Skip to main content

సేవతోపాటు సంతృప్తినిచ్చే కెరీర్.. నర్సింగ్

ఇతర రంగాలకు భిన్నమైంది.. ఆరోగ్య రంగంలో ఎన్నో విభాగాలున్నా.. తన ప్రత్యేకతను చాటుకుంటూ.. ఆత్మ సంతృప్తినిచ్చే కెరీర్‌గా నిలుస్తోంది నర్సింగ్. విస్తరిస్తున్న వైద్య రంగం.. అందివస్తున్న అవకాశాలతో నర్సింగ్ నేడు.. జాబ్ గ్యారంటీ కోర్సుగా మారింది. పర్యవేక్షించే వ్యవస్థలు ఎన్ని ఉన్నా.. సాంత్వన చేకూర్చే ‘నర్సింగ్’ తోడ్పడితేనే సత్ఫలితాలు. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్‌ఎం) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ‘నర్సింగ్’కు సంబంధించి అందుబాటులో ఉన్న వివిధ రకాల కోర్సులు.. వాటి అర్హత, తదితర వివరాలపై కెరీర్ గైడెన్స్...

ఏఎన్‌ఎం:
యాక్సిలరీ నర్స్ అండ్ మిడ్ వైఫరీ (ఏఎన్‌ఎం).. నర్సింగ్‌కు సంబంధించిన ప్రాథమిక కోర్సు. ఈ కోర్సును ఎంపీహెచ్ డబ్ల్యూ అని కూడా వ్యవహరిస్తారు. అర్హత: ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియెట్. వయసు: 17 నుంచి 35 ఏళ్లు. కోర్సు కాల వ్యవధి: రెండేళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇందుకు సంబంధించి డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

జీఎన్‌ఎం:
జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ (జీఎన్‌ఎం) మూడున్నరేళ్ల కోర్సు. ఇందులో ఆరు నెలలు ఇంటర్న్‌షిప్. ఈ కోర్సును డిప్లొమా ఇన్ నర్సింగ్ అని కూడా వ్యవహరిస్తారు. అర్హత: ఇంటర్మీడియెట్/తత్సమానం. సైన్స్ గ్రూపు విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఏఎన్‌ఎం కోర్సు చేసిన అభ్యర్థులు కూడా ఈ కోర్సులో చేరొచ్చు. వయసు: 17 నుంచి 35 ఏళ్లు. ఏఎన్‌ఎం అభ్యర్థులకు వయోపరిమితి లేదు. రాష్ట్రంలోని 14 ప్రభుత్వ కాలేజీల్లో జీఎన్‌ఎం కోర్సు అందుబాటులో ఉంది. వీటిల్లోని సీట్ల సంఖ్య: 661. కౌన్సెలింగ్ ద్వారా డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సీట్లను భర్తీ చేస్తుంది.

బీఎస్సీ నర్సింగ్:
నర్సింగ్‌కు సంబంధించి అత్యధిక మంది విద్యార్థులు ఎంచుకుంటున్న కోర్సు బీఎస్సీ నర్సింగ్. ఈ కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ)/తత్సమానం. వయసు: 17 నుంచి 35 ఏళ్లు. ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఇందుకోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది.

పీబీ బీఎస్సీ (నర్సింగ్):
పోస్ట్ బేసిక్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (పీబీ బీఎస్సీ- నర్సింగ్). కోర్సు కాల వ్యవధి: రెండేళ్లు. అర్హత: ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియెట్‌తోపాటు జీఎన్‌ఎం కోర్సు పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ వద్ద ఆర్‌ఎన్‌ఆర్‌ఎంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. వయసు: 17 నుంచి 45 ఏళ్లు.ఎన్టీఆర్‌హెల్త్ యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేస్త్తుంది.

ఎంఎస్సీ నర్సింగ్:
బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఆసక్తి ఉంటే ఎంఎస్సీ కోర్సును ఎంచుకోవచ్చు. మెడికల్ సర్జికల్, ఆబ్‌స్టెట్రిక్స్, పిడియాట్రిక్స్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ వంటి స్పెషలైజేషన్స్ ఈ కోర్సులో అందుబాటులో ఉన్నాయి. అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి 55 శాతం మార్కులతో బీఎస్సీ (నర్సింగ్) లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్)/ బీఎస్సీ ఆనర్స్(నర్సింగ్). అంతేకాకుండా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ వద్ద నర్సు లేదా మిడ్ వైఫరీ నర్సుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించరాదు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏటా జూలై/ ఆగస్టులో ప్రకటన విడుదల చేస్తుంది.

