Skip to main content

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌కు ఇలా సిద్ధం కండి!

ప్రొఫెషనల్‌ కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులకు తమ కెరీర్‌ కలలను సాకారం చేసుకునే సమయం ఆసన్నమైంది! కోర్సులో చేరిన నాటి నుంచే.. ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూసే.. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌కు రంగం సిద్ధమైంది! ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఐఐఎంలు మొదలు.. స్థానిక కళాశాలల వరకు.. క్యాంపస్‌ డ్రైవ్స్‌కు కసరత్తు ప్రారంభమైంది! త్వరలో దేశవ్యాప్తంగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధించేందుకు సూచనలు..

ఉజ్వల కెరీర్‌ మార్గంలో తొలి అడుగు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌! అందుకే ఐఐటీలు, ఐఐఎంల నుంచి స్థానిక ఇంజనీరింగ్, ఎంబీఏ కళాశాలల వరకు.. ప్రతి విద్యార్థి లక్ష్యం.. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌లో విజయం సాధించడం. కంపెనీలు ఆచితూచి నియామకాలు జరుపుతున్న ప్రస్తుత పరిస్థితిలో ప్లేస్‌మెంట్స్‌లో గెలుపు సాధించాలంటే.. వినూత్నంగా, విభిన్నంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేవలం జీపీఏలు.. ప్రాజెక్ట్‌ వర్క్స్‌.. రాతపరీక్షల ఆధారంగానే ఆఫర్లు ఖరారు చేసే కాలం పోయింది. ఇప్పుడు కోర్‌ నైపుణ్యాలతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలపై పట్టున్న వారికే కంపెనీలు పట్టం కడుతున్నాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ రంగం)లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందనేది నిపుణుల అభిప్రాయం.

సరళమైన రెజ్యూమె :
క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థుల మెరిట్‌ జాబితా (షార్ట్‌లిస్ట్‌) సిద్ధం చేసేందుకు కంపెనీలు ఉపయోగించే మొదటి సాధనం.. రెజ్యూమె. అందువల్ల గతంలో మాదిరి మూడు, నాలుగు పేజీల రెజ్యూమె తయారీకి స్వస్తి పలికి.. దాన్ని ఒకట్రెండు పేజీలకు పరిమితం చేయాలి. ప్రధానంగా రెజ్యూమెలో అకడమిక్, సంబంధిత నైపుణ్యాల సమాచారాన్ని పొందుపరచాలి. అప్‌డేట్‌ చేసిన వ్యక్తిగత సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్స్‌ను ఇస్తే.. రిక్రూటర్స్‌ వాటి ఆధారంగా అభ్యర్థి గురించి పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు వీలుంటుంది. అకడమిక్, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్, సోషల్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా అభ్యర్థి నిజమైన ఆసక్తిని అంచనా వేసేందుకు అవకాశముంటుంది. ఒక విద్యార్థిSసోషల్‌ నెట్‌వర్క్‌లో తన కోర్‌ రంగానికి సంబంధించిన నిపుణులు, ప్రొఫెసర్స్‌ ఎక్కువగా ఉంటే.. సదరు విద్యార్థి కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాడనే భావన రిక్రూటర్స్‌లో కనిపిస్తోంది.

ఇంటర్వూ్యకు సన్నద్ధమయ్యేందుకు...
రెజ్యూమెను షార్ట్‌లిస్ట్‌ చేసిన తర్వాత కంపెనీలు ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తున్నాయి. మొదట టెలిఫోనిక్‌ లేదా స్కైప్‌ ఇంటర్వూ్యలు నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులకు ముందుగానే తెలియజేస్తున్నాయి. దీనికి అనుగుణంగా అభ్యర్థులు తమకు నిర్దేశించిన సమయంలో ఈ ఇంటర్వూ్యల్లో రాణించేందుకు సిద్ధమవాలి. ఆన్‌లైన్‌ ఇంటర్వూ్య అయినప్పటికీ.. అటెన్షన్‌ పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి.

