క్యాంపస్ టు కంపెనీ...
కాలేజీ జీవితమెప్పుడూ రంగులమయమే.. ఒక్కసారిగా దాన్నుంచి బయటకొచ్చి కార్పొరేట్ కంపెనీలో అడుగుపెట్టాలంటే కొంచెం కంగారే! కెరీర్ పరంగా కీలక మైలురాయి అయిన తొలి కొలువును కెరీర్‌కు మేలి మలుపుగా ఎలా మలచుకోవాలి?ఆ దిశగాఅనుసరించాల్సిన వ్యూహాలేంటి? తదితరాలపై ప్రత్యేక కథనం...
ఆనందాలు, ఆవేశాలు, అలకలు, చిట్‌చాట్‌లు, షికార్లతో కాలేజీ జీవితం ఇట్టే గడిచిపోతుంది. ఇదంతా ఒక ఎత్తయితే చాలామంది కోర్సులో చేరిన తొలి రోజునుంచే క్యాంపస్ కొలువును చేజిక్కించుకునేందుకు కృషి చేస్తుంటారు. లక్ష్యానికి అనుగుణంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఆఫర్ అందుకున్న అభ్యర్థులు.. కార్పొరేట్ ఇన్నింగ్స్ ప్రారంభించాల్సిన సమయం రానే వచ్చింది.
ప్రొఫెషనలిజమ్ :
క్యాంపస్ డ్రైవ్‌లో ఆఫర్ లెటర్ ఇచ్చే కంపెనీలు.. అపాయింట్‌మెంట్ లెటర్, జాయినింగ్ రిపోర్ట్ తేదీని కొద్ది రోజుల తర్వాత అందిస్తాయి. విద్యార్థులు అపాయింట్‌మెంట్ లెటర్ అందుకున్న క్షణం నుంచిప్రొఫెషనల్‌గా వ్యవహరించాలి. విద్యార్థులమనే భావన వీడి.. కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులమని గుర్తెరగాలి. ఈ భావన ఎంత బలంగా ఉంటే.. కొలువులో చేరిన తర్వాత మీ పనితీరు అంతే ప్రొఫెషనలిజంగా ఉంటుంది.
తొలి అడుగు :
అపాయింట్‌మెంట్ లెటర్ అందుకున్నవారు మానవ వనరుల (హెచ్‌ఆర్)విభాగంలో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. హెచ్‌ఆర్ విభాగం.. అభ్యర్థికి సంబంధిత టీమ్ లీడర్‌ని పరిచయం చేస్తుంది. ఈ సందర్భంగా అభ్యర్థులు హుందాగా వ్యవహరించాలి. అప్పటివరకు కాలేజీలో ఎంతో ఉత్సాహంగా ఉన్నవారు సైతం కంపెనీలో అడుగుపెట్టగానే కొత్త వాతావరణాన్ని చూసి ఒక్కసారిగా బిగుసుకుపోతారు. ప్రశాంతత, ఆత్మవిశ్వాసంతో వేసే తొలి అడుగు.. భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. కెరీర్‌లో అత్యున్నత శిఖరాలకు చేరేందుకు మార్గమవుతుంది.
బృంద స్ఫూర్తి :
ఉద్యోగిగా కంపెనీలో అడుగుపెట్టిన వారుటీమ్ లీడర్, ఇతర సభ్యులతో వీలైనంత త్వరగా కలసిపోవాలి. దీనికి ఇంటరాక్టివ్ స్కిల్స్ ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల్లోని చొరవను పరీక్షించడంలో భాగంగా.. మిమ్మల్ని టీమ్ లీడర్.. ఇతర సభ్యులకు పరిచయం చేయకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మీరే స్వయంగా వారిని పరిచయం చేసుకోవాలి. చిన్నపాటి చిరునవ్వుతో తోటి ఉద్యోగులను పలకరించడం; మీ పేరు చెప్పడం; వారి పేర్లను తెలుసుకోవడం వంటివి చేయాలి. తద్వారా మీలోని బృందస్ఫూర్తి వెలుగులోకి వస్తుంది.
విధులు, పనితీరు..
