Skip to main content

ఇన్నోవేషన్‌.. నేటి యువత మంత్రం..!

అభద్రత, నిలకడలేని ఉద్యోగాల కంటే సొంత కాళ్లపై నిలదొక్కుకుందాం.. పట్టా చేతికొచ్చాక కొలువు ప్రయత్నం గతం మాట.. కళాశాలకు వెళ్తూనే ఉపాధి ఆలోచించడం నేటి పంథా.. విద్యార్థి దశ నుంచే అంకుర స్వప్నం.. కొత్త తరానికిదే కెరీర్‌ మంత్రం..

1) లాజినెక్ట్స్‌ సొల్యూషన్స్‌...
ఇది బిగ్‌డేటా, డేటా అనలిటిక్స్‌ ఆధారంగా సప్లయ్‌ చైన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ కార్యకలాపాలను నిర్వహించే సంస్థ. ముంబైకు చెందిన ఎంటెక్‌ విద్యార్థి ధ్రువిల్‌ సంగ్వి కొత్త ఆలోచనతో ఏర్పాటు చేశాడు. ఈ సంస్థకు గతేడాది ఎంటర్‌ప్రెన్యూర్‌ ఇండియా నిర్వహించిన ఎంటర్‌ప్రెన్యూర్‌ అవార్డ్స్‌– 2016లో బహుమతి లభించింది. పది లక్షల రూపాయల ఫండ్‌ కూడా అందింది.

2) అధాన్‌ :
ఇది షిప్పింగ్‌ కంటైనర్స్‌ను నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా మార్చి పలు ప్రాంతాల్లో యువతకు శిక్షణనిచ్చే సంస్థ. ముంబైకు చెందిన ఇద్దరు యువకుల్లో కళాశాల రోజుల్లోనే మొలకెత్తిన ఆలోచనకు ప్రతిరూపంగా ఏర్పాటైంది అధాన్‌. ఈ సంస్థ గతేడాది ఐఎస్‌బీ నిర్వహించిన బూట్‌ క్యాంప్‌లో విజేతగా నిలిచింది.

3) డ్రీమ్‌ వీయు...
ఇది వీఆర్‌ కెమెరా టెక్నిక్స్‌తో ప్రకృతి అందాలను చిత్రీకరించే సంస్థ. ఇద్దరు ఎంటెక్‌ విద్యార్థులు దీనికి ఆద్యులు. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ గతేడాది ఆవిష్కార్‌ పేరుతో నిర్వహించిన యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ పోటీలో విజేతగా నిలిచింది.
అంకుర సంస్థల (స్టార్టప్స్‌) పట్ల నవతరంలో పెరుగుతున్న ఆసక్తికి.. వారి అడుగులు ఆవిష్కరణల దిశగా పడుతున్నాయనడానికి నిదర్శనం ఈ ఉదంతాలు. కళాశాల రోజుల్లోనే పుట్టుకొచ్చిన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లి.. పెట్టుబడిదారులను సంప్రదించి కార్యరూపం ఇచ్చేందుకు అందుబాటులోని అన్ని మార్గాలను అన్వేషిస్తోంది నేటి యువత.

ఇన్‌స్టిట్యూట్‌ స్థాయిలోనే...
ఇటీవల యువత.. స్టార్టప్‌ ఆలోచనలను ఇన్‌స్టిట్యూట్‌ స్థాయిలోనే అమలు చేసేలా కదులుతోంది. విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్‌ సెంటర్స్, ఇంక్యుబేషన్‌ సెంటర్స్‌లో వీటికి రూపమిచ్చేలా చురుగ్గా పాల్గొంటోంది. ఇంక్యుబేషన్‌ సెంటర్లలో ఉండే మెంటార్లు, ఇతర నిపుణుల సాయంతో ఆలోచనలకు నగిషీలు దిద్దుతోంది. ఈ ఉత్సుకతకు మరింత ప్రోత్సాహమిచ్చేలా కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఐఐటీలు, ఐఐఎంలు తదితర టాప్‌ కళాశాలలు దీనిపై క్రమంతప్పకుండా పోటీలు నిర్వహిస్తున్నాయి. తద్వారా పెట్టుబడిదారులు, ఔత్సాహికులను ఒక వేదికపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి.

