Skip to main content

కెరీర్ గైడెన్స్... టెక్నికల్ రైటింగ్

క్లిష్టమైన సాంకేతిక సమాచారాన్ని సులభంగా అర్ధమయ్యే భాషలో క్లుప్తంగా,సూటిగా రాయడం టెక్నికల్ రైటింగ్. ఇలా రాసేవాళ్లే టెక్నికల్ రైటర్స్. దీన్ని కెరీర్‌గా మలుచుకోవాలను కునేవారు కొన్ని అంశాలను గమనించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో టెక్నికల్ రైటర్లకు ప్రత్యేక గుర్తింపు ఉన్నా మనదేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే దీన్ని వృత్తిగా గుర్తిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు,
భాషాధ్యయనం, విశ్లేషణా సామర్ధ్యం, కమ్యూనికేషన్, ఎడిటింగ్, డిజైనింగ్ నైపుణ్యాలు ఉంటే ఈ రంగంలో రాణించడం సులభం.

వ్యాపార రంగంలో తీవ్రమైన పోటీని అధిగమించడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగ కంపెనీలు, బ్యాంకులు, వివిధ సంస్థలు తమ ప్రత్యేకతల్ని వినియోగదారులకి తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయా కంపెనీల ఉత్పత్తులు, పథకాలు, ప్రతిపాదనలు, సేవలు ఇలా అనేక విషయాలను కూళంకషంగా అర్థం చేసుకుని, వినియోగదారులకు స్పష్టంగా తెలియపరచడానికి ‘టెక్నికల్ రైటర్స్’ ఉపయోగపడుతున్నారు. అందుకే టెక్నికల్ రైటర్ సామర్ధ్యాన్ని బట్టి అతని కెరీర్ ఉన్నతి ఆధారపడి ఉంటుంది.

అర్హతలు:
టెక్నికల్ రైటర్‌ను టెక్నికల్ కమ్యూనికేటర్, ఇన్ఫర్మేషన్ డెవలపర్, డేటా డెవలప్‌మెంట్ ఇంజనీర్, టెక్నికల్ డాక్యుమెంటేషన్ స్పెషలిస్ట్ అనీ పిలుస్తారు. దేశకాలాలకనుగుణంగా చేసే పని ఒకటైనా హోదా మారుతూ ఉంటుంది. బ్రిటన్ తదితర దేశాల్లో వీరిని టెక్నికల్ ఆథర్ / నాలెడ్జ్ ఆథర్ అని పిలుస్తారు. ఈ ఉద్యోగానికి ప్రధానంగా సాంకేతిక, భాషా సామర్ధ్యాలతో పాటు ఎడిటింగ్, ఫార్మేటింగ్, డిజైనింగ్ స్కిల్స్ ఉండాలి.

ఎవరికి అనుకూలం:
ఇంజనీరింగ్, ఇంగ్లిష్ లిటరేచర్‌లో మాస్టర్ డిగ్రీ, మాస్ కమ్యూనికేషన్, టెక్నికల్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ఈ కెరీర్ సరిపోతుంది. ఐటీ ఉద్యోగులు, మెడికల్ ట్రాన్స్‌స్క్రిప్షనిస్ట్‌లు, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌లు, పరిశోధకులు... ఈ కోర్సు చేయవచ్చు. నిర్ణీత వయోపరిమితి లేకపోవడం కలిసొచ్చే అంశం.

భవిష్యత్తు:
టెక్నికల్ రైటర్‌కు భవిష్యత్తుకు ఢోకా లేదు. ఉన్నత విద్యార్హతలు, అనుభవం ఆధారంగా టెక్నికల్ రైటర్స్ స్థాయి నుంచి ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ టెక్నికల్ రైటర్, డాక్యుమెంటేషన్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు.

వేతనం:
కెరీర్ ప్రారంభంలో నెలకు రూ. 10,000 నుంచి 18,000 వరకు లభిస్తుంది. 5 నుంచి 9 సంవత్సరాల అనుభవం ఉన్న వారు నెలకు రూ.30 వేల నుంచి 40 వేలు పొందుతుండగా సీనియర్లకు, ప్రతిభావంతులకు భారీ వేతనాలు లభిస్తున్నాయి.

మన దేశంలో ఈ కోర్సును అందిస్తున్న సంస్థలు:
టెక్నికల్ రైటర్స్ అకాడెమీ-పుణే
కోర్సు: డిప్లొమా ఇన్ టెక్నికల్ కమ్యూనికేషన్
వ్యవధి: మూడు నెలలు
వెబ్‌సైట్: www.t-ec-h-now-r-it-w-s.-com

టెక్ టోటల్ సాఫ్ట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్-హైదరాబాద్, టెక్నికల్ రైటింగ్‌లో పలు సర్టిఫికెట్ కోర్సులను అందిస్తోంది.
వెబ్‌సైట్: www.t-ec-ht-ot-als-ys-t-em-s.-com
Published date : 18 Sep 2012 01:56PM

Photo Stories