Skip to main content

ఈ షుగర్‌ టెక్నాలజీ కోర్సులు చదివితే.. నెలకు రూ. 25వేలు ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు..

దేశంలో చక్కెర పరిశ్రమ.. ప్రైవేట్‌ రంగంలో కొనసాగుతున్న అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటి. చక్కెర తయారీ ప్రత్యేకమైన విధానంతో కూడుకొని ఉంటుంది.

ఇందులో అనేక ప్రక్రియలు ఉంటాయి. చక్కెర ఉత్పత్తిలో కీలక పద్ధతులైన కిణ్వప్రక్రియ, ప్రాసెసింగ్‌ వంటి వాటిలో పనిచేసే నిపుణులకు ‘షుగర్‌ టెక్నాలజీ’పై శిక్షణ అవసరం ఉంటుంది. అందుకోసం దేశంలో నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌(కాన్పూర్‌)తోపాటు పలు సాంకేతిక విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, పాలిటెక్నికల్‌ కాలేజీలు.. సర్టిఫికెట్‌ స్థాయి నుంచి ఇంజనీరింగ్‌ వరకూ.. వివిధ కోర్సులకు అందిస్తున్నాయి. తాజాగా నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. షుగర్‌ టెక్నాలజీ కోర్సులు, అందించే విద్యా సంస్థలు, ఉద్యోగావకాశాలు, వేతనాలు, కెరీర్‌ స్కోప్‌పై ప్రత్యేక కథనం...

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చెప్పుకోదగ్గ సంఖ్యలో షుగర్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కాని దేశంలో షుగర్‌ టెక్నాలజీ కోర్సులు అందించే ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య తక్కువనే చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ రంగంలో ఉద్యోగాల గురించి విద్యార్థుల్లో సరైన అవగాహన లేదు. కానీ జాబ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో షుగర్‌ టెక్నాలజీ ముందుంటోంది.

షుగర్‌ టెక్నాలజీ కోర్సులు..
చక్కెర పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు దేశంలోని పలు ఇన్‌స్టిట్యూట్‌లు.. షుగర్‌ టెక్నాలజీ కోర్సులను అందిస్తున్నాయి. అవి..

  • బీఎస్సీ–షుగర్‌ టెక్నాలజీ
  • బీటెక్‌–షుగర్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ
  • ఎమ్మెస్సీ–షుగర్‌ టెక్నాలజీ
  • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ ఫెర్మెంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ
  • పీజీ డిప్లొమా ఇన్‌ షుగర్‌ ఇంజనీరింగ్‌
  • పీజీ డిప్లొమా ఇన్‌ షుగర్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ
  • పీజీ డిప్లొమా ఇన్‌ షుగర్‌ టెక్నాలజీ
  • సర్టిఫికెట్‌ కోర్సు ఇన్‌ షుగర్‌ బాయిలింగ్‌
  • సర్టిఫికెట్‌ కోర్సు ఇన్‌ షుగర్‌ ఇంజనీరింగ్‌
  • సర్టిఫికెట్‌ కోర్సు ఇన్‌ షుగర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌.

అర్హతలు..

  • షుగర్‌ టెక్నాలజీలో ఇంజనీరింగ్, బ్యాచిలర్‌ డిగ్రీలో చేయాలనుకుంటే.. ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత పోస్టు గ్రాడ్యుయేషన్‌, పీజీ డిప్లొమా, పరిశోధన వంటి కోర్సుల్లోనూ చేరే వీలుంది.
  • షుగర్‌ టెక్నాలజీలో కోర్సులను అందించడంలో నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌ఎస్‌ఐ)–కాన్పూర్, వసంతదాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (వీఎస్‌ఐ)–పుణే ముందుంటున్నాయి. ఇవి అందించే కోర్సులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. వీటితోపాటు పలు కాలేజీలు సైతం డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి.

ఎన్‌ఎస్‌ఐ – కాన్పూర్‌..

  • చక్కెర పరిశ్రమలకు పెట్టింది పేరైన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో స్వాతంత్య్రానికి ముందే ‘నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఎస్‌ఐ)’ ఏర్పాటైంది. గతంలో ఈ సంస్థ ఇంపీరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ షుగర్‌ టెక్నాలజీగా ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ షుగర్‌ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ)గా మారింది. చివరకు 1957 ఏప్రిల్‌లో ‘నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌’గా పేరు మార్చుకొని.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది.
  • ఎన్‌ఎస్‌ఐ ప్రస్తుతం పలు కోర్సులను అందిస్తోంది. అవి.. షుగర్‌ కెమిస్ట్రీ, షుగర్‌ టెక్నాలజీ, షుగర్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నికల్‌ విభాగాల్లో కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది.
  • ఎన్‌ఎస్‌ఐ కోర్సుల్లో ఫెలోషిప్‌ ఆఫ్‌ నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు ఆఫ్‌ అసోసియేట్‌షిప్‌ ఆఫ్‌ నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ షుగర్‌ టెక్నాలజీ, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు ఆఫ్‌ అసోసియేట్‌షిప్‌ ఆఫ్‌ నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ షుగర్‌ ఇంజనీరింగ్‌. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు ఇన్‌ ఇండస్ట్రియల్‌ ఫెర్మెంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు ఇన్‌ షుగర్‌ ప్రొడక్టివిటీ అండ్‌ మెచ్యూరిటీ మేనేజ్‌మెంట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు ఇన్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ క్వాలిటీ కంట్రోల్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, షుగర్‌ ఇంజనీరింగ్‌ సర్టిఫికెట్‌ కోర్సు, షుగర్‌ బాయిలింగ్‌ సర్టిఫికెట్‌ కోర్సు, క్వాలిటీ కంట్రోల్‌ సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తోంది. నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌–కాన్పూర్‌ అందించే పలు కోర్సుల్లో 2020–21 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంట్రన్స్‌ టెస్ట్‌లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా ఆయా కోర్సుల సీట్లను భర్తీ చేస్తారు. ఆసక్తి గలవారు 2021 జూన్‌ 4వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ప్రవేశాలు, వివరాలకు వెబ్‌సైట్‌: http://nsi.gov.in

వసంత్‌దాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌..

