Skip to main content

అవకాశాలకు వేదిక...ఐఐఎస్‌సీ

దేశంలో సైన్స్ ఎడ్యుకేషన్ అంటే టక్కున గుర్తొచ్చే విద్యాసంస్థ... బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ).
అంతర్జాతీయంగా యూనివర్సిటీలకు ర్యాంకులు ఇచ్చే క్యూఎస్, టైమ్స్, ఏఆర్‌డబ్ల్యూయూ తదితర సంస్థల ర్యాంకుల జాబితాలో ప్రతిఏటా తప్పనిసరిగా స్థానం పొందే సంస్థ ఇది. దీనికి ప్రధాన కారణం.. బోధన, పరిశోధన పరంగా ఇన్‌స్టిట్యూట్‌లో పాటిస్తున్న ప్రమాణాలే. ఇక్కడ కోర్సులు పూర్తి చేస్తే.. భవిష్యత్తు బంగారమవుతుందనే అభిప్రాయముంది. 2018-19 విద్యా సంవత్సరానికి.. యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఐఐఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో పూర్తి వివరాలు...

ప్రయోజనాలు..
  • ఐఐఎస్‌సీలో ఏ కోర్సులో ప్రవేశం లభించినా.. ఉజ్వల భవిష్యత్తు సొంతమవడం ఖాయం. ఇటీవల కాలంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గణాంకాలే ఇందుకు నిదర్శనం. బ్యాచిలర్, పీజీ ప్రోగ్రామ్‌ల అభ్యర్థులకు ఆర్ అండ్ డీ సంస్థలు, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఫార్మసీ సంస్థల్లో సగటున రూ.15లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభిస్తున్నాయి.
  • పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి డీఆర్‌డీఓ, డీబీటీ తదితర పరిశోధన సంస్థల్లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్, సీఎస్‌ఐఆర్ లేబొరేటరీల్లో సైంటిస్ట్ హోదాలో ఉద్యోగాలు లభిస్తున్నాయి.
  • ఐఐఎస్సీలో ప్రవేశం పొందిన విద్యార్థులు సమంజసమైన ట్యూషన్ ఫీజుతోపాటు అత్యాధునిక ల్యాబ్స్, తక్కువ ధరకే భోజనం, వసతి వంటి ఇతర సౌకర్యాలు కూడా అందిపుచ్చుకోవచ్చు.
  • ఇంటిగ్రేటెడ్ పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు ఎంపికైన అభ్యర్థులకు ఎంహెచ్‌ఆర్‌డీ, సీఎస్‌ఐఆర్, యూజీసీ, ఐసీఎంఆర్, డీబీటీ, ఏఐసీటీఈ, డీఏఈ సంస్థలు అందించే స్కాలర్‌షిప్ లభిస్తుంది.
యూజీ ప్రోగ్రామ్స్...
ఐఐఎస్‌సీ అందించే యూజీ కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రీసెర్చ్). ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. కోర్ సైన్స్, ఇంటర్ డిసిప్లినరీ అంశాలు ఇందులో భాగంగా బోధిస్తారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్‌ను పూర్తిచేస్తే.. ఇండస్ట్రీలో, ఉన్నత విద్యపరంగా ఆకర్షణీయ అవకాశాలు అందుకోవచ్చు. నాలుగేళ్లు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులకు ఆసక్తి ఉంటే మరో ఏడాది అక్కడే చదివి(ఎంఎస్) మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా అందుకునే అవకాశాన్ని ఐఐఎస్‌సీ కల్పిస్తోంది. నాలుగేళ్ల బీఎస్ కోర్సుల్లో భాగంగా సైన్స్ సబ్జెక్టులు స్పెషలైజేషన్‌లుగా చదవడంతోపాటు ఇంజనీరింగ్, సోషల్ సైన్సెస్ అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్‌లలో విద్యార్థులంతా తప్పనిసరిగా... ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అంశాలు చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 4వ, 5వ , 6వ సెమిస్టర్‌లలో విద్యార్థులు తమకు నచ్చిన స్పెషలైజేషన్లు(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, మెటీరియల్స్ అండ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) ఎంపిక చేసుకోవచ్చు. 7వ, 8వ సెమిస్టర్స్‌లో ఫ్యాకల్టీ పర్యవేక్షణలో రీసెర్చ్ ఓరియెంటెడ్ ప్రాజెక్టు వర్క్ ఉంటుంది.
అర్హతలు:
  • 12వ తరగతి/ఇంటర్‌ను 2017లో పూర్తిచేసిన; 2018లో పూర్తిచేసుకోనున్న విద్యార్థులు యూజీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • ఇంటర్/12వ తరగతిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా చదివుండాలి.
  • 12వ తరగతి/ఇంటర్‌లో కనీసం 60శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఎంపిక విధానం :
  • కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)-ఎస్‌ఏ స్ట్రీమ్-2016లో ఉత్తీర్ణత సాధించి, ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులు.
  • కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కే వీపీవై)-ఎస్‌బీ స్ట్రీమ్-2017లో ఉత్తీర్ణత సాధించి, ఫెలోషిప్‌నకు ఎంపికైన వారు.
  • కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)-ఎస్‌ఎక్స్‌కు 2017లో హాజరై, ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులు.
  • కేవీపీవై-ఎస్‌ఏ, ఎస్‌ఎక్స్‌కు ఎంపవర్‌మెంట్ ఇనిషియేటివ్ ద్వారా ఎంపికైన ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు.
  • ఐఐటీ జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్‌కు 2018లో హాజరవుతున్న అభ్యర్థులు. అయితే ఈ విధానంలో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు.. జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్‌లలో జనరల్ అభ్యర్థులు తప్పనిసరిగా 60శాతం మార్కులు సాధించాలి. ఓబీసీ అభ్యర్థులు 54శాతం; ఎస్‌సీ/ఎస్‌టీ/పీడబ్ల్యుడీ అభ్యర్థులు 30శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. నీట్ యూజీ 2018కు హాజరుకానున్న అభ్యర్థులు, కనీసం 60 శాతం(జనరల్), 54 శాతం (ఓబీసీ), 30 శాతం (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ).
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది : ఏప్రిల్ 30, 2018 వరకు
దరఖాస్తు ఫీజు : జనరల్/ఓబీసీ/కెఎమ్ (కాశ్మీరీ మైగ్రెంట్) అభ్యర్థులకు రూ.500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.250
వెబ్‌సైట్: https://www.iisc.ac.in/ug


పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు...
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌తోపాటు పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు కూడా ఐఐఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రోగ్రామ్‌ల వివరాలు...
1. రీసెర్చ్ ప్రోగ్రామ్స్(పీహెచ్‌డీ/ఎంటెక్(రీసెర్చ్).
2. కోర్స్ ప్రోగ్రామ్స్(ఎంటెక్/మాస్టర్ ఆఫ్ డిజైన్/ మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్.
3. ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్.
4. పీహెచ్‌డీ-ఎక్స్‌టర్నల్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్స్(ఈఆర్‌పీ).
అర్హతలు :
  • బీటెక్ ఉత్తీర్ణత లేదా సైన్స్/ఎకనామిక్స్/జాగ్రఫీ/సోషల్ వర్క్/సైకాలజీ/మేనేజ్‌మెంట్/ కామర్స్/ఆపరేషన్స్ రీసెర్చ్/కంప్యూటర్ సైన్స్/అప్లికేషన్ స్పెషలైజేషన్లతో పీజీ.
  • గేట్ స్కోర్ లేదా నెట్ జేఆర్‌ఎఫ్ ఉత్తీర్ణత.
  • ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/అగ్రికల్చర్/ఫార్మసీ/వెటర్నరీ సైన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు; బీఈ/బీటెక్ తర్వాత ఎంఎస్/ఎంబీఏ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి విషయంలోనూ గేట్, నెట్-జేఆర్‌ఎఫ్ వారికి కొంత ప్రాధాన్యం ఉంటుంది.
  • గేట్ స్కోర్ గుర్తింపు పరంగా.. 2016/ 2017/ 2018 సంవత్సరాల్లో గేట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ..
ఎంటెక్‌లో పేర్కొన్న కొన్ని స్పెషలైజేషన్ల (క్లైమేట్ సైన్స్, కంప్యుటేషనల్ డేటాసైన్స్, ఎర్త్ సైన్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)కు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూను ఐఐఎస్‌సీ నిర్వహిస్తుంది.

