Skip to main content

ఈ రాజ్యసభ ఫెలోషిప్‌తో చట్టసభల అధ్యయనంతోపాటు.. రూ.8 లక్షల వరకు గ్రాంట్‌..

భారత పార్లమెంట్‌.. ముఖ్యంగా రాజ్యసభ కార్యకలాపాలను అధ్యయనం చేయాలని, అవగాహన పెంచుకోవాలని కోరుకునే అభ్యర్థులకు మంచి అవకాశం.

 రాజ్యసభలో ఫెలోషిప్, ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కల్పించేందుకు రాజ్యసభ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో.. రాజ్యసభ ఫెలోషిప్, ఇంటర్న్‌షిప్‌ల పూర్తి సమాచారం...

ఆర్‌ఎస్‌ఆర్‌ఎస్‌ అంటే..
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోని వివిధ అంశాలపై పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. 2009లో డాక్టర్‌ ఎస్‌.రాధాకృష్ణన్‌ చైర్‌ అండ్‌ రాజ్యసభ ఫెలోషిప్స్‌ పథకాన్ని రాజ్యసభ ఏర్పాటు చేసింది. దీనికి ‘రాజ్యసభ రీసెర్చ్‌ అండ్‌ స్టడీ’ (ఆర్‌ఎస్‌ఆర్‌ఎస్‌) స్కీమ్‌గా పేరుపెట్టారు. ఇందులో రాజ్యసభ ఫెలోషిప్‌లు నాలుగు, రాజ్యసభ స్టూడెంట్‌ ఎంగేజ్‌మెంట్‌ ఇంటర్న్‌షిప్‌లు పది అందిస్తున్నారు. వీటికి గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

రాజ్యసభ ఇంటర్న్‌షిప్‌– అర్హతలు

  • భారత పార్లమెంటులోని వివిధ విధానపరమైన అంశాలను..ముఖ్యంగా రాజ్యసభ కార్యకలాపాలను విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ ఇంటర్న్‌షిప్‌ లక్ష్యం. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు రాజ్యసభ ఇంటర్న్‌షిప్‌కు అర్హులు. గ్రాడ్యుయేట్స్‌ ఐదుగురు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌ æఐదుగురికి (మొత్తం 10 మంది) ఇంటర్న్‌గా అవకాశం కల్పిస్తారు. రాజ్యసభ సెక్రటేరియట్‌ ద్వారా సెక్రటరీ జనరల్‌ ఆధ్వర్యంలో ఇంటర్న్స్‌ ఎంపిక జరుగుతుంది. వేసవి సెలవుల్లో ఈ ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది.
  • ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులను సచివాలయంలోని కీలకమైన లెజిస్లేటివ్‌ సెక్షన్, బిల్‌ ఆఫీస్, టేబుల్‌ ఆఫీస్, కమిటీ సెక్షన్స్‌ మొదలైన వాటిలో సంబంధిత బ్రాంచ్‌ సూపర్‌విజన్‌/మెంటారింగ్‌ కింద నియమిస్తారు. ఎంపికైన తేదీ నుంచి రెండు నెలలపాటు ఈ ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. వీరికి నెలకు రూ.10వేల చొప్పున స్టయిఫండ్‌ చెల్లిస్తారు.
  • ఇంటర్న్‌షిప్‌ గడువు నాటికి ఇంటర్న్‌లు తాము చేసిన పని, నేర్చుకున్న అంశాలతో నివేదికను తమకు కేటాయించిన సూపర్‌వైజర్‌/మెంటార్‌కు సమర్పించాల్సి ఉంటుంది. విజయవంతంగా ప్రోగ్రామ్‌ పూర్తి చేసినవారికి రాజ్యసభ నుంచి సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు.

రాజ్యసభ ఫెలోషిప్‌– అర్హతలు..

  • మొత్తం నాలుగు ఫెలోషిప్స్‌ అందిస్తున్నారు. ఈ ఫెలోషిప్‌ స్కీమ్‌ ద్వారా అభ్యర్థులు పార్లమెంటరీ సంస్థల పనితీరు, ఆయా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై అధ్యయనం చేస్తారు. సంబంధిత విద్యార్హత, సోషల్‌ సైన్స్, లా ఇతర సంబంధిత అంశాల్లో కనీసం మాస్టర్స్‌ డిగ్రీ ఉన్న అభ్యర్థులు/అనుభవం గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఫిల్, పీహెచ్‌డీ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. వీటికి మాజీ పార్లమెంటు సభ్యులు/రాష్ట్ర శాసనసభ సభ్యులు, పార్లమెంటు/రాష్ట్ర శాసనసభ సచివాలయాల మాజీ అధికారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు 25 ఏళ్ల నుంచి 65ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
  • కాలవ్యవధి: ఫెలోషిప్‌ 18 నెలల పాటు ఉంటుంది. అవసరాన్ని బట్టి మరో ఆరు నెలల వరకు పొడిగించే అవకాశం ఉంది.
  • అధ్యయనం చేయాల్సిన అంశాలు: ప్రధాన చట్టాల మదింపు, పార్లమెంటరీ కమిటీల పనితీరు, ప్రధాన పార్లమెంటరీ కమిటీల సమర్థత, భారతీయ పార్లమెంట్‌లో సంస్థాగత/విధానపరమైన సంస్కరణలు, ఇతర కామన్వెల్త్‌ పార్లమెంట్ల ప్రత్యేకతలపై అధ్యయనం చేయాలి. రాజ్యసభ సెక్రటేరియట్‌ సూచించిన అంశాలపై కూడా పరిశోధన చేయాల్సి ఉంటుంది.
  • రీసెర్చ్‌ గ్రాంట్‌: రాజ్యసభ ఫెలోషిప్స్‌ కేవలం నలుగురు మాత్రమే పొందగలరు. ప్రతి ఫెలోషిప్‌కు రీసెర్చ్‌ గ్రాంట్‌గా రూ.8 లక్షలను పలు దఫాలుగా అందిస్తారు. దీంతోపాటు మరో రూ.50 వేలు కంటిజెన్సీ ఫండ్‌గా ఇస్తారు.

ముఖ్య సమాచారం..

  • దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • రాజ్యసభ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు: rksahoo.rs@sansad.nic.in
  • రాజ్యసభ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు: rssei.rsrs@sansad.nic.in
  • దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://rajyasabha.nic.in/rsnew/fellowship/felloship_main.asp
Published date : 27 Mar 2021 01:15PM

Photo Stories