Skip to main content

ఇండస్ట్రీ 4.0...ఉత్తమ కెరీర్ అవకాశాలు!

ఇక ఇప్పుడు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఆటోమేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స (ఐవోటీ).. విజృంభణతో నాలుగో పారిశ్రామిక విప్లవం లేదా ఇండస్ట్రీ 4.0 మొదలైంది. గత కొంతకాలంగా కార్పొరేట్ ప్రపంచంలో, మీడియాలో ఇండస్ట్రీ 4.0పై పెద్ద చర్చే జరుగుతోంది. అసలు ఇండస్ట్రీ 4.0 అంటే ఏమిటి? దాని స్వరూపం.. ఎలాంటి నైపుణ్యాలున్న వారికి ఇండస్ట్రీ 4.0 ఆహ్వానం పలుకుతోంది. లేటెస్ట్ టెక్నాలజీపై పట్టు సాధించేందుకు.. ఏ కోర్సులు చదవాలి.. అందుబాటులోకి వస్తున్న కొత్త కొలువులు.. అవసరమైన జాబ్ స్కిల్స్ తదితర వివరాలు...
1760లలో స్టీమ్ ఇంజన్ ఆవిష్కరణతో.. మొదటి పారిశ్రామిక విప్లవం మొదలైంది.
1780ల తర్వాత విద్యుత్‌ను కనుగొనడంతో.. రెండో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం జరిగింది.
1960ల్లో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆవిష్కరణతో మూడో పారిశ్రామిక విప్లవానికి నాంది పడింది.

ఇటీవల కాలంలో ఇండస్ట్రీ 4.0 పద ప్రయోగం మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది. ఉత్పత్తి, సేవల ప్రక్రియలో.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఐవోటీ, ఆటోమేషన్.. కార్యకలాపాలనే నాలుగో పారిశ్రామిక విప్లవం లేదా ఇండస్ట్రీ 4.0 అంటున్నారు. అంటే.. మనం ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవ కాలంలో ఉన్నాం. ఇండస్ట్రీ 4.0కి పర్యాయపదం.. స్మార్ట్ ఫ్యాక్టరీస్. సంస్థలు తమ కార్యకలాపాల నిర్వహణలో లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకుంటూ..‘స్మార్ట్’గా అడుగులు వేస్తుండటమే.. స్మార్ట్ ఫ్యాక్టరీస్. ఇప్పుడు ఇదే.. కెరీర్ ఔత్సాహికులకు వరంగా మారింది. ఇండస్ట్రీ 4.0 కోరుకునే స్కిల్స్‌ను అందిపుచ్చుకుంటే.. భవిష్యత్‌లో కంపెనీలు రెడ్‌కార్పెట్ స్వాగతం పలకడం ఖాయం అంటున్నారు నిపుణులు.

అన్ని రంగాల్లోనూ...
నేటి ఇండస్ట్రీ 4.0 కాలంలో.. అన్ని రంగాల్లో.. జాబ్ ప్రొఫైల్స్ మారిపోతున్నాయి. ఉత్పత్తి, సేవల రంగం, సాఫ్ట్‌వేర్/ఐటీ, హెల్త్‌కేర్.. ఇలా అన్ని రంగాల్లోనూ ఆటోమేషన్ వినియోగం పెరిగిపోతోంది. మానవ ప్రమేయం తగ్గిపోతోంది. ఆటోమేటెడ్, డిజిటల్ కార్యకలాపాల పాత్ర ఊపందుకుంటోంది. వాస్తవానికి రెండు, మూడేళ్ల నుంచే ఆటోమేషన్, ఐవోటీ ప్రమేయం ప్రారంభమైనప్పటికీ.. ఇటీవల కాలంలో అన్ని విభాగాల్లో వీటి వినియోగం విస్తృతమవుతోంది. పలు అంచనాల ప్రకారం అంతర్జాతీయంగా ఇప్పటికే దాదాపు 60 శాతం సంస్థలు ఐవోటీ, ఆటోమేషన్ ఆధారిత సేవల దిశగా అడుగులేస్తున్నాయి. మరో 30 శాతం సంస్థలు వచ్చే రెండేళ్లలో తాము కూడా ఆటోమేషన్ బాట పట్టనున్నట్లు పేర్కొంటున్నాయి. ఆటోమేషన్ అంటే.. ఐటీ, సాఫ్ట్‌వేర్ సంస్థలు మాత్రమే కాదు. తయారీ రంగం నుంచి సేవల విభాగం వరకూ... అన్ని రంగాల్లోనూ ఆటోమేషన్, రోబోటిక్స్, ఐవోటీ ప్రాధాన్యం పెరుగుతోంది.