మాస్టర్ ఆఫ్ డిజైన్ :
ఐఐఎస్‌సీ అందిస్తున్న మరో మాస్టర్స్ కోర్సు.. మాస్టర్ ఆఫ్ డిజైన్. ఇంజనీరింగ్/టెక్నాలజీ/ డిజైన్/ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణతతోపాటు గేట్ 2016/2017/2018 స్కోర్/సీడ్ 2018 స్కోర్ పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఆ తర్వాత చివరగా ఇంటర్వ్యూ ఉంటుంది.

మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ :
సైన్స్ ఎడ్యుకేషన్‌కు పేరు గడించిన ఐఐఎస్‌సీ వినూత్నంగా మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోర్సును కూడా అందిస్తోంది. బీటెక్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి గేట్ (2016/2017/2018) స్కోర్లు ఉన్న అభ్యర్థులు/క్యాట్-2017 ఉత్తీర్ణులు, జీమ్యాట్ స్కోర్ పొందిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఈ స్కోర్ల ఆధారంగా దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి తదుపరి దశలో గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ :
ఐఐఎస్‌సీ ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ అందిస్తోంది. ప్రస్తుతం బయలాజికల్ సైన్సెస్, కెమికల్ సెన్సైస్, ఫిజికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. బీఎస్‌సీ(ఎంపీసీ, బీజెడ్‌సీ) లేదా బీఫార్మసీ, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ కోర్సుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతతోపాటు.. జామ్-2018లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు.
  • జెస్ట్-2018 అభ్యర్థులు ఫిజికల్ సైన్సెస్ కోర్సుకు అర్హులు.
  • బీఈ/బీటెక్ పూర్తి చేసి.. జామ్-2018లో మ్యాథమెటిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ పేపర్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మ్యాథమెటికల్ సైన్సెస్ కు; బయోటెక్నాలజీ పేపర్‌లో ఉత్తీర్ణులు బయలాజికల్ సైన్స్ విభాగాలకు అర్హులు.
  • కెమికల్ సైన్సెస్ స్పెషలైజేషన్ ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు మాత్రం జామ్ స్కోర్‌తోపాటు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.
పీహెచ్‌డీ-ఈఆర్‌పీ :
ఆర్‌అండ్‌డీ సంస్థలు/ఇండస్ట్రీస్‌తోపాటు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాస్యుటికల్, వెటర్నరీ, మెడికల్ కళాశాలలు/యూనివర్సిటీల్లోని అధ్యాపకుల కోసం పీహెచ్‌డీ-ఎక్స్‌టర్నల్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్స్(ఈఆర్‌పీ)ను ప్రత్యేకంగా ఐఐఎస్‌సీ రూపొందించింది. ఔత్సాహిక అభ్యర్థులు, రెగ్యులర్ కోర్సుల వారికి అవసరమైన అర్హతలతోపాటు సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ జేఆర్‌ఎఫ్/డీబీటీ జేఆర్‌ఎఫ్/ఐసీఎంఆర్ జేఆర్‌ఎఫ్/గేట్/ఎన్‌బీ హెచ్‌ఎంలలో ఏదో ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం :
ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఫిబ్రవరి 1, 2018 నుంచి మార్చి 26, 2018 వరకు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ రూ.800, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.400; అన్ని కేటగిరీల ఈఆర్‌పీ అభ్యర్థులకు ఫీజు రూ.2000; డీఆర్‌డీవో, బార్క్, ఇస్రో, ఎన్‌ఏఎల్, ఎన్‌టీఆర్‌వో, కెఎస్‌ఆర్‌టీసీ, బీఎంటీసీ, బీడీఏ, పీడబ్ల్యూడీ, సీపీఆర్‌ఐ స్పాన్సర్డ్ అభ్యర్థులకు ఫీజు రూ.800.
వెబ్‌సైట్: https://www.iisc.ac.in/admission
Published date : 08 Mar 2018 03:20PM

Photo Stories