  • భారతదేశంలో చెప్పుకోదగ్గ మరో ప్రముఖ చక్కెర ఇన్‌స్టిట్యూట్‌ పుణెలోని ‘వసంత్‌దాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌’. ఇది సావిత్రిబాయి పూలే పుణే విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. ఈ సంస్థ ప్రవేశ పరీక్ష ఆధారంగా వివిధ స్పెషలైజేషన్లలో.. పీజీ డిప్లొమా, ఎమ్మెస్సీ, సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది.
  • వివరాలకు వెబ్‌సైట్‌: www.vsisugar.com
  • మధురై కామరాజ్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న తమిళనాడులోని దేవాంగ ఆర్ట్స్‌ కాలేజీ ఇంటర్‌ అర్హత గలవారికి ఏడాది కాలపరిమితి గల డిప్లొమా ఇన్‌ షుగర్‌ టెక్నాలజీ కోర్సును ఫుల్‌టైమ్‌ కోర్సుగా అందిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్వీ పాలిటెక్నిల్‌ కాలేజీ (తిరుపతి) పదో తరగతి తర్వాత మూడేళ్ల ఫుల్‌టైమ్‌ కోర్సుగా డిప్లొమా ఇన్‌ షుగర్‌ టెక్నాలజీ కోర్సును అందిస్తోంది.
  • గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ, నిజామాబాద్‌లో మూడేళ్ల డిప్లొమా ఇన్‌ కెమికల్‌ అండ్‌ షుగర్‌ టెక్నాలజీ కోర్సు అందుబాటులో ఉంది.

ఉద్యోగ అవకాశాలు..

  • షుగర్‌ టెక్నాలజీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు షుగర్‌ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు, పరిశోధకులు, సూపర్‌వైజర్లు, క్వాలిటీ అనలిస్టులుగా సేవలు అందించవచ్చు. వీరికి చక్కెర కర్మాగారాలు, నాన్‌–ఆల్కహాలిక్, ఆల్కహాలిక్‌ డ్రింక్స్‌ ఉత్పత్తి కంపెనీలు, చక్కెర పరిశోధన ల్యాబ్స్‌తోపాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఉద్యోగాలు లభిస్తాయి.
  • ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫెర్టిలైజర్‌ కో ఆపరేటివ్‌ లిమిటెడ్‌(ఇఫ్కో), నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కో ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీస్‌(ఎన్‌ఎఫ్‌సీసీఎస్‌ఎఫ్‌) వంటి ప్రభుత్వ, ప్రైవేట్‌ చక్కెర ఫ్యాక్టరీల్లో కొలువులు దక్కించుకోవచ్చు.
  • సియల్‌ గ్రూప్, డీఎస్‌సీఎల్‌ గ్రూపు, రాణా షుగర్స్‌ అండ్‌ బిర్లా గ్రూప్‌ మొదలైన సంస్థలు చక్కెర టెక్నాలజీ, సంబంధిత కోర్సుల విద్యార్థులకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయి. నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఆల్కహాల్‌ టెక్నాలజీ కోర్సులు చేసినవారిని ఎస్‌ఏబీ మిల్లర్స్, మెక్‌ డోవెల్, ఇండియా–గ్లైకోల్స్, పెర్నోడ్‌–రికార్డ్‌ డిస్టిలరీ వంటి అంతర్జాతీయ సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ కోర్సుల్లో పీహెచ్‌డీ చేసినవారిని చాలా ఇన్‌స్టిట్యూట్స్‌ పరిశోధకులుగాను, టీచింగ్‌ ఫ్యాకల్టీగాను నియమించుకుంటున్నాయి.

వేతనాలు..
షుగర్‌ టెక్నాలజీ కోర్సులు పూర్తిచేసిన వారికి సంస్థను బట్టి వేతనాలు ఉంటాయి. పదోతరగతి తర్వాత డిప్లొమా చేసినవారికి ప్రారంభ వేతనం నెలకు రూ.25 వేల వరకు ఉంటుంది. ఏడాది అనుభవం ఉన్నవారికి వార్షిక వేతనం రూ.6 లక్షల వరకు లభిస్తోంది. డిస్లరీస్‌లో ఈ వేతనాలు ఇంకా అధికంగా ఉటాయి. ఎఎస్‌ఐ–కాన్పూర్‌ వంటి టాప్‌ ఇన్‌స్టిట్యూట్ల నుంచి కోర్సులు పూర్తి చేసిన వారు, వీఎస్‌ఐ–పుణెలో చదువుకున్నవారు నైపుణ్యాలు, అనుభవం ద్వారా 6 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వార్షిక వేతనం అందుకునే అవకాశం ఉంది.

Published date : 09 Apr 2021 03:02PM

Photo Stories