Skip to main content

2019లో జాబ్ మార్కెట్...?

కొత్త ఏడాదిలో జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది? గత రెండేళ్లుగా మందగమనంగా సాగిన ఉద్యోగాల కల్పన.. ఈ సంవత్సరమైనా... ఆశాజనకంగా ఉంటుందా?! నియామకాల విషయంలో ఎలాంటి నైపుణ్యాలకు ప్రాధాన్యం? ఇలా.. యువతలో.. ఉద్యోగార్థుల్లో.. అనేక సందేహాలు! ఈ నేపథ్యంలో 2019లో జాబ్ మార్కెట్ ధోరణులు,యువత అందిపుచ్చుకోవాల్సిన నైపుణ్యాలపై నిపుణుల విశ్లేషణ...
టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు.. ఇలా ఏ కోర్సు చదువుతున్న విద్యార్థుల్లోనైనా.. ఏటా కనిపించే ఆందోళన జాబ్ మార్కెట్ రిక్రూట్‌మెంట్ ట్రెండ్స్ గురించే! ముఖ్యంగా ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో ఈ ఆలోచన కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో సర్టిఫికెట్ చేతికొచ్చిన ఏడెనిమిది నెలల్లోపు ఉద్యోగం రాకుంటే..‘ఫ్రెషర్ ట్యాగ్’ కనుమరుగవుతుంది. ఉద్యోగ సాధన కష్టమవుతుంది. దాంతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నిరుత్సాహానికి గురైన యువత.. జాబ్ మార్కెట్ ట్రెండ్స్, అవసరమైన నైపుణ్యాల గురించే ఆలోచిస్తుంటారు. ప్రభుత్వ రంగంలో సివిల్స్ నుంచి రాష్ట్ర స్థాయి పబ్లిక్ కమిషన్‌ల నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరంలో సర్కారీ కొలువులపై పెద్దగా ఆశలు పెట్టుకొనే పరిస్థితి కనిపించడంలేదు. మరి ఐటీ నుంచి ఆటోమోటివ్స్ వరకూ... ప్రయివేట్ రంగం నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తుందా? జాబ్ మార్కెట్ ఉద్యోగార్థులకు సానుకూలంగా ఉంటుందా! అంటే..కొంత అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఐటీ నుంచి ఆటోమోటివ్స్ వరకు..
2019లో జాబ్ మార్కెట్, రిక్రూట్‌మెంట్ ట్రెండ్స్ ఆశాజనకంగా ఉంటాయని ఇటీవల పలు సర్వేలు, ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేయడం విద్యార్థులకు సంతోషం కలిగించే విషయమే! ఇండస్ట్రీ వర్గాలైతే.. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం నియామకాల సంఖ్య పెంచుతామని పేర్కొనడం నిరుద్యోగులకు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. పదోతరగతి నుంచి ప్రొఫెషనల్ కోర్సుల వరకూ.. యువత తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాల కోసం సానుకూల దృక్పథంతో ప్రయత్నాలు ప్రారంభించొచ్చని జాబ్‌మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే కొత్త ఏడాదిలో టాప్-10 రంగాల్లో దాదాపు పది లక్షల వరకూ కొత్తగా కొలువులు లభించే అవకాశం ఉందంటున్నారు. కొత్త సంవత్సరంలో కొత్త నియామకాల విషయంలో ఐటీ నుంచి ఆటోమోటివ్స్ వరకు.. దాదాపు అన్ని రంగాల్లోని సంస్థలు సానుకూల దృక్పథంతో అడుగులు వేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు, కన్సల్టింగ్ సంస్థల అంచనా. ఐటీ, ఐటీఈఎస్, ఇంజనీరింగ్, ఆటోమోటివ్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, ఫార్మా అండ్ హెల్త్‌కేర్, బీపీఓ, కేపీఓ, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలు టాప్ రిక్రూటర్స్‌గా నిలిచే వీలుంది.

