Skip to main content

డిజిటల్ కొలువులకు మార్గం...

ఆన్‌లైన్ వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లు మార్కెట్ ప్రమోషన్.. వెబ్‌సైట్‌లో, బ్లాగ్‌లో వచ్చిన అంశాలకు బాధ్యత వహించడం..సైట్ల భద్రతకు పహారా .. ఈ సాంకేతిక యుగంలో పుట్టుకొస్తున్న ఉద్యోగాలివే. ప్రపంచ గమనాన్ని సమూలంగా మార్చేసిన ఇంటర్నెట్.. కొత్తకొత్త కొలువులకూ కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ముందున్నది మరింత డిజిటల్ ప్రపంచం. దీనికి అనుగుణంగా విధానాలను మార్చుకోక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే సంస్థల కార్యకలాపాలను చక్కబెడుతూ.. అందులోనే సవాళ్లను పరిష్కరించే.. కొన్ని సూపర్ జాబ్స్ గురించి..
గ్రోత్ హ్యాకర్స్ :
ఆన్‌లైన్ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా బాధ్యతలు నిర్వహించే వ్యక్తిని ‘గ్రోత్ హ్యాకర్’ అంటారు. వెబ్‌సైట్లు, కమ్యూనిటీలు, బ్లాగ్‌లు, సోషల్ నెట్‌వర్కింగ్ వంటి మాధ్యమాల్లో.. నిర్ణీత కాలంలో వెబ్‌సైట్‌ను ఎంతమంది వీక్షించారు..? ఎంత బిజినెస్ జరిగింది..? వంటి అంశాలపై గ్రోత్ హ్యాకర్స్ పనిచేస్తారు. దీంతోపాటు ఆన్‌లైన్ వీక్షకుల సంఖ్యను పెంచే బాధ్యత కూడా వీరిదే. ఇందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది.

కమ్యూనిటీ మేనేజర్స్ :
ఆన్‌లైన్ వినియోగదారుల ఆలోచనలు, ఆసక్తులు రకరకాలుగా ఉంటాయి. వాటిని గుర్తించి అందుకు అనుగుణంగా బ్రాండ్‌లను, కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేయడం వీరి బాధ్యత. ఇప్పుడిప్పుడే కొన్ని సంస్థలు వీటిని నిర్వర్తించడానికి ‘కమ్యూనిటీ మేనేజర్స్’ను నియమించుకుంటున్నాయి. వీరు ముందుగా ఆన్‌లైన్‌లో తమదైన సోషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వినియోగదారుల్లో సంబంధిత బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలి.

డిజిటల్ ప్రొడక్షన్ మేనేజర్ :
ఏదైనా వెబ్‌సైట్, బ్లాగ్, కమ్యూనిటీలో ప్రచురితం అయిన కంటెంట్‌కు సంబంధించి పూర్తి బాధ్యత డిజిటల్ ప్రొడక్షన్ మేనేజర్‌దే. ఆయా సైట్లలో వినియోగించే టెక్ట్స్, ఇమేజస్, ఆడియో, వీడియో, మల్టీ మీడియా ఎలిమెంట్స్ వంటి అంశాలన్నీ వీరి పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఈ విభాగంలో కెరీర్‌ను ప్రారంభించాలనుకునేవారికి కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఎలా ప్రజెంట్ చేయాలో బాగా తెలిసుండాలి. వీటితోపాటు అందుకు సహకరించే సాఫ్ట్‌వేర్స్, మల్టీ మీడియా టూల్స్ వంటి సాంకేతిక అంశాలపై కూడా అవగాహన ఉండాలి.

సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ :
ఐటీ రంగం ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ.. భద్రతపరంగా నిత్యం సవాళ్లను ఎదుర్కొంటోంది. అనేక సంస్థల వెబ్‌సైట్లపై హ్యాకర్లు దాడి చేయడం, డేటా చోరీ వంటి ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇలాంటి చర్యలను ఎదుర్కొని తమ సర్వర్లను కాపాడుకునే క్రమంలో సంస్థలు ‘సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’కు పెద్ద పీట వేస్తున్నాయి. అందులో భాగంగానే నెట్‌వర్క్ సెక్యూరిటీ డెవలపర్స్, నెట్‌వర్క్ సెక్యూరిటీ ప్రోగ్రామర్స్‌ను మంచి వేతనాలు చెల్లించి మరీ నియమించుకుంటున్నాయి.

డిజిటల్ స్టోరీ టెల్లర్ :
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో పత్రికలు చదివే తీరిక, ఓపిక ఎవరికీ ఉండటం లేదు. వార్తలు సహా అన్నీ ఆన్‌లైన్‌లోనే. అక్కడ కూడా పేజీలకు పేజీలుంటే చదవడానికి ఇష్టపడటం లేదు. సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా ఉంటేనే ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటివాళ్లకు విషయాన్ని ఆకర్షణీయంగా ప్రజెంట్ చేసే వారినే ‘డిజిటల్ స్టోరీ టెల్లర్స్’ అంటున్నారు. ట్రెండ్‌కు అనుగుణంగా సంబంధిత విషయానికి ఆడియోలు, వీడియోలు జోడిస్తూ.. ప్రభావవంతంగా, ఆకర్షణీయంగా చెప్పగలగడమే వీరికి ఉండాల్సిన ప్రధాన అర్హత. ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో డిజిటల్ స్టోరీ టెల్లర్స్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సర్క్యూట్ డిజైన్ స్పెషలిస్ట్ :
ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం ఏ స్థాయిలో పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. మొబైల్, ల్యాప్‌ట్యాప్, రిమోట్.. ఇలా ముఖ్యమైన ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ బ్యాటరీ ఆధారంగా పనిచేసేవే. దీంతో బ్యాటరీల జీవిత కాలాన్ని, పని సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీనికోసం ‘ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ లేదా 3డీ డిజైన్ సర్క్యూట్ బోర్డ్స్’ అవసరం భారీగా ఉంటోంది. అంతే స్థాయిలో వీటిని రూపొందించే నిపుణులు కూడా కావాల్సి వస్తోంది. సర్క్యూట్ బోర్డులు, చిప్స్, సెన్సార్లున్న మల్టీ పర్పస్ సర్క్యూట్ బోర్డులను తయారు చేసేవారికి బాగా డిమాండ్ ఏర్పడింది.

ఎథికల్ హ్యాకర్స్ :
సాంకేతికత మనిషి జీవితాన్ని ఎంత సరళం చేసిందో.. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే అంతే జటిలంగా మారుస్తోంది. సంస్థలు టెక్నాలజీ మీదనే ఆధారపడి పనిచేయడం మొదలుపెట్టాక వాటిని బ్రేక్ చేసే హ్యాకర్స్ కూడా పుట్టుకొచ్చారు. ఇది ఆన్‌లైన్ భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితి సృష్టించింది. తద్వారా ఎథికల్ హ్యాకర్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఎథికల్ హ్యాకర్స్ లీగల్‌గానే ఇతర సంస్థల వెబ్‌సైట్స్‌ను హ్యాక్ చేస్తుంటారు. సంస్థలు డబ్బులిచ్చి మరీ హ్యాక్ చేయమని చెబుతాయి. దీనిద్వారా తమ భద్రతా వ్యవస్థలోని లోపాలను తెలుసుకుని సరిదిద్దుకుంటాయి.
Published date : 12 Sep 2017 04:40PM

Photo Stories