Skip to main content

ఎంబీబీఎస్ కుప్రత్యామ్నాయ కోర్సులెన్నో..!

డాక్టర్ కావడమే ఆశయంగా... ఎంబీబీఎస్, బీడీఎస్ లక్ష్యంగా.. దేశవ్యాప్తంగా ‘నీట్-యూజీ’ ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య పదిలక్షల పైమాటే! తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన వారు దాదాపు లక్ష! కానీ.. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను చూస్తే.. అవకాశం దక్కేది చాలా తక్కువ మందికి మాత్రమే! మరి..
మిగతా విద్యార్థుల పరిస్థితి? ఇంటర్మీడియెట్‌లో బైపీసీ చదివిన విద్యార్థులకు...ఎంబీబీఎస్/బీడీఎస్‌కు దీటైన కోర్సులెన్నో అందుబాటులో ఉన్నాయి. వీటిలో చేరడం ద్వారా భవిష్యత్తులో చక్కటి అవకాశాలు అందుకోవచ్చు. బైపీసీ విద్యార్థుల ముందున్న ప్రత్యామ్నాయ కోర్సుల గురించి తెలుసుకుందాం...

ఆయుష్ కోర్సులు..
ఎం
బీబీఎస్, బీడీఎస్ అవకాశం చేజారినా... బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్ (బీయూఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ అండ్ యోగా (బీఎన్‌వైఎస్) వంటి ఆయుష్ (AYUSH-Ayurveda, Yoga and Naturopathy, Unani, Siddha and Homeopathy) కోర్సులు చదవడం ద్వారా వైద్యులుగా గుర్తింపు పొందొచ్చు.

బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి :
బీహెచ్‌ఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ)గా దశాబ్దాలుగా మనుగడలో ఉన్న కోర్సు. ఈ కోర్సు వ్యవధి ఐదున్నరేళ్లు. బీహెచ్‌ఎంఎస్ కోర్సులో చేరేందుకు ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థులు అర్హులు. ఈ ఏడాది నుంచి నీట్ యూజీ ర్యాంకు ద్వారా అడ్మిషన్ కల్పించనున్నారు. ఇటీవల కాలంలో హోమియోపతి వైద్య విధానం పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. దాంతో కెరీర్ అవకాశాల పరంగానూ విద్యార్థులకు మంచి ప్రత్యామ్నాయ కోర్సుగా బీహెచ్‌ఎంఎస్‌ను పేర్కొనొచ్చు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఉన్నత విద్య అవకాశాలు కూడా విస్తృతమే. బీహెచ్‌ఎంఎస్ తర్వాత.. హోమియోపతిక్ ఫిలాసఫీ, మెటీరియా మెడికా వంటి స్పెషలైజేషన్లలో పీజీ చేయొచ్చు. ఈ కోర్సు పూర్తిచేయడం ద్వారా హోమియోపతి డాక్టర్‌గా గుర్తింపుపొందొచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో అవకాశాలు లభిస్తున్నాయి. సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హోమియోపతి కళాశాలల్లో అధ్యాపకుడిగా కూడా పనిచేయొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న బీహెచ్‌ఎంఎస్ సీట్ల సంఖ్య 220.

బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్) :
ఆయుర్వేదానికి పుట్టినిల్లు భారతదేశం. వైద్యవృత్తిలో అడుగుపెట్టాలనుకునే బైపీసీ విద్యార్థులకు మంచి ప్రత్యామ్నాయం.. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్). ఈ కోర్సు కాల వ్యవధి ఐదున్నరేళ్లు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నీట్ యూజీ ద్వారా ప్రవేశం కల్పించనున్నారు. జనం జీవన శైలి వ్యాధుల బారినపడుతుండటంతో ఆయుర్వేద వైద్యానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. కాబట్టి బీఏఎంఎస్ కోర్సు పూర్తిచేసిన వారికి అవకాశాలు విస్తృతమని చెప్పొచ్చు. కోర్సు పూర్తయ్యాక ఆయుర్వేద డాక్టర్‌గా, థెరపిస్ట్‌గా, మెడికల్ కాలేజీల్లో లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. ప్రభుత్వ/ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, ఆయుర్వేద హెల్త్ కేంద్రాలు, స్పాలు, ఫార్మా కంపెనీల్లో అవకాశాలు అందుకోవచ్చు. సొంతంగానూ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. మరోవైపు ఉన్నత విద్య పరంగా కాయ చికిత్స, పంచకర్మ, క్షర సూత్ర వంటి పాపులర్ స్పెషలైజేషన్లల్లో చేరొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న బీఏఎంఎస్ సీట్ల సంఖ్య 160.

