Skip to main content

డిజిటల్‌ బాటలో టెక్‌ స్కిల్స్‌ హవా!

రోబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్, డేటాసైన్స్‌...

గత కొంత కాలంగా హాట్‌ టాపిక్స్‌! బిజినెస్, కార్పొరేట్, టెక్నాలజీ రంగాల్లో వీటి గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ఏఐని ఎవరు ముందుగా అందిపుచ్చుకుంటే.. ఆ దేశమే ఆర్థికంగా దూసుకుపోయే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. భవిష్యత్‌లో ఎలాంటి కొలువు కావాలన్నా.. ఈ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఉంటేనే సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కారణం.. ప్రస్తుతం డిజిటల్‌ బాట పడుతున్న కంపెనీలు.. రోబోటిక్స్, ఏఐ–ఎంఎల్, డేటాసైన్స్‌ వంటి టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతుండటమే!! ఈ నేపథ్యంలో.. డిజిటల్‌ టెక్నాలజీస్‌.. అందివచ్చే
అవకాశాలు.. ఆయా నైపుణ్యాలు పొందేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం..

కరోనా ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసింది. క్లయింట్లకు, కస్టమర్లకు వేగంగా సేవలందించాలనే ఆలోచనతో అన్ని రంగాల్లోని సంస్థలూ.. డిజిటల్‌ బాటపడుతున్నాయి. అందుకోసం ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీగా పేరుగాంచిన ఏఐ, ఎంఎల్, డేటాసైన్స్, రోబోటిక్స్‌ టెక్నాలజీలను ప్రవేశ పెడుతున్నాయి. ఈ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ నైపుణ్యాలున్న నిపుణులకు ఉద్యోగాలతోపాటు ఆకర్షణీయ వేతనాలు ఇస్తున్నాయి.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌..
డిజిటల్‌ టెక్నాలజీస్‌ ఆధారిత కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌(ఏఐ–ఎంఎల్‌) కీలకంగా మారుతున్నాయి. చిన్న తరహా సంస్థలు మొదలు, బహుళ జాతి కంపెనీల వరకూ.. సర్వీస్‌ సెక్టార్‌ నుంచి హెల్త్‌కేర్‌ దాకా.. ఏఐ–ఎంఎల్‌ టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది.

ఆటోమొబైల్‌ రంగంలో ప్రస్తుతం డ్రైవర్‌లెస్‌ కార్ల గురించి వింటున్నాం కదా! ఈ కార్లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌(ఏఐ) ఆధారంగానే పనిచేస్తాయి. ఇందుకు అవసరమైన కోడింగ్, ప్రోగ్రామింగ్‌లను రూపొందించే వారినే ఏఐ–ఎంఎల్‌ నిపుణులుగా పేర్కొంటున్నారు. అదేవిధంగా అమెజాన్‌ అసిస్టెంట్, అలెక్సా సర్వీసెస్‌ వంటివి కూడా ఏఐతోనే సాధ్యమవుతున్నాయి.

హెల్త్‌కేర్‌ రంగంలో.. రోగుల మెడికల్‌ హిస్టరీ, బిల్లింగ్‌ ఇన్ఫర్మేషన్, డాక్టర్ల అపాయింట్‌మెంట్‌ రిమైండర్లు వంటివన్నీ ఏఐ ఆధారిత ఆటోమేషన్‌ విధానంలోనే∙జరుగుతున్నాయి. అలాగే మెషీన్‌ లెర్నింగ్‌ టూల్స్‌ ఆధారంగా డయాగ్నస్టిక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

సాఫ్ట్‌వేర్‌ రంగంలో 60 శాతం మేర కార్యకలాపాలను ఏఐ, ఎంఎల్‌ ద్వారా నిర్వహించేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఇదే పరిస్థితి బీఎఫ్‌ఎస్‌ఐ, ఎడ్‌టెక్, ఈ–కామర్స్‌ తదితర రంగాల్లోనూ కనిపిస్తోంది. దీంతో ఏఐ–ఎంఎల్‌ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది.

ఏఐ ఇండెక్స్‌–2021 వార్షిక నివేదిక ప్రకారం–2020లో ఏఐ విభాగాల్లో1.14 లక్షల ఉద్యోగాలు లభించాయి.

ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ తాజా విశ్లేషణ ప్రకారం–2030 నాటికి ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల స్థానంలో కొత్త టెక్నాలజీకి సంబంధించి 20 మిలియన్ల కొలువులు రానున్నాయి.

డేటాసైన్స్‌..
నేటి డిజిటల్‌ యుగంలో.. డేటాసైన్స్‌ డిమాండింగ్‌ టెక్నాలజీగా మారింది. కంపెనీలు మార్కెట్‌ ట్రెండ్స్‌ విశ్లేషణకు, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు, కస్టమర్లకు నచ్చే విధంగా సేవలు, ఉత్పత్తులు అందించేందుకు డేటా విశ్లేషణపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

డేటాసైన్స్‌కు సంబంధించి క్షేత్ర స్థాయి విధులు, బ్యాక్‌ ఎండ్‌ అప్లికేషన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. మార్కెటింగ్‌ నిపుణులు అందించే కస్టమర్స్‌ డేటాను విశ్లేషించి.. వినియోగదారులకు నచ్చే ప్రొడక్ట్స్‌ను మార్కెట్‌లోకి తెచ్చేలా వీరు కంపెనీలకు సహకరిస్తారు.