మన రాష్ట్రంలో:
మన రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలే కాకుండా నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్)-హైదరాబాద్ (వెబ్‌సైట్: www.nims.ap.nic.in), స్విమ్స్-తిరుపతి (వెబ్‌సైట్: https://svimstpt.ap.nic.in) కూడా నర్సింగ్‌కు సంబంధించి బీఎస్సీ (నర్సింగ్), పోస్ట్ బేసిక్, ఎంఎస్సీ (నర్సింగ్) తదితర కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

ఇగ్నో కూడా:
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) దూర విద్యా విధానంలో పోస్ట్ బేసిక్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (పీబీ బీఎస్సీ- నర్సింగ్) కోర్సును ఆఫర్ చేస్తుంది. కోర్సు కాల వ్యవధి: మూడేళ్లు. అర్హత: 10+2తోపాటు జీఎన్‌ఎం, రెండేళ్ల అనుభవం లేదా పదో తరగతితోపాటు జీఎన్‌ఎం, ఐదేళ్ల అనుభవం. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. రాష్ట్రంలోని నిమ్స్ నర్సింగ్ కాలేజీ ద్వారా ఇగ్నో ఈ కోర్సును అందిస్తుంది. ప్రస్తుత సంవత్సరానికి ఇగ్నో-పీబీ బీఎస్సీ (నర్సింగ్) కోర్సుకు నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 8, 2013. రాత పరీక్షను సెప్టెంబర్ 8న నిర్వహిస్తారు.
వివరాలకు: www.ignou.ac.in

ఎంచుకునే ముందు:
నర్సింగ్ కాలేజీని ఎంచుకునే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి.. ఎంచుకున్న కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్ ఉందా? ఉంటే దాని స్థాయి ఏమిటి? క్లినికల్ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? ఫ్యాకల్టీ? ఎందుకంటే నేర్చుకున్న అంశాన్ని ప్రాక్టికల్‌గా అన్వయించాల్సి ఉంటుంది. కాబట్టి చక్కటి క్లినికల్ సౌకర్యాలు ఉన్న కాలేజీని ఎంచుకోవాలి.

జాతీయ స్థాయిలో:
జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)-న్యూఢిల్లీ, జిప్‌మర్-పాండిచ్చేరి, రాజ్‌కుమారి అమృత్ కౌర్ కాలేజీ ఆఫ్ నర్సింగ్-న్యూఢిల్లీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ (నిమ్‌హాన్స్)-బెంగళూరు వంటి ఇన్‌స్టిట్యూట్‌లు కూడా నర్సింగ్‌కు సంబంధించి బీఎస్సీ నుంచి ఎంఎస్సీ వరకు పలు కోర్సులను అందిస్తున్నాయి. వీటిల్లో రాజ్‌కుమారి అమృత్ కౌర్ కాలేజీ ఆఫ్ న ర్సింగ్, నిమ్‌హాన్స్ నర్సింగ్‌లో పీహెచ్‌డీ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి.

మిలిటరీ నర్సింగ్ సర్వీస్:
మిలిటరీ సర్వీసెస్‌లలోని కీలక విభాగాల్లో నర్సింగ్ ఒకటి. ఇందులో ప్రవేశించాలనుకునే వారి కోసం ప్రతి ఏటా ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులు బీఎస్సీ (నర్సింగ్), డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. పుణేలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో బీఎస్సీ (నర్సింగ్) కోర్సును నిర్వహిస్తారు. డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సుకు ఎంపికైన అభ్యర్థులకు మాత్రం దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హాస్పిటల్స్‌లో శిక్షణనిస్తారు. శిక్షణ పూర్తయ్యాక నాలుగు లేదా ఐదేళ్లు మిలిటరీ హాస్పిటల్‌లో పని చేస్తామని సర్వీస్ బాండ్ రాయూలి. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి మిలటరీ నర్సింగ్ సర్వీస్ కమిషన్డ్ ప్రదానం చేస్తారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలతోపాటు యూనిఫామ్ అలవెన్స్, నెలవారీగా స్టయిఫండ్ చెల్లిస్తారు. అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (బైపీసీ) మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులవ్వాలి. లేదా పదో తరగతితో జీఎన్‌ఎంతోపాటు ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయో పరిమితి 17 నుంచి 25 ఏళ్లు. పెళ్లికాని యువతులు, భర్త నుంచి విడాకులు తీసుకున్నవారు, వితంతువులు అర్హులు. సంబంధిత నోటిఫికేషన్ సెప్టెంబర్/అక్టోబర్/డిసెంబర్‌లలో వెలువడుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ అనే మూడు దశలుగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

