ఏటేటా తగ్గుతున్న కేంద్ర కొలువులు.. యువతకు తగ్గుతున్న అవకాశాలు..
కేంద్ర ప్రభుత్వ నియామకాలకు ఏదైనా నోటిఫికేషన్ వెలువడిందంటే.. ఒక్కో పోస్ట్‌కు వేల మంది పోటీ! ఇంతలా కేంద్ర ప్రభుత్వ కొలువులపై ఆశలు పెట్టుకున్న యువతకు నిరాశ ఎదురవుతోంది. కారణం.. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో పోస్ట్‌ల సంఖ్య క్రమేణా తగ్గుతుండటమే! అత్యున్నత సివిల్ సర్వీసెస్ మొదలు.. కిందిస్థాయిలో మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల వరకు.. నూతన నియామకాల సంఖ్య ఏటేటా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో.. కేంద్రంలో తగ్గిపోతున్న కొలువులు.. అందుకు కారణాలపై విశ్లేషణాత్మక కథనం..
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ)..
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ)..
- రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ)..
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)..
ఇవి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో, రైల్వేలో, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీ చేపట్టే నియామక సంస్థలు! ఐఏఎస్ మొదలు మల్టీ టాస్కింగ్ స్టాప్ వరకూ.. వివిధ కేంద్ర కొలువుల కోసం ఏటా లక్షల మంది కోటి ఆశలతో ప్రిపరేషన్ సాగిస్తుంటారు. యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌ల నుంచి నోటిఫికేషన్ వస్తుందంటే.. వేల సంఖ్యలో పోస్టులుంటాయని అభ్యర్థులు ఆశిస్తుంటారు. కానీ.. గత అయిదేళ్ల కాలంలో పరిస్థితుల్లో ఎంతో మార్పు కనిపిస్తోంది. సదరు నియామక సంస్థలు భర్తీ చేసే ఖాళీల సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కనిపిస్తోంది.
సివిల్స్ 2021 ఖాళీలు 712..
- ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ విడుదల చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లను పరిశీలిస్తే.. ఖాళీల సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది.
- 2016లో 1079 ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఆ తర్వాత ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.
- 2017లో 980 ఖాళీలు, 2018లో 782 పోస్టులు, 2019లో 896 పోస్టులు, 2020లో 796 ఖాళీల భర్తీకి యూపీఎస్‌సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
- తాజాగా ఈ నెలలోనే ప్రకటించిన సివిల్స్–2021 నోటిఫికేషన్‌ను పరిశీలిస్తే.. ఖాళీల సంఖ్య కేవలం 712గానే యూపీఎస్‌సీ పేర్కొంది.
- ఈ గణాంకాలను పరిశీలిస్తే 2016 నుంచి తాజా నోటిఫికేషన్ 2021 వరకు ఖాళీల సంఖ్యలో దాదాపు పది శాతం మేర తగ్గుదల కనిపిస్తోంది.
- యూపీఎస్‌సీ ద్వారా వివిధ అర్హతలతో భర్తీ చేసే ఐఎఫ్‌ఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్), సీఎంఎస్(కంబైన్డ్ మెడికల్ సర్వీస్), ఐఈఎస్(ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్), ఎన్‌డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడెమీ), సీడీఎస్(కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్) తదితర పోస్ట్‌ల సంఖ్యలోనూ ఏటేటా తగ్గుదల నమోదవుతోంది. అలాగే ఇతర శాఖలకు సంబంధించి ఆయా నోటిఫికేషన్లతో భర్తీ చేసే పోస్ట్‌ల సంఖ్య కూడా గత ఐదేళ్లుగా తగ్గుతూ వస్తోంది.
- 2016లో మొత్తం అన్ని రకాల పోస్ట్‌లకు సంబంధించి 6,103 మందిని నియమించిన యూపీఎస్‌సీ.. 2019–20లో మాత్రం కేవలం 4,399 ఖాళీలనే భర్తీ చేసింది.
ఎస్‌ఎస్‌సీదీ అదే బాట..
- బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు, ఆపై అర్హతలున్న వారు యూపీఎస్‌సీ తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్‌లనే లక్ష్యంగా చేసుకొని ప్రిపరేషన్ సాగిస్తుంటారు.