డేటా సైన్స్‌ విభాగంలో విధులు నిర్వహించే నిపుణులు.. స్టాటిస్టిక్స్, అల్గారిథమ్స్, డేటా అనాలిసిస్, మెషీన్‌ లెర్నింగ్, కోడింగ్, ప్రోగ్రామింగ్‌ తదితర విభాగాలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. కంపెనీలు వినియోగ దారులకు చేరువయ్యేలా చూడటం డేటాసైన్స్‌ నిపుణుల ప్రధాన బాధ్యత.

తాజా విశ్లేషణల ప్రకారం–డేటాసైన్స్‌లో 2020లో దేశంలో 90 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ విభాగంలో డిమాండ్‌కు తగ్గట్లు మానవ వనరుల లభ్యత లేదని చెబుతున్నారు. కాబట్టి విద్యార్థులు డేటాసైన్స్‌ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. అవకాశాలు అందుకోవచ్చు.

రోబోటిక్స్‌..
ఆటోమొబైల్, మాన్యుఫ్యాక్చరింగ్‌ వంటి రంగాల్లో వేగంగా విస్తరిస్తున్న మరో టెక్నాలజీ.. రోబోటిక్స్‌.
రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ ద్వారా ఉత్పత్తి రంగం మొదలు హెల్త్‌ కేర్‌ వరకూ.. అనేక విభాగాలు రోబో ఆధారిత సేవలు, కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా మెషిన్‌లు వాటంతటవే పని చేసేలా చూసే ప్రక్రియనే.. రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ అంటారు. సంస్థల అవసరాలకు తగ్గ రీతిలో పనిచేసే విధంగా రోబోలను ప్రోగ్రామింగ్‌ చేస్తారు.
గార్ట్‌నర్‌ అంచనా ప్రకారం–ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌పీఏ ఆధారిత కార్యకలాపాలు రెండింతలు పెరిగాయి.
పలు స్టాఫింగ్‌ సంస్థల నివేదికల ప్రకారం–2021లో టాప్‌–10 డిమాండింగ్‌ కెరీర్స్‌లో రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌(ఆర్‌పీఏ) కూడా చోటు సంపాదించింది.
నాస్‌కామ్‌ నివేదిక ప్రకారం–ఐటీ బీపీఓ రంగంలో 2022 నాటికి ఆర్‌పీఏ ఆధారిత సేవలు 70 శాతం మేరకు పెరగనున్నాయి. అందుకు తగ్గట్టుగా ఆర్‌పీఏ, రోబోటిక్స్‌ విభాగాల్లో ఉద్యోగాలు లభించనున్నాయి.

నేర్చుకునేందుకు మార్గాలు
బీటెక్‌లో ఏఐ..
ప్రస్తుతం పలు ఐఐటీలు, ఇతర ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు.. బీటెక్‌ స్థాయిలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌తో పూర్తి స్థాయి కోర్సును అందిస్తున్నాయి. దీంతో పాటు పీజీలో కూడా ఏఐ స్పెషలైజేషన్‌తో ఎంటెక్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐబీఎం, ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు ఏఐలో ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. వీటి కాల వ్యవధి నెల రోజుల నుంచి నాలుగు నెలల వరకు ఉంటోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోనూ స్వల్ప కాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

రోబోటిక్స్‌ నైపుణ్యాలు పొందేలా..
ఎంటెక్‌లో మెడికల్‌ రోబోటిక్స్‌; సిగ్నల్‌ ప్రాసెసింగ్‌; రోబోట్‌ మోషన్‌ ప్లానింగ్‌; ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ స్పెషలైజేషన్లు అభ్యసించడం ద్వారా ఆర్‌పీఏ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు సీమెన్స్, రోబోటిక్స్‌ ఆన్‌లైన్, సర్టిఫైడ్‌ ఆటోమేషన్‌ ప్రొఫెషనల్, రోబోటిక్స్‌ టెక్నీషియన్‌ అండ్‌ ఆటోమేషన్‌ ట్రైనింగ్‌ వంటి పలు సర్టిఫికేషన్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

డేటాసైన్స్‌కు మార్గం..
డేటా సైన్స్‌లో నైపుణ్యాలు సొంతం చేసుకునేలా బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయి నుంచే అడుగులు వేయొచ్చు. బీఎస్సీ(మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజికల్‌ సైన్సెస్‌) చదువుతున్న విద్యార్థులు.. వీటికి అదనంగా కోడింగ్, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకోవడం ద్వారా డేటా సైన్స్‌ ఉద్యోగాలకు సిద్ధం కావొచ్చు. అదే విధంగా కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులు.. బిగ్‌ డేటా, డేటా అనలిటిక్స్‌లో సర్టిఫికేషన్స్‌ పూర్తి చేయడం ద్వారా కొలువుల అన్వేషణ సాగించొచ్చు. పీజీ స్థాయిలో ఎంబీఏలో డేటాసైన్స్‌ లేదా మార్కెటింగ్, బిజినెస్‌ అనలిటిక్స్‌ స్పెషలైజేషన్స్‌ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఈ విభాగంలో కొలువుదీరొచ్చు. అదేవిధంగా కోర్స్‌ఎరా, ఉడాసిటీ, యుడెమీ, ఎడెక్స్‌ వంటి మూక్స్‌ ద్వారాను నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు.


మరింత పెరిగే అవకాశం..
ఏఐ, డేటాసైన్స్, ఆర్‌పీఏ ఆధారిత కార్యకలాపాలు రానున్న రోజుల్లో మరింత వేగంగా పెరగడం ఖాయం. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు, బీటెక్‌ చదువుతున్న వారు ఆయా టెక్నాలజీ నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలి.
– ఎ.శశికుమార్, ఇండీడ్‌ డాట్‌ కామ్‌

Published date : 26 Aug 2021 04:14PM

Photo Stories