Skip to main content

కొలువుకు సోపానాలు.. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్

సూరజ్ కూడా బీటెక్ ఫైనలియర్ విద్యార్థే. ఆకాశ్‌తో పోల్చితే అకడమిక్‌గా కొంత వెనుకంజలో ఉన్నాడు. ఆకాశ్ హాజరైన సంస్థలోనే ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తక్షణమే ఆఫర్ అందుకున్నాడు. అకడమిక్‌గా మెరుగ్గా లేకపోయినా సూరజ్‌కు అవకాశం రావడానికి కారణం.. అతడు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనడమే! తమ కళాశాలలో నిర్వహించే ఎక్స్‌ట్రా కరిక్యులర్, కో -కరిక్యులర్ యాక్టివిటీస్‌ను లీడ్ చేయడమే!
ఆకాశ్.. బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థి. అన్ని సెమిస్టర్లలో అకడమిక్‌గా సీజీపీఏ 9 పైమాటే. అదే ధీమాతో క్యాంపస్ డ్రైవ్‌లో ఓ ప్రముఖ సంస్థ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. కానీ ఆఫర్ లభించలేదు. కారణం అన్వేషించే క్రమంలో క్యాంపస్‌లోని ప్లేస్‌మెంట్ సెల్స్ అధికారులను ఆరా తీశాడు. వారు చెప్పింది విని.. విస్మయం చెందాడు. అకడమిక్‌గా బాగున్నా.. విద్యేతర వ్యాపకాల్లో (ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్) చొరవ చూపకపోవడం వల్లే జాబ్ రాలేదని తెలిసి నిరుత్సాహానికి గురయ్యాడు.

పై రెండు ఉదాహరణలు.. ప్రస్తుతం కంపెనీలు నియామక ప్రకియలో ‘ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్’కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయనడానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. దీనికి ఏకైక కారణం.. వీటిలో పాల్పంచుకున్న విద్యార్థులకు ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్ స్కిల్స్ లభిస్తాయనే ఆలోచనే. ఫలితంగా భవిష్యత్తులో తమ సంస్థలో విధులు నిర్వర్తించే క్రమంలో చురుగ్గా వ్యవహరిస్తారనేది వారి నమ్మకం. ప్లేస్‌మెంట్స్‌లో ప్రాధాన్యం రీత్యా ఈ తరహా యాక్టివిటీస్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలని విద్యార్థులకు నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి విదేశాల్లో విద్యా సంబంధ విషయాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో, విద్యేతర కార్యకలాపాలకు అంతే విలువ ఇస్తారు. అయితే.. మన దేశంలో నేటికీ ఎక్కువమంది విద్యార్థులు, అధిక శాతం విద్యా సంస్థలు ఈ దిశగా ఆలోచించడం లేదు. ఈ నేపథ్యంలో.. అసలు ఎక్స్‌ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఏమిటి..? వీటితో ప్రయోజనం ఏమిటోతెలుసుకుందాం..!

