Skip to main content

క్రికెట్ ‘కామెంటేటర్’ కావాలంటే...

క్రికెట్ అభిమానులకు భారత్ పెట్టింది పేరు. భారత టీం మ్యాచ్ ఆడుతుందంటే జనాలు కాలేజీలు, ఆఫీసులు, మీటింగ్‌లన్నీ బంక్ కొట్టాల్సిందే. కోట్ల మంది టీవీకి అతుక్కుపోవడం పరిపాటే. ప్లేయర్ల ఆటతీరు పక్కన పెడితే.. ప్రేక్షకుల్లో మ్యాచ్ పట్ల అమితాసక్తిని రగిల్చేది క్రికెట్ కామెంటేటర్లే. బ్యాట్స్‌మన్ గాల్లోకి కొట్టిన బంతి బౌండరీ దాటుతుందా! లేదా ఫీల్డర్ ఒడిసిపడతాడా!! అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు ప్రేక్షకులకు వివరిస్తారు కామెంటేటర్లు. ఆటకు అదనపు హుషారు కామెంటరీ. ప్రేక్షకులను ఆటలో మరింత లీనం చేస్తుంది కామెంటరీ. ‘వాట్ ఎ షాట్’, ‘ఇన్ ది ఎయిర్’, ‘దట్స్ ఎ హ్యూజ్ ఇట్’ వంటి కామెంట్లు ప్రేక్షకులను మరింత ఉల్లాసపరిచి.. ఆటను ఆసాంతం ఆస్వాదించేలా చేస్తాయనడం సందేహం లేదు. ఆఫ్‌బీట్ కెరీర్‌గా మారుతున్న క్రికెట్ కామెంటేటర్ కెరీర్‌పై ప్రత్యేక కథనం...
రాబోయే రోజుల్లో క్రికెట్‌కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఖాయం. వివిధ లీగ్‌ల పేరిట అధికారిక టోర్నీలు, అనధికార మ్యాచ్‌లు ఇప్పుడు పరిపాటి. వీటికి తోడు ఇటీవల స్థానికంగా ప్రతిభావంతులను వెలికితీసే లోకల్ టోర్నీలు సైతం తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మొదలయ్యాయి. బీసీసీఐ, ఆల్ ఇండియా రేడియో మధ్య జరిగిన అవగాహన మేరకు రేడియోలోనూ క్రికెట్ కామెంటరీ మళ్లీ ప్రసారం కానుంది. ఇది దేశం నలుమూలల ఉన్న లక్షల మంది క్రికెట్ అభిమానులను అలరిస్తుందని చెప్పొచ్చు. క్రికెట్ కామెంటరికీ ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో ప్రతిభావంత కామెంటేటర్లకు డిమాండ్ ఏర్పడింది. ఇటీవల కాలంలో ప్రాంతీయ భాషల్లోనూ కామెంటరీ చెబుతున్నారు. రకరకాల డిజిటల్ వేదికలపై కామెంటేటర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. కామెంటేటర్ అవతారం ఎత్తాలంటే.. ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి.. కామెంటరీ కెరీర్ ఎవరికి సూట్ అవుతుంది.. అవసరమైన అర్హతలేంటి తదితరాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

