Skip to main content

గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఉన్నత చదువులా..! వ్యాపారమా!!

రాజేష్‌.. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న తెలివైన కుర్రాడు. బీటెక్‌ తర్వాత స్టార్టప్‌ ప్రారంభించాలనేది అతడి కల. మరోవైపు విదేశాల్లో ఎంఎస్‌ లేదా ఎంబీఏ చేయాలని కోరుకుంటున్నాడు.
అందుకోసం జీఆర్‌ఈ (ది గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామినేషన్స్‌) రాసేందుకు సిద్ధమవుతున్నాడు. వ్యాపారం ప్రారంభించాలంటే.. మొదట ఎంబీఏ చేయడం మేలని స్నేహితులు అతడికి సలహా ఇస్తున్నారు. ఇప్పుడు రాజేష్‌ బీటెక్‌ తర్వాత ఫారిన్‌లో ఎంఎస్‌ చేయాలా! లేక ఎంబీఏ చదవాలా! లేదా స్టార్టప్‌తో సొంత వ్యాపారం ప్రారంభించాలా!! ఏ నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేక పోతున్నాడు...

ఎంఎస్‌–జాబ్‌–ఎంబీఏ..
జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కలలు కనే యువతలో ఎంతోమంది రాజేష్‌లాగే సందిగ్ధంలోనే ఉంటున్నారు. ఓవైపు ఇంజనీరింగ్‌ లేదా డిగ్రీ కోర్సులు చదువుతూనే.. సొంత వ్యాపారం గురించి ఆలోచిస్తున్నారు. కొందరైతే గ్రాడ్యుయేషన్‌ కూడా పూర్తికాకుండానే స్టార్టప్‌ ప్రారంభించేస్తున్నారు. ఇది అంతగా సరైన నిర్ణయం కాదంటున్నారు నిపుణులు. బీఈ/బీటెక్‌ చదువుతున్న విద్యార్థులు మొదట తమ కోర్సును పూర్తి చేసుకోవడం ప్రాథమిక అర్హతగా భావించాలి. ఆ తర్వాత జీఆర్‌ఈ వంటి స్టడీ అబ్రాడ్‌ టెస్టులు రాసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక ఎంఎస్‌ కోసం అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలకు వెళ్లడం ద్వారా.. అంతర్జాతీయ దృక్పథం అలవడుతుంది. ఆయా మార్కెట్లు, టెక్నాలజీలపై అవగాహన వస్తుంది. ఇది భవిష్యత్‌లో వారు ప్రారంభించబోయే స్టార్టప్‌లకు తోడ్పాటునిస్తుంది.

అంతర్జాతీయ కెరీర్‌కు మార్గం..
ఎంఎస్‌ తర్వాత కొన్నాళ్లు ఉద్యోగ అనుభవం.. ఆ తర్వాత ఎంబీఏ చేయడమంటే చాలామంది సమయం వృథా అవుతుందనుకుంటారు. అలాంటి అభ్యర్థులు డిగ్రీ తర్వాత కనీసం రెండేళ్లు పని అనుభవం పొందడం అవసరం. ఆ సమయంలో ఎంఎస్‌ లేదా ఎంబీఏ.. వీటిల్లో ఏది చేయాలనేదానిపై స్పష్టత పొందొచ్చు. యుఎస్‌ లేదా ఏదైనా విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేయడం ద్వారా అంతర్జాతీయ కెరీర్‌కు మార్గం సుగమం అవుతుంది. అలాగే సొంతంగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు ఎంబీఏ చేయడమే ఉత్తమం. దీనిద్వారా చేపట్టే ప్రాజెక్టు సాధక బాధకాలు సులభంగా అంచనా వేయవచ్చు.

