Skip to main content

కార్పొరేట్ జాబ్ To క్లాస్‌రూం టీచింగ్

కార్పొరేట్ కొలువు.. కళ్లుచెదిరే వేతనాలు! ఉన్నత హోదాలు.. అత్యున్నత సదుపాయాలు! వీటన్నింటినీ కాదని.. కార్పొరేట్ కొలువులను వీడి.. క్లాస్‌రూం టీచింగ్ వైపు మళ్లుతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. నాలుగైదేళ్ల అనుభవం గడించిన యువతలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది! సంప్రదాయ కాలేజీల్లో చదివిన వారే కాదు... ఐఐటీ, ఐఐఎంల్లో చదువుకున్న ప్రతిభావంతులు సైతం బోధన బాట పడుతున్నారు. ఈ క్రమంలో యువత కార్పొరేట్ కొలువులు వీడి.. టీచింగ్ కెరీర్‌వైపు వెళ్లడానికి కారణాలు, బోధన రంగంతో ప్రయోజనాలపై ప్రత్యేక కథనం...
సాకేత్.. పుణె కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తిచేసి, క్యాంపస్ డ్రైవ్‌లో బెంగళూరులోని ఐటీ సంస్థలో ఆఫర్ సొంతం చేసుకున్నాడు. నాలుగేళ్లు పనిచేశాక.. కార్పొరేట్ జాబ్ విసుగు పుట్టించింది. దాంతో టీచింగ్ కెరీర్‌వైపు దృష్టిపెట్టారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

జానకి కణ్నన్.. అమెరికాలో మాస్‌మీడియా కోర్సులో పీజీ పూర్తిచేసి.. అక్కడే ప్రముఖ అడ్వర్టయిజింగ్ సంస్థలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. ఆ రంగం తనకు నప్పదనిపించింది. దాంతో స్వదేశానికి తిరిగొచ్చి.. తనకిష్టమైన బోధన రంగంలో ప్రవేశించారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ పాఠశాలలో టీచర్‌గా చిన్నారులకు పాఠాలు బోధిస్తున్నారు.

సాకేత్, జానకిలే కాదు.. ఇలా మరెందరో ఇప్పుడు.. తాము పనిచేస్తున్న కార్పొరేట్ కొలువులు వీడి.. టీచింగ్ కెరీర్ వైపు మళ్లుతున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూట్స్ వరకు.. వేదికగా చేసుకుని టీచర్లుగా, లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా కొత్త కెరీర్ ప్రారంభిస్తున్నారు. యువతలో ఇటీవల కాలంలో ఈ దృక్పథం క్రమేణా పెరుగుతోంది. వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమన్వయం చేసుకునేందుకు వీలుండటం.. అదే సమయంలో టీచింగ్‌లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించొచ్చనే అభిప్రాయం... ఈ నయా ట్రెండ్‌కు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆకర్షణీయ వేతనాలు..
  • ఆధునిక పోటీ ప్రపంచంలో కార్పొరేట్ కొలువులంటేనే ఒత్తిళ్లమయం! అందుకే కొంతమంది డెడ్‌లైన్లు, ఒత్తిళ్లు లేని జీవితం గడపాలనే ఆలోచనతో టీచింగ్ వైపు వెళ్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దాంతోపాటు ఇటీవల కాలంలో టీచింగ్‌లోనూ ఆకర్షణీయ వేతనాలు లభిస్తుండటం మరో ముఖ్య కారణంగా విద్యావేత్తలు చెబుతున్నారు.
  • యూనివర్సిటీల్లో అసోసియేట్ ప్రొఫెసర్/ప్రొఫెసర్స్థాయిలో నెలకు రూ.70 వేల నుంచి రూ.80 వేల వేతనం పొందే అవకాశముంది. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం ప్రారంభంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.45 వేలకు పైగా వేతనం అందుతోంది. ప్రొఫెసర్ హోదాలో నెలకు రూ.70 వేల వరకు లభిస్తోంది. యూజీసీ నిబంధనల మేరకు యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లోనూ ఇదే స్థాయిలో వేతనాలు లభిస్తున్నాయి.
  • ఇంటర్మీడియెట్‌తో పాటు జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కార్పొరేట్ కాలేజీల్లో బోధనలో కుదురుకుంటే రూ.లక్షల్లో వేతనాలు లభిస్తున్నాయి. నైపుణ్యాలనుబట్టి పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ప్రారంభంలో రూ.20 వేల నుంచి రూ.35వేల వరకు వేతనం లభిస్తోంది. కార్పొరేట్ పాఠశాలల్లో అయితే భారీగా జీతభత్యాలు అందుకునే వీలుంది.