స్వీయ ప్రతిభ :
క్రికెట్ కామెంటేటర్‌గా రాణిస్తున్న వారిలో అంతర్జాతీయ, జాతీయస్థాయి క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్నవారే ఎక్కువ. క్రికెట్ ఆడిన అనుభవంలేని వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలు రావడం కష్టమనే అభిప్రాయముంది. అయితే ఆటపై అవగాహనతోపాటు వ్యక్తిగత నైపుణ్యాలుంటే.. కామెంటేటర్‌గా రాణించడం పెద్ద కష్టమేమీ కాదు. హైదరాబాద్‌కు చెందిన హర్ష భోగ్లే ప్రస్తుతం అత్యంత ప్రేక్షక ఆదరణ పొందిన కామెంటేటర్. అతనికి రంజీ వరకు క్రికెట్ ఆడిన అనుభవం లేదు. అయినా క్రికెట్ సబ్జెక్టుపై రాటుదేలి, అద్భుతమైన అనలిటికల్ స్కిల్స్‌తో చక్కటి కామెంటేటర్‌గా పేరొందాడు. స్వయం కృషితో ఎదిగిన కామెంటేటర్ హర్షభోగ్లే. అతను విసిరే చలోక్తులు హాస్యం పండించడంతోపాటు ప్రేక్షకులను ఆలోచింపచేస్తాయి. కాబట్టి స్వీయ ప్రతిభ ఉన్నవారికి క్రికెట్ కామెంటరీ చక్కటి ఆఫ్‌బీట్ కెరీర్‌గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఆ కోర్సులతో మేలు :
ప్రత్యేకంగా కామెంటేటర్ సంబంధిత కోర్సులు అందుబాటులో లేవు. అయితే స్పోర్‌‌ట్స జర్నలిజం, మాక్ మీడియా కోర్సులు పూర్తిచేస్తే కామెంటేటర్‌గా రాణించడానికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలు అలవడతాయి. వీటితోపాటు యాంకరింగ్, రేడియో జాకీ లాంటి మీడియా కోర్సులు కూడా కామెంటేటర్ సంబంధిత కెరీర్ కోవకు చెందినవే. అలానే విశ్లేషణా నైపుణ్యాలు అందించే ఎంబీఏ పట్టా పొందటం వల్ల కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.

టాకెటివ్‌నెస్ :
టీవీ చూసేటప్పుడు ప్రేక్షకులు కోరుకునే వినోదం లేకపోతే వారు చానెల్ మార్చేస్తారు. క్రికెట్ గురించి కామెంటరీ చెప్పేటప్పుడు సబ్జెక్టుకు సంబంధించిన సాంకేతిక పదాలు ఉపయోగిస్తూ సగటు ప్రేక్షకుడికి అర్థమమ్యేలా మాట్లాడాలి. మ్యాచ్ డల్‌గా నడుస్తున్నప్పడు ఆడియన్స్ చానల్ మార్చకుండా ఆపడంలో కామెంటేటర్ ప్రతిభ కీలకం. ఆటలో, నిబంధనల్లో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రభావంతంగా విశ్లేషించడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు తమకంటూ ప్రత్యేకశైలిని ఏర్పరచుకొని గుర్తింపు పొందటం ముఖ్యం.

నాలెడ్జ్ :
కామెంటేటర్ కెరీర్‌కు ఏకధాటిగా మాట్లాడటం, చక్కగా విశ్లేషణ చేయడంతోపాటు క్రికెట్ నాలెడ్‌‌జ ఉండాలి. వేర్వేరు టోర్నమెంట్స్, మ్యాచ్‌లు జరుగుతుంటాయి. కాబట్టి ఆయా ఆటగాళ్ల నేపథ్యం గురించి తెలుసుకోవాలి. కీలక ఘట్టాల గణాంకాలపై అవగాహన పెంచుకోవాలి. గతంలో ఆయా ఆటగాళ్లు ఆడిన మ్యాచ్‌ల తేదీలు, వారి ప్రదర్శనను ఇట్టే చెప్పగలగాలి. అలాగే, ఉచ్ఛారణ, సంస్కృతి, వాయిస్ పిచ్‌ను సందర్భానుసారంగా పెంచడం, తగ్గించడం కూడా ముఖ్యమే. 2007లో భారత ఆటగాడు యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్‌పై 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన సందర్భంలో వినిపించినకామెంటరీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం మనందరికీ తెలిసిందే.