యునానీ (బీయూఎంఎస్) :
పర్షియన్-అరబిక్ వైద్య విధానంగా.. బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్‌‌స (బీయూఎంఎస్)కి పేరుంది. 12వ శతాబ్దంలో భారత్‌లో ప్రవేశించి... మొగలుల పాలనా కాలంలో ఎక్కువ జనాదరణ పొందిన వైద్యం ఇది. బీయూఎంఎస్ కోర్సు హైదరాబాద్‌లోని గవర్నమెంట్ నిజామియా టిబీ కాలేజ్‌లో మాత్రమే అందుబాలో ఉంది. మొత్తం సీట్లు 75. కోర్సు వ్యవధి ఐదున్నరేళ్లు. నీట్ యూజీ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. పలు కంపెనీలు యునానీ మందులపై పరిశోధనలు చేస్తున్న నేపథ్యంలో కోర్సు పూర్తయ్యాక దేశవిదేశాల్లో అవకాశాలు అందుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. యునానీ కాలేజీల్లో అధ్యాపకుడిగా కూడా పనిచేయొచ్చు.

బీఎన్‌వైఎస్:
బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ అండ్ యోగిక్ సెన్సైస్... బీఎన్‌వైఎస్. ఇటీవల కాలంలో ప్రజల్లో ప్రకృతి వైద్యం పట్ల అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో.. బైపీసీ విద్యార్థులకు కెరీర్ పరంగా ఇది మరో ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఈ కోర్సును హైదరాబాద్‌లోని గాంధీ నేచురోపతిక్ మెడికల్ కాలేజ్‌లో అభ్యసించొచ్చు. అందుబాటులో ఉన్న సీట్లు 30.

సీట్ల భర్తీ విధానం :
ఆయుష్ కోర్సుల్లో గతేడాది వరకూ సీట్ల భర్తీకి ఎంసెట్ (అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్) ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించేవారు. ఇందుకోసం ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ వెలువడేది. 2018-19 నుంచి ఆయుష్ కోర్సులనూ నీట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయాలని నిర్ణయించారు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని హెల్త్ యూనివర్సిటీలు ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ పూర్తయ్యాక.. ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశముంది.

వైద్య అనుబంధ కోర్సులు..
వెటర్నరీ సైన్స్, బీఫార్మసీ, ఫార్మ్-డి, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్‌లను వైద్య అనుబంధ కోర్సులుగా పేర్కొంటున్నారు. బైపీసీ విద్యార్థులకు ఈ కోర్సులు ఉత్తమ కెరీర్ అవకాశాలను అందించడంలో ముందుంటున్నాయి. ఆయా కోర్సుల వివరాలు...

వెటర్నరీ సైన్స్ :
మూగ జీవాలపై ప్రేమ ఉన్న వారికి నప్పే కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్‌‌స అండ్ యానిమల్ హజ్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్). కోర్సు వ్యవధి ఐదేళ్లు. బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు అర్హులు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కోర్సులో చేరేందుకు అర్హత ఎంసెట్ (మెడికల్ అండ్ అగ్రికల్చర్ విభాగం). దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సు పూర్తిచేసిన వారికి అవకాశాలు ఖాయమని చెప్పొచ్చు. పశువులు, జంతువుల వైద్యానికి సంబంధించిన మెళకువలను ఈ కోర్సులో భాగంగా నేర్పిస్తారు. ఈ కోర్సు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (తిరుపతి); పి.వి.నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (హైదరారాబాద్)లో అందుబాటులో ఉంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు పశు వైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు, పౌల్ట్రీ ఫామ్స్, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్, గొర్రెల పెంపక కేంద్రాల్లో అవకాశాలు లభిస్తాయి. సొంతంగా క్లినిక్ కూడా ప్రారంభించొచ్చు.

ఫార్మ్-డి :
వైద్య రంగంలో స్థిరపడాలనుకునే వారికి మరో ముఖ్యమైన కోర్సు.. ఫార్మ్-డి. ఆరేళ్ల వ్యవధిలో ఉండే ఈ కోర్సు పూర్తిచేసిన వారికి మెడికల్ పీజీ ఉత్తీర్ణులకు దీటుగా వైద్య రంగంలో నైపుణ్యాలు అలవడతాయి. ఈ కోర్సులోనూ మొత్తం సీట్లలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు 50 శాతం సీట్ల చొప్పున కేటాయిస్తారు. వీటి భర్తీ కూడా ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారానే జరుగుతుంది. డిప్లొమా ఇన్ ఫార్మసీ పూర్తిచేసిన విద్యార్థులు కూడా ఫార్మ్-డికి అర్హులే. ఈ కోర్సుకు సంబంధించి తెలంగాణలో 33 కళాశాలలు, ఆంధ్రప్రదేశ్‌లో 30 కళాశాలలు ఉన్నాయి. ఒక్కో కళాశాలలో 30 చొప్పున సీట్లు అందుబాటులో ఉంటాయి.

బీఫార్మసీ :
బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ.. ఎంపీసీ, బైపీసీ రెండు గ్రూపుల విద్యార్థులకు అవకాశం కల్పించే కోర్సు ఇది. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మనదేశంలో డ్రగ్ రీసెర్చ్, డ్రగ్ ఫార్ములేషన్, ప్రొడక్షన్ వంటి కార్యకలాపాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. బీఫార్మసీ విద్యార్థులు మెరుగైన అవకాశాలు అందుకునే వీలుంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఫార్మా కంపెనీల్లో ఎంట్రీ లెవల్‌లో సూపర్‌వైజర్ స్థాయి ఉద్యోగాలు లభిస్తాయి. బీఫార్మసీ పూర్తిచేసిన వారికి ఉన్నత విద్య అవకాశాలు ఎక్కువే. ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, క్వాలిటీ అష్యూరెన్‌‌స, ఫార్మకోగ్నసీ, ఫార్మా మేనేజ్‌మెంట్ వంటి స్పెషలైజేషన్లతో ఎంఫార్మసీ పూర్తిచేస్తే ఆర్ అండ్ డీ ల్యాబ్స్, డ్రగ్ ప్రొడక్షన్ యూనిట్లలో కీలక హోదాలు లభిస్తాయి. బీఫార్మసీలోని మొత్తం సీట్లలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు 50 శాతం చొప్పున కేటాయిస్తారు. ఎంపీసీ విద్యార్థులు ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్)లో ఉత్తీర్ణత సాధించి కౌన్సెలింగ్‌కు హాజరుకావల్సి ఉంటుంది. బైపీసీ విద్యార్థుల కోసం (ఎంసెట్ -అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్) బీఫార్మసీ కౌన్సెలింగ్ ఫర్ బైపీసీ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 12 వేలు; తెలంగాణలో 16 వేల బీఫార్మసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ :
ప్రమాదంలో గాయపడి ఫ్రాక్చర్ అవ్వడం, కాలు, చెయ్యి బెణకడం, లేదా పలు శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి అవయవాల ఎక్సర్‌సైజ్ ఎంతో అవసరం అవుతోంది. దీనికి సంబంధించి శాస్త్రీయ నైపుణ్యాలు అందించే కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ). నాలుగున్నరేళ్ల బీపీటీ కోర్సులో చేరేందుకు అర్హత బైపీసీ. ఈ కోర్సు పూర్తిచేయడం ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్లు, రిహాబిలిటేషన్ సెంటర్లు, హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉపాధి పొందొచ్చు. అదే విధంగా స్వయంగానూ ఫిజియోథెరపీ సెంటర్లు నెలకొల్పొచ్చు. విదేశాల్లో అవకాశాలు అందుకునే వీలుంది. బీపీటీ పూర్తయ్యాక ఉన్నతవిద్య పరంగా పీజీ స్థాయిలో మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీలో చేరొచ్చు. న్యూరాలజీ, ఆర్థోపెడిక్/మాస్క్యులో స్కెలెటల్, స్పోర్‌‌ట్స, కార్డియోథొరాసిక్ అండ్ రిహాబిలిటేషన్ తదితర స్పెషలైజేషన్లతో మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ పూర్తిచేస్తే మరిన్ని అవకాశాలు సొంతమవడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి భర్తీకి ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్), కేఎన్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ (తెలంగాణ)లు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు. ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి సీట్లను భర్తీ చేస్తారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ జూలై/ఆగస్ట్‌లో వెలువడుతుంది.

బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ :
శారీరకంగా, మానసికంగా వ్యాకులతకు గురవుతున్న వారికి కౌన్సెలింగ్ తరహాలో చికిత్సనందించే నైపుణ్యాలు నేర్పే కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్న విభాగం ఇది. ముఖ్యంగా బుద్ధి మాంద్యం గల పిల్లలు, పెద్దలు, మానసిక సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం కలిగించేలా శాస్త్రీయ పద్ధతుల్లో కౌన్సెలింగ్ నిర్వహించి.. వారిని సాధారణ స్థితికి తీసుకురాగలిగే నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తిచేసుకున్న వారికి హాస్పిటల్స్, రిహాబిలిటేషన్ సెంటర్లలో ఉద్యోగాలు లభిస్తారుు. ప్రస్తుతం మనదేశంలో ఈ కోర్సులు అందించే కళాశాలల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. జాతీయస్థారుులో 40 కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది.

బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ :
వైద్య రంగంలో అడుగుపెట్టాలనుకునే బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ప్రత్యామ్నాయ కోర్సు... బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. బైపీసీ ఉత్తీర్ణులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. నర్సింగ్ పట్ల ఆసక్తి కలిగిన వారికి బీఎస్సీ నర్సింగ్ మాత్రమే కాకుండా... జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం), యాక్సిలరీ నర్స్ మిడ్‌వైఫ్ (ఏఎన్‌ఎం), మిలిటరీ నర్సింగ్ సర్వీస్ (ఎంఎన్‌ఎస్) వంటి పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ స్థాయి కోర్సు పూర్తయ్యాక ఉన్నతవిద్యపై ఆసక్తి ఉంటే... ఎంఎస్సీ నర్సింగ్, ఎంఫిల్, పీహెచ్‌డీ వరకు వెళ్లొచ్చు. ప్రస్తుతం హాస్పిటల్స్‌లో నర్సుల సేవలు ప్రతి విభాగంలోనూ కీలకంగా మారుతున్నాయి. సర్జరీ నుంచి మెటర్నిటీ, ఎమర్జెన్సీ విభాగం వరకూ.. ప్రతి చోటా నర్సుల సేవలు తప్పనిసరి. ఈ కోర్సు పూర్తిచేయడం ద్వారా హాస్పిటల్స్, హోమ్ కేర్, ఇండస్ట్రియల్ కాంప్లెక్సులు, మిలిటరీ సర్వీసెస్, రెసిడెన్షియల్ స్కూల్స్, హెల్త్ కేర్ సెంటర్స్, కార్పొరేషన్‌‌సలో కెరీర్ సొంతం చేసుకోవచ్చు. నర్సింగ్ పూర్తయ్యాక నిరుద్యోగిగా మారే పరిస్థితి ఉండదని, దేశ విదేశాల్లో అవకాశాలు అందుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 11 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కూడా ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగానే ఉంటుంది. ఇందుకోసం హెల్త్ యూనివర్సిటీలు జూలై/ఆగస్టు నెలల్లో నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి.

ఇతర కోర్సులు..
బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్ :
ఉద్యాన రంగంలో కెరీర్‌కు అవకాశం కల్పించే కోర్సు... బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్ (ఆనర్స్). నాలుగేళ్ల వ్యవధి కలిగిన ఈ కోర్సు పూర్తిచేస్తే హార్టికల్చర్ మిషన్, డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు, మైక్రోఇరిగేషన్ ప్రాజెక్ట్‌లలో ఉద్యోగాలు పొందొచ్చు. ఉన్నతవిద్య పరంగా.. పీజీ స్థాయిలో ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్, ప్లాంటేషన్ అండ్ స్పైస్ క్రాప్ ప్రత్యేక అంశాలుగా ఎంఎస్సీ చదివే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల్లో బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్ లో 326 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, తెలంగాణలో శ్రీ కొండా లక్షణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సీట్లను భర్తీ చేస్తారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ జూలైలో వెలువడుతుంది.