- ఎస్‌ఎస్‌సీ పోస్టుల పరంగానూ గత కొన్నేళ్లుగా అభ్యర్థులను నిరాశ పరిచే విధంగానే ఖాళీల సంఖ్య ఉంటోంది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని గ్రూప్–బి నాన్–గెజిటెడ్, గ్రూప్–సి(నాన్–టెక్నికల్) పోస్ట్‌లకు, అదే విధంగా క్లాస్–3, 4 స్థాయి పోస్ట్‌లకు ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్లను పరిశీలిస్తే.. 2016తో పోల్చితే 2020–21నాటికి గణనీయ తగ్గుదల కనిపించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఆయా నియామక పరీక్షల ద్వారా 68,880 మందిని ఎంపిక చేసిన ఎస్‌ఎస్‌సీ.. 2020–21లో మాత్రం 2,016కు పరిమితం కావడం గమనార్హం.
- 2016–27లో ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్ష ద్వారా 10,661 పోస్ట్‌లను భర్తీ చేయగా, 2021లో ఆ సంఖ్య 7,035గా ఉంది.
బ్యాంకింగ్‌లోనూ షాక్!
దేశంలో.. యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొలువులు అనేది సుస్పష్టం. వీటిల్లోనూ గత కొన్నేళ్లుగా నియామకాలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీఓ, క్లర్క్ కేడర్లలో పోస్టులను భర్తీ చేసే∙ఐబీపీఎస్ నోటిఫికేషన్లను పరిశీలిస్తేæ.. గత రెండేళ్లలో పీఓ పోస్ట్‌ల సంఖ్యలో ఏకంగా 67 శాతం తగ్గుదల కనిపించింది. 2019లో 4,336 పీఓ పోస్ట్‌లకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ ఇవ్వగా.. ఆ సంఖ్య 2020లో 1,167కు పడి పోయింది. వాస్తవంగా ఐబీపీఎస్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పోస్ట్‌ల నియామకం విధానం ప్రవేశ పెట్టినప్పుడు తొలిసారి 2013లో భారీ స్థాయిలో 21,680 పోస్ట్‌లతో ఉద్యోగార్థుల ఆశలను చిగురింపజేసింది. ఆ తర్వాత సంవత్సరాల్లో ఈ సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది.
ఆర్‌ఆర్‌బీ.. అడియాశలు
జాతీయ స్థాయిలో ప్రభుత్వ రంగ కొలువుల కోణంలో మాస్ జాబ్ క్రియేటర్‌గా పేరుపొందింది... రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఆర్‌ఆర్‌బీ). ఇది కూడా ప్రస్తుతం ఉద్యోగార్థుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. 2016–17లో 27,427 పోస్ట్‌లను భర్తీ చేసిన ఆర్‌ఆర్‌బీ.. 2020–21లో మాత్రం 3,873 పోస్ట్‌లకే నియామకాలు జరిపింది. అయితే 2019–20 సంవత్సరంలో మాత్రం దాదాపు 1.16 లక్షల ఉద్యోగాలను ప్రకటించింది.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ దిశగా..
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీ స్థాయిలో కొలువుల సంఖ్య తగ్గడానికి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో సిబ్బంది నియామకానికి ప్రాధాన్యం ఇస్తుండటమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కింది స్థాయిలో.. క్లరికల్ కేడర్‌లో కాంట్రాక్ట్ విధానంలో ఆయా శాఖలు నియామకాలు చేపడుతున్నాయి. ఖర్చు తగ్గించుకునే ప్రణాళికలో భాగంగానే.. ఆయా శాఖలు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు జరుపుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పోస్ట్‌ల సంఖ్య తగ్గడానికి ప్రధానంగా పలు బ్యాంకులను విలీనం చేయడంతోపాటు, డిజిటలైజేషన్ ముఖ్య కారణంగా కనిపిస్తోంది.
ఎంపిక ప్రక్రియలో జాప్యం..
కేంద్ర ప్రభుత్వ కొలువుల సంఖ్య తగ్గడానికి ఎంపిక ప్రక్రియలో జరుగుతున్న జాప్యం, ప్రశ్న పత్రాల లీకేజ్ వంటి సమస్యలు కూడా కారణంగా చెబుతున్నారు. ఒక నోటిఫికేషన్ విడుదల చేశాక.. ఆ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే మరో కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి, పరీక్ష నిర్వహించడానికి సదరు ఏజెన్సీకి వెసులుబాటు ఉంటుంది. లక్షల సంఖ్యలో దరఖాస్తులు,పరీక్షల నిర్వహణ,ఫలితాల వెల్లడి వంటివి పూర్తికావడంలో జాప్యం ఏర్పడుతోంది. దీంతో సదరు ఏజెన్సీ ద్వారా అభ్యర్థులను నియమించుకునే శాఖలు, విభాగాలు.. ఈ లోపుగా సిబ్బంది కొరతను అధిగమించేందుకు కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించుకుంటున్నాయి. మరికొన్ని సందర్భాల్లో పోస్టుల ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరగడం కూడా జాప్యానికి కారణమవుతోందని పేర్కొంటున్నారు. 2017 ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్–2 పేపర్ లీక్ అవడంతో ఆ పరీక్షను రద్దు చేశారు.