ఉద్యోగ అనుభవం..
అమెరికాలో ఎంఎస్‌ లేదా ఎంబీఏ తర్వాత కనీసం రెండేళ్లు అక్కడే ఉండి.. చదువుకున్న కోర్సుకు తగిన ఉద్యోగం చేయడం మంచిది. దీనివల్ల కొత్త పని విధానాలతోపాటు బృంద నైపుణ్యాలు, ప్రొడక్ట్స్, సర్వీసెస్, మార్కెట్స్, కన్సూమర్స్‌పై అవగాహన వస్తుంది. అలాగే వ్యాపారంలో ఎదురయ్యే కష్టనష్టాలను అర్థం చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. స్టార్టప్‌ ప్రారంభించాలనుకునేవారు కొన్నేళ్ల ఉద్యోగ అనుభవం తర్వాత మాత్రమే ఎంబీఏ గురించి ఆలోచించడం మేలు. ఓ వైపు ఉద్యోగ అనుభవం.. ఆ తర్వాత ఎంబీఏ పూర్తిచేయడం.. విజయవంతంగా స్టార్టప్‌ నడిపేందుకు ఉపయోగపడుతుంది.

వ్యాపార మంత్రం..
సొంతంగా వ్యాపారం ప్రారంభించడం.. నేటి యువత ముఖ్య లక్ష్యంగా కనిపిస్తోంది. దీనిద్వారా సొంతంగా ఎదగడమేగాకుండా.. మరో పదిమందికి ఉపాధి కల్పించవచ్చని ఆలోచిస్తున్నారు. గ్రాడ్యుయేషన్‌ (బీటెక్‌/బీబీఏ వంటివి)తోనే స్టార్టప్స్‌ ప్రారంభించి.. విజయం సాధించినవారు కూడా ఉన్నారు. నిపుణులు మాత్రం.. ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలనుకునేవారికి, స్టార్టప్‌ ప్రారంభించాలనుకునేవారికి ఎంబీఏ వెన్నుముకలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఎంబీఏలో స్పెషలైజేషన్స్‌ పరంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ పది శాతం మంది, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ 11శాతం, ఫైనా్స 15శాతం మంది ఎంపిక చేసుకుంటున్నట్లు ఓ తాజా సర్వే వెల్లడించింది. బిజినెస్‌కు ఎంబీఏ ఎందుకంటే.. ఈ కోర్సు చదవడం ద్వారా నాయకత్వ లక్షణాలు అలవడతాయి. అంతేకాకుండా వ్యాపార వ్యూహాలు, సూత్రాలు, మార్కెట్‌ల తీరుతెన్నులు తెలుస్తాయి. ఇది మంచి వ్యాపార ప్రణాళికతో ప్రారంభంలో కంపెనీ ఆర్థిక లావాదేవీలను చక్కదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఐదు సూత్రాలు..
ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారే క్రమంలో పెట్టుబడి ఎంతో కీలకం. అలాగే నిబద్ధతతో పనిచేసే సిబ్బంది చాలా అవసరం. కాబట్టి సొంతంగా వ్యాపారం ప్రారంభించే యువత తొలుత కొంత ఉద్యోగ అనుభవం ఉంటే.. బిజినెస్‌లో ఎదురయ్యే ఇలాంటి సమస్యలను అర్థం చేసుకొని.. అధిగమించేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటిదాకా ప్రపంచ వ్యాపారవేత్తలుగా వెలుగొందుతున్నవారు తొలి అడుగుతోనే అద్భుతమైన విజయాన్ని అందుకోలేదు. ఎన్నో వైఫల్యాల తర్వాత గాని ఉన్నత స్థాయికి రాలేదనే విషయాన్ని గుర్తించాలి. వ్యాపారంలో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకొని నిలవగలగాలి. ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు అధిగమించడం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించొచ్చు.

ఇన్నోవేషన్‌.. క్రియేటివిటీ
ప్రపంచ మార్కెట్‌లో తమకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దిగ్గజ వ్యాపార సంస్థలు సైతం ఒక్కోసారి పోటీలో వెనుకబడిపోతాయి. కారణం.. వ్యాపారంలో నూతన ఆవిష్కరణలకు, సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే. నిపుణుల అభిప్రాయం ప్రకారం–మార్కెట్‌లో వ్యాపార పరంగా ముందు నిలవాలంటే.. కొత్త ఉత్పత్తులు, సేవలు, సరికొత్త వ్యాపార నమూనాలు రూపొందించడం చాలా అవసరం. ప్రస్తుతం టాప్‌లో నిలిచిన కంపెనీలు వినూత్న ఆవిష్కరణలతోనే ఆ స్థాయికి ఎదిగాయి.