ఇండస్ట్రీ 4.0.. స్కిల్స్‌కు డిమాండ్ :
గత కొన్నేళ్లుగా రిక్రూట్‌మెంట్స్, జాబ్ మార్కెట్ ట్రెండ్స్ అనగానే టక్కున గుర్తొచ్చే రంగం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ). గత కొన్నేళ్లుగా ఐటీ, ఐటీ అనుబంధ విభాగాల్లో నియామకాల సంఖ్య తగ్గినప్పటికీ.. నేటికీ ఈ రంగం టాప్ రిక్రూటర్‌గా గుర్తింపు పొందుతోంది. గతేడాది దేశవ్యాప్తంగా 1.3 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఐటీ విభాగం.. 2019లో మరింత ఆశాజనకంగా ఉంటుందని అంచనా. 2018లో జరిగిన నియామకాలతో పోల్చితే.. 2019లో 20 శాతం మేర నియామకాలు పెరగనున్నాయని పేర్కొంటున్నారు. అంటే.. ఐటీ రంగంలో.. లక్షన్నరకుపైగా ఉద్యోగాలు కొత్తగా లభించనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటిల్లో ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్‌గా పేర్కొంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజైన్, అనలిటిక్స్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రొఫైల్స్‌దే పైచేయిగా నిలవనుంది. మొత్తం ఆఫర్లలో వీటి వాటానే 50 శాతం పైగా ఉంటుందని అంచనా. దీంతో ఉద్యోగార్థులు లేటెస్ట్ నైపుణ్యాలు నేర్చుకోవడం తప్పనిసరి.

ఇంజనీరింగ్.. ఎంప్లాయబిలిటీ పెరిగిందా?
ప్రస్తుతం దేశంలో ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాలతో బయటికి వస్తున్నారు. వీరికి కొత్త సంవత్సరంలో కొలువులు ఆశాజనకంగానే ఉంటాయని అంచనా. ముఖ్యంగా మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్స్, ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్, హార్ట్‌వేర్, ఐటీ విభాగాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు డిమాండ్ నెలకొననుంది. మరోవైపు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు పెరుగుతుండటం ఆహ్వానించదగిన పరిణామం. రెండేళ్ల క్రితం వరకు 20 నుంచి 30 శాతం మధ్యలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థుల ఎంప్లాయబిలిటీ స్కిల్స్.. తాజాగా 57 శాతానికి పెరిగినట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా వీరికి జాబ్ మార్కెట్‌లో అవకాశాలు మెరుగయ్యే వీలుంది.

సంప్రదాయ కోర్సులతో కొలువు దక్కుతుందా!
బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు కూడా కొత్త సంవత్సరంలో కొలువుల పరంగా సానుకూల వాతావరణం కనిపిస్తోంది. బీఎఫ్‌ఎస్‌ఐ, బీపీఓ, కేపీఓ, ఐటీఈఎస్, పర్యాటకం, ఆతిథ్య రంగాలు వీరికి ప్రధాన ఉపాధి వేదికలుగా నిలవనున్నాయి. ఈ రంగాల్లో నియామకాల సంఖ్య దాదాపు ఎనిమిది లక్షల మేరకు ఉంటుందని అంచనా. సంప్రదాయ డిగ్రీ విద్యార్థుల్లో 35 శాతం; పీజీ విద్యార్థుల్లో 43 శాతం; ఎంబీఏ విద్యార్థుల్లో 36 శాతం మేర ఉద్యోగ నైపుణ్యాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా నైపుణ్యాలున్న విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు, కన్సల్టెన్సీల అభిప్రాయం.

బ్యాంకింగ్ రంగం :
సంప్రదాయ కోర్సుల విద్యార్థులతోపాటు ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసినవారికి ఉపాధి కల్పించే రంగంగా పేరొందిన బ్యాంకింగ్‌లోనే 2019లో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనా. ప్రైవేటు బ్యాంకులే కాకుండా.. జాతీయ బ్యాంకులు కూడా కొత్త సంవత్సరంలో నియామకాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిలో 40 శాతం మేరకు స్పెషలైజ్డ్ ప్రొఫైల్స్ (డేటా అనలిస్ట్, బిగ్ డేటా మేనేజ్‌మెంట్ తదితర)లోనే కొత్త కొలువులు పలకరించే అవకాశముంది.

డిజైన్ నైపుణ్యాలుంటే..
డిజైన్ నైపుణ్యాలున్న యువత హాట్ కేక్‌లుగా నిలవనున్నారు. సంస్థలు యాప్‌లు, వెబ్‌సైట్స్, ఇతర ఆన్‌లైన్ టూల్స్ ద్వారా తమ సేవలను అందించాలని భావిస్తుండటమే ఇందుకు కారణం. కోర్ మాన్యుఫ్యాక్చరింగ్ డిజైన్ మొదలు యాప్స్ డిజైన్ వరకు.. డిజైనింగ్ నైపుణ్యాలున్న వారికి ఉద్యోగం ఖాయం అనే పరిస్థితి కనిపిస్తోంది. అనలిటిక్స్, సాఫ్ట్‌వేర్/హార్డ్‌వేర్/కాన్సెప్ట్, ఏఐ, ఆర్ అండ్ డీ, రోబోటిక్స్ నైపుణ్యాలుంటే.. కొత్త సంవత్సరంలో మెరుగైన అవకాశాలు స్వాగతం పలకనున్నాయని అంచనా.

