Skip to main content

కన్సల్టింగ్ లో కెరీర్ అవకాశాలు

ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఎన్నో లక్ష్యాలు.. వాటి సాధనలో మరెన్నో సమస్యలు! పెద్దపెద్ద వ్యాపార సంస్థల నుంచి నిన్నమొన్న మొదలైన స్టార్టప్స్ వరకు.. అన్నింటిదీ ఇదే పరిస్థితి. అయితే లక్ష్యాలను చేరుకోవడంలో కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపేవే.. కన్సల్టింగ్ సంస్థలు! ఇవి నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. ఐఐఎంల్లో గత నాలుగేళ్ల క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ తుది ప్లేస్‌మెంట్ నివేదికల్లో కన్సల్టింగ్ సంస్థలదే పై చేయిగా కనిపిస్తోంది. ఈ క్రమంలో కన్సల్టింగ్‌లో కెరీర్ అవకాశాలపై ఫోకస్...
కన్సల్టింగ్ సంస్థలు
  • కన్సల్టింగ్ సంస్థలు... మార్కెట్లో ఆయా సెగ్మెంట్లలోని పరిశ్రమలు/ వ్యాపార సంస్థలకు అభివృద్ధి, పురోగతి దిశగా సలహాలు, సూచనలు అందిస్తాయి. కన్సల్టింగ్ సంస్థలు మొదటి దశలో డేటా కలెక్షన్, అనాలిసిస్‌ల ద్వారా తమను సంప్రదించిన సంస్థ ప్రస్తుత పనితీరును అంచనా వేస్తాయి.
  • రెండో దశలో ప్రస్తుత, భవిష్యత్తు పరిస్థితులను అంచనా వేసి, దానికి అనుగుణంగా సదరు సంస్థ అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్రంగా నివేదికను అందిస్తాయి. ఇందులో కంపెనీకి ఉపయోగపడే సలహాలు, సూచనలు ఉంటాయి. ఇటీవల రెండు రకాల కన్సల్టింగ్ సంస్థలు భాగా ప్రాచుర్యం పొందాయి.
  1. స్ట్రాటజిక్ కన్సల్టింగ్
    • కొత్తగా మార్కెట్లోకి అడుగుపెడుతున్న కంపెనీలకు అవసరమైన మార్కెట్ రీసెర్చ్, ప్రాజెక్ట్ రిపోర్ట్, అభివృద్ధి ప్రణాళికలు తదితరాలను స్ట్రాటజిక్ కన్సల్టింగ్ సంస్థలు రూపొందించి ఇస్తాయి.
  2. ఆపరేషన్స్ కన్సల్టింగ్
    • మార్కెట్లో అప్పటికే ఉన్న ఆయా సంస్థలు మరింత వృద్ధి సాధించేందుకు అవసరమైన అంతర్గత అభివృద్ధి ప్రణాళికలను..ఆపరేషన్ కన్సల్టింగ్ సంస్థలు రూపొందిస్తాయి.
    • సంస్థల (సదరు) ఉత్పత్తి ఆధారంగా పోటీ సంస్థల పనితీరును విశ్లేషించి.. తమ క్లయింట్ రాణించడానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించడం వంటి కార్యకలాపాలు చేపడతాయి.
ఐఐఎంలు- టాప్ కన్సల్టింగ్ సంస్థలు
  • ప్రతిభావంతులైన యువత కోసం టాప్ కన్సల్టింగ్ కంపెనీలన్నీ ఐఐఎంలు, ఇతర ప్రముఖ బి-స్కూల్స్‌పై దృష్టిపెడుతున్నాయి. ఇందులో భాగంగా తగిన నైపుణ్యాలు ఉంటే లక్షల్లో వార్షిక ప్యాకేజీలు అందిస్తున్నాయి. దీంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో కన్సల్టింగ్ కెరీర్ వైపు దృష్టి సారిస్తున్నారు.
  • క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో డబుల్ ఆఫర్లు వచ్చిన విద్యార్థులు సైతం కన్సల్టింగ్ సంస్థలకే తొలి ప్రాధాన్యం అంటున్నారు. కన్సల్టింగ్ సంస్థలు సాధిస్తున్న వృద్ధితో పాటు వాటిలో చేరితే భవిష్యత్తులో త్వరగా ఉన్నత హోదాలు అందుకునే అవకాశాలు ఉండటం... విద్యార్థులను ప్రభావితం చేస్తోంది.