స్వీయ ఆసక్తి, ఆస్వాదించే మనస్తత్వం :
కార్పొరేట్ ఉద్యోగులు... యువ గురువులుగా క్లాస్‌రూంలో అడుగుపెట్టడానికి మరో ప్రధాన కారణం.. బోధనపై ఆసక్తి, దాన్ని ఆస్వాదించే మనస్తత్వం. ‘పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్ల అధికశాతం మంది విద్యార్థులు ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిపోతున్నారు. కోర్సు పూర్తికాగానే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లోనే కొలువు లభిస్తోంది. కార్పొరేట్ కంపెనీలో నాలుగైదేళ్లు పనిచేశాక వివిధ కారణాల వల్ల అసంతృప్తి మొదలవుతోంది. ఈ దశలోనే టీచింగ్‌పై ఆసక్తి ఉన్నవారు బోధన రంగంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు.

మరో అభిప్రాయం :
  • కార్పొరేట్ రంగంలో టెక్నాలజీ శరవేగంగా మారిపోతోంది. దాంతో ఎప్పటికప్పుడు నాలెడ్జ్‌ను అప్ డేట్ చేసుకోవడం.. పోటీ వాతావరణంలో మనుగడ సాగించడం కత్తిమీద సాములా మారింది. అందువల్ల కొందరు అప్పటివరకు గడించిన పని అనుభవం, కోర్ సబ్జెక్టు నైపుణ్యాలతో అధ్యాపకులుగా విజయం సాధించొచ్చనే భావనతో టీచింగ్ వైపు వెళ్తున్నారనేది మరికొందరి అభిప్రాయం.
  • వివిధ సర్వేల ప్రకారం కార్పొరేట్ కొలువులు వీడి టీచింగ్ కెరీర్‌లో అడుగుపెడుతున్న వారి సగటు వయసు 30 నుంచి 32 ఏళ్ల మధ్య ఉంటోంది. అంటే.. చదువు పూర్తయ్యాక మహా అయితే అయిదేళ్లు కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్నారు.

ఫ్రెషర్స్ సైతం :
  • ఐఐటీ, ఐఐఎం తదితర ప్రముఖ విద్యాసంస్థల్లో నిర్వహించే క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్‌లో పీజీ విద్యార్థులు అధ్యాపక వృత్తిపై ఆసక్తి చూపడం మరో కొత్త ట్రెండ్. ప్రముఖ యూనివర్సిటీలు, విద్యా సంస్థలు.. ప్లేస్‌మెంట్స్ నిర్వహించి పీజీ విద్యార్థులకు అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌గా ఆఫర్లు ఇస్తున్నాయి. ఇటీవల ఐఐటీ-హైదరాబాద్, ఖరగ్‌పూర్, చెన్నై, ఇండోర్, పాట్నాలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ జరిగాయి. ఇందులో శివనాడార్ యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, ఫిట్-జీ, ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ తదితర విద్యా సంస్థలు 120 మందికి ఆఫర్లు ఇచ్చాయి.
  • విద్యా సంస్థలు టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఐఐటీల్లో క్యాంపస్ డ్రైవ్స్ చేపట్టడం గతేడాదితో పోల్చితే 30 శాతం నుంచి 50 శాతం మేర పెరిగింది.
  • విద్యాసంస్థలు ఆకర్షణీయ వేతనాలతో బోధన ఉద్యోగాలను ఆఫర్ చేశాయి. ఐఐటీ చెన్నైలో గరిష్టంగా రూ.14.4 లక్షల వార్షిక వేతనం నమో దుకాగా, కనిష్ట వేతనం రూ.3.6 లక్షలు. ఐఐటీ హైదరాబాద్‌లో గరిష్టంగా రూ.13 లక్షల వార్షిక వేతనంతో బోధన పోస్టులకు ఆఫర్ లభించగా, సగటు వేతనం రూ.8.05 లక్షలుగా నమోదైంది.