ఫ్రెషర్స్‌కు.. ఈ రంగాలు
కొత్త సంవత్సరంలో తాజా గ్రాడ్యుయేట్లకు మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, ఫార్మా, హెల్త్‌కేర్,హాస్పిటాలిటీ, బీపీఓ, కేపీఓ రంగాలు ముఖ్యమైన ఉపాధి వేదికలుగా నిలవనున్నాయి. మొత్తం నియామకాల్లో 25 నుంచి 30 శాతం మేరకే తాజా గ్రాడ్యుయేట్లకు లభిస్తాయని నిపుణుల అభిప్రాయం. కంపెనీలు నూతన సాంకేతికతలు వినియోగిస్తూ కార్యకలాపాలు నిర్వహించడం, అందుకోసం లేటెస్ట్ టెక్నాలజీపై పట్టున్న వారికి పెద్దపీట వేస్తున్నాయి. ఫ్రెషర్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నూతన సాంకేతిక నైపుణ్యాలుంటే.. ఉద్యోగం దక్కడం ఖాయమని జాబ్ మార్కెట్ నిపుణులు భరోసా ఇస్తున్నారు. మొత్తంగా ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం ప్రకారం ఫ్రెషర్స్, ఒకటి నుంచి అయిదేళ్ల అనుభవం ఆధారంగా నియామకం చేపట్టే ఉద్యోగాల సంఖ్య 42 శాతంగా నిలవనుంది. ఫ్రెషర్స్ నియామకాల సంఖ్య తక్కువగా ఉండటానికి సంస్థలు చెబుతున్న కారణం స్కిల్ గ్యాప్ సమస్య. 63 శాతం సంస్థలు తమ అవసరాలకు తగిన నైపుణ్యాలు తాజా గ్రాడ్యుయేట్లలో కనిపించట్లేదని పేర్కొనడం గమనార్హం.

మహిళలకు పెరగనున్న అవకాశాలు..
మహిళా అభ్యర్థులకు కొత్త సంవత్సరంలో ఉద్యోగావకాశాలు పెరగనున్నాయని అంచనా. ఇది జాబ్ మార్కెట్ కోణంలో మరో ముఖ్య పరిణామంగా పేర్కొనొచ్చు. గత ఏడాది 46 శాతంగా ఉన్న మహిళా ఉద్యోగిత.. 2019లో 15 నుంచి 20 శాతం మేర పెరగనుంది. మహిళలకు ప్రధానంగా బీఎఫ్‌ఎస్‌ఐ, ఆటోమోటివ్స్, ఐటీ, సాఫ్ట్‌వేర్, హాస్పిటాలిటీ విభాగాలు ఉపాధి వేదికలుగా నిలవనున్నాయి.

నియామక విధానాలు..
కంపెనీల నియామకాల సమాచారం విద్యార్థులకు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా పేర్కొంటున్నారు. సంస్థలు నియామకాల విషయంలో రకరకాల విధానాలు అనుసరిస్తున్నాయి. ప్రధానంగా జాబ్ పోర్టల్స్, ఇంటర్నల్ రిఫరల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. తాజా గ్రాడ్యుయేట్ల విషయంలో పది శాతం మాత్రమే క్యాంపస్ హైరింగ్స్ వైపు చూడటం గమనార్హం. విద్యార్థులు కేవలం క్యాంపస్ డ్రైవ్స్ కోసమే వేచి చూడకుండా.. మిగతా మార్గాల ద్వారా కూడా ఉద్యోగాన్వేషణ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

వేతనాలు ఆశాజనకం..
  • కొత్త సంవత్సరంలో వేతనాల పరంగా ఆశాజనక పరిస్థితులే కనిపిస్తున్నాయి.
  • తాజా టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు సగటున రూ. నాలుగు లక్షల వార్షిక వేతనం లభించనుంది.
  • ఐటీ రంగంలో కొలువు సాధిస్తే.. అనలిటిక్స్ ప్రొఫైల్స్‌లో సగటున రూ.ఏడు లక్షల వార్షిక వేతనం ఖాయం.
  • జనరల్ గ్రాడ్యుయేట్లకు రూ. మూడు లక్షల సగటు వేతనం లభించనుంది.
  • మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ రూ.5 లక్షల వరకు సగటు వార్షిక వేతనం అందుకునే వీలుంది.
  • ఐటీఐ, డిప్లొమా విద్యార్థులకు రూ.1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు వేతనం.