భాష మీద పట్టు :
భాష మీద బాగా పట్టు ఉన్నవారే కామెంటేటర్‌గా స్థిరపడగలరు. ఇంగ్లిష్ భాషపై పట్టు సాధిస్తే గ్లోబల్ వేదికగా అవకాశాలు మెరుగవుతాయి. ఇంగ్లిష్ కామెంటరీ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు చేరువకావచ్చు. మంచి కామెంటేటర్‌గా ఎదగడానికి ఇంగ్లిష్ భాషను సులభంగా, అవలీలగా మాట్లాడే స్కిల్ ఉండాలి. ఇటీవల కాలంలో తెలుగులోనూ కామెంటరీ పెరిగింది. డిజిటల్ వేదికలు, తెలుగు చానల్స్ కామెంటరీ ప్రారంభించాయి. వీటిల్లో రేడియో జాకీలుగా పనిచేసిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి.

వేతనాలు ఆకర్షణీయం :
నైపుణ్యాలున్న క్రికెట్ కామెంటేటర్ల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అయితే కామెంటేటర్ అనుభవం, నైపుణ్యాన్ని బట్టి వేతనం లభిస్తుంది. స్కిల్ ఉంటే ఆకర్షణీయ వేతనాలు అందుకునే వీలుంది. రోజు లెక్కల ప్రకారం, మ్యాచ్‌ల ఆధారంగా పే ఉంటుంది. కనిష్టంగా రూ.2 లక్షలు -రూ.3 లక్షల నుంచి జీతభత్యాలు మొదలవుతాయి. అనుభవం, గుర్తింపుతో రూ.10 లక్షలకు పైనే వార్షిక జీతభత్యాలు లభించే అవకాశం ఉంది.

మాటే మంత్రం..
కామెంటేటర్ కావాలంటే క్రికెట్ ప్రాథమిక అంశాలపై అవగాహన తప్పనిసరి. రంజీ వరకు కాకున్నా.. లీగ్ క్రికెట్, కాలేజీ లెవల్ వరకు అయినా క్రికెట్ ఆడి ఉండాలి. ఇంగ్లిష్ లేదా తెలుగు భాషపై పట్టుతోపాటు మాటకారితనం అవసరం. ఆటమీద సంపూర్ణమైన అవగాహనతోపాటు దాన్ని వ్యక్తపరిచే నైపుణ్యం ఉండాలి. అంతేకాకుండా గలగలగా, విట్టీగా మాట్లాడే వారికి కామెంటేటర్ కెరీర్ సెట్ అవుతుంది. స్టార్‌స్పోర్‌‌ట్స, సోనీ లివ్, జియో టీవీ.. డిజిటల్ హక్కులు తీసుకొని తెలుగులో మొబైల్ ద్వారా మ్యాచ్‌లు ప్రసారం చేస్తున్నాయి. అలాగే ఆల్ ఇండియా రేడియోలో సైతం తెలుగులో కామెంటరీ ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల తెలుగులోనూ అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రాంతీయ భాషల్లో వ్యాఖ్యానికి ఆదరణ పెరుగుతున్నట్లు చెబుతున్నారు. హిందీ భాష తర్వాత తెలుగు ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అలాగే, కామెంటేటర్స్‌లోనూ లీడ్ కామెంటేటర్స్, ఎక్స్‌పర్ట్ కామెంటేటర్స్ అని రెండు రకాలుగా ఉంటారు. లీడ్ కామెంటేటర్స్ మ్యాచ్ పరిచయం, అతిథుల ఇంటర్వ్యూలు వంటి పనులు చేస్తుంటారు. ఎక్స్‌పర్ట్ కామెంటేటర్స్ క్రికెట్ టర్మినాలజీపై దృష్టి పెడతారు. ఒక ఆటగాడు ఔట్ అయినప్పుడు రీప్లేలో దాన్ని టెక్నికల్‌గా వివరిస్తారు. మన దగ్గర కామెంటేటరీ కోర్సులు అందుబాటులో లేవు. కానీ స్టార్‌స్పోర్‌‌ట్స వంటి చానల్స్ సొంతంగా శిక్షణ ఇస్తున్నాయి. సెలబ్రిటీ క్రికెట్స్, లోకల్ లీగ్‌‌స వల్ల కామెంటరీ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
- సీహెచ్ వెంకటేష్, స్పోర్ట్స్ రైటర్, కామెంటేటర్.
Published date : 14 Oct 2019 02:43PM

Photo Stories