Skip to main content

కేస్‌స్టడీ కాంపిటీషన్స్ దిశగా... కార్పొరేట్ కొలువులు

ఇంజనీరింగ్, ఎంబీఏ కోర్సుల విద్యార్థులు ఆతృతగా ఎదురుచూసే క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ప్రాధాన్యం తగ్గిపోనుందా? కోర్సులో చేరిన నాటి నుంచే క్యాంపస్ ఆఫర్లపై ఆశలు పెట్టుకునే విద్యార్థులు తమ ఆలోచనలు మార్చుకోవాల్సిందేనా..!
ఇకపై కేస్‌స్టడీ కాంపిటీషన్స్‌లో ప్రతిభ చూపితేనే కొలువు దక్కుతుందా?!.. అంటే..అవుననే సమాధానం వినిపిస్తోంది. కారణం.. ఇటీవల కాలంలో కార్పొరేట్ కంపెనీలు తమ రిక్రూట్‌మెంట్ విధానాల్లో అనూహ్య మార్పులు చేస్తుండటమే! సంస్థలు సంప్రదాయ రీతి క్యాంపస్ డ్రైవ్స్ స్థానంలో.. కేస్‌స్టడీ కాంపిటీషన్స్ దిశగా అడుగులు వేస్తున్నాయ్! ఈ నేపథ్యంలో అసలు కేస్‌స్టడీ కాంపిటీషన్స్ అంటే ఏంటి? కంపెనీలు వాటివైపు మొగ్గు చూపడానికి కారణాలు... నెగ్గడానికి మార్గాల గురించి తెలుసుకుందాం...

కంపెనీలు కాలేజీల్లో ప్లేస్‌మెంట్స్‌కు రావడం... క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనడం.. రిక్రూటర్స్ అడిగే ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం ఇవ్వడం.. ఆ తర్వాత టెక్నికల్, హెచ్‌ఆర్ రౌండ్‌లలో నెగ్గి కొలువు దీరడం’
- ఇదీ ఇంతకాలం కార్పొరేట్ సంస్థల్లో జాబ్ ఆఫర్లు అందుకునేందుకు సాధారణంగా జరిగే ప్రక్రియ!

చదువు పూర్తికాగానే కొలువు సాధించుకునేందుకు ఇప్పటివరకు విద్యార్థులకు తెలిసిన విధానం కూడా అదే!! కానీ.. ఇటీవల కాలంలో కంపెనీల నియామక విధానాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రెజ్యూమె, అకడమిక్ ప్రతిభ కంటే.. అభ్యర్థుల్లోని రియల్ టైమ్ నాలెడ్జ్, ప్రాక్టికల్ సామర్థ్యం పరీక్షించి.. సరితూగే అభ్యర్థులను నియమించుకోవడానికి సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. అందుకు కార్పొరేట్ కంపెనీలు అనుసరిస్తున్న విధానం.. కేస్‌స్టడీ కాంపిటీషన్స్!! వీటిలో విజయం సాధించిన వారికే కొలువులు దక్కే పరిస్థితి కనిపిస్తోంది.

కేస్‌స్టడీ కాంపిటీషన్స్ అంటే?
కేస్‌స్టడీ కాంపిటీషన్ అంటే.. ఓ సంస్థ నియామకాలు చేపట్టాలని భావించినప్పుడు, అభ్యర్థుల ముందు ఒక రియల్ కేస్ స్టడీని ఉంచుతుంది. అభ్యర్థులు ఆ కేస్‌ను విశ్లేషించి.. సమస్యలను గుర్తించి పరిష్కారం చూపాలి. చక్కటి పరిష్కారం చూపిన అభ్యర్థులకు మాత్రమే నియామక ఆఫర్ లభిస్తుంది. అదే విధంగా మరో తరహా కేస్ స్టడీ కాంపిటీషన్స్ విధానం కూడా సంస్థలు అనుసరిస్తున్నాయి. సదరు సంస్థ తమ భవిష్యత్తు ప్రణాళిక గురించి చెప్పి.. ఆ ప్రణాళిక విజయవంతం అవ్వడానికి ఏం చేయాలో చెప్పాలని సూచిస్తున్నాయి. సరైన సక్సెస్ ప్లాన్‌ను రూపొందించిన అభ్యర్థులకే ఉద్యోగం సొంతమవుతుంది. ఇలా కంపెనీలు వివిధ కేస్‌స్టడీ కాంపిటీషన్స్ నిర్వహించడానికి ప్రధాన కారణం.. విద్యార్థుల్లోని ప్రాక్టికల్ నైపుణ్యాలను పరిశీలించడమే అంటున్నారు నిపుణులు.