అప్రెంటీస్‌షిప్ అవకాశాలూ..
కొత్త సంవత్సరంలో ఉద్యోగావకాశాల పరంగా ఆశాజనకంగా భావించాల్సిన మరో అంశం.. సంస్థలు అప్రెంటీస్‌షిప్ అవకాశాలు కల్పించడానికి కూడా మొగ్గు చూపడం. ఐటీఐ, డిప్లొమా విద్యార్థులను తప్పనిసరిగా అప్రెంటీస్‌లుగా చేర్చుకోవాలనే ప్రభుత్వ నిబంధనే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. 70 శాతం సంస్థలు అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాయి.

అదనంగా ఈ స్కిల్స్..
ప్రస్తుతం ఇండస్ట్రీ 4.0 నేపథ్యంలో టెక్నికల్ స్కిల్స్‌కు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. వీటితోపాటు నాన్-టెక్నికల్ స్కిల్స్‌కు కూడా సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. టెక్నికల్‌తోపాటు ఈ నాన్-టెక్నికల్ స్కిల్స్‌లోనూ ముందంజలో ఉంటేనే మెరుగైన అవకాశాలు సొంతం చేసుకునే వీలుంటుంది. ఏ రంగం అయినా.. జాబ్ ప్రొఫైల్ ఎలాంటిదైనా.. ఇప్పుడు సంస్థలు కమ్యూనికేషన్ స్కిల్స్‌లో భాగంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. దాంతోపాటు పలు నాన్ టెక్నికల్ స్కిల్స్ సైతం తప్పనిసరిగా మారుతున్నాయి. అవి.. కమ్యూనికేషన్ స్కిల్స్, అడాప్టబిలిటీ, లెర్నింగ్ ఎబిలిటీ, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్, సెల్ఫ్ డిటర్మినేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్.

కంపెనీల నియామక మార్గాలు..
ఇటీవల ఇండియా స్కిల్ రిపోర్ట్ ప్రకారం కంపెనీలు ఖాళీల భర్తీ కోణంలో ఉద్యోగార్థుల కోసం వినియోగించుకుంటున్న మార్గాలు..
  1. జాబ్ పోర్టల్స్ 29 శాతం
  2. ఇంటర్నల్ రిఫరల్స్ 19 శాతం
  3. కన్సల్టెంట్స్16 శాతం
  4. ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ అండ్ సోషల్ మీడియా 8 శాతం
  5. వాక్-ఇన్-ఇంటర్వ్యూస్ 8 శాతం
  6. క్యాంపస్ హైరింగ్స్10 శాతం
  7. కంపెనీ వెబ్‌సైట్స్ 5 శాతం
  8. జాబ్ ఫెయిర్స్ 2 శాతం
  9. ఇతర మార్గాలు 3 శాతం


రంగాల వారీగా నియామకాల పెరుగుదల..
బీఎఫ్‌ఎస్‌ఐ: 10-15 శాతం
బీపీఓ, కేపీఓ, ఐటీఈఎస్: 10-15 శాతం
కోర్ సెక్టార్స్: పది శాతం పైగా
ఇంజనీరింగ్ అండ్ ఆటోమోటివ్స్: 15 శాతం పైగా
మాన్యుఫ్యాక్చరింగ్: 10 శాతం పైగా
ఫార్మా అండ్ హెల్త్‌కేర్: 10 నుంచి 15 శాతం
సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఐటీ: 15 శాతం పైగా
ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ: 15 శాతంపైగా

అడాప్టబిలిటీతో.. అన్ని నైపుణ్యాలు
యువత ముందుగా అడాప్టబిలిటీ నైపుణ్యాన్ని, దృక్పథాన్ని అలవర్చుకుంటే అన్ని నైపుణ్యాలు ఆటోమేటిక్‌గా లభిస్తాయి. అడాప్టబిలిటీ దృక్పథం ఉంటే.. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే తపన కలుగుతుంది. నియామకాల్లో విజయం కోసం కోర్ నైపుణ్యాలతోపాటు పీపుల్ స్కిల్స్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
- వి.రాజన్న, వైస్ ప్రెసిడెంట్, టీసీఎస్.

Published date : 25 Dec 2018 08:53PM

Photo Stories