Skip to main content

జాతీయ ఇన్‌స్టిట్యూట్‌లు... కొత్త క్యాంపస్‌లు

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా క్యాంపస్‌లు ఉన్న ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు..
ఐఐఎస్‌ఈఆర్, ఎన్‌ఐటీ, ఐఐటీలు. జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతాల అభ్యర్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో వీటిని విస్తరిస్తున్న కేంద్రప్రభుత్వం.. విభజిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ వీటి ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం (2015-16) నుంచే వీటిలో క్లాసులు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కొత్త ఇన్‌స్టిట్యూట్‌లు, ప్రవేశాల వివరాలు..

ఐఐఎస్‌ఈఆర్ - చిత్తూరు
ఐఐఎస్‌ఈఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. సైన్స్ విభాగంలో పరిశోధన కార్యకలాపాల విస్తరణకు, విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2006లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయిదు ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌లు ఉండగా.. ఈ విద్యా సంవత్సరం నుంచి చిత్తూరులోనూ నూతన క్యాంపస్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఐఐఎస్‌ఈఆర్ పుణె మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌గా వ్యవహరిస్తున్న చిత్తూరు క్యాంపస్‌ను తాత్కాలికంగా ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి నిర్వహిస్తారు.

కోర్సుల వివరాలు..
  • బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సు.
  • వ్యవధి: అయిదేళ్లు
  • సీట్లు: 50
  • అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (ఎంపీసీ) ఉత్తీర్ణతతోపాటు కిశోర్ వైజ్ఞానిక్ ప్రో త్సాహన్ యోజన (కేవీపీవై)/ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో/ఐఐఎస్‌ఈఆర్ నిర్వహించే స్టేట్ సెంట్రల్ బోర్డ్(ఎస్‌సీబీ) ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం:
  • కేవీపీవై/జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు, ఎస్‌సీబీ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉత్తీర్ణులకు సీట్ల భర్తీ ప్రక్రియ వేర్వేరుగా ఉంటుంది.
  • విద్యార్థులు రెండు విధానాలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య తేదీలు:
  • కేవీపీవై/ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆధారంగా దరఖాస్తు తేదీలు
    ఆన్‌లైన్ అప్లికేషన్:
    జూన్1, 2015-జూన్ 27, 2015
    సీట్ల కేటాయింపు తేదీ: జూన్ 29, 2015
  • ఎస్‌సీబీ ఆప్టిట్యూడ్ ముఖ్య తేదీలు
    ఆన్‌లైన్ అప్లికేషన్:
    జూన్ 1, 2015 - జూలై 4, 2015 వరకు
    ఎస్‌సీబీ ఆప్టిట్యూడ్ టెస్ట్ తేదీ: జూలై 12, 2015
    ఫలితాలు/సీట్ల కేటాయింపు: జూలై 15, 2015
    తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు:
    హైదరాబాద్, తిరుపతి, విజయవాడ
    వెబ్‌సైట్: www.iiseradmission.in


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ - విజయవాడ
తెలుగు రాష్ట్ర విభజన జరిగాక.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖరారైన తొలి జాతీయ స్థాయి విద్యా సంస్థగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను పేర్కొనవచ్చు. దీని ప్రధాన కార్యాలయం అహ్మదాబాద్‌లో ఉంది. 2014లోనే విజయవాడలో ఎన్‌ఐడీ క్యాంపస్ ఖరారైంది. ఈ విద్యా సంవత్సరం (2015-16) నుంచి కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణాన్ని తాత్కాలిక శిక్షణ కేంద్రంగా ఖరారు చేశారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిజైన్ కోర్సుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు..
  • కోర్సు: గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిజైన్
  • వ్యవధి: నాలుగేళ్లు
  • సీట్లు: 60
  • అర్హత: 10+2/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత
  • వయోపరిమితి: జూన్ 1, 2015 నాటికి 20 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం:
ఎన్‌ఐడీ డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, స్టూడియో టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. తొలుత గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా స్టూడియో టెస్ట్ కు ఎంపిక చేస్తారు. అందులోనూ విజయం సాధిస్తే జీడీ/పీఐ నిర్వహించి తుది జాబితా రూపొందిస్తారు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో applyadmission.net/nidv2015 వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: మే 3, 2015 నుంచి మే 22, 2015
  • అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: జూన్ 6, 2015
  • డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ తేదీ: జూన్ 14, 2015
  • డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫలితాలు: జూలై 11, 2015
  • స్టూడియో టెస్ట్: ఆగస్ట్ 8, 2015
  • తుది ఫలితాలు: ఆగస్ట్ 22, 2015
  • డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సెంటర్లు: విజయవాడ, హైదరాబాద్
  • స్టూడియో టెస్ట్ సెంటర్: విజయవాడ
  • వివరాలకు వెబ్‌సైట్: www.nid.edu
‘మొదటి ఏడాది విద్యార్థులందరికీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ పేరుతో ఉమ్మడి శిక్షణ ఉంటుంది. తర్వాత సంవత్సరం విద్యార్థుల అకడమిక్ ప్రతిభ, ఆసక్తి ఆధారంగా ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, టెక్స్‌టైల్ అండ్ అపరెల్ డిజైన్ ఎలక్టివ్స్‌ను ఎంచుకోవచ్చు.’
-ప్రొఫెసర్ మమత ఎన్ రావు, ఎన్‌ఐడీ - బెంగళూరు సెంటర్ కోఆర్డినేటర్.