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లలో ఏ క్యాంపస్ చూసినా.. గత నాలుగేళ్ల క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్, ఫైనల్ ప్లేస్‌మెంట్ రిపోర్ట్స్‌లో కన్సల్టింగ్ సంస్థలదే పై చేయిగా ఉంది.
  • 2012 ఎంబీఏ బ్యాచ్‌లో సగటున 15 శాతంగా ఉన్న కన్సల్టింగ్ సంస్థల నియామకాలు 2015నాటికి 40 శాతానికి చేరాయి.
కళ్లు చెదిరే ప్యాకేజీలు..
  • క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో నియామకాలు చేపడుతున్న కన్సల్టింగ్ సంస్థలు ప్యాకేజీల విషయంలోనూ ఇతర సంస్థల కంటే ముందుంటున్నాయి.
  • అభ్యర్థుల నైపుణ్యాలు, అకడమిక్ ట్రాక్ రికార్డ్ ఆధారంగా డొమెస్టిక్ ఆఫర్ల పరంగా కనిష్టంగా రూ.15 లక్షలు; గరిష్టంగా రూ.25 లక్షల వార్షిక ప్యాకేజీ అందిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఆఫర్ల పరంగా కనిష్టంగా రూ.80 లక్షలు; గరిష్టంగా రూ.1.25 కోట్లతో ప్యాకేజీలు అందిస్తున్నాయి. 2015 బ్యాచ్‌లో బోస్టన్ కన్సల్టింగ్ సంస్థ అత్యధికంగా రూ.1.27 కోట్ల ఇంటర్నేషనల్ ప్యాకేజీ అందించింది.
ఎంపిక ప్రక్రియ విభిన్నంగా
  • కన్సల్టింగ్ సంస్థలు.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లోనూ వినూత్నంగా వ్యవహరిస్తున్నాయి. రెజ్యుమె, పర్సనల్ ఇంటర్వ్యూలకే పరిమితం కాకుండా.. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసే క్రమంలో క్రియేటివిటీ చూపిస్తున్నాయి. కన్సల్టింగ్ సంస్థల నియామక ప్రక్రియ.. మూడు లేదా నాలుగు దశల్లో ఉంటుంది.
తొలి దశ: ఈ దశలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల రెజ్యుమెలను క్షుణ్నంగా పరిశీలిస్తారు.
రెండో దశ: రాత పరీక్ష ఉంటుంది. ఇందులో అభ్యర్థుల్లోని విశ్లేషణ నైపుణ్యాలను పూర్తి స్థాయిలో పరీక్షిస్తారు. ఒక వాస్తవ కేస్ స్టడీని ఇచ్చి దాని సమస్యకు పరిష్కారం చూపమంటారు. మెకిన్సే, బోస్టన్ కన్సల్టింగ్ సంస్థలు ప్రాబ్లమ్ సాల్వింగ్ టెస్ట్ పేరిట నిర్వహించే రాత పరీక్షలో రియల్ కేస్ స్టడీస్, అనాలిసిస్‌లకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.
మూడో దశ: ఈ దశలో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. కన్సల్టింగ్ సంస్థలు అభ్యర్థుల్లోని భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని, పీపుల్ స్కిల్స్‌ను పరీక్షించేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. బోస్టన్ కన్సల్టింగ్, డెలాయిట్ ఇంటర్నేషనల్, ఎ.టి.కెర్నీ వంటి సంస్థలు గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తున్నాయి.
నాలుగో దశ: మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసుకొన్న విద్యార్థులకు చివరి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో కన్సల్టింగ్ సంస్థలవైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారనే ప్రశ్నతో మొదలై.. అప్పటికప్పుడు ఏదైనా ఒక సమస్య ఇచ్చి దానికి సంబంధించి పరిష్కారం చూపమనే విధంగా ప్రశ్నలు ఉంటాయి.
  • ఇంటర్వ్యూ దశను విజయవంతంగా ముగించుకుంటే... గంటలు లేదా రెండు మూడు రోజుల్లో ఆఫర్ లెటర్ ఈ-మెయిల్ ‘ఇన్ బాక్స్’లోనో లేదా మొబైల్ మేసేజ్ బాక్స్‌లోనో కనిపించడం ఖాయం.