ఇన్వెస్టర్లను సంప్రదించేందుకు..
తమ ఆలోచనకు ఇన్‌స్టిట్యూట్‌ స్థాయిలో సానుకూల స్పందన లభిస్తే.. దాన్ని సంస్థగా మార్చుకునేందుకు.. అవసరమైన పెట్టుబడికి పలు మార్గాలు అన్వేషిస్తోంది యువత. ప్రధానంగా టై, నాస్‌కామ్, ఎంటర్‌ ప్రెన్యూర్‌ ఇండియా వంటి సంస్థలు నిర్వహించే ‘బూట్‌ క్యాంప్స్‌‘, ‘స్టార్టప్‌ ఇనీషియేటివ్‌ కాంపిటీషన్స్‌’లో పాల్గొంటోంది. అక్కడికి వచ్చే ఏంజెల్‌ ఇన్వెస్టర్లకు, ఫండింగ్‌ ఏజెన్సీలకు ఉద్దేశాలను వివరించి.. వారిని మెప్పించి.. నిధులు సమకూర్చుకునే అవకాశాలను వినియోగించుకుంటోంది.

స్వయం ఉపాధి వైపు మొగ్గు...
నేటితరం ఇన్నోవేషన్స్, స్టార్టప్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం.. స్వయం ఉపాధిని బలంగా కోరుకుంటుండటమే.! సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు.. ఆలోచనలను అమల్లో పెట్టేందుకు.. స్వీయ ఆసక్తి మేరకు పనిచేసేందుకు స్టార్టప్‌ ద్వారా అవకాశం ఉంటుందని యూత్‌ భావిస్తోంది. తమ స్టార్టప్‌ విజయపథంలో ఉంటే.. ఫండింగ్‌ ద్వారా మరింత విస్తరించొచ్చని.. తద్వారా తాము ఉపాధి పొందడంతో పాటు మరికొందరికి ఉద్యోగాలు కల్పించొచ్చనే అభిప్రాయం వారిలో కనిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

కొలువుల్లో అభద్రత...
కార్పొరేట్‌ కొలువుల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఉద్యోగ అభద్రత. ఉద్యోగం లభించినా.. కొనసాగింపుపై అనిశ్చితి.. యువత స్టార్టప్‌ దిశగా ఆలోచించడానికి మరో కారణం..! ముఖ్యంగా ఐటీ రంగంలో ఇలాంటి ఆందోళన ఉంది. ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌లో అన్ని రంగాల్లో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటివి దూసుకొస్తున్నాయి. కొలువుల్లో చేరుతున్న అభ్యర్థులు.. నిరంతరం అత్యున్నత స్థాయి కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటేనే మనుగడ. నిరంతరం అభద్రత వెంటాడే కొలువుల కంటే స్వయం ఉపాధి ప్రయత్నాలు కొనసాగించడం ఉత్తమమని యువతరం భావిస్తోంది. డిజిటల్‌ ఇండియా, అటల్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్, మేకిన్‌ ఇండియా వంటి పథకాల ద్వారా చేయూత పొందొచ్చనేది కూడా ఔత్సాహికుల ఆలోచనగా ఉంది.

జాగ్రత్తలు తప్పనిసరి...
స్టార్టప్స్‌ వైపు దృష్టిసారించే విద్యార్థులు.. వాటికి కార్యరూపం ఇవ్వడంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘వారి ఆలోచనకు మార్కెట్‌ సామర్థ్యం ఏ స్థాయిలో ఉంది? స్టార్టప్‌గా మార్చేందుకు ఇంక్యుబేషన్‌ పరంగా ఉన్న అవకాశాలు ఏమిటి? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇంక్యుబేషన్‌ సెంటర్లలో సరైన ప్రేరణ లభించకపోతే చేసిన కృషి అంతా వృథాగా మారుతుంది. అంతేకాక సంస్థను ఏర్పాటు చేసే క్రమంలో తొలి దశలో ఎవరో ఒక ఇన్వెస్టర్‌ లభిస్తే చాలు.. అనే ధోరణి తగదు. ఇన్వెస్టర్‌ పూర్వ చరిత్ర, వారు విధించే నిబంధనలæ గురించి క్షుణ్నంగా తెలుసుకున్నాకే ఒప్పందం చేసుకోవాలి’ అని వివరిస్తున్నారు.

