Skip to main content

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధించాలంటే...

సంవత్సరాల చదువుకు సార్థకత చేకూరే సందర్భం..జీవితాన్ని మలుపు తిప్పే అవకాశాలు వరించే సమయం.. విద్యార్థి నుంచి ఉద్యోగిగా మారే తరుణం.. కళాశాలల్లో ప్రాంగణ ఎంపికల సందడి నెలకొనే వేళ.. త్వరలో ప్రారంభం కానున్నక్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఇంజనీరింగ్, ఎంబీఏ తదితర కోర్సుల ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఎంతో కీలకమైనవి. ఈ ప్లేస్‌మెంట్ ప్రక్రియ ఎలా ఉంటుంది? దీనికి ప్రిపరేషన్ ఎలా సాగించాలి..? ప్లేస్‌మెంట్స్ ఇంటర్వ్యూల్లో
ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు..?విద్యార్థులు ఎలా వ్యవహరించాలి...?తదితర విషయాల గురించి తెలుసుకుందాం..

1. సంక్షిప్త రెజ్యూమె
రెజ్యూమె.. అద్దం వంటిది. అది ఇంటర్వ్యూయర్ ముందు మిమ్మల్ని ప్రజెంట్ చేస్తుంది. కాబట్టి.. ఇందులో అకడమిక్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పరంగా మీ ప్రత్యేకతలను హైలైట్ చేయాలి. ప్రారంభంలో క్లుప్తంగా ఇంట్రో రాయాలి. రెజ్యూమె ఎంత సంక్షిప్తంగా ఉంటే అంత మంచిది. సాధారణంగా ఒకటి లేదా రెండు పేజీలకు మించకూడదు. ఎందుకంటే ఇంటర్వ్యూయర్ మొదటి మూడు నిమిషాలు మీరు రాసిన అంశాలపైనే ప్రశ్నలడుగుతారు. ఈ కొద్ది సమయంలోనే ఇంటర్వ్యూ ప్యానల్ మీ గురించి ఒక అంచనాకు వస్తుంది. తర్వాతి 30 నిమిషాలు వారి అంచనాను సమర్థించుకునేలా ప్రక్రియ సాగుతుంది. సంబంధిత ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు మీలో ఉన్నాయని తెలిపేలా రెజ్యూమె ఉండాలి. ఆ ఉద్యోగం చేసేందుకు మీరు సమర్థులు అనే విషయం దాని ద్వారా స్పష్టం చేయాలి.

2. సంస్థ గురించి
ప్లేస్‌మెంట్స్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు ముందుగా ఇంటర్వ్యూలకు వస్తున్న కంపెనీలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ సంస్థలకు సంబంధించిన సమాచారం సేకరించుకోవాలి. కళాశాలలోని ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్లను సంప్రదిస్తే వివరాలు అందిస్తారు. కంపెనీ నేపథ్యం, ఉత్పత్తు లు, భవిష్యత్తు ప్రణాళిక వంటివాటిని అవగతం చేసుకోవడం ద్వారా ఇంటర్వ్యూయర్ ఎలాంటి ప్రశ్నలడిగే అవకాశముందో అంచనాకు రావచ్చు.

3. ఈ పొరపాట్లు వద్దు
కంగారు కంగారుగా ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లడం.. చేతులు నలుపుకోవడం.. పైకి కిందకు దిక్కులు చూడటం.. పెదవులు, గోర్లు కొరుక్కోవడం.. పెన్ను తిప్పడం.. టేబుల్‌పై శబ్దాలు చేయడం.. చూయింగ్ గమ్ నమలడం.. అతి విశ్వాసం ప్రదర్శించడం.. అబద్ధాలు ఆడటం వంటివి ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇంటర్వ్యూయర్ ముందు కూర్చుకున్నప్పుడు వినయంగా ఉండటం, హుందాగా మసలుకోవడం, నిజాయతీ ఉట్టిపడేలా మాట్లాడటం మేలు చేస్తుంది. మొత్తంగా ఇంటర్వ్యూ ఆసాంతం పరిణతి చెందిన వ్యక్తిలా కనిపించేందుకు ప్రయత్నం చేయాలి. ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడే పదాలు అభ్యర్థి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంటాయి. కాబట్టి భాష హుందాగా, సరళంగా ఉండేట్లు ముందే సాధన చేయాలి.

4. బాడీ లాంగ్వేజ్
ఇంటర్వ్యూలో 50 శాతం మార్కులు సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పరీక్షించినందుకు ఇస్తే.. మిగతా 50 శాతం పాత్ర బాడీ లాంగ్వేజ్‌ది. ఉల్లాసంగా, ప్రశాంతంగా ఉంటే సగం విజయం సాధించినట్టే! చిరునవ్వు, చూసే విధానం, కూర్చునే తీరు, కరచాలనం.. అభ్యర్థి వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటం చేస్తాయి. ఎంపికలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. వీటితోపాటు సందర్భానికి తగ్గట్టు చిరునవ్వు చిందించాలి. ప్యానల్‌లో అందరివైపు మర్యాదగా చూస్తూ మాట్లాడాలి. ప్రశ్నలడుగుతున్న సమయంలో కిందకు పైకి చూడటం సరికాదు. శరీర కదలికలు ముఖ్యంగా చేతి కదలికలు కనీస స్థాయిలో ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. కుర్చీలో ముందుకు వెనుకకు కాకుండా.. నిటారుగా కూర్చుకోవాలి. చేతులు కట్టుకుని ఉండటం ప్రతికూల భావన కలిగిస్తుంది. ఇంటర్వ్యూయర్ కరచాలనం ఇస్తే.. మరీ గట్టిగా నొక్కినట్లు కాకుండా ప్రతిస్పందించాలి.

5. వేషధారణ, ఆసక్తి
పరిజ్ఞానంతో పాటు మనం కనిపించే తీరు కూడా ముఖ్యం. ఉద్యోగం ఇస్తే అంకితభావంతో పనిచేస్తారనే అభిప్రాయం కలగాలి. అందుకని ఇంటర్వ్యూ సమయంలో మీ వేషధారణ ప్రొఫెషనలిజాన్ని చాటేలా ఉండాలి. ఫార్మల్ దుస్తులు ధరించాలి. షూస్ వేసుకోవడం మంచిదే అయినా సూట్, టై తప్పనిసరి కాదని గుర్తించండి. దుస్తులతో పాటు క్లీన్‌గా, స్మార్ట్‌గా, అలర్ట్‌గా కనిపిస్తే.. ఉద్యోగం పట్ల ఆసక్తి ఉందనే విషయం తెలిసిపోతుంది. సంస్థలో దీర్ఘకాలం కొనసాగే ఉద్దేశం ఉన్నట్లు మాట్లాడాలి. ఒకటి రెండేళ్ల తర్వాత ఉన్నత విద్యకు, విదేశాల్లో ఉద్యోగానికి వెళ్తానని మాత్రం చెప్పకూడదు. తన ఎంపిక విన్-విన్ అంటే.. అటు అభ్యర్థి, ఇటు సంస్థకు ఇద్దరికీ ప్రయోజనకరమేననే అభిప్రాయం బలంగా కలిగించాలి.