రోబోటిక్స్ :
ఇండస్ట్రీ 4.0లో ఉత్పత్తి ప్రక్రియ మొదలు సేవల వరకూ.. సంస్థలు రోబోల వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నాయి. దాంతో రోబోటిక్స్ నైపుణ్యాలున్న వారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. రోబోటిక్స్‌కు సంబంధించిన నైపుణ్యాలంటే.. నిర్దిష్ట పనికోసం రోబోను డిజైన్ చేయడం, అది నిర్వహించాల్సిన పనిని పరిగణనలోకి తీసుకొని ప్రోగ్రామింగ్ రూపొందించడం వంటివి. ప్రస్తుతం అకడమిక్‌గా పలు ఇన్‌స్టిట్యూట్స్‌లో రోబోటిక్ టెక్నాలజీస్‌కు సంబంధించి షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. అదే విధంగా ఎంటెక్ స్థాయిలో రోబోటిక్ స్పెషలైజేషన్ కోర్సులు కూడా ఉన్నాయి. వీటిని పూర్తిచేసుకొని ఆయా సంస్థల వాస్తవ పనితీరుకు తగ్గ క్షేత్రనైపుణ్యాలు సొంతం చేసుకుంటే... ఇండస్ట్రీ 4.0లో ఉత్తమ కెరీర్ అవకాశాలు అందుకోవచ్చు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ :
నేటి నాలుగో పారిశ్రామిక విప్లవంలో కీలకంగా మారుతున్న మరో టెక్నాలజీ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ). ప్రోగ్రామింగ్ ద్వారా యంత్రం తనంతట తాను పనిచేసేలా చూసేదే కృత్రిమ మేధ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీపై పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక రంగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ప్రారంభమైంది. ఇప్పటివరకూ యంత్రాలు మనం చెబితేనే అవి పనిచేసేవి. అంటే.. ఏదైనా యంత్రం పనిచేయడానికి మానవ ప్రమేయం తప్పనిసరి. కానీ, ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో యంత్రాలు స్వయంగా పనిచేస్తాయి. కొంతమేర సొంతంగా నిర్ణయాలు తీసుకోగలవు. ఉదాహరణకు డ్రైవర్‌లేని కారు. మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటాసైన్స్ వంటివి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించినవే. సీఎస్‌ఈ, ఐటీతోపాటు మెకానికల్, సివిల్, కెమికల్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫార్మసీ.. ఇలా ఏ నేపథ్యమున్నవారైనా సంబంధిత కోర్సులు పూర్తిచేయడం, నైపుణ్యాలు మెరుగుపరచుకోవడం ద్వారా ఏఐ సంబంధిత కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్, టీసీఎస్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి కంపెనీల్లో అవకాశాలు అందుకోవచ్చు.

బ్లాక్‌చైన్ టెక్నాలజీ :
ఇండస్ట్రీ 4.0లో భాగంగా తెరపైకి వస్తున్న మరో లేటెస్ట్ టెక్నాలజీ.. బ్లాక్ చైన్ టెక్నాలజీ. కంపెనీలు తాము అందించే సేవలు, తమ సంస్థల్లోని కార్యకలాపాలు సురక్షితంగా ఉండేలా చూసే విధానమే బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే... ప్రస్తుత పరిస్థితుల్లో కొలువు ఖాయమని చెప్పొచ్చు. బ్లాక్ చైన్ కౌన్సిల్ అంచనా ప్రకారం ఈ విభాగంలో 2020 నాటికి రెండు లక్షల ఉద్యోగాలు లభించే అవకాశముంది.

డేటా అనలిటిక్స్ :
డిజిటల్ సేవలు, ఈ-కామర్స్ విస్తరణ కారణంగా మానవ వనరులకు డిమాండ్ పెరుగుతున్న మరో విభాగం.. డేటా అనలిటిక్స్. ఉత్పత్తి నుంచి సేవల రంగం వరకూ... సంస్థలు తమ వినియోగదారుల డేటాను నిక్షిప్తం చేయడం.. వారి అభిరుచులను విశ్లేషించడం.. తద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు దోహదంచేసే ప్రక్రియే.. డేటాఅనలిటిక్స్. ఇప్పుడు ప్రతి సంస్థా మార్కెట్లో ముందుండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆ దిశగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు డేటా అనలిటిక్స్ ఉపయోగపడుతుంది. డేటాఅనలిటిక్స్ నైపుణ్యాలున్న వారికి ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు.. ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎం వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించి రూ.13 లక్షల సగటు వార్షిక వేతనంతో కొలువులు అందిస్తున్నాయి.

