Skip to main content

అధిక వేతనాలిచ్చే కొలువులు ఇవే

అమెరికాలో ఉద్యోగం.. పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో లక్షల్లో జీతమొచ్చే ఐటీ జాబ్! ఇలాంటి మాటలు మనం తరచూ వింటుంటాం. అంటే.. అమెరికాలో జాబ్, లేదంటే సాఫ్ట్‌వేర్ కొలువు అయితేనే రూ.లక్షల్లో వేతనాలు చేతికందుతాయనే అభిప్రాయం సర్వసాధారణంగా మారింది.
కానీ, సరైన నైపుణ్యాలు, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే ఇక్కడే, వివిధ రంగాల్లో భారీ వేతనాలు వచ్చే ఉద్యోగాలున్నాయంటున్నారు నిపుణులు. అందుకునే సామర్థ్యం ఉండాలేగానీ అవకాశాలు అపారమంటూ భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సరైన విద్యార్హతలు, విషయ పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు ఉంటే.. అత్యధిక వేతనాలు లభించే అవకాశమున్న ఉద్యోగాలేవో చూద్దాం..!

మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్..
సంస్థ అభివృద్ధి విషయంలో మేనేజర్ స్థాయి వ్యక్తులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. టాప్ మేనేజ్‌మెంట్ విధానాలను అమలు చేస్తారు. వృత్తి పరంగా ప్రారంభ దశలో కష్టపడితే చాలు.. కొంత అనుభవం గడించాక వెనక్కి తిరిగి చూసుకోవల్సిన అవసరం ఉండదు. స్థాయికి తగ్గట్లు అధిక వేతనాలూ అందుకోవచ్చు. మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ కెరీర్ పరంగా ఐఐఎంలు వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎంబీఏ పూర్తిచేసిన వారికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లోనే కార్పొరేట్ కంపెనీలు లక్షల్లో వేతనం ఆఫర్ చేస్తున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికైన మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ ప్రారంభ వార్షిక వేతనం సగటున రూ.10 లక్షల వరకు ఉంటుంది.

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ :
సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టడంలో.. ఆర్థికపరమైన సలహాలు అందించడంలో.. మూలధన పెట్టుబడుల సేకరణలోనూ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లదే కీలక పాత్ర. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా కెరీర్ ప్రారంభిస్తే... అనలిస్ట్, అసోసియేట్, వైస్ ప్రెసిడెంట్, డెరైక్టర్, మేనేజింగ్ డెరైక్టర్.. ఇలా అంచెలంచెలుగా ఎదిగే వీలుంది. వేతనాల విషయానికొస్తే అనలిస్టులకు సగటున రూ.8 లక్షలు, అసోసియేట్లకు రూ. 13 లక్షలు, వైస్ ప్రెసిడెంట్లకు రూ.30 లక్షల మధ్య వేతనం లభిస్తుంది. ప్రతిష్టాత్మక సంస్థలైన గోల్డ్‌మ్యాన్ శ్యాచ్స్, జేపీ మోర్గాన్ చేస్, డచ్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గాన్ స్టాన్లీ, సిటీ గ్రూప్ తదితరాలు ఉద్యోగ కల్పనలో ముందుంటున్నాయి.

చార్టర్డ్ అకౌంటెంట్ :
మనదేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తికి అమితమైన గౌరవం ఉంది. ఇంజనీరింగ్, మెడిసిన్ తర్వాత అత్యధిక మందికి క్రేజీ కెరీర్ ఇది. సీఏ కోర్సు పూర్తిచేసి.. వ్యాపార దక్షత, ఆర్థిక అంశాల్లో పట్టున్న వారు చార్టర్డ్ అకౌంటెంట్లుగా స్థిరపడొచ్చు. సీఏ పూర్తిచేసిన వారికి ఫైనాన్షియల్ అకౌంటింగ్, ట్యాక్స్ మేనేజ్‌మెంట్, ఆడిటింగ్, కాస్ట్ అకౌంటింగ్, బ్యాంకింగ్, కన్సల్టెన్సీ తదితర అంశాలపై మంచి అవగాహన కలిగి ఉంటే.. డెలాయిట్, ప్రైస్ వాటర్ కూపర్స్, కేపీఎంజీ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర సంస్థలు అధిక వేతనాలతో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. వీరి ప్రారంభ వార్షిక వేతనాలు సగటున రూ.5-8 లక్షలు, అనుభవం వచ్చాక రూ.18-25 లక్షల మధ్య ఉంటున్నాయి.

