Skip to main content

గ్రూప్ డిస్కషన్(జీడీ)లో విజయానికి మార్గాలు...

నేడు ఉద్యోగ సాధనలో.. గ్రూప్ డిస్కషన్ (జీడీ)ఎంతో కీలంగా మారింది... మనం కలలు కనే సంస్థలో ఉద్యోగం లభించాలన్నా.. రాత పరీక్షలో ప్రతిభ చూపితే సరిపోదు. కీలకమైన గ్రూప్ డిస్కషన్‌లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. జీడీలో సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..!
 ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో దాదాపు అన్ని సంస్థలు రాత పరీక్ష, బృంద చర్చ (గ్రూప్ డిస్కషన్), మౌఖిక పరీక్ష (పర్సనల్ ఇంటర్వ్యూ) అనే మూడంచెల ప్రక్రియను నిర్వహించి.. తమ సంస్థకు అనుగుణమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. గ్రూప్ డిస్కషన్‌కు నిర్ణీత సిలబస్ ఉండదు. ఏ టాపిక్ ఇస్తారో... ఏం మాట్లాడి మెప్పించాలో, బృందంలోని వారిని ఎలా మెప్పిస్తే... ఇంటర్వ్యూయర్‌కు నచ్చుతుందో అంచనాకు అందదు. అందుకే జీడీ అనేది అగ్ని పరీక్ష అంటున్నారు నిపుణులు!

జీడీ అంటే..!
రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ను బృందాలుగా ఏర్పాటుచేసి.. ఏదైనా ఒక అంశం పై చర్చించమనడమే జీడీ. సాధారణంగా జీడీ వ్యవ ధి 15-20 నిమిషాలు ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్ స్కిల్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్, స్పష్టత, సమయస్ఫూర్తి వంటి లక్షణాలు ఏ మేరకు ఉన్నా యో తెలుసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. గతం లో కంటే ప్రస్తుతం దీని పరిధి బాగా విస్తరించింది. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ అభ్యర్థులకు మాత్రమే కాకుండా.. అనేక ప్రొఫెషనల్ కోర్సులు, కార్పొరేట్ సంస్థలు నిర్వహించే ఉద్యోగ నియామకాల్లో సైతం జీడీ కీలకపాత్ర పోషిస్తోంది.

జీడీ టాపిక్స్
  • మేనేజ్‌మెంట్ కాన్సెప్ట్స్.
  • బిజినెస్ కాన్సెప్ట్స్.
  • ఆర్థిక అంశాలు.
  • రాజకీయ అంశాలు.
  • జనరల్ అంశాలు (ఉదా: మహిళా సమస్యలు, పర్యావరణ అంశాలు).
  • విద్యా రంగ అంశాలు.
  • సినిమా, క్రీడాంశాలు.
  • టెక్నాలజీ అంశాలు.

వేటిపై దృష్టిపెట్టాలి?
  1. భావ వ్యక్తీకరణ (కమ్యూనికేషన్ స్కిల్స్): ఇచ్చిన అంశాన్ని సూటిగా, సరళంగా, స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో చెప్పడమే భావ వ్యక్తీకరణ.
  2. విషయ పరిజ్ఞానం: సంబంధిత అంశంపై ఉన్న పరిజ్ఞానం కూడా జీడీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇచ్చిన టాపిక్‌పై చక్కగా ప్రజెంట్ చేయాలన్నా.. చర్చించాలన్నా.. విషయ పరిజ్ఞానం తప్పనిసరి. సబ్జెక్ట్ అంశాలతోపాటు ప్రముఖ దినపత్రికలు, మ్యాగజైన్లు, టీవీచానళ్లు, ఇంటర్నెట్ వంటి సాధనాలను ఉపయోగించుకుని సమకాలీన అంశాలపై ఎంతోకొంత పరిజ్ఞానం పెంపొందించుకోవాలి.
  3. నాయకత్వ లక్షణాలు: లీడర్‌షిప్ స్కిల్స్‌ని పరీక్షించడం కూడా జీడీలో భాగమే. విషయ పరిజ్ఞానంతోపాటు డిస్కషన్ సజావుగా జరిగేలా వ్యవహరించే తీరు, సందర్భోచితంగా స్పందించే గుణం, వివాదం తలెత్తినప్పుడు హుందాగా వ్యవహరించడం తదితర అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు.
  4. ఆలోచనలు పంచుకోవడం: జీడీ ప్రధాన ఉద్దేశం ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకోవడమే. ఎదుటివారి అభిప్రాయాలను, ఆలోచనలను గౌరవించడం, వాదించకుండా హుందాగా చెప్పడం, ఇతరులు మాట్లాడటం పూర్తయ్యాక మన అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలియజేయడం వంటివి చాలా ముఖ్యం.
  5. భాషా పరిజ్ఞానం: మనం ఉపయోగించే భాష కూడా జీడీలో కీలకం. సరళంగా, స్పష్టంగా, సున్నితంగా మాట్లాడాలి. జీడీలో కంటెంట్‌కు అధిక ప్రాధాన్యం ఉన్నా.. ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని కూడా పరిశీలిస్తారు. కాబట్టి ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి.
  6. హావభావాలు: జీడీ సమయంలో బాడీ లాంగ్వేజ్‌ని కూడా గమనించుకోవాలి. మంచి దుస్తులు ధరించడం, నిటారుగా కూర్చోవడం, కంటి చూపు సరిగా ఉండటం, ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శించడం చాలా ముఖ్యం.

చేయాల్సినవి.!
  • ఒత్తిడి లేకుండా చిరునవ్వుతో ఉండాలి.
  • సమాధానం తడబాటు లేకుండా చెప్పాలి.
  • సానుకూల దృక్పథంతో మెలగాలి.
  • హుందాగా వ్యవహరించాలి.
  • ఇచ్చిన అంశానికే పరిమితం కావాలి.
  • ఇతరుల అభిప్రాయాలను శ్రద్ధగా వినాలి.
  • ఉత్సాహంగా ఉండాలి.
  • చొరవ చూపాలి.
  • ఇతరులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి.
  • ముగింపు సరిగా ఉండేలా జాగ్రత్త పడాలి.

చేయకూడనివి.!
  • అత్యుత్సాహం ప్రదర్శించకూడదు.
  • గట్టి మాట్లాడటం తగదు
  • మధ్యలో అభ్యంతరాలు చెప్పకూడదు.
  • ఆధిపత్యం కోసం ప్రయత్నించకూడదు.
  • నిర్లక్ష్యంగా, నిర్లిప్తింగా ప్రవర్తించకూడదు
  • సంబంధంలేని అంశాలను ప్రస్తావించడం సరికాదు.
Published date : 12 Dec 2017 12:44PM

Photo Stories