Skip to main content

‘బంగారం’ లాంటి కెరీర్ సొంతం చేసుకోండిలా...

అక్షయ తృతీయ.. ఒక్క రోజే రూ.కోట్లలో వ్యాపారం... ధనత్రయోదశి.. నగల దుకాణాల ముందు క్యూకట్టి మరీ బంగారం కొనుక్కోవాలనే తాపత్రయం! బంగారం అన్నా.. వజ్రాభరణాలన్నా.. మన దేశ ప్రజలకున్న మక్కువకు నిదర్శనాలివి!! ఒకప్పుడు బంగారు నగలు, నట్రా చేయడం సంప్రదాయ వృత్తిగా ఉండేది. ఇప్పుడు జె మ్స్, జ్యుయలరీ విభాగం కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. ఫలితంగా.. ఈ విభాగం నేడు యువతకు ఉద్యోగాలకు వేదికగా మారుతోంది. మరి అకడెమిక్‌గా జెమ్స్ అండ్ జ్యుయలరీ కోర్సులు ఏవైనా అందుబాటులో ఉన్నాయా..! ఈ రంగంలో బంగారం లాంటి కెరీర్ సొంతం చేసుకునేందుకు మార్గాలేమిటో తెలుసుకుందాం...
ఆభరణాల తయారీ ఒకప్పుడు సంప్రదాయ కుల వృత్తిగా ఉండేది. పూర్వీకులు, తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా నగల వ్యాపారం నిర్వహించే వారు. కానీ, ప్రస్తుతం జెమ్స్ అండ్ జ్యుయలరీ విభాగం కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. సూపర్ మార్కెట్ చైన్ల మాదిరిగానే పలు సంస్థలు ఈ విభాగంలో రిటైల్ ట్రేడింగ్‌లోకి అడుగుపెట్టాయి. ఇవి తమ శాఖలను విస్తరిస్తున్నాయి. ఫలితంగా జెమ్స్ అండ్ జ్యుయలరీ రంగం యువతకు సరికొత్త ఉపాధి వేదికగా మారుతోంది. డిజైన్ నుంచి సేల్స్ వరకు.. పలు విభాగాల్లో కార్పొరేట్ సంస్థలు, రిటైల్ ట్రేడింగ్ సంస్థలు నియామకాలు జరుపుతున్నాయి.

డిజైన్ నుంచి.. సేల్స్ వరకు
ఆభరణాలు, డైమండ్స్ విభాగంలో కార్పొరేట్ సంస్థలు అడుగుపెట్టాయి. ఇవి వినియోగదారులను ఆకట్టుకోవడానికి, మార్కెట్ వాటా పెంచుకునేందుకు ఆకర్షణీయమైన డిజైన్లలో ఆభరణాలు రూపొందిస్తున్నాయి. మరోవైపు వాటిని కొనుగోలుచేసేలా వినియోగదారులను ఒప్పించేందుకు ఫ్రంట్ ఎండ్‌లో సేల్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. కాబట్టి ఆభరణాలు, డైమండ్స్‌కు సంబంధించి డిజైన్ నుంచి సేల్స్ వరకు.. ఒక్కో విభాగంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభించే అవకాశముందని నిపుణుల అంచనా.

సర్టిఫికెట్ టు డిగ్రీ కోర్సులు :
జెమ్స్ అండ్ జ్యుయలరీ విభాగంలో కొలువులకు వీలు కల్పించే నైపుణ్యాలు అందించేందుకు అకడమిక్ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. పలు సంస్థలు డిప్లొమా, సర్టిఫికెట్, డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఫ్యాషన్ కెరీర్స్‌కు పెట్టింది పేరైన నిఫ్ట్(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ).. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆర్నమెంట్ డిజైన్‌లో శిక్షణనందిస్తోంది. దీన్ని పూర్తిచేసిన వారికి ఆభరణాల తయారీలో తొలిదశగా పేర్కొనే డిజైన్ విభాగంలో కొలువులు లభించడం ఖాయం. ముఖ్యంగా ఫ్యాషన్ జ్యుయలరీ విభాగం, డైమండ్స్, జెమ్స్ విభాగంలో వీరు ఉపాధి పొందే వీలుంది.

ఎంఎస్‌ఎంఈ :
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎంఎస్‌ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్).. జ్యుయలరీ విభాగంలో పలు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అందిస్తోంది. దేశవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్.. గోల్డ్ స్మిత్, డైమండ్ కటింగ్ తదితరఅంశాల్లో స్వల్పకాలిక కోర్సులు నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా ఎన్‌ఎస్‌డీసీలోనూ.. సెక్టార్‌స్కిల్ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో గోల్డ్ స్మిత్, ప్రాసెసింగ్, రిటెయిలింగ్, ట్రేడింగ్ వంటి అంశాల్లో శిక్షణ లభిస్తోంది. దీంతోపాటు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ పరిధిలో.. డైమండ్ సెట్ జ్యుయలరీ విభాగంలో క్యాడ్ ఆపరేటర్, హ్యాండ్ స్కెచ్ డిజైనర్ కోర్సుల్లో శిక్షణ సదుపాయం అందుబాటులో ఉంది.