ఉద్యోగంలో చేరిన తర్వాత ఒకట్రెండు రోజుల పాటు టీమ్‌కు కేటాయించిన టాస్క్, బృందం పనితీరు, పని వాతావరణం, ఎవరు ఎలాంటి విధులు నిర్వర్తిస్తున్నారు తదితర అంశాలను నిశితంగా పరిశీలించాలి. తద్వారా పనివాతావరణంపై అవగాహన ఏర్పడుతుంది. ప్రస్తుతం ఒక్కో సంస్థలో ఒక్కో విధమైన పని విధానం ఉంది. ఇది కొన్ని సందర్భాల్లో అకడెమిక్స్‌కు భిన్నంగా ఉండొచ్చు. ఇలాంటి సందర్భంలో సహోద్యోగులతో పోల్చుకుని ఆందోళన చెందకూడదు. తెలియని విషయాల గురించి చొరవతో సీనియర్లను అడగాలి. ఇప్పుడు చాలా సంస్థలు కొత్త వారికి తమ అవసరాలకు అనుగుణంగా శిక్షణనిస్తున్నాయి. దీన్ని సాధ్యమైనంత మేర సద్వినియోగం చేసుకోవాలి.
చొరవతోనే విలువ :
బృంద పనితీరుపై అవగాహన ఏర్పడిన వెంటనే పూర్తిస్థాయి విధుల్లో నిమగ్నమవ్వాలి. విధి నిర్వహణ పరంగా చొరవ చూపడం లాభిస్తుంది. ప్రధానంగా విధుల కోణంలో ఆలోచించడం అలవరచుకోవాలి. కొత్త అభ్యర్థుల విషయంలో ఎదురయ్యే మరో సమస్య.. అసైన్‌మెంట్లు. కొన్ని సంస్థల్లో టీం లీడర్లు ఒకేసారి నాలుగైదు అసైన్‌మెంట్లు ఇస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆందోళన చెందకుండా టీమ్ లీడర్‌ను సంప్రదించి.. ప్రాధాన్య క్రమంలో అసైన్‌మెంట్లను పూర్తిచేయాలి. పనివేళలకు పరిమితమవుదామనే వైఖరి ప్రతికూల ప్రభావం చూపుతుంది.
పనితీరు.. మెరిసేలా!
కొత్తగా కొలువులో చేరిన వారు టాస్క్‌ను పూర్తిచేసే క్రమంలో తమదైన పనితీరును ప్రదర్శించాలి. ఎందుకంటే.. కంపెనీలెప్పుడూ నూతన ఉద్యోగి వ్యవహార శైలి, పనితీరులను గమనిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా వారం లేదా నెలవారీగా సంబంధిత టీం లీడర్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాయి. దాని ఆధారంగా కొత్త ఉద్యోగిపై ఒక అభిప్రాయానికి వస్తాయి. ఇది కెరీర్‌కు కీలకంగా మారుతుంది. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కమ్యూనికేషన్ స్కిల్స్‌కు పదునుపెట్టుకోవడం ఎంతైనా అవసరం.
బహుముఖ విధానం :
తొలిసారి ఉద్యోగంలో అడుగుపెట్టిన వారు విధుల పరంగా బహుముఖ విధానాన్ని అలవరచుకోవాలి. కేవలం తమకు కేటాయించిన విభాగానికే పరిమితం కాకుండా.. అనుబంధ విభాగాలనూ సమన్వయం చేసుకోవాలి. తద్వారా మెరుగైన ఫలితాలు సాధించొచ్చు. ఈ విధమైన పనితీరుతో సంస్థలోని అన్ని విభాగాలపై అవగాహన వస్తుంది. ఇది భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరేందుకు ఉపకరిస్తుంది.
స్థితప్రజ్ఞత :
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అభ్యర్థులు కొలువులో చేరిన తొలినాళ్ల నుంచే అలవర్చుకోవాల్సిన లక్షణం.. స్థితప్రజ్ఞత. అంటే.. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడం. దీనివల్ల ఇతరుల మనస్తత్వాలను అర్థం చేసుకునే నైపుణ్యం లభిస్తుంది. దీంతోపాటు నిరంతరం నేర్చుకోవడంఅలవాటు చేసుకోవాలి.
తొలిరోజు నుంచే ఉన్నతంగా..
‘క్యాంపస్’ నుంచి కొలువులోకి అడుగుపెట్టిన తర్వాత ఈ కింది లక్షణాలను పెంపొందించుకోవడం ద్వారా కెరీర్‌లో ఎదగొచ్చు.
అవి..
1. ఎదుటివారిని మెప్పించే తత్వం.
2. హుందాగా వ్యవహరించడం.
3. బృంద స్ఫూర్తిని అలవర్చుకోవడం.
4. డ్రెస్‌కోడ్ పాటించడం.
5. ఉద్వేగ ప్రజ్ఞ.
6. ఎలాంటి పని సంస్కృతిలోనైనా ఇమిడిపోగలగడం.
7. నిర్దిష్ట గడువులోగా అసైన్‌మెంట్ పూర్తిచేయడం.
8. సీనియర్ల పనితీరును గమనించడం.
9. తెలియని విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస.