ఎల్‌ఐసీలో 8500 ఉద్యోగాలు; ప్రిపరేషన్ గైడెన్స్...
దేశంలో అతిపెద్ద బీమా సంస్థగా పేరొందిన ఎల్‌ఐసీలో ‘అసిస్టెంట్’ ఉద్యోగాలు దక్కించుకోవడం ద్వారా స్థానికంగా పని చేసే వీలుంటుంది. అంతేకాకుండా బీమా రంగంలో కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. బ్యాంకు పరీక్షల తరహాలో ఉండే ఎల్‌ఐసీ పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ బ్యాంకింగ్ రంగ ఔత్సాహిక అభ్యర్థులకు లాభిస్తుంది. ఎల్‌ఐసీ అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ... ప్రిపరేషన్ గైడెన్స్...
విద్యార్హత :
10+2+3 ప్యాట్రన్‌లో డిగ్రీ చదివిన వారు అర్హులు. ఇతర తత్సమాన ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకోరు.
వయసు :
2019 సెప్టెంబర్ 1 నాటికి 18–30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయోపరిమితి నిబంధనల్లో సడలింపు ఉంటుంది.
వేతనాలు :
ఎల్‌ఐసీ నిర్ణయించిన మూల వేతనం రూ.14,435. అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభంలో ప్రధాన నగరాల్లో పనిచేసే వారికి అలవెన్సులనీ కలుపుకొని సుమారు రూ. 30,000 అందుతుంది.
తెలుగు రాష్ట్రాలున్న జోన్‌లో 630 ఖాళీలు :
తెలుగు రాష్ట్రాలున్న సౌత్ సెంట్రల్ జోన్‌లో 630 కి పైగా పోస్టులు ఉన్నాయి. జోన్ పరిధిలో డివిజన్‌లు ఉంటాయి. డివిజన్‌ల వారీగా నియామకాలు చేపడతారు. అభ్యర్థులు ఏదైనా ఒక డివిజన్‌లోని ఖాళీలకు మాత్రమే పోటీ పడాలి. పోటీ కూడా డివిజన్ల వారీగానే ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారు ఆయా డివిజన్ పరిధిలోనే పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రొబేషన్ పీరియడ్ ఆరు నెలలు. వీరు క్యాషియర్, అసిస్టెంట్, సింగిల్ విండో ఆపరేటర్‌న, వినియోగదారుల సర్వీస్ ప్రతినిధిగా విధులు నిర్వర్తిస్తారు.
ఎంపిక విధానం :
ఎల్‌ఐసీ అసిస్టెంట్ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు మొదట ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో ప్రతిభ చూపిన వారిని మొత్తం ఖాళీలకు దాదాపు 20 రెట్ల మందిని మెయిన్ ఆన్‌లైన్ పరీక్షకు అనుమతిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్.. రెండూ పరీక్షలు కూడా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. మొదట ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు జరుగుతుంది. ఇందులో ఇంగ్లిష్ లేదా హిందీ 30 ప్రశ్నలు– 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు– 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు– 35 మార్కులకు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్ లేదా హిందీ సెక్షన్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో పొందే మార్కులను లెక్కించరు. మిగతా న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీలో పొందిన మార్కుల ఆధారంగానే మెయిన్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ప్రిలిమినరీ పరీక్షకు గంట సమయం కేటాయిస్తారు.
ప్రిలిమినరీ పరీక్షలో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొంది అర్హులుగా ప్రకటించిన వారికి మెయిన్ పరీక్ష ఉంటుంది. ఇది 200 మార్కులకు జరుగుతుంది. దీనికి రెండున్నర గంటల సమయం కేటాయిస్తారు. ఈ టెస్టులో వేర్వేరు సబ్జెక్టులను విభాగాల వారిగా విభజిస్తారు. ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. వేర్వేరుగా ప్రతిసబ్జెక్టులో నిర్దేశిత మార్కులు పొందాలి. అలాగే మొత్తంగా ఎల్‌ఐసీ నిర్ణయించిన కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులతో మెరిట్ జాబితా రూపొందిస్తారు. మెయిన్ లో... జనరల్ అవేర్‌నెస్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు–50 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 60 ప్రశ్నలు– 60 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు– 40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు– 50 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. అభ్యర్థులు వేర్వేరుగా ఆయా సెక్షన్లల్లో అర్హత సాధించడం తప్పనిసరి.
నెగిటివ్ మార్కులు :
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో కనీస అర్హత మార్కులను పేర్కొన్నప్పటికీ.. వాటిని తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. అలానే ప్రిలిమ్స్, మెయిన్ ఆబ్జెక్టివ్ పరీక్షలకు రుణాత్మక మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఆయా ప్రశ్నలకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు మార్కులు కోత విధిస్తారు. ఎల్‌ఐసీ అసిస్టెంట్‌పరీక్షలను బ్యాంకు క్లర్క్ ఎగ్జామ్స్‌తో పోల్చుకోవచ్చు. బ్యాంకు పరీక్షల పరీక్ష విధానం, ఎంపిక విధానం తరహాలోనే ఎల్‌ఐసీ పోస్టుల భర్తీ ప్రక్రియ ఉంటుంది.
ప్రిపరేషన్ గైడెన్స్ :
న్యూమరికల్ ఎబిలిటీ/క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ :
అభ్యర్థుల అర్థమెటిక్ పరిజ్ఞానాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించిన విభాగం ఇది. న్యూమరికల్ ఎబిలిటీలో అర్థమెటిక్ అంశాలు పర్సంటేజేస్, యావరేజేస్, రేషియో–ప్రపోర్షన్, ప్రాఫిట్–లాస్, సింపుల్–కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్–వర్క్, టైమ్–డిస్టెన్స్, పర్ముటేషన్స్–కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, మిక్షర్ అండ్ అలిగేషన్స్ చాప్టర్లు ప్రధానమైనవి. అభ్యర్థులు బేసిక్స్ అర్థం చేసుకోవాలి. ప్రాథమిక గణాంకాలైన బోడ్‌మస్ నియమాల ఆధారంగా ప్రాబ్లమ్స్‌ను వేగంగా పరిష్కరించగలగాలి. పరీక్షలో కచ్చితత్వానికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే వర్గాలు, ఘనాలు, వర్గమూలాలు గుర్తించుకోవాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లు అంశాలకు చాలా ముఖ్యమైనవి. మెయిన్‌లో డేటా విశ్లేషణకు ప్రాధాన్యత ఇస్తారు.
ముఖ్యమైన చాప్టర్లు: సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్షిమేషన్స్, బేసిక్ ఆల్జీబ్రా (క్వాడ్రటిక్ ఈక్వేషన్స్), డేటా ఇంటర్‌ప్రిటేషన్, మిస్సింగ్ నంబర్స్(రాంగ్ నంబర్ సిరీస్). మెయిన్ పరీక్షలో అప్రాక్షిమేషన్స్, నంబర్ సిరీస్, డీఐ, క్వాడ్రటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ టాపిక్స్ కీలకమైనవి.
జనరల్ ఇంగ్లిష్ :
ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లిష్ లేదా హిందీలో అర్హత మార్కులు పొందితే చాలు. కానీ మెరిట్ జాబితా రూపొందించడంలో కీలకమైన మెయిన్ పరీక్షలో మాత్రం ఇంగ్లిష్‌కు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఇంగ్లిష్‌ను నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఈ సెక్షన్‌లో రీడింగ్ కాంప్రెహెన్షన్, పారా జంబుల్స్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్ తదితర టాపిక్స్ ముఖ్యమైనవి. ఇంగ్లిష్‌పై పట్టు పొందేందుకు గ్రామర్ రూల్స్, వొక్యాబులరీ పెంచుకోవడం ప్రధానం. అందుకు ఏదైనా ప్రామాణిక ఆంగ్ల పత్రిక ఎడిటోరియల్స్ చదవడం, కొత్త పదాలను ఉపయోగించి వాక్యాలు రాసుకోవడం ప్రాక్టీస్ చేసుకోవాలి. నిత్యం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలి. కొత్తగా సన్నద్ధమయ్యే వారు మెయిన్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని చదవాలి. ప్రిలిమినరీలో అర్హత మార్కులు పొంది, మెయిన్లో మంచి స్కోరు చేయడానికి యత్నించాలి.