టెక్నికల్‌ రౌండ్‌ :
వాస్తవానికి కంపెనీలు కనీసం మూడు రౌండ్లలో ఇంటర్వూ్యలు నిర్వహించి అభ్యర్థుల నైపుణ్యాన్ని మూల్యాంకనం చేస్తున్నాయి. స్కైప్‌/ టెలిఫోనిక్‌/ పర్సనల్‌ ఇంటర్వూ్యలో.. టెక్నికల్‌ రౌండ్‌ పేరుతో ప్రశ్నలు సంధిస్తున్నాయి. వీటిలో అభ్యర్థుల డొమైన్‌ నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు.. అన్నింటిపైనా ప్రశ్నలు అడిగే అవకాశముంది. కాబట్టి ప్రస్తుతం విస్తృత ప్రచారం పొందుతున్న ఆటోమేషన్, ఐఓటీ తదితర అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి. దీనిద్వారా ఈ రౌండ్‌లో విజయం సాధించి మలి దశకు అర్హత పొందొచ్చు. కొన్ని కంపెనీలు.. రెండో రౌండ్‌ ఇంటర్వూ్యను సైతం టెక్నికల్‌ రౌండ్‌గా పేర్కొంటున్నాయి. ఈ దశలో అభ్యర్థుల్లోని ప్రాక్టికల్‌ నైపుణ్యాలను పరీక్షించేలా రియల్‌ టైం టాస్క్‌ను ఇస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల విషయంలో ఇలాంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి అభ్యర్థులకు బేసిక్‌ స్కిల్స్‌ అయిన కోడింగ్, ప్రోగ్రామింగ్‌లపై పట్టుసాధించడం తప్పనిసరి.

హెచ్‌ఆర్‌ రౌండ్‌ :
క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో తుది దశ హెచ్‌ఆర్‌ ఇంటర్వూ్య. టెక్నికల్, సబ్జెక్ట్‌ నైపుణ్యాల ఆధారంగా మెరిట్‌ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు హెచ్‌ఆర్‌ రౌండ్‌ ఉంటుంది. ఇందులో అభ్యర్థి వ్యక్తిత్వం, ఆప్టిట్యూడ్, ఆటిట్యూడ్‌లను పరిశీలిస్తారు. అభ్యర్థులు బాడీ లాంగ్వేజ్‌ పరంగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దుస్తులు హుందాగా ఉండేలా చూసుకోవాలి. మాట్లాడే తీరు, హావ భావాల వ్యక్తీకరణ సహజంగా ఉండాలి. హెచ్‌ఆర్‌ రౌండ్‌లో విజయం దిశగా అభ్యర్థులకు భవిష్యత్‌ లక్ష్యంపై స్పష్టత అవసరం. ‘మీ లక్ష్యం ఏమిటి.. ఆ లక్ష్య సాధనకు మా సంస్థలో ఉద్యోగం ఎలా ఉపయోగపడుతుంది?’ అనే ప్రశ్న సర్వ సాధారణంగా ఎదురవుతోంది. ఇలాంటి ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వగలగాలి.

ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌...
అభ్యర్థుల ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ను కంపెనీలు నిశితంగా గమనిస్తున్నాయి. దీనిద్వారా అభ్యర్థుల నాయకత్వ లక్షణాలు, సాఫ్ట్‌ స్కిల్స్, పీపుల్‌ స్కిల్స్, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ పరంగా సమర్థతను అంచనా వేస్తున్నాయి. ఇటీవల ముంబైలో ఓ ప్రముఖ సంస్థ ఫుట్‌బాల్‌ కాంపిటీషన్‌ నిర్వహించి.. అందులో ప్రతిభ చూపిన వారికి తదుపరి రౌండ్‌ ఇంటర్వూ్యలు నిర్వహించడాన్ని దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. దీనికి కారణం.. అభ్యర్థుల్లోని ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ను, పోటీతత్వాన్ని బేరీజు వేయడమే. వీటితోపాటు పలు కంపెనీలు అభ్యర్థులకు హ్యాకథాన్‌లు నిర్వహిస్తున్నాయి.

విజయానికి అవసరమైన నైపుణ్యాలు...
  • కోర్‌ స్కిల్స్‌
  • ఆటోమేషన్‌పై అవగాహన
  • సాఫ్ట్‌ స్కిల్స్‌
  • టీమ్‌ కల్చర్‌ స్కిల్స్‌
  • నాలెడ్జ్‌ అప్‌డేషన్‌
  • రెగ్యులర్‌ లెర్నింగ్‌ నేచర్‌
  • ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌
పటిష్ట ప్రణాళికతో..
ప్రస్తుత పరిస్థితుల్లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ఔత్సాహికులు పటిష్ట ప్రణాళికతో వ్యవహరించాలి. అధిక శాతం కంపెనీలు నియామకాల పరంగా వడపోతపై దృష్టిసారిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు తొలి రౌండ్‌ నుంచి తుది రౌండ్‌ వరకు అన్నిదశల్లోనూ విజయం సాధించాలంటే కంపెనీల తాజా రిక్రూట్‌మెంట్‌ విధానాల గురించి తెలుసుకోవాలి. దీనికోసం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ సెల్స్‌ను ఉపయోగించుకోవాలి.
– ప్రొఫెసర్‌ వి.ఉమామహేశ్వర రావు, ఓయూసీఈ.
Published date : 25 Oct 2017 05:08PM

Photo Stories