టే వీరికి లభించే వేతనాలు కూడా ఆకర్షణీయమని చెప్పొచ్చు.
సప్లయ్ చైన్ డిజైన్ అండ్ ప్లానింగ్ ఆఫీసర్స్:
సంస్థకు చెందిన ఒక వస్తువు వేర్‌హౌస్ నుంచి రిటైల్ ఔట్‌లెట్ లేదా, వినియోగదారుడికి చేరే వరకూ... పలు స్థాయిల్లో అనుసరించాల్సిన విధానాలు, ప్రణాళికలు రూపొందించడం సప్లయ్ చైన్ డిజైన్ అండ్ ప్లానింగ్ ఆఫీసర్స్ ముఖ్యమైన విధి. వీరు రూపొందించే ప్రణాళిక ఆధారంగానే ఆయా ప్రొడక్ట్‌లకు సంబంధించిన ప్యాకింగ్, డెలివరీ తదితర అంశాలు ఆధారపడి ఉంటాయి. వాస్తవానికి సప్లయ్ చైన్ విభాగంలో ఇది కీలకమైన బాధ్యత అని చెప్పొచ్చు. అందుకే ఈ ఉద్యోగాలకు సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌లో స్పెషలైజ్డ్ డిగ్రీ, డిప్లొమా అర్హతలున్న వారిని కంపెనీలు నియమించుకుంటున్నాయి. వేతనాలు కూడా సగటున రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అందుకునే వీలుంది.
ప్రొక్యూర్‌మెంట్ మేనేజర్స్:
తమ సంస్థ లక్షిత వినియోగదారులు, వారికి అవసరమైన వస్తువులను గుర్తించడం, ఆ తర్వాత అవి తమ సంస్థకు అందేలా.. ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరపడం ప్రొక్యూర్‌మెంట్ మేనేజర్స్ ప్రధానమైన విధి. వీరికి కూడా వేతనాలు సగటున రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు లభిస్తున్నాయి.
డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మేనేజర్స్:
ఒక వస్తువును వినియోగదారులకు వీలైనంత త్వరగా అందించడంఈ-కామర్స్, ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలకు అత్యంత కీలకం. కాబట్టి సదరు ఈ కామర్స్ సంస్థలు అన్ని ప్రాంతాల్లోని డిస్ట్రిబ్యూటర్స్‌తోనూ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తమ సంస్థకు వచ్చిన ఆర్డర్/ప్రొడక్ట్ వివరాలను సదరు డిస్ట్రిబ్యూటర్‌కు తెలియజేయడం, ఆ తర్వాత ఆ ప్రొడక్ట్‌ను సమీపంలోని తమ వేర్‌హౌస్‌కు రప్పించేలా చేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మేనేజర్స్‌ను నియమిస్తున్నాయి. వీరు చేయాల్సిందల్లా పర్యవేక్షణ, నిరంతరం డిస్ట్రిబ్యూటర్స్‌తో సంప్రదింపులు సాగించడం. వీరికి కూడా నైపుణ్యాలను అనుసరించి వేతనాలు రూ.30 వేల నుంచి 40వేల వరకూ అందే వీలుంది.
సప్లయ్ చైన్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్స్:
అప్పటికే సప్లయ్ చైన్ డిజైన్ ఆఫీసర్స్ రూపొందించిన ప్రణాళికను ఆధారంగా ఎలాంటి ప్రొడక్ట్ తయరీ, సరఫరా పరంగా ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ సాగించాల్సిన ఉద్యోగం ఇది. వీరికి ప్రారంభంలో రూ.20 వేలకు పైగానే అందుతోంది. ఇవే కాకుండా.. ఈ విభాగంలో ఇన్వెంటరీ మేనేజర్స్, పర్చేజింగ్ ఎగ్జిక్యూటివ్స్ వంటి పలు ఉద్యోగాలు అందుబాటులో ఉంటున్నాయి.
అకడమిక్‌గా అడుగులు ఇలా..:
ప్రస్తుతం లాజిస్టిక్స్, సప్లయ్ చైన్ విభాగాల్లోని ఉద్యోగాలు, అందుకు సంబంధించిన క్షేత్ర స్థాయి నైపుణ్యాలు అందించేందుకు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పలు ఇన్‌స్టిట్యూట్‌లు సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ విభాగాలకు సంబంధించి స్పెషలైజ్డ్ కోర్సులను అందిస్తున్నాయి.
కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు వివరాలు:
- ఐఐఎం-కోల్‌కతా
కోర్సు: అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్ ఇన్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్
- యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ స్టడీస్
కోర్సు : ఎంబీఏ (లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్)
- ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ
కోర్సు - బీబీఏ (లాజిస్టిక్స్, రిటైలింగ్ అండ్ ఈ-కామర్స్)
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్, డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ అండ్ లాజిస్టిక్స్
- నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్
- మణిపాల్ యూనివర్సిటీ
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్, ఎంకాం (లాజిస్టిక్స్ స్పెషలైజేషన్)
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్
కోర్సు: డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్
లాజిస్టిక్స్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ కెరీర్ ముఖ్యాంశాలు..
- పలు స్టాఫింగ్ సంస్థల అంచనా ప్రకారం రానున్న నాలుగేళ్లలో లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో విభాగాల వారీగా లభించనున్న కొత్త ఉద్యోగాల వివరాలు.
- 2022 నాటికి ప్యాకింగ్ సిబ్బంది నుంచి ప్రొక్యూర్‌మెంట్ అనలిస్ట్‌ల వరకు దాదాపు మూడు మిలియన్ల ఉద్యోగాలు.
- ట్రాన్స్‌పోర్టేషన్ విభాగంలో దాదాపు ఎనిమిది లక్షల ఉద్యోగాలు.
- వేర్‌హౌసింగ్‌లో 1.2 లక్షల కొలువులు
- ప్యాకేజింగ్‌లో 40 వేల ఉద్యోగాలు
- కొరియర్ సర్వీస్‌లో 60 వేల జాబ్స్
- సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌లో తొంభై వేల ఉద్యోగాలు
- ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్న ఈ-కామర్స్, రిటైల్, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, ఆటోమోటివ్ సెక్టార్స్.
Published date : 04 Dec 2018 03:03PM