భవిష్యత్తు ప్రణాళికలు..
స్టార్టప్‌ ఔత్సాహిక యువత సంబంధిత కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలనేది నిపుణుల సూచన. ఇన్‌స్టిట్యూట్‌లో అందుబాటులో ఉన్న ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్‌ సెంటర్స్‌ను వీలైనంత త్వరగా సంప్రదించాలి. అప్పుడే కోర్సు పూర్తయ్యే నాటికి కార్యరూపం ఇచ్చే అవకాశం లభిస్తుంది. స్టార్టప్‌ ఏర్పాటు క్రమంలోనే భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి. సంస్థను ప్రారంభించడం నుంచి వైండప్‌ విధానం వరకూ.. అన్నింటిపైనా సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. కొన్ని స్టార్టప్స్‌కు సంబంధిత రంగంలోని పరిస్థితుల ఆధారంగా మార్కెట్‌ సామర్థ్యం కొద్ది కాలమే ఉంటుంది. అలాంటప్పుడు వైండప్‌ స్ట్రాటజీపైనా ముందుగానే అవగాహన ఏర్పరచుకోవాలి అనేది నిపుణుల సలహా. అలాగే ఏర్పాటు సమయంలో ఆ రంగంలో ఒకటి రెండు సంస్థలే ఉన్నా.. ఆ తర్వాత పోటీ పెరిగినా తట్టుకునేలా వ్యూహాలు సిద్ధం చేసి పెట్టుకోవాలి.

ప్రత్యామ్నాయాలపైనా దృష్టి :
చాలామంది విద్యార్థులు ఇంక్యుబేషన్‌ సెంటర్స్‌లో స్టార్టప్‌ దిశగా కసరత్తు చేస్తున్న సహచరులను చూసి ఆ దిశగా కదిలితే బాగుంటుందని భావిస్తారు. ఈ క్రమంలో తమ నైపుణ్యాల స్థాయిని స్వీయ విశ్లేషణ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఐడియాలకు రూపమిచ్చే క్రమంలో ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యమిస్తూనే.. వేరే మార్గాలూ చూసుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో స్టార్టప్‌ ఐడియాలకు ఎంత ప్రయత్నించినా ఫండింగ్‌ ఏజెన్సీల నుంచి సానుకూల స్పందన రాదు. ఇలాంటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు.. ప్రధానంగా ఉద్యోగ సాధన గురించి ఆలోచించాలని సూచిస్తున్నారు.

ఒకటి రెండేళ్ల ఉద్యోగం తర్వాత...
ప్రస్తుతం యువ పట్టభద్రుల్లో స్టార్టప్‌ ఆలోచనలు పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయినా అడుగిడాలనుకుంటున్న రంగంలో కనీసం ఒకట్రెండేళ్ల పని అనుభవం గడించాక కార్యరూపం ఇస్తే మరింత సమర్థంగా మనుగడ సాగించే అవకాశం ఉంటుంది. స్టార్టప్‌ ఆలోచన మదిలో మెదిలినప్పుడే ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ నుంచి వైండప్‌ స్ట్రాటజీ వరకు.. అన్నింటిపై సంపూర్ణ అవగాహనతో అడుగులు వేస్తేనే విజయం లభిస్తుంది అంటున్నారు నిపుణులు.

పెరుగుతున్న ఔత్సాహికుల సంఖ్య...
యువతలో స్టార్టప్‌ ఔత్సాహికుల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవమే. ఇటీవల ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయిలో ఇంక్యుబేషన్‌ సెంటర్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఐడియాలకు కార్యరూపం ఇచ్చేందుకు కదులుతున్నారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం భవిష్యత్తు అవకాశాల గురించి తెలుసుకోవడం. అప్పుడే సరైన మార్గంలో పయనించే అవకాశం లభిస్తుంది. ఫండింగ్‌ ఏజెన్సీల తోడ్పాటు కూడా లభిస్తుంది.
–ప్రొఫెసర్‌.వి.వి.వర్మ, డీన్‌ ఆర్‌అండ్‌డీ, ఐఐఐటీ–హెచ్‌

Published date : 16 Sep 2017 05:34PM

Photo Stories