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే..
  • కళాశాలలో ఈవెంట్స్ నిర్వహించడం, టెక్నికల్ లేదా కల్చర్ ఫెస్ట్‌లలో పాల్గొనడం, ఇన్‌స్టిట్యూట్స్‌లో జరిగే కార్యక్రమాల సమన్వయ బాధ్యతలు తీసుకోవడం, బృంద స్ఫూర్తితో కలిసి పనిచేయడం వంటి.. కరిక్యులమ్ పరిధిలోకి రాని అంశాలను ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు.
  • వీటిలోనే విద్యార్థులను ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్ దిశగా అడుగులు వేయించే సాధనాలుగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్, అడ్వెంచర్స్ వంటి వాటిని పేర్కొనవచ్చు. ఈ దిశగానే ప్రస్తుతం పలు విద్యా సంస్థలు క్రమంతప్పకుండా అథ్లెటిక్ మీట్స్ నిర్వహిస్తున్నాయి. అడ్వెంచర్ క్లబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి.
  • ఇటీవల ఎక్స్‌ట్రా కరిక్యులర్ పరంగా 'కల్చరల్ సొసైటీ కాన్సెప్ట్' కూడా పెరుగుతోంది. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వాటిలో పాల్గొనేలా చేయడం వంటి కార్యక్రమాలను ఇన్‌స్టిట్యూట్లు చేపడుతున్నాయి. వీటివల్ల అకడమిక్స్ ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడంతో పాటు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలను చాటుకునే అవకాశం లభిస్తోంది.
  • ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో అంతర్భాగంగా, కో-కరిక్యులర్ యాక్టివిటీస్‌గా పేర్కొనే అంశం.. విభాగాల వారీగా ప్రొఫెషనల్ బాడీస్‌లో స్టూడెంట్ మెంబర్‌షిప్ తీసుకోవడం. ఉదాహరణకు సీఐఐ, నాస్కామ్, ఫిక్కీ, ఆసోచామ్ తదితర సంస్థల్లో స్టూడెంట్ మెంబర్‌షిప్ ద్వారా ఆ సంస్థలు నిర్వహించే సెమినార్లు, లెక్చర్స్‌కు హాజరై నిపుణుల అభిప్రాయాలు, సలహాలు తెలుసుకోవచ్చు. ఆ రంగాల్లో తాజా పరిస్థితుల గురించి అవగాహన పెంచుకోవచ్చు.
  • తాజా పరిణామాల నేపథ్యంలో స్వచ్ఛంద సేవ (వాలంటీర్ సర్వీస్) కూడా విద్యేతర వ్యాపకాల్లో ప్రధానంగా నిలుస్తోంది. దీనిలో భాగంగా విద్యార్థులు తమ కళాశాల సమీప ప్రాంతంలోని గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరికి విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలకు పరిష్కారం చూపే అవకాశం లభిస్తుంది. ఫలితంగా వారిలో 'సమాజానికి ఎంతో కొంత చేద్దాం..' అనే దృక్పథం ఏర్పడుతుంది. భవిష్యత్తులోనూ సామాజిక అభివృద్ధికి కృషి చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇటీవల ఇన్‌స్టిట్యూట్లు వాలంటీర్ క్లబ్స్ ఏర్పాటు చేసి విద్యార్థుల సెలవు రోజుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం తప్పనిసరి చేస్తున్నాయి. ఇక వ్యక్తిగతంగా లాభించే అంశాలేమంటే..
కమ్యూనికేషన్ స్కిల్స్...
ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌తో విద్యార్థులకు ప్రధానంగా లభించే ప్రయోజనం.. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడటం. ఇన్‌స్టిట్యూట్ స్థాయిలో ఈవెంట్స్, సెమినార్స్, ఇతర కల్చరల్ క్లబ్స్‌లో పాల్పంచుకోవడం ద్వారా అందరితోనూ కలివిడిగా మాట్లాడగలిగే లక్షణం అలవడుతుంది. తద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇది భవిష్యత్తులో భిన్న సంస్కృతుల వారు ఉండే సంస్థల్లో మనగలిగేందుకు ఉపయోగపడుతుంది.

నాయకత్వ లక్షణాలు..
మరో సానుకూలాంశం.. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందడం. ఇన్‌స్టిట్యూట్స్‌లోని పలు విభాగాలు నిర్వహించే ఈవెంట్లలో వారిని భాగస్వాములను చేస్తుండటంతో నిపుణులు, ఇతర ప్రముఖ వ్యక్తులతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు.. క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్‌నే తీసుకుంటే ఐఐఎం, ఐఐటీలు తమ ఇన్‌స్టిట్యూట్ల పరిధిలోని క్యాంపస్ డెవలప్‌మెంట్ సెల్స్‌లో విద్యార్థులను క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ రిప్రజెంటేటివ్స్‌గా నియమిస్తున్నాయి. ఈ సమయంలో వారు డ్రైవ్స్‌కు వచ్చే సంస్థల ప్రతినిధులతో మాట్లాడటం, ఇంటర్వ్యూ షెడ్యూల్స్ ఖరారు చేయడం, వాటిని సంస్థల ప్రతినిధులకు తెలియజేయడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. సహజంగానే ఇలాంటి అంశాల ప్రస్తావన రెజ్యుమేలో ఉంటే కచ్చితంగా అది అదనపు అర్హతగా మారుతుంది.