బిగ్ డేటా మేనేజ్‌మెంట్ :
లక్షల్లో వినియోగదారులు.. వందల కోట్లలో వ్యాపారం.. వేల సంఖ్యలో వినిమయ వస్తువులు.. ప్రస్తుత ఈ-కామర్స్, డిజిటల్ ఆధారిత సేవల ప్రపంచంలో కొనసాగుతున్న ట్రెండ్. ఇంతటి విస్తృత డేటాను నిర్వహించేందుకు నిపుణుల అవసరం ఉంటుంది. అందుకే బిగ్ డేటా మేనేజ్‌మెంట్ తెరపైకి వచ్చింది. మొత్తం సమాచారాన్ని ఒడిసిపట్టి, విశ్లేషించి నిక్షిప్తం చేయడం.. అంతేకాకుండా ఆయా డేటావిశ్లేషణ సమాచారం సంస్థలోని వివిధ విభాగాలకు ఉపయోగపడేలా నివేదికలు రూపొందించడం బిగ్ డేటా మేనేజ్‌మెంట్ నిపుణుల పని. ప్రస్తుతం పలు సంస్థలు బిగ్‌డేటా నిపుణుల నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. రాండ్‌స్టాండ్ ఇండియా నివేదిక ప్రకారం వచ్చే రెండేళ్లలో ఐటీ నిపుణుల కంటే 50 శాతం మేర అధికంగా బిగ్‌డేటా అనలిటిక్స్ నిపుణుల అవసరం ఏర్పడనుంది.

సైబర్ సెక్యూరిటీ :
ఇండస్ట్రీ 4.0లో సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యం పెరుగుతోంది. కంపెనీలు టెక్నాలజీ ఆధారంగా అందించే సేవలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు, ప్రభుత్వ విభాగాల విలువైన సమాచారం.. హ్యాకింగ్‌కు గురికాకుండా సురక్షితంగా ఉంచేందుకు సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఉంటుంది. 2020 నాటికి 20 లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణుల కొరత ఉంటుందని నాస్‌కామ్ అంచనా.

నైపుణ్యాలు సొంతం చేసుకోవడమెలా?
నేటి నాలుగో పారిశ్రామిక విప్లవానికి అవసరమైన నైపుణ్యాలు సొంతం చేసుకోవడం ఎలా? లక్షల సంఖ్యలో ఊరిస్తున్న కొలువులను ఖాయం చేసుకునేందుకు మార్గం ఏమటి? ఇప్పుడు సర్వ సాధారణంగా యువతలో తలెత్తున్న సందేహాలు! ప్రస్తుతం ఐబీఎం, సిస్కో, మైక్రోసాఫ్ట్, వీఎం వేర్, ఇంటెల్ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు.. ఆటోమేషన్, ఐఓటీ పరిధిలోని పలు విభాగాల్లో ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. అదే విధంగా ఇటీవల కాలంలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ స్థాయిలోనూ లేటెస్ట్ టెక్నాలజీపై అవగాహన కల్పించేలా కరిక్యులంలోనూ మార్పులు చేస్తున్నారు.

ఇండస్ట్రీ 4.0 ముఖ్యాంశాలు :
  • స్మార్ట్ ఇండస్ట్రీ దిశగా అడుగులు వేస్తున్న 80 శాతం సంస్థలు.
  • 2020 నాటికి గ్లోబల్ ఐవోటీ మార్కెట్లో భారత్ వాటా 20 శాతానికి చేరుకునే అవకాశం.
  • వచ్చే రెండేళ్లలో ఐఓటీ విభాగాల్లో 15 నుంచి 20 లక్షల ఉద్యోగాలు.
  • ప్రపంచ వ్యాప్తంగా వచ్చే రెండేళ్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో 2.3 మిలియన్ల ఉద్యోగాలు.

ఇదే సరైన సమయం...
ఇండస్ట్రీ 4.0 నేపథ్యంలో యువత సంబంధిత నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికిదే ఇదే సరైన సమయం. అకడమిక్ కరిక్యులంతో సంబంధం లేకుండా.. నాస్‌కామ్, ఎన్‌ఎస్‌డీసీ, ఇతర ప్రముఖ సంస్థలు అందించే ఆన్‌లైన్ శిక్షణ తీసుకోవాలి. ఆయా అవ కాశాలను అందిపుచ్చుకోవాలి. ఇప్పటి నుంచే సం బంధిత నైపుణ్యాలు పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తే.. మరింతగా విస్తరించనున్న ఐవోటీ విభాగాల్లో భవిష్యత్‌లో ఉద్యోగాలు సొంతం చేసుకోవడం తేలిక అవుతుంది.
-సతీశ్ కుమార్, మేనేజర్, నాస్‌కామ్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్
Published date : 27 Jul 2018 12:36PM

Photo Stories