రీజనింగ్ ఎబిలిటీ :
అభ్యర్థులు తార్కికంగా ఆలోచించగలరా? సమస్యను వేగంగా పరిష్కరించే నేర్పు ఉందా! అనే కోణంలో రీజనింగ్ ఎబిలిటీకి ప్రాధాన్యం ఉంటుంది. మెయిన్‌లో ఎక్కువ వెయిటేజీ ఉన్న విభాగం రీజనింగ్ ఎబిలిటీనే. దీనితోపాటు కంప్యూటర్ ఆప్టిట్యూడ్‌ను కూడా చేర్చారు. అయినా ఎక్కువ వెయిటేజీ రీజనింగ్‌కే ఉంటుంది. కంప్యూటర్ సెక్షన్ నుంచి 10–15 మార్కులు ఆశించవచ్చు. మిగతా ప్రశ్నలన్నీ రీజనింగ్ నుంచే అడుగుతారు. ఇచ్చిన సమస్యను వేగంగా అర్థం చేసుకోవడం.. ఆ సమస్యలో ఉన్న లాజిక్‌ను గుర్తించడం ద్వారా సమాధానాలు రాబట్టవచ్చు. రీజనింగ్‌లో మంచి స్కోరు చేయడానికి ఏకైక మార్గం ప్రాక్టీస్. సాధ్యమైనన్నీ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్నీ మాక్ టెస్టులు రాయడం ద్వారా విజయ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. సందేహాం ఉన్న టాపిక్‌ను ఎప్పటికప్పడు నివృత్తి చేసుకోవాలి. ముఖ్యంగా అనలిటికల్ ఎబిలిటీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక, కంప్యూటర్ నాలెడ్జ్‌లో ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, నెట్‌వర్కింగ్; ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షార్ట్‌కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల గురించి తెలుసుకోవాలి.
ముఖ్యమైన టాపిక్స్: సీటింగ్ అరెంజ్‌మెంట్, కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సిలాయిజమ్స్, ఇన్‌ఈక్వాలిటీస్, పజిల్స్, డేటా సఫిషిఝెన్సీ, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్, ఇన్‌పుట్ – ఔట్‌పుట్, అనలిటికల్ రీజనింగ్.
జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ :
ఇది సులువైన విభాగమని చెప్పొచ్చు. సరైన ప్రణాళికతో చదివితే ఎక్కువ మార్కులు పొందడానికి వీలుంది. 2019 మే–జూన్ నుంచి కరెంట్ అఫైర్స్ చదవుకోవాలి. సొంతంగా నోట్స్ సిద్ధం చేసుకోవాలి. జనరల్ అవేర్‌నెస్ విభాగంలో బ్యాంకింగ్ రంగం పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇటీవల కాలంలో ఆర్థిక రంగంలో ఎన్నో కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిని సునిశితంగా పరిశీలిస్తూ ప్రధాన పేపర్లో వచ్చే కథనాల నుంచి నోట్స్ సిద్ధం చేసుకోవడం లాభిస్తుంది. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, బ్యాంకుల విధులు, కొత్త విధానాలు, రిజర్వ్ బ్యాంక్ వంటి వాటిపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలోనూ ఆర్థిక వ్యవహారాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాల)కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విభాగంలో 50 ప్రశ్నలు ఉన్నాయి. వీటిలో బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 12; ప్రభుత్వ విధానాల నుంచి 3; కరెంట్ అఫైర్స్ నుంచి 20; బేసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ నుంచి 5; స్టాండర్డ్ జీకే నుంచి 6; బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ నుంచి 4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
నోటిఫికేషన్ సమాచారం :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2019 అక్టోబర్ 1
ప్రిలిమినరీ పరీక్షకు హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్ తేదీలు: అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 22 వరకు
ప్రిలిమినరీ పరీక్ష తేది: అక్టోబర్ 21, 22, 2019
మెయిన్ పరీక్ష తేది: తర్వాత తెలియజేస్తారు.
దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.85, ఇతరులకు రూ.510
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.licindia.in