అగ్రికల్చర్ బీఎస్సీ (ఏజీ బీఎస్సీ) :
నాలుగేళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో చేరేందుకు అర్హత ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తిచేసుండాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ (అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం) ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఈ కోర్సు పూర్తిచేస్తే విత్తనోత్పత్తి సంస్థలు, బ్యాంకులు, ప్లాంటేషన్‌‌సలో కెరీర్ సొంతం చేసుకోవచ్చు. పీజీ స్థారుులో క్రాప్ ప్రొడక్షన్, ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ తదితర విభాగాల్లో పీజీ చేస్తే మరిన్ని అవకాశాలు ఖాయం. ఆంధ్రప్రదేశ్‌లో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో అరుుదు కళాశాలల్లో.. అలాగే తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో నాలుగు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల భర్తీకి రెండు యూనివర్సిటీలు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారుు. అంతేకాకుండా సీట్ల కేటారుుంపులో వ్యవసాయ కుటుంబానికి చెందిన విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది.

బీటెక్-ఫుడ్ టెక్నాలజీ :
బీటెక్-ఫుడ్ టెక్నాలజీ కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. ఆహార ఉత్పత్తుల తయారీ, నాణ్యత, ప్రాసెసింగ్ సంబంధిత నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. దీన్ని పూర్తిచేయడం ద్వారా ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల్లో కొలువుదీరొచ్చు. హోటల్ రంగంలోనూ వీరికి అవకాశాలు లభిస్తారుు. ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో అవకాశాలు పుష్కలం. ఫుడ్‌ప్యాకేజింగ్ అండ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో.. క్వాలిటీ అష్యూరెన్‌‌స మేనేజర్లు, ప్రిజర్వేషన్ మేనేజర్లు, ప్యాకేజింగ్ టెక్నాలజిస్టులు, ప్రొడక్షన్ మేనేజర్, లేబొరేటరీ సూపర్‌వైజర్ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. నైపుణ్యాలుంటే విదేశాల్లోనూ ఆహార పదార్థాల తయారీ, పరిశోధన కంపెనీల్లో అవకాశాలు అందుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంసెట్ (అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం) ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు.

బీఎస్సీ (సీఏబీఎం) :
వ్యవసాయ విధానంలో ఆధునిక పద్ధతులను అన్వరుుంచడం, వాటిద్వారా లాభదాయకత పెరిగేలా చేయడానికి అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్సు.. బీఎస్సీ సీఏబీఎం (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్). ఈ కోర్సు పూర్తిచేసిన వారికి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, క్రాప్ ప్రొడక్షన్ కంపెనీలలో మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తారుు. వీటితోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్‌‌స, బీఎస్సీ ఫారెస్ట్రీ వంటి కోర్సులు సైతం బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్నారుు.

పారామెడికల్ కోర్సులు..
ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు.. స్వల్ప కాలంలోనే ఉపాధి పొందేందుకు మార్గం.. పారామెడికల్ కోర్సులు. ఓ మాదిరి పట్టణాలకు సైతం కార్పొరేట్ ఆసుపత్రులు విస్తరిస్తున్న తరుణంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్, రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్ వంటి పారామెడికల్ కోర్సులు పూర్తిచేయడం ద్వారా తక్షణమే ఉపాధి అవకాశాలు అందుకోవచ్చు. ప్రభుత్వ కాలేజీల్లోని పారామెడికల్ కోర్సులను రాష్ట్రాల పారామెడికల్ బోర్డులు నోటిఫికేషన్ ద్వారా ప్రవేశం కల్పిస్తాయి.

బీఎస్సీ లైఫ్ సెన్సైస్ :
సంప్రదాయ డిగ్రీ స్థాయిలో.. బయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, జెనిటిక్ ఇంజనీరింగ్, బాటనీ, జువాలజీ తదితర సబ్జెక్టులతో వివిధ కాంబినేషన్లలో బీఎస్సీ పూర్తిచేసుకోవచ్చు. ఆ తర్వాత పీజీ, పీహెచ్‌డీల్లో చేరడం ద్వారా రీసెర్చ్ కెరీర్ వైపు వెళ్లొచ్చు.
  • అగ్రికల్చర్ విభాగంలోని పలు కోర్సులకు ఎంసెట్-అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్‌లో ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వ విద్యాలయాలు ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి.
Published date : 17 May 2018 04:08PM

Photo Stories