అవకాశాలు.. వేతనాలు:
నర్సింగ్ అంటే... కేవలం హాస్పిటల్ నర్సింగ్ మాత్రమే కాదు. ఇందులో పలు విభాగాలున్నాయి. హోమ్ కేర్, ఇండస్ట్రియల్ కాంప్లెక్సులు, మిలిటరీ సర్వీసెస్, రెసిడెన్షియల్ స్కూల్స్, హెల్త్ కేర్ సెంటర్స్‌లలో కూడా నర్సుల సేవలు అవసరమవుతాయి. వీరు అంబులేటరీ కేర్, ఐసీయూ, మదర్-బేబీ కేర్, ఎమర్జెన్సీ, పిడియాట్రిక్స్, సైకియాట్రిక్స్, రికవరీ, రిహాబిలిటేషన్ విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. హాస్పిటల్ నర్సింగ్, పబ్లిక్‌హెల్త్ నర్సింగ్ అండ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఇండస్ట్రియల్ నర్సింగ్, ఆక్యుపేషనల్ హెల్త్ నర్సింగ్, సైకియాట్రిక్ నర్సింగ్, పిడియాట్రిక్, ఆర్థోపెడిక్ నర్సింగ్ ఇలా పలు విభాగాల్లో సేవలందించవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. నర్సింగ్ అభ్యర్థులకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. అవసరాల మేరకు సరిపడ అభ్యర్థులు లభించక.. ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ సొంతంగా నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను నిర్వహిస్తున్నాయి. కెరీర్ గ్రోత్ విషయానికొస్తే.. సీనియారిటీ ఆధారంగా హెడ్ నర్స్, థియేటర్ నర్స్, సూపర్ వైజరీ నర్సులుగా పదోన్నతులు కల్పిస్తారు. ఆసక్తి ఉంటే ప్రైవేటు, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో అధ్యాపకులుగా సైతం వెళ్లే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న ప్రాంతం, అనుభవం, ఎంచుకున్న విభాగాన్ని బట్టి జీతభత్యాలు ఆధారపడి ఉంటాయి. కెరీర్ ప్రారంభంలో వార్షికంగా రూ. 1.2 లక్షల నుంచి రూ. 2.4 లక్షల వరకూ వేతనం అందుకోవచ్చు. రాష్ట్రంలో పేరొందిన ప్రముఖ ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లలో నెలకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు వేతనాలు లభిస్తున్నాయి.

పభుత్వ విభాగంలో:
నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ పరంగా కూడా పలు అవకాశాలున్నాయి. స్టాఫ్‌నర్సు పోస్టుకు ఎంపికైతే ప్రారంభంలో నెలకు రూ. 25 వేల వేతనం అందు కోవచ్చు. సీనియారిటీ పెరిగే కొద్దీ పదోన్నతులు సైతం లభిస్తాయి. స్టాఫ్‌నర్సుగా విధుల్లోకి చేరిన వారికి సుమారు అయిదేళ్ల లోపు పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో హెడ్‌నర్స్ ఆ తర్వాత గ్రేడ్-1, గ్రేడ్-2, సూపర్‌వైజరీ నర్సెస్‌గా పదోన్నతి లభిస్తుంది. ఈ స్థాయికి చేరుకున్న వారికి అత్యధికంగా రూ.35 వేల నుంచి రూ. 40 వేల వరకు జీత భత్యాలు లభిస్తారుు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, రైల్వేలు వాటి ఆరోగ్య విభాగాల్లో వీరికి అవకాశాలుంటాయి. కేంద్రప్రభుత్వ సర్వీసులకు సంబంధించి ఎయిమ్స్, రైల్వేలు, ఈఎస్‌ఐ హాస్పిటల్స్, స్వయంప్రతిపత్తి ఉన్న ఆరోగ్య సంస్థల్లో ప్రారంభంలోనే నెలకు రూ.36,000- రూ.40,000 వరకు వేతనం అందుకోవచ్చు.

జీఎన్‌ఎం నోటిఫికేషన్ సమాచారం:
అర్హత: ఇంటర్మీడియెట్/తత్సమానం. సైన్‌‌స గ్రూప్ విద్యార్థులకు ప్రాధాన్యం.
వయసు: 17 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత దరఖాస్తును ప్రింట్‌తీసి దానికి సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి నిర్దేశిత హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు పంపించాలి.
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 16, 2013
డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పంపడానికి చివరితేదీ (కన్వీనర్ కోటా సీట్లకు): ఆగస్టు 17, 2013.
మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు: ఆగస్టు 24, 2013
వివరాలకు: https://dme.ap.nic.in