కోర్టు కేసులు..
న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయడం కూడా నియామక ప్రక్రియలో జాప్యానికి మరో కారణంగా చెబుతున్నారు. పర్యవసానంగా కొత్త నోటిఫికేషన్ జారీ కావడంలో ఆలస్యం అవుతోంది. ముఖ్యంగా ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ వంటి నియామక పరీక్షల విషయంలో అర్హత నిబంధనలు, వయోపరిమితి, రిజర్వేషన్ నిబంధనలపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. దీంతో ఎంపిక ప్రక్రియలో జాప్యం ఏర్పడుతోంది. ఈ సమయంలో సంబంధిత శాఖలు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించుకుంటున్నాయి. మరోవైపు కొత్త పోస్ట్‌ల కోసం రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు ఇండెంట్లు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.
పీఎస్‌యూలు సైతం కాంట్రాక్ట్ వైపు..
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇటీవల కాలంలో కాంట్రాక్ట్ విధానంలో నియామకాలకు మొగ్గు చూపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. కాస్ట్ కటింగ్(వ్యయ నియంత్రణ) అనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. నికర ఆదాయం తక్కువగా నమోదవుతున్న పీఎస్‌యూలతోపాటు, ఉత్పత్తి రంగంలోని సంస్థల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. సదరు సంస్థలు శాశ్వత ఉద్యోగులను నియమించి.. ఆ మేరకు వేతనాలు, ఇతర అలవెన్సులు ఇవ్వడం కంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ఏడాది, రెండేళ్ల వ్యవధికి సిబ్బందిని నియమించుకోవడం మేలని భావిస్తున్నాయి. తద్వారా అనుభవజ్ఞులైన వారిని ఎంపిక చేసి..కార్యకలాపాలు సమర్ధంగా నిర్వహించొచ్చనే ఆలోచన చేస్తున్నాయి.
- మొత్తం మీద చూస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గుతున్న తరుణంలో.. యువత ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలపైనా దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
నియామక సంస్థల గణాంకాలు ఇలా..
గత అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీల ద్వారా జరిగిన నియామకాల గణాంకాలు..
సంవత్సరం | ఎస్‌ఎస్‌సీ | ఆర్‌ఆర్‌బీ | యూపీఎస్‌సీ |
2016–17 | 68,880 | 27,427 | 6,103 |
2017–18 | 45,391 | 25,564 | 4,149 |
2018–19 | 16,748 | 7,325 | 1,142 |
2019–20 | 14,691 | 1,16,391 | 4,399 |
2020–21 | 2,106 | 3,873 | 1,055 |
- గమనిక: యూపీఎస్‌సీ నియామకాలకు సంబంధించి 2018–19లో తుది ఫలితాల ద్వారా నియామకాలు ఖరారైన అభ్యర్థుల సంఖ్య పేర్కొనడం జరిగింది. 2018–19 నోటిఫికేషన్లకు సంబంధించి పలు పోస్ట్‌లకు తుది విజేతలను 2019–20లో ప్రకటించడం జరిగింది.
- అదే విధంగా 2020–21కు సంబంధించి ఇప్పటి వరకు కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ (మొత్తం తుది విజేతలు 522), ఎన్‌డీఏ–(1)–2020 (మొత్తం తుది విజేతల సంఖ్య 533) ఫలితాలు మాత్రమే వచ్చాయి. వాటి సంఖ్యనే పేర్కొనడం జరిగింది.
దీర్ఘ కాలిక ఆలోచనతోనే..
ప్రభుత్వ నియామక సంస్థల ద్వారా పోస్ట్‌ల సంఖ్య తగ్గడానికి కారణం.. ఆయా శాఖలు అనుసరిస్తున్న విధానాలే. ఆయా శాఖలు ఉన్నత వర్గాల సూచనల మేరకు కాస్ట్ కటింగ్ విధానాలు అనుసరిస్తున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఇటీవల కాలంలో కాంట్రాక్ట్ సిబ్బంది నియామకాల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి యువత ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలపై కూడా దృష్టిసారించడం మేలు.
– ప్రొ‘‘ వై.వెంకట్రామిరెడ్డి, యూపీఎస్‌సీ మాజీ సభ్యులు