ఫ్యాషన్ జ్యుయలరీ :
జెమ్స్ అండ్ జ్యుయలరీలో రంగంలో ఫ్యాషన్ జ్యుయలరీ విభాగం వేగంగా వృద్ధి చెందుతోంది. దాంతో చైన్ కటింగ్, క్యాస్టింగ్, స్టోన్ ఫిట్టింగ్ తదితర విభాగాల్లో కొలువుల సంఖ్య పెరుగుతోంది. ఏటా రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు తామే సొంతంగా అభ్యర్థులను నియమించుకుని కొద్దికాలం శిక్షణనిచ్చి ఆర్టిసన్‌లుగా కొలువులు ఖరారు చేస్తున్నాయి. వేతనాలు కూడా ఆకర్షణీయంగానే ఉంటున్నాయి. కాంట్రాక్ట్ విధానంలో చేరిన అభ్యర్థులకు నెలకు రూ.8 వేల నుంచి పది వేలు; శాశ్వత ప్రాతిపదికగా నియమించుకున్న వారికి నెలకు రూ.15 వేల వరకు వేతనం లభిస్తోంది.

వైవిధ్య కొలువులు..
జ్యుయలరీ డిజైనర్:
ఆభరణానికి సంబంధించి ప్రాథమికంగా ఒక ఆకృతిని రూపొందించే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నిఫ్ట్, సీడ్, ఎన్‌ఐడీ వంటి సంస్థల నుంచి డిజైన్ కోర్సుల్లో డిగ్రీ పొందిన వారికి జ్యుయలరీ డిజైనర్‌గా అవకాశం లభిస్తోంది. వీరు ప్రారంభంలో రూ.40 వేల వరకు వేతనం అందుకోవచ్చు.
గోల్డ్‌స్మిత్ (స్వర్ణకారులు): డిజైన్‌పై స్పష్టత లభించాక.. ముడి బంగారాన్ని డిజైన్‌కు అనుగుణంగా తీర్చిదిద్దడం గోల్డ్‌స్మిత్ చేసే పని. వీరికి జ్యుయలరీ విభాగంలో నెలకు రూ.20 వేల వరకు; జెమ్స్, డైమండ్స్, ఫ్యాషన్ జ్యుయలరీ విభాగంలో రూ.15 వేల వరకు వేతనం లభిస్తుంది.
ల్యాబ్ జెమాలజిస్ట్: డైమండ్స్, పెర్ల్స్ వంటి జెమ్స్‌కు సంబంధించి లేబొరేటరీల్లో వాటి నాణ్యతను పరిశీలించే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరికి ప్రారంభంలో రూ.40 వేల వరకు వేతనం ఖాయం.
డైమండ్ గ్రేడర్: జెమాలజీకి సంబంధించి మంచి ఆదాయం కల్పించే మరో హోదా డైమండ్ గ్రేడర్. డైమండ్ నాణ్యతను బట్టి గ్రేడింగ్ చేయడం ప్రధాన విధి.
జెమ్ స్టోన్ అప్రైజర్: జెమ్స్‌ను, వాటి నాణ్యతను పరిశీలించడం, దాని ఆధారంగా వాటి విలువను అంచనా వేయడం వీరి ప్రధాన విధి. ప్రస్తుతం వీరికి డిమాండ్ అధికంగా ఉంది.

రిటైల్ ట్రేడింగ్ :
రిటైల్ ట్రేడింగ్‌లోనూ పలు అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, ఫ్లోర్ మేనేజర్, షోరూమ్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ హోదాల్లో నెలకు రూ.12 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనం అందుకోవచ్చు.

కొలువుల అన్వేషణ..
జెమ్స్ అండ్ జ్యుయలరీ విభాగంలో ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ.. వాటికి సంబంధించి సమాచారం అభ్యర్థులకు తెలియడంలేదు. దీనికి ప్రధాన కారణం.. సంస్థలు, తమ సమీప ప్రాంతాల్లోని స్వర్ణకారులను నేరుగా సంప్రదించడమే. దీంతో ఈ రంగంలో అసంఘటిత కార్మికుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఈ విభాగంలో నైపుణ్యం పొందిన అభ్యర్థులు స్వయంగా సంస్థలను సంప్రదించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

జెమాలజీ ఇన్‌స్టిట్యూట్స్ వివరాలు..
  1. జెమ్ అండ్ జ్యుయలరీ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.
    వెబ్‌సైట్:
    www.gjsci.org
  2. జెమలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.
    వెబ్‌సైట్:
    https://giionline.com
  3. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెమాలజీ.
    వెబ్‌సైట్:
    www.iigdelhi.com
  4. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన.
    వెబ్‌సైట్:
    pmkvyofficial.org

ముఖ్య గణాంకాలు..
  • బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలోనే పెద్ద మార్కెట్‌గా ఉంది.
  • భారత బంగారం మార్కెట్ 2025 నాటికి వంద బిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా.
  • పస్తుతం దేశవ్యాప్తంగా జెమ్స్, జ్యుయలరీ రంగంలో సంఘటిత, అసంఘటిత విభాగాల్లో 4.64 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తోంది.
  • 2022 నాటికి ఉపాధి పొందే వారి సంఖ్య 8.2 మిలియన్లకు చేరుకోనుంది.
Published date : 16 Nov 2018 04:16PM

Photo Stories