6. డొమైన్ పై పట్టు.. సరళత్వం
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో.. విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఒక్కోసారి లోతైన ప్రశ్నలు అడుగుతారు. అందుకని డొమైన్‌పై పట్టు తప్పనిసరి. మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు కోర్ సబ్జెక్టుల బేసిక్స్ అన్నీ నేర్చుకోవాలి. అంతేకాక.. నిరంతరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామనే దృక్పథాన్ని ప్రదర్శించాలి. తరగతి గది అంశాలను ఉద్యోగంలో ఆచరణాత్మకంగా ఎలా అన్వయించగలరో చెప్పగలగాలి. సమాధానాలు, వ్యవహారశైలి ద్వారా.. వాస్తవిక దృక్పథం, నేర్చుకోవాలనే తపన, ఓపెన్ మైండ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నట్లు తెలియజెప్పాలి. ఏదైనా అంశంపై మీ అభిప్రాయం సరికాదని ఇంటర్వ్యూయర్ పేర్కొంటే.. వారి వాదన తప్పని నిరూపించే ప్రయత్నం చేయకూడదు. మరోసారి పరిశీలన చేసుకుంటానని సున్నితంగా వివరించండి. మొండి పట్టుదల, వెంటవెంటనే అభిప్రాయాలు మార్చుకోవడమూ తగదు. చెప్పాలనుకున్న అంశం చెప్పి.. ఇంటర్వ్యూ మళ్లీ మళ్లీ అదే అంశంపై సాగుతుంటే.. ‘ఐ మే రాంగ్’, ‘ఐ విల్ చెక్’ అంటూ స్పందించండి. మన ఉద్దేశం ఇంటర్వ్యూయర్ అభిప్రాయం తప్పని నిరూపించడం కాదు. మొండితనానికి, ఆత్మవిశ్వాసానికి మధ్య తేడాను గమనించండి. ఇంటర్వ్యూలో హాస్యం పండించే ప్రయత్నం చేయకపోవడమే మంచిది.

7. ఒత్తిడి అధిగమించి..
చాలామంది అభ్యర్థులు ఇంటర్వ్యూ ముందు తీవ్ర ఒత్తిడికి లోనై ఆందోళన చెందుతుంటారు. ఒకస్థాయి వరకూ ఇది మంచిదే అయినా అదే పనిగా ఒత్తిడికి లోనైతే నేర్చుకున్న విషయాలు కూడా చెప్పనిలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి అతి ఆందోళన అనవసరం. ఇంటర్వ్యూని చావోరేవో తీరుగానూ భావించకూడదు. ఎంపిక కాకపోతే పరువు పోతుందని కాకుండా.. ఇది పోతే ఇంకోటి అనే ధీమాతో ఒత్తిడిని జయించాలి. ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించే ముందు దీర్ఘ శ్వాస, గుండెల నిండా గాలి పీల్చి వదలడం వంటి పద్ధతుల ద్వారా సాంత్వన పొందొచ్చు.

8. బలహీనతలు
మన బలాల గురించి ఎంతైనా చెప్పొచ్చు. బలహీనతల గురించి మాత్రం అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది బలహీనతలనగానే కంగారు పడిపోతారు. అయితే సమయస్ఫూర్తితో.. సంస్థకు బలంగా మారే వాటినే మీ బలహీనతలుగా చెప్పే ప్రయత్నం చేయండి. ఇంటర్వ్యూ చేస్తున్న సంస్థ, వాళ్ల ఉత్పత్తులు, ఉద్యోగ ప్రొఫైల్‌ను దృష్టిలో పెట్టుకుని సందర్భానికి తగ్గట్లు మాట్లాడండి.

9. ముగింపు ఇలా..
ప్రారంభం ఎంత ముఖ్యమో.. ముగింపూ అంతే ప్రధానం. ఇది ఇంటర్వ్యూయర్ మీ అభ్యర్థిత్వానికి సంబంధించి నిర్ణయాత్మక అభిప్రాయానికి వచ్చే సందర్భం. ఇంటర్వ్యూ ఎలా జరిగినా ఇంటర్వ్యూయర్‌తో పాటు ప్యానల్‌కు ధన్యవాదాలు చెప్పడం మర్చిపోకండి. అందరివైపు ఓ ఆత్మీయ చూపు చూడటం మేలు చేస్తుంది. ఇలా.. ముందస్తు సాధన ద్వారా 30 నిమిషాల ఇంటర్వ్యూలో విజేతగా నిలిచి.. కెరీర్‌ను మలుచుకోవచ్చు.
Published date : 10 Oct 2017 05:37PM

Photo Stories