బృందంతో బంధం..
నైపుణ్యపరంగా మరో లబ్ధి.. టీమ్ వర్క్! ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌తో ఒక బృందంగా నలుగురితో కలిసి పనిచేసే లక్షణం అలవడుతుంది. ఈవెంట్ నిర్వహణ క్రమంలో పలువురు విద్యార్థులను జట్టుగా ఏర్పాటు చేస్తారు. ఈ సమయంలో వారు ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి ఉంటుంది. తద్వారా అన్ని నేపథ్యాలవారితో కలిసి పనిచేసే స్వభావం అలవడుతుంది.

సమస్య పరిష్కార సామర్థ్యం...
ఈ రెండు లక్షణాలను సైతం ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్పంచుకోవడం ద్వారా మెరుగుపరచుకోవచ్చు. ఒక టాస్క్‌ను నిర్వర్తించే క్రమంలో సమస్య ఎదురైనప్పుడు ప్రొఫెసర్లు లేదా హెచ్‌ఓడీలను సంప్రదించి పరిష్కార, ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేస్తారు. దీంతో ఏ సమయంలో ఎలా వ్యవహరించాలి? అనే విషయమై అవగాహన వస్తుంది. ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైన చాకచక్యం సొంతమవుతుంది.

ఏఐసీటీఈ సైతం..
మన దేశంలో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌పై దృష్టి చాలా తక్కువ. యునిసెఫ్ నివేదిక ప్రకారం- హైస్కూల్ స్థాయిలో దాదాపు 90 శాతం మందికి వీటి గురించి అవగాహన లేదు. గ్రాడ్యుయేషన్ స్థాయిలో పరిస్థితి కొంత మెరుగవుతున్నా అది కూడా 80 నుంచి 85 శాతం మధ్యలోనే ఉంటోంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దేశవ్యాప్తంగా అన్ని ప్రొఫెషనల్ కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. యోగా, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, ఉన్నత్ భారత్ అభియాన్ పేరుతో స్వచ్ఛంద సేవ, వివిధ క్రీడాంశాలను చేర్చింది. ప్రతి విద్యార్థి ఈ అయిదింటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకుని నిరంతరం పాల్గొనేలా చూస్తోంది. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి విద్యా సంస్థల విద్యార్థులను దృష్టిలో పెట్టుకునే ఇలాంటి వాటికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

వ్యక్తిగతంగా లబ్ధి...
  • ఆత్మవిశ్వాసం వస్తుంది
  • ఒత్తిడిని ఎదుర్కోగలరు
  • భవిష్యత్తుపై అవగాహన
  • సామాజిక సేవా దృక్పథం
రిక్రూటర్ల దృక్పథం :
  • నాయకత్వ లక్షణాలు ఉంటాయనే ఆలోచన
  • సమయస్ఫూర్తితో వ్యవహరించగలరనే యోచన
  • బృందంతో కలిసిపోయి పనిచేయగల నైపుణ్యం
  • నిరంతర అభ్యసన లక్షణాలు
రెజ్యుమేలోనూ చూస్తున్నారు..
ఈ పోటీ ప్రపంచంలో రిక్రూటర్స్ కోణంలో.. విద్యార్థులకు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ భాగస్వామ్యం ప్రధానంగా మారింది. ఇన్‌స్టిట్యూట్ స్థాయిలోనే వీటిలో పాల్గొనడం వల్ల భవిష్యత్తులో సంస్థలో విధుల నిర్వహణపరంగా అవసరమయ్యే నాయకత్వ లక్షణాలు, ఒత్తిడిని తట్టుకోవడం, క్లయింట్లతో సంప్రదించే ఓర్పు, నేర్పు లభిస్తాయనే ఉద్దేశమే ఇందుకు కారణం. అందుకే రెజ్యుమేలో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనే కాలమ్‌పై దృష్టిపెడుతున్నారు. కాబట్టి విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా.. ఇన్‌స్టిట్యూట్లు నిర్వహించే నాన్ -అకడమిక్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనాలి.
-ప్రొఫెసర్ ఎన్.గణేశ్‌ప్రభు, చైర్మన్, కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్- ఐఐఎంవి
Published date : 15 Nov 2017 11:40AM

Photo Stories