ఐఐఎంసీలో జర్నలిజం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!
సమాజ హితాన్ని కాంక్షిస్తూ.. అక్షరాలతో అందరినీ ఆలోచింపజేసే అరుదైన అవకాశం జర్నలిజంలో పనిచేసే వారికే లభిస్తుంది. ఇలాంటి రంగంలో కెరీర్ కోరుకునే యువత కోసం జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు అందిస్తోంది.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ). 2021–22 విద్యాసంవత్సరానికి ఐఐఎంసీలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఐఐఎంసీ అందించే కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..
కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూ నికేషన్ (ఐఐఎంసీ).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ క్యాంపస్‌ల్లో పలు రకాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. ఐఐఎంసీకి న్యూఢిల్లీలోని ప్రధాన క్యాంపస్‌తో పాటు ధేన్ కనల్ (ఒడిషా), ఐజ్వాల్ (మిజోరం), అమరావతి(మహారాష్ట్ర), కొట్టాయం(కేరళ), జమ్ముల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో పీజీ డిప్లొమా ఇన్ ఇంగ్లిష్ జర్నలిజం, హిందీ జర్నలిజం, రేడియో అండ్ టీవీ జర్నలిజం, అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, ఇతర లాంగ్వేజ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు..
ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు ఐఐఎంసీ అందించే కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ..
ఐఐఎంసీలో ప్రవేశాలు కోరుకునే వారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
జాతీయ స్థాయిలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో రెండు సిట్టింగ్‌ల్లో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలుంటాయి.
అడ్వర్‌టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్‌కు సంబంధించి ఇంగ్లి్లష్/హిందీ భాషల్లో ప్రశ్న పత్రం ఉంటుంది. అలాగే భాషపరమైన పీజీ డిప్లొమా జర్నలిజం కోర్సులకు సంబంధించి ఎంపిక చేసుకునే భాషను అనుసరించి హిందీ/ఉర్దూ/ఒడియా/మలయాళం భాషల్లో పరీక్ష ఉంటుంది.
ఒకే రోజు రెండు సిట్టింగ్‌లో పరీక్షలను నిర్వహిస్తారు. పీజీ డిప్లొమా ఇన్ ఇంగ్లిష్, హిందీ, పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ అడ్వర్‌టైజింగ్, పీజీ డిప్లొమా ఇన్ రేడియో అండ్ టెలివిజన్ జర్నలిజానికి సంబంధించిన నాలుగు కోర్సులను ఒక సిట్టింగ్‌గా పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. అలాగే ప్రాంతీయ భాషలు ఉర్దూ/ఒడియా/మలయాళం/మరాఠీలకు సంబం«ధించి మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షను ఉంటుంది.
వార్తల్లోని వ్యక్తులు/జాతీయ, అంతర్జాతీయంగా ప్రస్తుత పరిణామాలు, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలను అడిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు భాషా సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలను అడుగుతారు.
ఉద్యోగావకాశాలు..
జర్నలిజం కోర్సులను పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మ్యాగజైన్లు, వెబ్‌సైట్లలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డెవలప్‌మెంట్ జర్నలిస్టులకు మీడియా రంగంలో మంచి డిమాండ్ ఉంది. సబ్ ఎడిటర్లుగా, కాపీ ఎడిటర్లుగా, రిపోర్ట్‌లుగా కెరీర్ ప్రారంభించి.. ఆసక్తి ఉన్న విభాగంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.
వేతనాలు..
ప్రస్తుతం మీడియా సంస్థల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ప్రతిభ కనబరిస్తే ఆకర్షణీయమైన వేతనాలు అందుతాయి. దాంతోపాటు సమాజంలో మంచి గుర్తింపు పొందొచ్చు.ఈ ఉద్యోగంలో వేతనాలు ఎక్కువగా లభించకపోయినా.. వృత్తిపరమైన సంతృప్తి మాత్రం లభిస్తుందనే అభిప్రాయం ఉంది.
ముఖ్యమైన సమాచారం..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 09.08.2021
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం : హైదరాబాద్
ప్రవేశ పరీక్ష తేదీ: 29.08.2021
ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 10, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : www.iimc.gov.in.