కన్సల్టింగ్ కెరీర్ అవకాశాలు
ఇంటర్న్‌షిప్‌కు అధిక ప్రాధాన్యం
  • కన్సల్టింగ్ సంస్థలు ఆఫర్లు అందించే విషయంలో ఇంటర్న్‌షిప్ చేసిన అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో తుది ప్లేస్‌మెంట్ రిపోర్ట్స్‌లో కన్సల్టింగ్ సంస్థల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ.. అందులో 80 శాతం నియామకాలు సదరు కన్సల్టింగ్ సంస్థల్లో ఇంటర్న్ చేసిన వారికే దక్కుతున్నాయి. ఇదే విషయాన్ని ఐఐఎంల క్యాంపస్ ప్లేస్‌మెంట్ సెల్ ఇన్‌ఛార్జ్‌లు పేర్కొంటున్నారు.
  • ఇంటర్న్ ట్రైనీ ద్వారా సదరు సంస్థ పనితీరుపై అవగాహన, అంతర్గత కార్యకలాపాలు, ఇతర అంశాల్లో శిక్షణ పొంది ఉండటంతో అలాంటి అభ్యర్థుల వైపు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి.
కన్సల్టింగ్ సంస్థలు- హోదాలు
  • కన్సల్టింగ్ సంస్థల్లో లభించే హోదాలు.. అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా ఉంటాయి. సాధారణంగా కన్సల్టింగ్ సంస్థల్లో మూడు స్థాయిల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ జరుగుతాయి.
అనలిస్ట్, జూనియర్ అసోసియేట్: సంస్థలు.. సాధారణంగా ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను తొలుత ఈ హోదాల్లో నియమిస్తాయి. విధుల పరంగా డేటా కలెక్షన్, డేటా అనాలిసిస్, ఫైండింగ్స్‌తో కూడిన రిపోర్ట్స్ రూపకల్పన వంటి విధులు ఉంటాయి.
కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, మేనేజర్: పని అనుభవంతో పాటు ఎగ్జిక్యూటివ్ పీజీ ప్రోగ్రామ్‌లు పూర్తిచేసిన వారికి ఈ హోదాల్లో ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. కింది స్థాయిలోని అనలిస్ట్‌లు, జూనియర్ అసోసియేట్‌లు ఇచ్చిన నివేదికల విశ్లేషణ, సమస్యకు పరిష్కారం చూపే మార్గాల అన్వేషణ వంటి విధులు.. ఈ విభాగంలో ఉంటాయి.
ప్రిన్సిపల్ /డెరైక్టర్: కన్సల్టింగ్ సంస్థల్లో టాప్ లెవల్‌లోని సెకండ్ లేయర్ పొజిషన్లుగా వీటిని పేర్కొంటారు. అయితే వీటికి క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా ఎంపిక చాలా తక్కువ. ఈ హోదాల్లోని వ్యక్తులు నేరుగా క్లయింట్ రిలేషన్‌షిప్ బిల్డింగ్, న్యూ క్లయింట్స్ ఐడెంటిఫికేషన్ విధులను చేపడతారు.

బీస్కూల్స్‌లో కన్సల్టింగ్ క్లబ్‌లు
  • కన్సల్టింగ్ డొమైన్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను గుర్తించిన మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్.. ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయిలోనే కన్సల్టింగ్ క్లబ్‌లను రూపొందిస్తున్నాయి. వీటిలో విద్యార్థులను భాగస్వామ్యం చేసి అవుట్ సోర్సింగ్ విధానంలో క్లయింట్లకు సేవలందిస్తున్నాయి.
  • ఐఐఎం అనగానే గుర్తొచ్చే అహ్మదాబాద్ క్యాంపస్‌లో ఫోరం ఫర్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ పేరిట కన్సల్టింగ్ క్లబ్ ఏర్పాటు చేశారు.
  • బెంగళూరు, కోల్‌కతా, త్రిచీ, కోజికోడ్ తదితర ఐఐఎంలు కూడా కన్సల్టింగ్ క్లబ్‌లు ఏర్పాటు చేశాయి. వీటి ద్వారా సంస్థలకు అవసరమైన రీసెర్చ్ అనాలిసిస్, డేటా అనాలిసిస్, కేస్ ఫైండింగ్స్ అండ్ సొల్యూషన్స్ వంటి సేవలు అందిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్టప్స్, ఈ- కామర్స్ సంస్థల ఔత్సాహికులు, ఎన్‌జీఓలు, .. ఈ స్టూడెంట్ కన్సల్టింగ్ క్లబ్‌లవైపు మొగ్గు చూపుతున్నారు.
  • కన్సల్టింగ్ డొమైన్‌లో కెరీర్ కోరుకునే అభ్యర్థులు ఈ క్లబ్స్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తే క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో ముందుండొచ్చు.
