Skip to main content

ఆడపిల్లల కోసం విజ్ఞాన జ్యోతి

కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం విద్యార్థినుల కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. తాజా లెక్కల ప్రకారం-సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్(స్టెమ్) కోర్సుల్లో చేరుతున్న విద్యార్థినుల సంఖ్య చాలాతక్కువగా ఉంది.
దీంతో స్టెమ్ కోర్సులు, కెరీర్ వైపు అమ్మాయిలను ప్రోత్సహించేందుకు విజ్ఞాన జ్యోతి అనే వినూత్న కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. విజ్ఞాన జ్యోతి పథకం వివరాలు...
విజ్ఞాన జ్యోతి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.. అమ్మాయిల్లో ఉన్నత విద్యపై ఆసక్తి పెంచడం.దీంతోపాటు విద్యార్థినులు జీవితంలో సొంతంగా నిలదొక్కుకొనేందుకు అవసరమైన సామర్థ్యాలను సాధించేలా వారిని ప్రోత్సహిస్తారు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థినులకు సైన్స్ విభాగాల్లో పాఠశాల నుంచి కళాశాల వరకు... పరిశోధనల నుంచి ఉద్యోగ సాధన దాకా.. కెరీర్‌ను తీర్చిదిద్దుకోవడంపై అవగాహన కల్పిస్తారు.

పథకం లక్ష్యం :
విద్యార్థినుల్లో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సుల పట్ల ఆసక్తి పెంచడం, ఆయా విభాగాల్లో వారిని ప్రోత్సహించడం.
  • ఈ కార్యక్రమం కింద తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం వరకు విద్యార్థినులను ఎంపిక చేస్తారు.
  • ఈ పథకం కింద 2020-2025 మధ్యకాలంలో 550 జిల్లాల నుంచి విద్యార్థినులను ఎంపిక చేయనున్నారు.
  • ఈ స్కీమ్‌లో భాగంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, జాతీయ ల్యాబొరేటరీలల్లో సైన్స్‌పై సదస్సులు, క్యాంపులు నిర్వహిస్తారు.
  • ఈ కార్యక్రమంలో విద్యార్థినులు క్యాంపునకు హాజరయ్యేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చులు, ఇతరత్రా వ్యయాలను అందిస్తారు.
  • ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు సైన్సు అండ్ టెక్నాలజీ, కార్పొరేట్ ప్రపంచం, విశ్వవిద్యాలయాలు, డీఆర్‌డీవో తదితర విభాగాలు, సంస్థల్లోని మహిళా నాయకులు, నిపుణులతో సంభాషించే అవకాశం లభిస్తుంది.
  • శాస్త్ర, సాంకేతిక డిపార్ట్‌మెంట్‌తో కలసి శాస్త్రవేత్త సంజీవ్ మిశ్రా ఈ కార్యక్రమ అమలు బాధ్యతలు చూస్తున్నారు.
ఐఐటీల్లో సమ్మర్ క్యాంపులు :
  • విజ్ఞాన జ్యోతి కార్యక్రమం కింద వేసవి సెలవుల్లో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర జాతీయ పరిశోధనా కేంద్రాల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తారు. విద్యార్థినుల్లో సైన్సు, టెక్నాలజీ పట్ల ఆసక్తి పెంపొందించడం.. ఆయా విభాగాల్లో అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలపై అవగాహన కల్గించడం ప్రధాన ఉద్దేశం. ఆయా క్యాంపుల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థినులు సైన్సు, టెక్నాలజీ విభాగాల్లోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లతో సంభాషించే అవకాశం దక్కుతుంది.
  • క్యాంపుల్లో లెక్చర్స్‌తోపాటు ల్యాబొరేటరీల్లో ప్రాక్టిల్స్ నిర్వహిస్తారు. అదేవిధంగా కంప్యూటర్స్, ఇంటర్నెట్ విజ్ఞానాన్ని సముపార్జించే విధానాన్ని నేర్పిస్తారు. దీంతోపాటు క్యాంపస్ వాక్, యోగా తదితర ఔట్‌డోర్ యాక్టివిటీస్ నిర్వహిస్తారు.
  • ఎంపికైన విద్యార్థులకు క్యాంపు జరిగినన్ని రోజులు ఐఐటీ హాస్టల్‌లో బస, భోజన వసతులు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థినులతోపాటు క్యాంపు తొలి, చివరి రోజు వారి తల్లిదండ్రులు సైతం పాల్గొనాల్సి ఉంటుంది. ఆయా రోజుల్లో విద్యార్థినుల తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహిస్తారు. ఇందులో ఆడ పిల్లలకు స్టెమ్ కోర్సులు, కెరీర్ అవకాశాలు, అమ్మాయిలు విద్యను కొనసాగించాల్సిన అవసరాన్ని తెలియజేస్తారు.
  • విజయవంతంగా క్యాంపును ముగించుకున్న వారికి రూ.5000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు.

 ఎంపిక ప్రక్రియ ఇలా.. 
ఆయా కాలేజీ ప్రిన్స్‌పల్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిల్లో ముగ్గురిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులకు వారి పదోతరగతి మార్కుల జాబితాను జతచేయాల్సి ఉంటుంది. అలా వచ్చిన దరఖాస్తుల్లో నుంచి విద్యార్థులను ఎంపిక చేస్తారు.
Published date : 10 Dec 2019 02:39PM

Photo Stories