జాతీయస్థాయిలో ఆన్‌లైన్‌లో...
ఇన్ఫోసిస్, టీసీఎస్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు దేశవ్యాప్తంగా కేస్‌స్టడీస్ కాంపిటీషన్స్‌ను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నాయి. నిర్దిష్టంగా తేదీలను ప్రకటించి.. ఇందుకోసం ప్రత్యేక వెబ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తున్నాయి. అందులో అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌లోనే నిర్దిష్టంగా ఒక సమస్యను పేర్కొని.. దానికి పరిష్కారం చూపమని అడుగుతున్నాయి. ఆన్‌లైన్లో జాతీయస్థాయిలో కేస్‌స్టడీ కాంపిటీషన్స్ ద్వారా ప్రతి కాలేజీకి ప్రత్యేకంగా వెళ్లి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించడానికి అవుతున్న వ్యయ ప్రయాసలను తగ్గించుకోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ విధానం వల్ల టాప్ బి-స్కూల్స్, టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్ విద్యార్థులే కాకుండా.. ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలోని ప్రతిభ గల విద్యార్థులను కూడా ఆకర్షించేందుకు వీలవుతుందని పేర్కొంటున్నాయి.

రెండు, మూడేళ్ల క్రితమే :
వాస్తవానికి దేశంలో కేస్‌స్టడీ కాంపిటీషన్స్ నిర్వహించే విధానం దాదాపు రెండు, మూడేళ్ల క్రితమే మొదలైంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలే కాకుండా.. సిటీ బ్యాంక్, అమెజాన్, మహీంద్రా గ్రూప్, జేపీ మోర్గాన్, టాటా మోటార్స్, జీఈ, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి సంస్థలు సైతం కేస్‌స్టడీ కాంపిటీషన్స్‌ను నిర్వహించడం ప్రారంభించాయి.

ప్రధానంగా బి-స్కూల్స్‌లో...
కేస్‌స్టడీ కాంపిటీషన్స్ ద్వారా అభ్యర్థులను నియమించుకునే విధానం ప్రస్తుతం ప్రధానంగా బిజినెస్ స్కూల్స్‌లో కనిపిస్తోంది. సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరించుకునే క్రమంలో అనుసరించాల్సిన ప్రణాళికలు, వ్యూహాల గురించి మేనేజ్‌మెంట్ విద్యార్థుల నుంచి ఐడియాలు స్వీకరించాలనే ఉద్దేశమే ఇందుకు ప్రధాన కారణం. అభ్యర్థుల బిజినెస్ ఆలోచనలు బాగుంటే.. వాటిని అమలు చేసేందుకు సంస్థలు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో సదరు ఐడియాలు ఇచ్చిన విద్యార్థులకు ఆకర్షణీయమైన వేతనంతో కొలువులు అందిస్తున్నాయి.

అన్ని విభాగాల్లోనూ..
ప్రస్తుతం సంస్థలు అన్ని విభాగాలకు సంబంధించి నియామకాల కోసం కేస్‌స్టడీ కాంపిటీషన్స్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్‌తోపాటు కీలకమైన స్ట్రాటజిక్ ప్లానింగ్, లాజిస్టిక్స్ ఆపరేషన్స్ విభాగాలకు సంబంధించి కూడా కేస్‌స్టడీ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాయి. అధిక శాతం కంపెనీలు మార్కెటింగ్ వ్యూహాలు, మార్కెట్లో మరింత వాటా సొంతం చేసుకోవడం ఎలా? అనే విషయాలపై దృష్టిపెడుతూ.. వాటికి సంబంధించి కేస్‌స్టడీ కాంపిటీషన్స్‌ను నిర్వహిస్తున్నాయి. వీటిలో నెగ్గిన వారికి సంస్థలో సీనియర్లతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తున్నాయి.

ఐటీ సంస్థల్లో హ్యాకథాన్ :
వాస్తవానికి అభ్యర్థుల్లోని రియల్ టైమ్ నాలెడ్జ్‌ని గుర్తించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కేస్‌స్టడీ కాంపిటీషన్స్‌ను ఐటీ సంస్థలు చాలా కాలం క్రితమే ప్రారంభించాయి. ఐటీ కంపెనీలు హ్యాకథాన్స్ పేరిట అభ్యర్థులకు కోడింగ్, ప్రోగ్రామింగ్‌లకు సంబంధించి రియల్‌టైమ్ టాలెంట్ టెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. ఈ సంస్కృతి ఇప్పుడు అన్ని రంగాలకు కూడా విస్తరిస్తోంది.

క్యాంపస్ డ్రైవ్స్ కనుమరుగవుతాయా?
దేశంలో కేస్‌స్టడీ కాంపిటీషన్స్ విస్తరణతో కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ కనుమరుగవుతాయా? అనే సందేహం వ్యక్తమవుతోంది. పలు సంస్థల అంచనాల ప్రకారం ఏటా సంస్థలు తమ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ను 18 శాతం నుంచి 20 శాతం మేర తగ్గించుకుంటున్నాయి. అంటే.. రానున్న రోజుల్లో టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో చదివిన విద్యార్థులైనా కార్పొరేట్ సంస్థల్లో కొలువుదీరేందుకు కేస్‌స్టడీ కాంపిటీషన్స్‌లో నెగ్గాల్సి ఉంటుందని చెప్పొచ్చు.