పేరున్న కన్సల్టింగ్ సంస్థలు
  • బెయిన్ అండ్ కంపెనీ
  • పీడబ్ల్యుసీ (ప్రైస్ వాటర్ కూపర్)
  • మెకిన్సే అండ్ కో
  • ది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్
  • ఎ.టి.కెర్నీ
  • కేపీఎంజీ
  • యాక్సెంచెర్ స్ట్రాటజీ
  • డెలాయిట్
  • స్ట్రాటజీ అండ్ కో
  • ఎర్నెస్ట్ అండ్ యంగ్
ఐఐటీల్లోనూ ‘కన్సల్టింగ్’ హవా!
కన్సల్టింగ్ సంస్థలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను సైతం నియమించుకోవడంలో ముందుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌ను జోరుగా చేపడుతున్నాయి. 2016లో కోర్సు పూర్తిచేసుకునే వారికి తాజాగా చేపట్టిన ఫైనల్ ప్లేస్‌మెంట్స్ తొలి దశ రిక్రూట్‌మెంట్ గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గతేడాదితో పోల్చితే రెట్టింపు సంఖ్యలో కన్సల్టింగ్ సంస్థల్లో నియామకాలు జరిగాయి.
  • ఐఐటీ-ముంబైలో టైర్-1 కన్సల్టింగ్ సంస్థల నియామకాలు గతేడాది కంటే 50 శాతం మేర; ఐఐటీ-ఢిల్లీ, రూర్కీ, గువహటి క్యాంపస్‌ల్లో 30 నుంచి 40 శాతం మేర పెరిగాయి.
  • ప్రముఖ కన్సల్టింగ్ సంస్థలుగా పేరొందిన బీసీజీ, ఎర్నస్ట్ అండ్ యంగ్ సంస్థలు గతేడాది కంటే రెట్టింపు ఆఫర్లతో తాజా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఆఫర్స్ అందించాయి.
  • బీసీజీ సంస్థ ఐఐటీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ తొలి దశలోనే 38 ఆఫర్లు అందించింది.
  • మరో ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కో సంస్థ కూడా గత గతేడాది కంటే 40 శాతం అధికంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేయడం విశేషం.
  • కన్సల్టింగ్ సంస్థల అంతర్గత పనితీరులో భాగంగా డేటా అనలిటిక్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, సైబర్ సెక్యూరిటీ, కాంప్లెక్స్ అనాలిసిస్ వంటి సాంకేతిక విభాగాల్లో ఇంజనీరింగ్ నిపుణుల ఆవశ్యకత పెరగడం నియామకాల సంఖ్య పెరగడానికి కారణమని క్యాంపస్ ప్లేస్‌మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కన్సల్టింగ్ సంస్థలు స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వార్షిక వేతనాలతో ఆఫర్లు అందించాయి. ఇదే హవా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ చివరి వారం వరకు నిర్వహించే మలి దశ రిక్రూట్‌మెంట్లలోనూ కనిపిస్తుందని ఆయా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
మార్కెట్ పోటీనే కారణం
ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ పోటీ పెరుగుతోంది. దీంతో ఆయా రంగాల్లోని సంస్థలు, పరిశ్రమలు తమ సంస్థల అభివృద్ధి దిశగా ప్రణాళికలు, మార్గనిర్దేశాల కోసం కన్సల్టింగ్ సంస్థలపై ఆధారపడుతున్నాయి. ఈ పరిణామాల ఫలితంగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో కన్సల్టింగ్ సంస్థలు హవా చూపిస్తున్నాయి. బి-స్కూల్స్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ పరంగానూ ఈ సంస్థలే ముందజలో ఉంటున్నాయి. కన్సల్టింగ్ సంస్థలు రిక్రూట్‌మెంట్స్ పరంగా తొలి ప్రాధాన్యాన్ని ఐఐఎంలకే ఇస్తున్నాయి. ఐఐఐం-అహ్మదాబాద్ నుంచి కొత్త ఐఐఎంల వరకు కన్సల్టింగ్ సంస్థల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఐఐఎం రోహ్‌తక్‌లో 2015 బ్యాచ్‌లో 21 మందికి కన్సల్టింగ్ డొమైన్‌లో ఉద్యోగాలు లభించడమే దీనికి నిదర్శనం.
- వి.రామకృష్ణ, క్యాంపస్ ప్లేస్‌మెంట్ సెల్ కోఆర్డినేటర్, ఐఐఎం-రోహ్‌తక్
Published date : 18 Dec 2015 10:58AM

Photo Stories