విదేశాల్లో అవకాశాలు
నర్సింగ్ కోర్సులు చేసిన వారికి విదేశాల్లో కూడా అవకాశాలు ఉంటున్నాయి. అమెరికా, యుూకే, కెనడా, ఆస్ట్రేలియూ, ఐర్లాండ్, న్యూజీలాండ్, సింగపూర్ వంటి దేశాలు వున దేశంలో నర్సింగ్ ఉత్తీర్ణులకు ప్రధాన గవ్యూలుగా నిలుస్తున్నాయి. ఆ అవకాశాలను సొంతం చేసుకోవాలంటే మాత్రం.. రెండు-మూడేళ్ల అనుభవంతోపాటు ఇంగ్లిష్ భాషపై అవగాహన, సబ్జెక్ట్ నాలెడ్జ్ తప్పనిసరి. అంతేకాకుండా కొన్ని పరీక్షల్లో అర్హత సాధించాలి. ఈ క్రమంలో అమెరికాలో నర్స్‌గా స్థిరపడాలంటే నేషనల్ కౌన్సిల్ లెసైన్సర్ ఎగ్జామినేషన్ ఫర్ రిజిస్టర్డ్ నర్సెస్ (ఎన్‌సీఎల్‌ఈఎక్స్- ఆర్‌ఎన్)లో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు ఐఎల్‌టీఎస్ స్కోర్ ఉండాలి. కెనడాలో అడుగుపెట్టాలంటే కెనడియున్ రిజిస్టర్డ్ నర్స్ ఎగ్జామినేషన్ (సీఆర్‌ఎన్‌ఈ)లో ఉత్తీర్ణత తప్పనిసరి. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాల్లో కూడా ఎంట్రీ కోసం ఐఎల్‌టీఎస్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వీటితోపాటు గల్ఫ్ దేశాలు కూడా భారీ ఎత్తున భారత నర్సింగ్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారుు. అక్కడ స్థిరపడాలంటే మాత్రం అరబిక్/స్థానిక భాషను నేర్చుకోవాలి. కొన్ని గల్ఫ్ దేశాలు ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ చేసుకుంటే, కొన్ని దేశాలు వాటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నిర్వహించే అర్హత పరీక్షల ద్వారా నియమించుకుంటున్నాయి. విదేశాల్లో ఆదాయుం కూడా ఆకర్షణీయుంగానే ఉంటోంది. అమెరికాలో ప్రారంభంలోనే నెలకు నాలుగు వేల నుంచి ఐదు వేల డాలర్ల వేతనం లభిస్తోంది. గల్ఫ్ దేశాల్లోనైతే నెలకు రూ. లక్ష వరకు సంపాదించవచ్చు.

ఉత్తమ కెరీర్‌కు బలమైన పునాది
నర్సింగ్ కోర్సు అనగానే చాలా మంది కేవలం ఆసుపత్రులకే పరిమితం అనే అభిప్రాయంలో ఉంటారు. కానీ అది పొరపాటు. కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరేందుకు ఎన్నో అవకాశాలు ఉంటాయి.సేవ చేస్తున్నామనే సంతృప్తి, ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కేవలం నర్సింగ్ వృత్తి ద్వారానే సాధ్యం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వైద్య సదుపాయాలు విస్తరిస్తున్న కారణంగా విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాకుండా వైద్యులతో సమానంగా వేతనాలు అందుకుంటున్న బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ప్రభుత్వ విభాగంలో స్టాఫ్‌నర్సుగా ఎంపికైతే ప్రారంభంలోనే నెలకు రూ.25 వేల జీతం అందుకోవచ్చు. అదే ప్రైవేట్ ఆసుపత్రుల్లో నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకూ ప్రారంభ వేతనం లభిస్తుంది. ఆర్మీ, నేవీ వంటి సైనికదళాలలోనూ ఉద్యోగం సంపాదించుకోవచ్చు. అనుభవం, నైపుణ్యం పెంపొందించుకుంటే డాక్టర్లతో సమానంగా గౌరవం, వేతనం రెండూ లభిస్తాయి. ఇతర డిగ్రీలతో సమానంగా యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీపరీక్షలకు సిద్ధం కావచ్చు. కేరళలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన ఓ అమ్మాయి సివిల్స్‌కు ఎంపిక కావటం నిజంగా స్ఫూర్తిదాయకం. విస్తరిస్తున్న నర్సింగ్ కళాశాలల్లో అధ్యాపకులుగా కెరీర్ ప్రారంభించే వీలుంది. పీహెచ్‌డీ కూడా చేసే అవకాశం ఉంది. ఆసక్తి ఉంటే సంబంధిత విభాగంలో పరిశోధనలు కూడా చేయవచ్చు.
- మరియా రోజా,
వైస్‌ప్రిన్సిపల్,
జీజీహెచ్ నర్సింగ్ కాలేజీ, గుంటూరు.
Published date : 09 Aug 2013 02:44PM

Photo Stories