మరి నెగ్గడం ఎలా?
కేస్‌స్టడీ కాంపిటీషన్స్‌కు రోజురోజుకీ ప్రాధాన్యం పెరుగుతోంది. దాంతో కొలువు దక్కాలంటే వీటిలో నెగ్గడం తప్పనిసరిగా మారుతోంది. అభ్యర్థుల్లోని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్, లాజికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్, రియల్ టైం నాలెడ్జ్‌లను పరీక్షించేలా కేస్‌స్టడీ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు ఆయా నైపుణ్యాలు పెంచుకునే విధంగా కృషిచేయాలి.

రీసెర్చ్ దృక్పథం పెరిగేలా..

కేస్‌స్టడీ కాంపిటీషన్స్ అభ్యర్థుల్లోని రీసెర్చ్ దృక్పథాన్ని కూడా పెరిగేలా చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే.. సంస్థలు ఒక కేస్ (సమస్య)ను ఇచ్చినప్పుడు నిర్దిష్ట సమయం ఇచ్చి.. దానిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి పరిష్కారం చూపాలని అడుగుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు సదరు సమస్యను లోతుగా అన్ని కోణాల్లో అధ్యయనం చేయడంతోపాటు... ఇతర సంస్థల పరిస్థితితో పోల్చి చూడాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థుల్లో రీసెర్చ్ దృక్పథాన్ని పెంచేలా చేస్తోంది.

ఆ విద్యార్థులకు సదవకాశం..

కేస్‌స్టడీ కాంపిటీషన్స్ ప్రముఖ బి-స్కూల్స్ విద్యార్థులకే కాకుండా.. స్థానిక కళాశాలల్లో చదివిన విద్యార్థులకు కూడా సదవకాశంగా నిలుస్తోందని చెప్పొచ్చు. ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నప్పటికీ.. తమ కళాశాలకు కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌కు రాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యే విద్యార్థులు ఎంతోమంది. ఇలాంటి వారందరికీ ‘కేస్‌స్టడీ కాంపిటీషన్స్’ చక్కటి మార్గంగా నిలుస్తాయి. ప్రతిభ ఉంటే సాధారణ కళాశాలల్లో చదివిన విద్యార్థులు సైతం ప్రముఖ కంపెనీల్లో కొలువుదీరేందుకు కేస్‌స్టడీస్ ద్వారా అవకాశం లభిస్తుంది. కేస్‌స్టడీ కాంపిటీషన్స్ ఫలితంగా ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. రెండేళ్ల క్రితం పరిస్థితితో పోల్చితే ప్రస్తుతం ఆఫ్ క్యాంపస్ ద్వారా కేస్ స్టడీ కాంపిటీషన్ విధానంలో నియామకాలు చేపట్టే సంస్థ సంఖ్య 20 నుంచి 25 శాతం మేర పెరగడమే ఇందుకు నిదర్శనం.

ప్రముఖ సంస్థల కేస్ స్టడీ కాంపిటీషన్స్ :
కేస్ స్టడీ కాంపిటీషన్స్ పరంగా ప్రముఖ సంస్థలు ప్రత్యేక విభాగాలను నెలకొల్పి వీటిని నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రముఖ సంస్థలు నిర్వహిస్తున్న పోటీల పేర్ల వివరాలు...
టీసీఎస్- ఎన్‌కోడ్
ఇన్ఫోసిస్ - ఇన్‌జీనియస్
కేపీఎంజీ - ఇంటర్నేషనల్ కేస్ కాంపిటీషన్
సిటీ బ్యాంక్ - క్యాంపస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్
మహీంద్రా గ్రూప్ - వార్ రూమ్
ఏషియన్ పెయింట్స్ - కాన్వాస్
ఐటీసీ - ఇంటెరోబ్యాంగ్
టాటా మోటర్స్ - మైడ్‌రోవర్
కోకో-కోలా ఇండియా - షోకేస్.
ఇలా ఒక్కో సంస్థ ఒక్కో పేరుతో కేస్ స్టడీ కాంపిటీషన్స్‌ను నిర్వహిస్తోంది. వీటిలో విజేతలకు సంస్థలు కొలువులు ఇవ్వడమే కాకుండా నగదు బహుమతులను కూడా అందజేస్తున్నాయి.

రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం..
కేస్‌స్టడీ కాంపిటీషన్స్ ద్వారా అభ్యర్థులను నియమించుకునే ధోరణి రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. కంపెనీలు ప్రధానంగా అకడమిక్ నైపుణ్యాలకంటే అభ్యర్థుల్లోని ప్రాక్టికల్ నైపుణ్యాలను, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పరిశీలించాలనుకుంటున్నాయి. తద్వారా తమ సంస్థ అవసరాలకు సదరు అభ్యర్థులు సరితూగుతారో లేదో తెలుసుకోవడం ప్రధాన ఉద్దేశంగా కేస్‌స్టడీ కాంపిటీషన్స్‌ను నిర్వహిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ డొమైన్ ఏరియాస్‌కు సంబంధించిన రంగాల్లోని పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం మేలు చేస్తుంది.
- ప్రొఫెసర్ దీపిక గుప్తా, చైర్మన్, కెరీర్ డెవలప్‌మెంట్ సర్వీసెస్, ఐఐఎం- విశాఖపట్నం.
Published date : 08 Aug 2019 05:21PM

Photo Stories