ఐఐఎం - విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటవుతున్న మరో జాతీయ స్థాయి విద్యా సంస్థ.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ -విశాఖపట్నం. ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలోని ఆంధ్రాబ్యాంక్ స్కూల్ ఆఫ్ బిజినెస్ బిల్డింగ్‌ను తాత్కాలిక క్యాంపస్‌గా నిర్ణయించిన ఐఐఎం-విశాఖపట్నానికి ఐఐఎం-బెంగళూరు మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌గా వ్యవహరిస్తూ అకడమిక్ సహకారం అందిస్తుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రెండేళ్ల వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సును ప్రారంభిస్తారు. తొలుత 75 సీట్లతో ప్రారంభించాలని భావించినప్పటికీ స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. అయితే కచ్చితంగా 50 సీట్లు మాత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

‘ఐఐఎం-విశాఖపట్నం సీట్ల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎంపిక ప్రక్రియలో తుది దశ జీడీ/పీఐలను ఐఐఎం, ఉదయ్‌పూర్ నిర్వహిస్తుందనే వార్తల విషయంలో ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కానీ ఈ ఏడాది నుంచి క్లాస్‌లు ప్రారంభమవుతాయి’
-కవితా కుమార్, ఐఐఎం-బెంగళూరు ప్రతినిధి.


ట్రిపుల్‌ఐటీ - చిత్తూరు
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వా మ్యంలో చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో గత విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమైన మరో జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్ ట్రిపుల్‌ఐటీ-చిత్తూరు. దీనికి ఐఐటీ హైదరాబాద్ మెంటార్‌గా ఉంది. ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌లో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్న ట్రిపుల్‌ఐటీలో అందుబాటులో ఉన్న కోర్సులు, ప్రవేశాల వివరాలు..
  • కోర్సు: బీటెక్ (కంప్యూటర్‌సైన్స్ అండ్ ఇంజనీరింగ్)
    సీట్లు: 60
  • కోర్సు: బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)
    సీట్లు: 60
అభ్యర్థులు కోర్ సబ్జెక్ట్‌లతోపాటు కొన్ని ఎలక్టివ్స్‌ను మైనర్ సబ్జెక్ట్‌లుగా ఎంచుకునే అవకాశం ఈ ఇన్‌స్టిట్యూట్‌లో అందుబాటులో ఉంది.

‘జేఈఈ మెయిన్ మార్కుల ఆధారంగా సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్(సీఎస్‌ఏబీ) నిర్వహించే కౌన్సెలింగ్ ఆధారంగా సీట్ల భర్తీ చేస్తారు. ఈ ఏడాది నుంచి కొత్తగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌ల ప్రతినిధులతో కూడిన జాయింట్ అడ్మిషన్ బోర్డ్ నిర్వహిం చే.. జాయింట్ సీట్ అలొకేషన్ విధానంలో కూడా సీట్ల భర్తీ జరిగే అవకాశం ఉంది. ట్రిపుల్ ఐటీ సత్యవేడును అకడమిక్‌లో ఉత్కృష్టంగా రూపొందించేందుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తాం’.
- డీన్ ఫయజ్ అహ్మద్, అకడమిక్ అఫైర్స్, ఐఐటీ-హైదరాబాద్.


ఎన్‌ఐటీ-ఏలూరు
ఐఐటీల తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లు. వీటిని విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో కొత్తగా ఒక క్యాంపస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే క్లాస్‌లు ప్రారంభించాలని, ఇందుకోసం తాత్కాలికంగా సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని వినియోగిస్తున్నారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు ఎన్‌ఐటీ-వరంగల్ మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌గా వ్యవహరిస్తుంది.

‘సీట్లు, హోం స్టేట్ కోటా వంటి అంశాలపై నిర్దిష్ట ఆదేశాలు రాలేదు. జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ ప్రారంభమయ్యేలోపు వీటిపై స్పస్టత వచ్చే అవకాశం ఉంది’
-ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్, నిట్-వరంగల్ రిజిస్ట్రార్ (ఇన్‌ఛార్జ్)


ఐఐటీ - చిత్తూరు
ఇంజనీరింగ్ విద్యలో ప్రతిష్టాత్మక ఐఐటీల క్యాంపస్‌ల విస్తరణలో భాగంగా ఏర్పాటైన ఐఐటీ-చిత్తూరులోనూ ఈ విద్యా సంవత్సరం నుంచే బీటెక్ క్లాస్‌లు ప్రారంభమవుతాయి. ఐఐటీ-మద్రాస్ మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌గా వ్యవహరిస్తున్న ఐఐటీ-చిత్తూరు క్యాంపస్‌లో నాలుగు బ్రాంచ్‌లను, 120 సీట్లను కేటాయించే అవకాశం ఉంది.

‘ఐఐటీ - తిరుపతి విషయంలో పూర్తి వివరాలు ఈ నెలాఖరుకు తెలుస్తాయి. అకడమిక్‌గా అన్ని విధాలుగా సహకరిస్తాం. క్లాస్‌ల నిర్వహణకు అవసరమైన సామగ్రికి సంబంధించి టెండర్‌లకు ఆహ్వానించాం. చెన్నైకి తిరుపతికి మధ్య స్వల్ప దూరమే కావడంతో విద్యార్థుల అవసరాలను బట్టి చెన్నై క్యాంపస్‌కు తీసుకువెళ్లే సందర్భాలు ఏర్పడే అవకాశం ఉంది.’
-కె.రామమూర్తి, అకడమిక్ అఫైర్స్ డీన్, ఐఐటీ-చెన్న్ణై
Published date : 16 May 2015 12:15PM

Photo Stories