పరిశోధనలకు అవకాశం..
కార్పొరేట్ కొలువు వదిలి.. యువత టీచింగ్ వైపు వెళ్లడానికి ఆసక్తి, ఆదాయాలతోపాటు మరో అంశం కూడా ప్రధాన కారణంగా నిలుస్తోంది. అది.. వ్యక్తిగత పరిశోధనలకు ఇన్‌స్టిట్యూట్‌లు అవకాశమివ్వడం! ఇటీవల కాలంలో పరిశోధన ఔత్సాహికుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని యూనివర్సిటీలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. తమ సంస్థల్లో అధ్యాపక వృత్తిలో చేరితే.. ఇండిపెండెంట్ రీసెర్చ్‌కు సైతం అవకాశం కల్పిస్తామని భరోసా ఇస్తున్నాయి. దీంతో పరిశోధనలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు టీచింగ్ ఆఫర్లను అంగీకరిస్తున్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహం :
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) సైతం యువతను టీచింగ్ కెరీర్‌వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా సాంకేతిక విద్య పరంగా ఇప్పటికే పలు ప్రణాళికలకు కార్యరూపం ఇచ్చింది. సాంకేతిక విద్యా బోధనలో వెనుకబడిన 53 ఇంజనీరింగ్ కళాశాలల్లో బోధించేందుకు ఎన్‌ఐటీలు, ఐఐటీల్లోని పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు అవకాశమివ్వాలని ఈ ఏడాది ప్రారంభంలోనే నిర్ణయించింది. మూడేళ్ల పాటు పనిచేసేలా నిబంధనలు రూపొందించి.. నెలకు రూ.70 వేల వేతనం అందిస్తోంది. మూడేళ్ల తర్వాత వారు బోధనలో కొనసాగాలనుకుంటే.. దానికీ వీలు కల్పించనుంది. ఈ కార్యక్రమానికి దాదాపు అయిదు వేల మంది దరఖాస్తు చేసుకోవడం బోధనరంగంపై యువత ఆసక్తికి నిదర్శనమని చెబుతున్నారు.

విద్యార్థులకు ప్రయోజనం :
కార్పొరేట్ రంగంలో పని అనుభవం గడించి.. బోధన రంగంలోకి అడుగుపెట్టి అధ్యాపకులుగా మారిన వారి వల్ల విద్యార్థులకు సైతం ఎంతో ప్రయోజనం కలుగుతోంది. కార్పొరేట్ కొలువు సొంతం చేసుకున్న వారిలో అపార కోర్ నైపుణ్యాలు ఉంటాయి. అదే విధంగా పని అనుభవం వల్ల సంబంధిత రంగానికి చెందిన క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉంటుంది. ఫలితంగా క్లాస్‌రూంలో సబ్జెక్టును, సమకాలీన ధోరణులకు అన్వయిస్తూ బోధిస్తారు. దీనివల్ల విద్యార్థులకు కోర్ అంశాలపై పరిజ్ఞానంతో పాటు తాజా మార్పులపైనా అవగాహన వస్తుంది.

ఆసక్తే ప్రధాన కారణం :
వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసిన యువత బోధన రంగంపై దృష్టిసారించడానికి ఆసక్తి ప్రధాన కారణమని చెప్పొచ్చు. టీచింగ్ కెరీర్‌లోనూ ఆదాయం బాగానే ఉందని, అందుకే అటువైపు వెళ్తున్నారనే మాటల్లో వాస్తవం లేదు. మావద్ద రెండేళ్ల ఫెలోషిప్ కోసం ఏటా వందల సంఖ్యలో కార్పొరేట్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఫెలోషిప్‌నకు ఎంపికై, రెండేళ్లు పూర్తయ్యాక.. బోధనను పూర్తిస్థాయి కెరీర్‌గా ఎంపికచేసుకుంటున్న వారి సంఖ్య 50-60 శాతం ఉంటోంది.
- తాన్య అరోర, సెలక్షన్ హెడ్, టీచ్ ఫర్ ఇండియా.

స్వతంత్ర పరిశోధనలకు అవకాశం..
టీచింగ్ ఆఫర్లకు ఫ్రెషర్స్ సైతం మొగ్గు చూపడానికి ప్రధాన కారణం.. యూనివర్సిటీలు కల్పిస్తున్న ‘స్వతంత్ర పరిశోధన’ అవకాశమే! ఇప్పుడు పీజీ, పీహెచ్‌డీ పట్టా చేతిలో ఉన్నా.. ఆర్ అండ్ డీ కోణంలో ‘ఇండెపెండెంట్ రీసెర్చ్’ చేసేందుకు మార్గాలు తక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో యూనివర్సిటీలు వ్యక్తిగత పరిశోధనలకు అవకాశం కల్పిస్తుండటం కార్పొరేట్ ఉద్యోగులు టీచింగ్ వైపు ఆకర్షితులవడానికి ముఖ్య కారణమని చెప్పొచ్చు.
- ప్రొఫెసర్ ఏముల ప్రదీప్, ప్లేస్‌మెంట్ ఇన్‌ఛార్జ్, ఐఐటీ-హెచ్.
Published date : 01 Oct 2018 05:36PM

Photo Stories