జియాలజిస్టులు, మెరైన్ ఇంజనీర్లు :
మనదేశంలో చమురు, సహజవాయు రంగాలకున్న డిమాండ్ గురించి తెలిసిందే. ముడి చమురు.. పెట్రోల్, డీజిల్‌గా మారాలంటే.. ఎన్నో ప్రక్రియలను దాటాలి. అందుకే ఈ రంగంలో పనిచేసే జియాలజిస్టులు, మెరైన్ ఇంజనీర్లు అధిక పరిజ్ఞానవంతులై ఉండాలి. సంబంధిత విద్యార్హతలు సొంతం చేసుకున్న విద్యార్థులు.. ఓఎన్‌జీసీ, ఐఓసీఎల్, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు బ్రిటిష్ గ్యాస్, రిలయన్స్ ఎనర్జీ, షెల్ వంటి ప్రైవేటు సంస్థల్లో అధిక వేతనాలతో ఉద్యోగాలు పొందొచ్చు. ఈ రంగంలో ప్రారంభ వార్షిక వేతనాలు సగటున రూ.5-8 లక్షలు ఉంటాయి. ఐదారేళ్ల అనుభవం గడించాక రూ.15-20 లక్షల వార్షిక వేతనం పొందవచ్చు.

ఏవియేషన్ ప్రొఫెషనల్స్ :
ప్రైవేటు ఎయిర్‌లైన్స్ రాకతో గతకొన్నేళ్లుగా ఏవియేషన్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అధిక సంఖ్యలో ఉద్యోగాలను సైతం కల్పిస్తోంది. జంబో పైలట్లు, రెగ్యులర్ పైలట్లు రూ.7-10 లక్షల వార్షిక వేతనం అందుంకుంటున్నారు. ఎయిర్‌లైన్ స్టీవార్డ్స్, ఎయిర్ హోస్టెస్, గ్రౌండ్ స్టాఫ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ (ఏటీసీ) వంటి వాళ్లకు సగటున రూ.5-6 లక్షల మధ్య వార్షిక వేతనం లభిస్తోంది.

బిజినెస్ అనలిస్ట్ :
మనదేశంలో వ్యాపార సంస్థల మధ్య పోటీ నానాటికీ పెరిగిపోతోంది. మార్కెట్ పరిస్థితులను ప్రతిరోజూ విశ్లేషించుకోవడం సంస్థలకు ప్రధానం. అందుకోసం పెద్ద కంపెనీలు బిజినెస్ అనలిస్ట్‌లను నియమించుకోవడం పరిపాటి. సంస్థ అవసరాలను అర్థం చేసుకుని, పోటీ సంస్థల పనితీరును అధ్యయనం (మార్కెట్ విశ్లేషణ) చేసి.. కంపెనీ ప్రగతికి నివేదికలు (డాక్యుమెంటేషన్) తయారు చేయడం బిజినెస్ అనలిస్టుల బాధ్యత. అనలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన వారు కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, మేనేజర్, ప్రాజెక్ట్ లీడ్, ప్రెసిడెంట్, డెరైక్టర్ స్థాయికి చేరుకోవచ్చు. బిజినెస్ అనలిస్ట్‌గా రాణించాలంటే.. లాజికల్ థింకింగ్, మ్యాథ్స్ కాన్సెప్ట్స్‌పై పట్టు, కొత్త టెక్నాలజీలపై అవగాహన, కొత్త అంశాలపై ఆసక్తి ఉండాలి. మెకన్సీ, యాక్సెంచర్, బీసీజీ, కేపీఎంజీ వంటి పేరొందిన అనేక సంస్థలు అధిక వేతనాలతో బిజినెస్ అనలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. వీరి ప్రారంభ వార్షిక వేతనం సగటున రూ.8-15 లక్షల వరకు ఉంటుంది. వీటితోపాటు జీవిత బీమా, పెయిడ్ సిక్ లీవ్స్, రీలొకేషన్ ఖర్చులు, పెయిడ్ ట్రిప్‌లు, ఫ్రీ హె ల్త్ క్లబ్ మెంబర్‌షిప్ వంటి అదనపు సౌకర్యాలను సైతం కల్పిస్తున్నాయి.
Published date : 13 Feb 2018 12:49PM

Photo Stories