నెట్‌వర్క్‌..
వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు తమకు అవసరమైన సహాయం ఇతరుల నుంచి పొందేందుకు సిద్ధంగా ఉండాలి. దీనివల్ల మీరు చేయలేనిది, మీవల్ల సాధ్యంకానిది ఇతరుల నుంచి లభిస్తుంది. పాల్‌ అలెన్‌ సాయంతోనే బిల్‌ గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ను స్థాపించగలిగాడు. స్టీవ్‌ జాబ్స్‌ కూడా స్టీవ్‌ వోజ్నియాక్‌ సాయంతోనే ఆపిల్‌ సంస్థను స్థాపించగలిగాడన్న విషయాన్ని మరిచిపోవద్దు. కాబట్టి బిజినెస్‌లో రాణించేందుకు బలమైన నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవాలి. సొంత వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన డబ్బు, ఉద్యోగులు, భాగస్వాముల అవసరం ఉంటుంది. వీటిని సమకూర్చుకునేందుకు మార్గాలను అన్వేషించాలి. తద్వారా వ్యాపారంలో రిస్క్‌ను అధిగమించే అవకాశం ఉంటుంది.

బిజినెస్‌ బేసిక్స్‌..
సొంత కంపెనీ ప్రారంభిస్తున్నామనగానే.. సన్నిహితులు ‘‘ఎందుకు రిస్క్‌’’ అంటారు. ఎందుకంటే.. వ్యాపారం అంటేనే రిస్క్‌తో కూడుకున్నది. ప్రతి ఎంట్రర్‌ప్రెన్యూర్‌ తన వ్యాపారంలో మొదట నేర్చుకోవాల్సింది లాభాలు సంపాదించడం గురించి కాదు.. నష్టాలను ఎలా అధిగమించాలి అని అంటారు నిపుణులు. కాబట్టి సొంత సంస్థ ప్రారంభించే ముందు బిజినెస్‌ బేసిక్స్‌ను నేర్చుకోవడం చాలా అవసరం. ఎంచుకున్న వ్యాపారం, సాధ్యాసాధ్యాలు, మార్కెటింగ్, సేల్స్, పోటీదారులు వంటి ప్రతి విషయంపై అవగాహన పెంచుకోవాలి. నష్టం రాకుండా ఏం చేయాలి. ఒకవేళ నష్టం తప్పదనుకుంటే ఆ నష్టం తగ్గించుకునేందుకు ఏం చేయాలి, ఆర్థిక భద్రత వంటి విషయాలæ గురించి ఆలోచించాలి. సమస్యలను అధిగమించేందుకు అవసరమైన వ్యూహాలు అలవరచుకోవాలి.

వైఫల్యాలు చెప్పే పాఠాలు..
దిగితేనేగాని లోతు తెలియదు.. అప్పుడే ఈదడం ఎలాగో తెలుస్తుంది. వ్యాపారంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. మీరు సొంత వ్యాపారం మొదలుపెట్టిన తర్వాతనే అందులోని కష్టనష్టాలపై అవగాహన వస్తుంది. సవాళ్లు, సమస్యలకు ఎలా స్పందించాలి. వైఫల్యాల నుంచి పాఠాలు ఎలా నేర్చుకోవాలో అర్థం అవుతుంది. నష్టాలు వచ్చినంత మాత్రన ఆగిపోరాదు. తొలి అడుగుతో వచ్చిన సవాళ్లను పరిష్కరించుకొని ముందుకు సాగాలి. ఏటా ప్రారంభమవుతున్న స్టార్టప్స్‌లో ప్రతి పదింటిలో తొమ్మిది విఫలవుతున్నట్లు అంచనా. ‘నేను చేపట్టే వ్యాపారం విజయవంతమైన ఆ ఒక్కటీ అవుతుంది’ అనే నమ్మకంతో వెళితే అడ్డంకులను అధిగమించి సక్సెస్‌ సాధించొచ్చు! అంటారు నిపుణులు!!
Published date : 30 Mar 2021 03:16PM

Photo Stories